S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

జిల్లా వేదికగా నేటి నుంచి జనచైతన్య యాత్రలు

గుంటూరు, నవంబర్ 30: గడచిన ఏడాదిన్నరగా అధికార తెలుగుదేశం ప్రభుత్వం రాష్ట్ర ప్రజల కోసం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గుంటూరు జిల్లా వేమూరు వేదికగా పార్టీ నాయకులు, కార్యకర్తలు దిశానిర్ధేశం చేయనున్నారు. డిసెంబర్ 1 నుంచి 14వ తేదీ వరకు జనచైతన్య యాత్రలను రాష్టవ్య్రాప్తంగా పార్టీ నాయకులు చేపట్టనున్నారు. ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలపై ప్రధాన ప్రతిపక్షం వైస్సార్ కాంగ్రెస్ పార్టీ విమర్శలకే పరిమితం కాకుండా నేరుగా ప్రజల్లోకి వెళ్లటంతో పలుమార్లు అధికార పార్టీ ఇరకాటంలో పడింది. కాంగ్రెసు, సిపిఐ, సిపిఎం తదితర పార్టీలు కూడా తెలుగుదేశంపార్టీపై విమర్శల దాడి పెంచారు. మిత్రపక్షమైన బిజెపి సమయానుకూలంగా తెలుగుదేశంపై విమర్శలు చేస్తోంది. కేంద్రప్రభుత్వంలో ఉన్న బిజెపి రాష్ట్ర నాయకులు రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలను ఎక్కుపెట్టిన నేపథ్యంలో ప్రధానమైన అంశాన్ని తెరపైకి తెచ్చారు. రాష్ట్రప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు కేంద్రం నిధులతో చేపడుతూ రాష్ట్ర ప్రభుత్వంగా చెప్పుకోవటంపై నేరుగా దాడి చేస్తున్నారు. దీంతో రాష్ట్రంలో అధికారం చేపట్టిన తెలుగుదేశం పార్టీ కేంద్రప్రభుత్వంతో కలిసిమెలిసి ముందుకు వెళ్లేందుకు చేస్తున్న యత్నాలు బిజెపి రాష్ట్ర శాఖ నేతల కారణంగా కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు తలెత్తున్నాయి. అయినప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు క్యాబినెట్ మంత్రులకు, పార్టీ శ్రేణులకు సమన్వయంతో వ్యవహరించాలని పదేపదే చెబుతున్నారు. తెలంగాణలో చోటుచేసుకున్న ఓటుకు నోటు కేసు వ్యవహరం ప్రతిపక్షానికి ప్రధాన అస్త్రంగా మారింది. ఇంతకాలం ముఖ్యమంత్రి చంద్రబాబు నుంచి సాధారణ నాయకుని వరకు జగన్ జైల్‌పై మండిపడుతూ చేస్తున్న ప్రకటనలకు ఓటుకు నోటు వ్యవహరంతో అడ్డుకట్ట వేసినట్లైంది. రాజధాని భూముల వ్యవహారంలో ప్రజల సహకారం స్పష్టంగా లభించినప్పటికీ తెలుగుదేశం పార్టీ ఆ మైలేజిని ముందుకు తీసుకు వెళ్లటంతో కొంత వెనుకబడింది. సిపిఎం దూకుడుకు తెలుగుదేశం పార్టీ శ్రేణులు కలవరానికి గురైయారు. భూసేకరణ నోటిఫికేషన్‌ను అడ్డుకోవటంతో ప్రధాన ప్రతిపక్షాలు ఎవరికి వారుగా పోరు చేసినప్పటికీ ఫలితాన్నిచ్చింది. భూసేకరణ చట్టం వ్యవహరంలో తెలుగుదేశం పార్టీ ముందుకు వెళ్లలేని పరిస్థితి ఎదురై ప్రతిష్ట కొంత మసకబారింది. ప్రతిష్ఠను కాపాడుకునేందుకే జనసేన పార్టీ అధ్యక్షుడు, సినీనటుడు పవన్‌కళ్యాణ్ ద్వారా భూసేకరణపై ప్రకటన చేయించి, విరమించుకున్నట్లు రాజధాని గ్రామాల్లో ప్రచారం జరిగింది. మరలా భూసేకరణపై నోటిఫికేషన్ ఇస్తామని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రకటించినప్పటికీ ఆ ప్రాంత ప్రజలు విశ్వసించలేదు. రాజధానిలో సమస్యల తీవ్రత పెరగటం కూడా ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. తెలుగుదేశం పార్టీకి రాజధాని అమరావతి ప్రధాన అజెండాగా ఉన్నందున త్వరితగతిన ముందుకు వెళ్లేందుకు పావులు కదుపుతున్నప్పటికీ చిన్న సమస్య ఎదురైనా వైఎస్సార్ కాంగ్రెసుపార్టీ అధినాయకత్వం స్వయంగా పర్యటిస్తూ ప్రజలతో మమేకమయ్యేందుకు చేస్తున్న యత్నాలు అధికార పార్టీకి పెను సవాలుగా మారింది. ఇటీవల మల్కాపురం చేను దగ్ధం కేసులో వైసిపి అధినేత జగన్ స్వయంగా జోక్యం చేసుకోవటంతో ప్రభుత్వం ముందుకు వెళ్లలేని పరిస్థితులు ఎదురైయాయి. విశాఖ బాక్సైట్ వ్యవహరంలో సొంత పార్టీ నేతలు కూడా పార్టీకి ఎదురు తిరిగారు. మిగిలిన పార్టీలు ఉద్యమించాయి. స్వయంగా బాక్సైట్ జివో ప్రభుత్వానికి తెలియకుండా విడుదలైందని ప్రకటించుకోవటం గమనిస్తే పార్టీ నాయకులు అధికారంలో ఉన్న మంత్రులకు సహకరించటం లేదనేది తేటతెల్లమవుతోంది. ఈ నేపథ్యంలో పార్టీ సంక్షేమ పథకాలను నేరుగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు, పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జనచైతన్య యాత్రలను వేదికగా చేసుకోనున్నారని పార్టీ వర్గాలు విశ్వసిస్తున్నాయి.

గురజాడ సాహిత్యం- ప్రజాచైతన్య గీతం
* మహాకవి గీతాన్ని ఆలపించిన వేలమంది సాంస్కృతిక ప్రియులు

గుంటూరు (కల్చరల్), నవంబర్ 30: దేశమును ప్రేమించుమన్న మంచి అన్నది పెంచుమన్న, వొట్టిమాటలు కట్టిపెట్టొయ్, గట్టిమేల్ తలపెట్టవోయ్’ అని లోకానికి పిలుపునిచ్చిన మహాకవి గురజాడ సాహిత్యం నిత్య ప్రజాచైతన్య గీతమని జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాసులురెడ్డితో సహా పలు సాంస్కృతిక సంఘాలు, కళాకారులు, సంస్థల ప్రతినిధులు కొనియాడారు. సోమవారం నగరంలోని పాటిబండ్ల సీతారామయ్య ఉన్నత పాఠశాలలో గురజాడ శతవర్ధంతిని దేశభక్తి ఉట్టిపడేలా నిర్వహించారు. ప్రజానాట్యమండలి, జనవిజ్ఞాన వేదిక, సాహితీస్రవంతి, సంస్కృతి, ఐద్వా, ఎస్‌ఎఫ్‌ఐ, యుటిఎఫ్, డివైఎఫ్‌ఐ, పిఒడబ్ల్యు, సిఐటియు, అవగాహన, అరసం, విరసం, జరసం, పీపుల్ ఫర్ ఇండియా ఫోరం సంస్థల ఆధ్వర్యంలో గురజాడ అప్పారావు రచించిన దేశభక్తి గీతాన్ని ఆ మహనీయుడిని స్మరించుకుంటూ ఆలపించారు. 2 వేల మందికి పైగా ఈ సాంస్కృతిక, కళారంగాలకు చెందిన ప్రతినిధులు, విద్యార్థినీ, విద్యార్థులు ఒక్కటిగా గురజాడ గీతాన్ని ఆలపించడమే కాకుండా ఆ నిష్కలంక దేశభక్తుడు సమాజానికి చేసిన సేవలను బహుదా ప్రశంసించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాసులురెడ్డి గౌరవ అతిథిగా మాట్లాడుతూ గురజాడ నేటితరానికి ఆదర్శమన్నారు. కన్యాశుల్కం నాటకంతో పాటుగా ఆయన రచించిన ఉత్తమ సాహిత్యం సమాజానికి ఓ దిక్సూచిలాగా ఉపయోగపడిందన్నారు. ప్రతి వ్యక్తిలో స్వాతంత్య్రోద్యమ దీప్తిని కల్గించడంలో గురజాడ చేసిన కృషి అనన్యసామాన్యమైందన్నారు. ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు, ఐద్వా రాష్ట్ర కార్యదర్శి డి రమాదేవి, అరసం జాతీయ కార్యదర్శి పెనుగొండ లక్ష్మీనారాయణ, కిట్స్ ఇంజనీరింగ్ కాలేజీ చైర్మన్ కోయి సుబ్బారావు, కళాభూషణ బి వేదయ్య, సాహితీ స్రవంతి జిల్లా నాయకులు ఎన్ కాళిదాసు, తెలుగు భాషోద్యమ నాయకులు నాగభైరవ ఆదినారాయణ, అవగాహన సంస్థ కార్యదర్శి కొండా శివరామిరెడ్డి, రచయితల సంఘం నాయకుడు సుభాని, ఎఎన్‌యు విశ్రాంత డిప్యూటీ రిజిష్ట్రార్ సిహెచ్ హరిబాబు, మెడికల్ రిప్రజెంజేటివ్ యూనియన్ నాయకులు సిహెచ్ కుమార్, రమేష్, పలువురు విద్యావేత్తలు దేశభక్తిని త్యాగనిరతిని, సామాజిక తత్పరతను గుండెనిండా నింపుకుని సంఘంలో మార్పు రావాలని తమ అత్యుత్తమ సాహిత్యం ద్వారా ప్రయత్నించి ఓ గొప్ప సందేశాన్ని ఆయన ఇచ్చారన్నారు. ఉత్సవంలో పాల్గొన్న అందరూ సొంతలాభం కొంత మానుకుని పొరుగువానికి తోడ్పడవోయ్, దేశమంటే మట్టికాదోయ్, దేశమంటే మనుషులోయ్ అని గురజాడ గీతాన్ని ఆలపించి ఆయన పట్ల తమ గౌరవాన్ని చాటుకున్నారు. వివిధ పోటీల్లో గెలుపొందిన విజేతలకు అతిథులు బహుమతులు అందజేశారు. ప్రజానాట్య మండలి జిల్లా కార్యదర్శి పివి రమణ, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి లక్ష్మణరావు, వ్యాపారవేత్త ఎ మాణిక్యవేల్, అమరావతి రామకృష్ణ, హిందూ హైస్కూల్ కరస్పాండెంట్ మల్లెల శ్రీనాథ్‌చౌదరి తదితరులు కార్యక్రమాన్ని సమన్వయం చేశారు.

తెనాలి కౌన్సిల్ సమావేశం రసాభాస
* టిడిపి, వైసిపి కౌన్సిలర్ల మధ్య తోపులాట
* వ్యక్తిగత దూషణలతో అట్టడుకిన సభ * చైర్మన్ వౌనం
తెనాలి రూరల్, నవంబర్ 30: తెనాలి మున్సిపల్ సర్వసభ్య సమావేశం రసాభసాగా మారి టిడిపి, వైసిపి కౌన్సిలర్ల మధ్య వాగ్యుధ్ధాలు, తోపులాటలు, వ్యక్తిగత ధూషణలు, అధికారపక్ష కౌన్సిలర్ల మధ్య కుదరని సయోధ్య, ర్యాటిఫై పేరుతో అధికారులు కోట్లు ఖర్చు చేస్తున్నారంటూ ఆరోపణలతో ముగిసింది. సోమవారం ఉదయం 11గంటలకు ప్రారంభం కావాల్సిన కౌన్సిల్ సమావేశం స్వచ్ఛ తెనాలి కారణంగా గంట ఆలస్యంగా చైర్మన్ కొత్తమాసు తులసీదాసు అధ్యక్షతన ప్రారంభమైంది. అధికారులు అజెండా చదువుతుండగా ఒక్కొక్క అంశంపై చర్చించాలని అధికారపక్ష టిడిపి కౌన్సిలర్ గుమ్మడి రమేష్ కోరారు. అందుకు అదేపక్ష పార్టీ కౌన్సిలర్ అహ్మద్‌బేగ్ ఖండించంతో సభలో గందరగోళం ప్రారంభమైంది. అనంతరం తెనాలి పాతఆసుపత్రి భవనానికి ప్రజల సొమ్మును 30లక్షల రూపాయలు ఖర్చుచేయాలని అజెండాలో పేర్కొనడాన్ని వైసిపి ప్రశ్నించింది. ఈవిషయంపై టౌన్ ప్లానింగ్ అధికారి అశోక్ సరైన సమాధానం చెప్పకపోవటం, ఆసుపత్రికి, మున్సిపాలిటీకి చెందినదిగా ఆధారాలు చూపకపోవటంతో టిడిపి కౌన్సిలర్లు వారికి వత్తాసు పలకడంతో ఇరుపార్టీల కౌన్సిలర్ల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. అలాగే టిడిపి కౌన్సిలర్ గుమ్మడి రమేష్ మాట్లాడుతూ ర్యాటిఫై పేరుతో అధికారులు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు. ఎస్టీ కౌన్సిలర్ ఏలూరి పెంచలయ్య గత కౌన్సిల్‌లో తన వార్డులో గుంటలో నిల్వఉన్న నీరు కారణంగా దోమలు వ్యాప్తి చెందుతున్నాయని, వాటి నివారణకు మట్టితో కుంటను పూడ్చాలని కోరినా ఎందుకు చర్యలు తీసుకోలేదంటూ టిడిపి కౌన్సిలర్ గుమ్మడి రమేష్ అధికారులను ప్రశ్నించారు. ఈ విషయంపై ఎంఇ ప్రభాకర్ చెప్పిన సమాధానం సరిగా లేకపోవటంతో చైర్మన్ కల్పించుకొని మరోమారు ఇలాజరిగితే చర్యలు తీసుకుంటామని ఎంఇని హెచ్చరించారు. ఈవిషయంపై టిడిపి కౌన్సిలర్ల కొద్దిసేపు, వైసిపి కౌన్సిలర్లతో మరో అర్ధగంటపాటు వాగ్విదం జరిగింది. ఆసుపత్రి తమదేనంటూ కొందరు వ్యక్తులు కోర్టును ఆశ్రయించారని అలాంటప్పుడు దానికి అంతపెద్దమొత్తంలో నిధులు ఖర్చు చేయటం ఎందుకని వైసిపి కౌన్సిలర్ రామయ్య ప్రశ్నించారు. ఈసందర్భంగా చైర్మన్ తులసీదాసు కల్పించుకొని కోర్టులో ఉన్న ఆసుపత్రి కేసు సంబంధిత వ్యక్తులకు అనుకూలంగా తీర్పువస్తే తానే ఆ 30 లక్షల రూపాయలు చెల్లిస్తామని హామీ ఇవ్వటంతో సభ శాంతించింది. ఆ తరువాత వైసిపి సభ్యులు ప్రజాసమస్యలపై చర్చలు ప్రారంభటంతో ప్రతి అంశంపైనా టిడిపి కౌన్సిలర్లు అధికారులకు బదులుగా సమాధానాలు చెప్పడాన్ని వైసిపి కౌన్సిలర్లు రామయ్య, రమేష్ తప్పుబట్టారు. దీంతో ఇరుపార్టీల కౌన్సిలర్ల మధ్య వాగ్వివాదాలు పెరిగి తోపులాటల వరకు రావటంతో చైర్మన్ సభను అదుపులో పెట్టలేక చేతులెత్తేశారు. వ్యక్తిగత దూషణలతో సభ రసాభాసైంది. దీంతో కొందరు కౌన్సిలర్లు సభకు, చైర్మన్, అధికారులకు చేతులెత్తి నమస్కారంచేసి సభ నుండి వాకౌట్ చేశారు. అయితే ఈ తతంగమంతా లైవ్‌లో ప్రసారం అవుతున్నా కౌన్సిలర్లలో ఎటువంటి మార్పు రాకపోవడాన్ని పట్టణ ప్రజలు తప్పుబడుతున్నారు.

హక్కు పత్రాలను రెవెన్యూ రికార్డుల్లో చేర్చాలి
గుంటూరు (పట్నంబజారు), నవంబర్ 30: అటవీ భూములను సాగుచేసుకుని జీవనం సాగిస్తున్న గిరిజనులకు ఇచ్చిన హక్కు పత్రాలను వెంటనే రికార్డుల్లో చేర్చాలని లంబాడీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు రమావత్ కృష్ణానాయక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం లంబాడీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ఆందోళన నిర్వహించి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించిన కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా కృష్ణానాయక్ మాట్లాడుతూ గతంలో తమ సంఘం చేసిన పలు ఆందోళనల ఫలితంగా అప్పటి కలెక్టర్ సురేష్‌కుమార్ జిల్లాలో అటవీభూములు సాగు చేసుకుంటున్న గిరిజనులకు హక్కుపత్రాలు ఇవ్వడంతో పాటు రెవెన్యూ రికార్డుల్లో కూడా వాటిని చేర్చాలని చెప్పినప్పటికీ అధికారుల నిర్లక్ష్యంతో నేటికీ నమోదు కాలేదన్నారు. గిరిజనుల న్యాయమైన డిమాండ్లను అధికారులు తక్షణమే పరిశీలించి న్యాయం చేయాలని కోరారు. అనంతరం జిల్లా పరిషత్‌లోని గ్రీవెన్స్‌కు వెళ్లి నాయకులు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో బి రామకోటేశ్వరరావు, గిరిజన విద్యార్థి విభాగం నాయకులు భానునాయక్, రామకోటి నాయక్, జమ్లా నాయక్, కోటానాయక్, ఆర్ సూర్యానాయక్ తదితరులు పాల్గొన్నారు.

ఇరుపార్టీల నేతలు కలిసిన వేళ...
నరసరావుపేట, నవంబర్ 30: నరసరావుపేట మున్సిపల్ శతాబ్ధి ఉత్సవాలను నిర్వహిస్తున్న సందర్భంగా నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గృహానికి సత్తెనపల్లి ఎమ్మెల్యే, నవ్యాంధ్ర స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావుస్వయంగా వెళ్ళి ఆహ్వానించారు. ఈ ఉత్సవాలు డిసెంబర్ 11నుండి 13వ తేదీ వరకు నిర్వహిస్తున్న విషయం పాఠకులకు విదితమే. కాగా, పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనులను స్పీకర్ కోడెల స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. దీనిపై జరుగుతున్న అభివృద్ధి పనుల్లో తన జోక్యం లేకపోవడంతో ఎమ్మెల్యే కొంత అసహనాన్ని ప్రదర్శిస్తున్నారు. దీనిపై స్పీకర్ కోడెల పలుసార్లు మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో అన్ని పార్టీల వారిని కమిటీల్లో నియమించాలని పదే పదే చెప్పారు. కింది స్థాయి నాయకుల చొరవతో వైయస్సార్‌సీపీ కౌన్సిలర్లు, నాయకులకు ప్రాధాన్యతను ఇవ్వలేదు. దీనిపై ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి అనుచరులు అవాకులు, చవాకులు పేలుతున్న విషయం అందికీ తెలిసిందే. పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనాలని, మూడు రోజులు జరిగే కార్యక్రమాల్లో తమవంతు కృషి చేయాలని స్పీకర్ కోడెల ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డికి చెప్పారు. దీనిపై ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి స్పీకర్‌తో మాట్లాడుతూ తమ కౌన్సిలర్లు గెలిచిన వార్డులో అభివృద్ది పనులు ఏమాత్రం జరగలేదని, ఎన్ని సార్లు చెప్పినా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. అంతేకాక తమ పార్టీకి ఒక పనిని అప్పగించాలని, దానిని తాము అభివృద్ధి చేస్తామని అన్నారు. దీనిపై కోడెల స్పందిస్తూ ఎవరికీ, ఏ పార్టీకి తాను పని అప్పగించలేదని, అందిరినీ కలుపుకుని పనులు చేస్తున్నామని, మీరు కూడా పనిచేయాలని హితవు పలికారు. తొలుత స్పీకర్ కోడెల స్వయంగా తన గృహానికి వస్తున్నారన్న వార్త తెలియడంతో ఎమ్మెల్యే డాక్టర్ శ్రీనివాసరెడ్డి గృహం వద్ద ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా ప్రతినిధులు పెద్దఎత్తున హాజరైనారు. 16నెలల తర్వాత ఒకరినొకరు కలుసుకునే శుభవేళ పట్టణంలో చర్చనీయాంశమైంది. కోడెల వెంట మాజీ మున్సిపల్ చైర్మన్ వనమా సుబ్బారావు, పట్టణ పార్టీ అధ్యక్షులు వేల్పుల సింహాద్రియాదవ్,దాసరి నర్సింహారావు, వైసీపీ నాయకులు కపలవాయి విజయకుమార్, అక్త్ఫా, హనీఫ్, పిల్లి ఓబుల్‌రెడ్డి వల్లెపునాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
విలేఖరులతో...
స్థానిక మున్సిపల్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా జరుగుతున్న అభివృద్ధి పనుల్లో పాల్గొంటే, మంచి పేరువస్తుందని, జరగనున్న ఉత్సవాల్లో ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పాల్గొని, కార్యక్రమాలను జయప్రదం చేయాలని కోరినట్లు స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు విలేఖరులకు తెలిపారు. ఎమ్మెల్యేకు ప్రోటోకాల్ ఉందని, నరసరావుపేట ప్రజలు ఆయనను గెలిపించారని అన్నారు. ఈ ఉత్సవాల్లో ఆర్థిక అంశాల కంటే నైతిక, సామాజిక, అభివృద్ధి, సంక్షేమ అంశాలను దృష్టిలో పెట్టుకుని పనిచేయాల్సి ఉంటుందన్నారు.తొలుత స్పీకర్ డాక్టర్ కోడెల ఎమ్మెల్యేతో యోగక్షేమాలు, ఆసుపత్రి ఎలా సాగుతుంది వంటి అంశాలను మాట్లాడారు. ఎమ్మెల్యే డా క్టర్ గోపిరెడ్డి మాట్లాడుతూ వేడుకలకు ఆహ్వానించడానికి స్పీకర్ కోడెల స్వ యంగా తన వద్దకు వచ్చిన సందర్భం గా ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు. తప్పకుండా మున్సిపల్ శతాబ్ధి ఉత్సవాల్లో పాల్గొంటానని ఎమ్మెల్యే విలేఖరులకు చెప్పారు.

రోడ్డు ప్రమాదంలో యువకుని మృతి
గురజాల, నవంబర్ 30: ద్విచక్రవాహాన్ని ఎదురుగా వస్తున్న ఆటో ఢీకొనడంతో ఒక యువకుడు మృతి చెందిన సంఘటన గురజాల పట్టణంలోని రైల్వేగేటు సమీపంలో సోమవారం జరిగింది. మండలంలోని జంగమహేశ్వరపురం గ్రామానికి చెందిన జయరామిరెడ్డి(22) ద్విచక్రవాహనంపై గురజాల నుండి స్వగ్రామానికి వెళ్తుండగా ఎదురుగా వస్తున్న ఆటో ఢీకొంది. ఈ ఘటనలో యువకుని తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ మేరకు గురజాల పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గురజాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

గురజాడ గీతాల ప్రతిధ్వని
* శత వర్ధంతి సభలో గొంతెత్తి పాడిన యువత
మంగళగిరి, నవంబర్ 30: దేశాభివృద్ధి కోసం ఆలోచించే పౌరులుగా విద్యార్థులు, యువకులు ఉండాలని మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు అన్నారు. సోమవారం స్థానిక ఇందిరా కళామందిర్‌లో డివైఎఫ్‌ఐ, ఎస్‌ఎఫ్‌ఐ, జనవిజ్ఞాన వేదిక, ప్రజానాట్య మండలి ఆధ్వర్యాన గురజాడ అప్పారావు శతవర్ధంతి సందర్భంగా గొంతెత్తి పాడుదాం గురజాడ గీతం అనే కార్యక్రమం నిర్వహించారు. ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు భగవాన్‌దాస్ అధ్యక్షతన జరిగిన సభలో లక్ష్మణరావు ప్రసంగిస్తూ గురజాడ అప్పారావు 53 సంవత్సరాలు జీవించినప్పటికీ మనుషులందరూ సమాన హోదాతో బతకాలనే సమాజంకోసం అనేక దేశభక్తి గీతాలను రచించారని అన్నారు. కులమతాలు వేరైనా మనుషులంతా ఒక్కటేననే భావం గురజాడలో ఉండేదన్నారు. పిల్లల వైద్యనిపుణులు డాక్టర్ కెవిఎస్ సాయిప్రసాద్ మాట్లాడుతూ విద్యార్థులు ప్రతి మనిషికీ సాయపడే విధంగా ఉండాలని, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం ద్వారా వ్యాధులకు దూరంగా ఉండవచ్చని సూచించారు. గురజాడ దేశభక్తి గీతాలను విద్యార్థులతో ఆలపించారు. మండల పరిషత్ ఉపాధ్యక్షుడు మొసలి పకీరయ్య, నిర్మలా కాలేజీ డైరెక్టర్ ప్రసాద్, ప్రజానాట్య మండలి జిల్లా కార్యదర్శి రమణ, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి లక్ష్మణరావు, ఐజాక్ న్యూటన్, భాగ్యరాజు, భాషా తదితరులు పాల్గొన్నారు.
సిసిఐ కొనుగోలు కేంద్రం ప్రారంభం

క్రోసూరు, నవంబర్ 30: క్రోసూరు మార్కెట్‌యార్డు ఆవరణలో సోమవారం సిసిఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీ్ధర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో శ్రీ్ధర్ మాట్లాడుతూ రైతులు దళారులను ఆశ్రయించకుండా నేరుగా తాము పండించిన పత్తిని సిసిఐ కేంద్రం వద్దకు తీసుకురావాలని, ప్రభుత్వం రైతు శ్రేయస్సు మేరకే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిందని పేర్కొన్నారు. క్వింటాకు గిట్టుబాటు ధర 4,100 రూపాయలు ప్రభుత్వం నిర్ణయించిందని, సోమవారం 753 క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేశామని బయ్యర్ ప్రతాపరెడ్డి తెలిపారు.
మేజర్‌కు పెట్టిన గండిని పూడ్చిన అధికారులు
పెదనందిపాడు, నవంబర్ 30: ఎన్‌ఎస్‌పి కాకుమాను మేజర్ కాల్వకు గండికొట్టి అక్రమంగా తాగునీటిని దారిమళ్లించడం వివాదాస్పదమైంది. దీంతో దిగువ ప్రాంతానికి తాగునీటి సరఫరా ప్రశ్నార్ధకమైంది. దిగువ ప్రాంత అభ్యంతరాలపై ఎన్‌ఎస్‌పి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ షేక్ మొహిద్ధిన్, డిఇఇ రవీంద్రప్రసాద్, ఎఇ సుభాషిణి తదితరులు పెదనందిపాడు సమీపంలో సాగర్‌కాల్వకు నాలుగు రోజుల క్రితం గండికొట్టిన ప్రాంతాన్ని సోమవారం పరిశీలించారు. దీంతో పెదనందిపాడు ఉప సర్పంచ్ శ్రీ్ధర్ వార్డుసభ్యులు అధికారులతో వాగ్వివాదానికి దిగారు. మంచినీటిచెరువు సగం కూడా నిండలేదు. గండిపూడిస్తే నీరు ఎలా వస్తుందంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. దీంతో గండికొట్టి నీరుపెట్టుకోవడం సరికాదు, ఆయిల్ ఇంజన్లకు మాత్రమే అనుమతి ఇచ్చాం, కాదంటే చట్టప్రకారం చర్యలు తీసుకోవాల్సి వస్తుందంటూ అధికారులు హెచ్చరించారు. ఆర్‌డబ్ల్యుఎస్ అధికారులు 60 శాతం చెరువులు నిండినట్లు చెబుతున్నారు, క్షేత్రస్థాయిలో 20 శాతం కూడా నిండలేదంటూ గ్రామస్థులు అసహనం వ్యక్తంచేశారు. ఎస్‌ఐ రామిరెడ్డి చొరవతో ఎట్టకేలకు గండినిపూడ్చటంతో కథసుఖాంతమైంది. దిగువ ప్రాంతంలో 21 చెరువులకు తాగునీరు అందించాల్సిన దృష్ట్యా అక్రమంగా నీటిని దారిమళ్లించే వారిపై చర్యలు తీసుకోవాల్సి వస్తుందంటూ అధికారులు హెచ్చరించి వెనుదిరిగారు.

రైతుల తోడ్పాటుతోనే సహకార వ్యవస్థ బలోపేతం
* మంత్రి ప్రత్తిపాటి
ఆంధ్రభూమి బ్యూరో
గుంటూరు, నవంబర్ 30: రాష్ట్రంలో సహకార వ్యవస్థను బలోపేతం చేసేందుకు రైతులందరూ సహకరించాలని వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కోరారు. సోమవారం జిల్లాలోని తుళ్లూరు మండలం, మందడం గ్రామంలో గుంటూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు 34వ బ్రాంచ్‌ను మంత్రి ప్రత్తిపాటి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి పుల్లారావు మాట్లాడుతూ సహకార బ్యాంకులను రైతుల బ్యాంకులుగా కీర్తించారు. గ్రామీణ ప్రాంతాభివృద్ధికి, అన్నివర్గాల అభ్యున్నతికి సహకార బ్యాంకులు పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నాయన్నారు. సహకార బ్యాంకుల అభివృద్ధికి రాష్ట్రప్రభుత్వం కూడా తమ వంతు చేయూతనిస్తుందన్నారు. తాడికొండ శాసనసభ్యుడు తెనాలి శ్రావణ్‌కుమార్ మాట్లాడుతూ రైతుల అభ్యున్నతి కోసం జిల్లా కేంద్ర సహకార బ్యాంకు అన్ని రకాల సేవలందిస్తుందన్నారు. జిడిసిసిబి చైర్మన్ ముమ్మనేని వెంకట సుబ్బయ్య మాట్లాడుతూ 2015-16 ఆర్థిక సంవత్సరంలో వివిధ రకాల పద్దుల కింద 860 కోట్ల రూపాయలను రుణాలుగా రైతులకు అందించినట్లు చెప్పారు. జిల్లావ్యాప్తంగా 700 మంది సిబ్బందితో 167 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలతో బ్యాంకు పనిచేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు ముఖ్య కార్యనిర్వహణ అధికారి భానుప్రసాద్, మార్కెటింగ్ సొసైటీ అధ్యక్షుడు ఇక్కుర్తి సాంబశివరావు, ఉపాధ్యక్షుడు సుబ్బారెడ్డి, తుళ్లూరు జెడ్పీటీసీ బెజవాడ నరేంద్ర, ఎంపిపి పద్మలత, ఎంపిటిసి రూతమ్మ, అధికారి పాండురంగారావు, వ్యవసాయ శాఖ సహాయ సంచాలకుడు కృపాదాస్, మందడం గ్రామసర్పంచ్ ఎం పద్మావతి పాల్గొన్నారు.