S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

రామాయణం.. 107 మీరే డిటెక్టివ్

హరిదాసు తన హరికథని ఇలా ఆరంభించాడు.
‘నిన్న చెప్పగా మిగిలిన అయోధ్య కాండలోని 108వ సర్గలో మిగిలిన భాగాన్ని చెప్పి ఇవాళ 109వ కాండ పూర్తి చేస్తాను.
నిజమైన బుద్ధి కలవారిలో శ్రేష్ఠుడైన రాముడు అధిక భక్తి, చలించని బుద్ధితో ఇలా చెప్పాడు.
‘నువ్వు నా మీద ప్రేమతో ఇంతదాకా మాట్లాడిన మాటలు పైకి చేయదగినవిగా, మంచివిగా కనపడినా నిజానికి అవి చేయదగని చెడ్డ మాటలు. కట్టుబాట్లు లేక, పాపాచారుడై మంచి చరిత్రకి, మంచి దృష్టికి విరుద్ధంగా ప్రవర్తించే మానవుడు సత్పురుషుల గౌరవాన్ని పొందలేడు. ఎవరు మంచి కులంలో పుట్టారో, ఎవరు పుట్టలేదో, ఎవరు వీరుడో, ఎవరు కేవలం వీరుడిననే దురభిమానం కలవాడో, ఎవరు పరిశుద్ధుడో, ఎవరు కారో అది వారి నడవడికే చెప్తుంది. నేను ఆర్యుడిలా పైకి కనిపిస్తూ అనార్యుడినై, అశుచినై, ఉత్తమ లక్షణాలు లేకుండా అవి ఉన్న వాడిలా కనపడుతూ, చెడ్డ శీలం కలవాడినైనా శీలవంతుడిలా కనపడుతూ, చెడ్డ దారిన నడిచి, సత్కర్మలు కాని, శాస్త్రం కాని లేనిది, లోకసంకర హేతువైన ఈ అధర్మాన్ని ధర్మమనే వేషంతో ఆచరించాననుకో. ఈ విధంగా దుష్ట ప్రవర్తనతో లోకానికి కీడు కలిగించే నన్ను ఈ లోకంలో కార్యాకార్యాలు తెలిసిన చైతన్యవంతుడైన ఏ పురుషుడైనా గౌరవిస్తాడా? నేను ప్రతిజ్ఞని విడిచి నువ్వు చెప్పినట్లు చేసినట్లైతే ఎవరికి మంచి మార్గాన్ని ఉపదేశించగలను? స్వర్గానికి ఎలా వెళ్లగలను? నేనలా ప్రవర్తిస్తే ప్రజలంతా స్వేచ్ఛగా ప్రవర్తిస్తారు. అతి పురాతనము, శాశ్వతమైన ఈ రాజధర్మం సత్యస్వరూపమైంది. దీనిలో క్రూరత్వానికి చోటు లేదు. అందువల్ల రాజ్యం సత్య ప్రధానమై ఉండాలి. సత్యం మీదనే లోకం నిలిచి ఉంది.
‘ఋషులు, దేవతలు కూడా సత్యమే పరమధర్మమని అంగీకరించారు. సత్యాన్ని పలికేవాడు ఈ లోకంలో ఉన్నతమైన స్థానాన్ని పొందుతాడు. అసత్యం చెప్పేవాడిని చూసి ప్రజలు పాముని చూసి భయపడినట్లు భయపడతారు. ఇహలోకంలో సత్యమే ఉత్తమ ధర్మం. ఇది స్వర్గానికి కూడా మూలకారణమని చెప్తారు. ఈ లోకంలో సత్యమే ఈశ్వరుడు. అన్నిటికీ సత్యమే మూలం. సత్యాన్ని మించిన ఉత్తమ ధర్మమేదీ లేదు. దానం, యాగం, హోమం, తపస్సు, వేదాలు ఇవన్నీ సత్యం మీదే ఆధారపడి ఉన్నాయి. అందువల్ల మానవుడు సత్యానే్న పాటించాలి. లోకంలో ఒకడు రాజ్యాన్ని పాలిస్తాడు. ఒకడు వంశాన్ని వృద్ధిలోకి తెస్తాడు. ఒకడు నరకంలో పడతాడు. ఒకడు స్వర్గంలో గౌరవాన్ని పొందుతాడు. నేను సత్య ప్రతిజ్ఞ కలవాడిని. తండ్రి ఎదుట సత్యం మీద శపథం చేసి సత్యమైన ఆజ్ఞని పరిపాలించకుండా ఎలా ఉంటాను? సత్యప్రతిజ్ఞ గల నేను నా తండ్రి సత్యమనే ధర్మాన్ని లోభం వల్ల కాని, మనసు చలించి కాని, తమోగుణంతో కలిగిన అజ్ఞానం వల్ల కాని వ్యతిరేకించను. అసత్య సంధుడినై, చిత్తస్థైర్యం లేక చంచలంగా ఉన్నవాడు సమర్పించిన హవ్యకవ్యాదులని దేవతలు కాని, పితృదేవతలు కాని స్వీకరించరని మేం విన్నాము. సత్యమనే ఈ ధర్మం సాక్షాత్తు పరమాత్మే అని నేను తలుస్తున్నాను. అందువల్ల సత్పురుషులు ఆచరించిన ఈ కష్టమైన పనిని నేను గౌరవిస్తున్నాను. నీచులు, క్రూరులు, దురాశాపరులు, పాపాత్ములైన వారు సేవించే కొంచెం ధర్మంతో కూడినదైనా, అధర్మంతో నిండినదైనా ఆ క్షత్రియ ధర్మాన్ని నేను విడిచేస్తాను.
‘మానవులు ముందుగా మనసులో నిర్ధారణ చేసుకుని తర్వాత శరీరంతో పాపకర్మలని చేస్తారు. నాలుకతో అసత్యం పలుకుతారు. ఇలా పాపం మానసికమూ, శారీరకం, వాచకం అని మూడు విధాలు. భూమి, కీర్తి, లక్ష్ములు సత్యవంతుడైన పురుషుడ్ని చేరాలని కోరుకుంటాయి. అతను స్వర్గస్థుడైనా అతనే్న చూస్తూంటాయి. అందువల్ల సత్యానే్న అవలంబించాలి. నువ్వు శ్రేష్టమని నిర్ణయించి, చమత్కారపు మాటలతో ‘ఇది మంచిది, దీన్ని చెయ్యి’ అని నాతో చెప్పిందంతా చెడ్డదే. నేను నా తండ్రి ఎదుట తిరుగులేని ప్రతిజ్ఞ చేశాను. అప్పుడు కైకేయి కూడా చాలా సంతోషించింది. నేను వనవాసం చేస్తానని నా తండ్రికి మాట ఇచ్చి ఇప్పుడు ఇది కాదని భరతుడి మాటని ఎలా వింటాను? నేను పరిశుద్ధుడినై, మితభోజనం చేస్తూ, పవిత్రమైన మూల ఫలాలతో పితృదేవతలని తృప్తిపరుస్తూ, పంచేంద్రియాలని సంతృప్తిగా ఉంచుతూ, కపటాన్ని వదిలి, శ్రద్ధతో కార్యాకార్యాలని తెలుసుకుంటూ ఇలా వనవాసం చేస్తూ జీవితాన్ని గడుపుతాను. ఈ కర్మ భూమిని పొందినవాడు శుభమైన కర్మని తప్పక చేయాలి. అగ్ని, వాయువు, చంద్రుడు వారు చేసిన కర్మలకి ఫలంగా ఆయా ఫలాలని పొందగలిగారు. దేవేంద్రుడు నూరు యజ్ఞాలు చేయడంతో స్వర్గ్ధాపత్యాన్ని పొందాడు. మహర్షులు తీవ్రమైన తపస్సులు చేసి స్వర్గానికి వెళ్లారు.’
ఉగ్రమైన తేజస్సు గల రాముడు నాస్తికత్వంతో కూడిన ఆ జాబాలి చేసిన హేతువాదాన్ని విని, దాన్ని సహించలేక అతని మాటలని ఖండిస్తూ మళ్లీ చెప్పాడు.
‘సత్యం, ధర్మం, పరాక్రమం, భూతదయ, ప్రియమైన సంభాషణ, దేవబ్రాహ్మణ అతిథుల పూజ అనేవి స్వర్గానికి మార్గాలని సత్పురుషులు చెప్తున్నారు. అందువల్లే విషయం సరిగ్గా తెలుసుకుని బ్రాహ్మణులు తప్పక మంచి ఫలాన్నిచ్చే మార్గాన్ని అవలంబించి, ఏమరుపాటు లేకుండా సకల ధర్మాలని యథావిధిగా ఆచరిస్తూ ఉత్తమ లోకప్రాప్తిని కోరుతున్నారు. చెడు మార్గంలో ప్రవర్తించే బుద్ధి గలవాడివి. ఈ నాస్తిక ఆలోచనలతో సంచరిస్తూ ధర్మమార్గాన్ని వదిలేసిన నిన్ను చేరదీసిన నా తండ్రిని నేను నిందిస్తున్నాను. నాస్తికుడు దొంగ వంటివాడు. అందుచేత అతను ప్రజలకి అనుమానించ దగ్గవాడు. పండితుడు ఎన్నడూ నాస్తికుడితో సంబంధం పెట్టుకోకూడదు. నీకంటే పూర్వులు, శ్రేష్ఠులైన జనులు అనేక శుభకార్యాలని చేసారు. ఇహలోకాన్ని పరలోకాన్ని కూడా జయించారు. ఈ కారణాల వల్ల బ్రాహ్మణులు హోమాలు, కర్మలని క్షేమం కోసం చేస్తారు. ధర్మం మీద ఆసక్తి గలవారు, సత్పురుషులతో స్నేహం చేసేవారు, తేజోవంతులు, దానగుణం ప్రధానంగా కలవారు, హింస చేయని వారు, పాపం పోయిన వారు, ఉత్తములైన మునులే లోకంలో పూజింపదగిన వారు.’
ఇలా కోపంగా మాట్లాడే మహాత్ముడు, మంచి బుద్ధి గలవాడైన రాముడితో జాబాలి హితం, అస్థికత్వం, సత్యాలతో కూడిన మాటలని అనునయంగా చెప్పాడు.
‘నా అంతట నేనుగా నాస్తికుల మాటలని చెప్పడం లేదు. నేను నాస్తికుడ్ని కాను. పరలోకం అంటూ ఏదీ లేదు. కాలాన్ని బట్టి నేను మళ్లీ అస్థికుడ్ని అవుతాను. మరో సమయంలో నాస్తికుడిలా మాట్లాడుతాను. రామా! నేను నాస్తిక మాటలు చెప్పాల్సిన సమయం మెల్లగా రావడంతో అలాంటి మాటలు చెప్పాను. నిన్ను అయోధ్యకి మరలించడానికి, నిన్ను అనుగ్రహింప చేసుకోడానికి, నీ కోసం మాత్రమే నేమీ విధంగా మాట్లాడాను.’

(అయోద్య కాండ సర్గ 109వ సర్గ)

ఇంటి దగ్గర ఆ రెండు సర్గలు చదువుకుని వచ్చిన ఆశే్లష అమ్మమ్మ మీనమ్మ వెంటనే హరిదాసుతో చెప్పింది.
‘ఏమయ్యోయ్. ఇవాళ హరికథలో ఐదు తప్పులు చెప్పావు. ఇలా ఐతే ఎలా?’
మీరా తప్పులని కనుక్కోగలరా?
*
1.మాట ఇచ్చింది తాతయ్య ముందు. కాని కైకేయికి అని హరిదాసు తప్పుగా చెప్పాడు.
2.అడవిలో నివసించాల్సింది పధ్నాలుగు ఏళ్లు. హరిదాసు పనె్నండు అని తప్పు చెప్పాడు.
3.గయలో. కాని హరిదాసు బ్రహ్మకపాల క్షేత్రంలో అని తప్పు చెప్పాడు.
4.107వ సర్గలో రాముడు చెప్పిన ‘నువ్వు నరులకి రాజువు. నేను అడవిలోని మృగాలకి రాజుని అవుతాను’ అన్న ముఖ్య విషయాన్ని హరిదాసు చ్పెలేదు.
5.ఆ బ్రాహ్మణోత్తముడి పేరు జాబాలి. హరిదాసు తప్పుగా హంసకుడు అని చెప్పాడు.
6.పతివ్రత ఒక్క జడ వేసుకుని భర్త కోసం వేచి ఉన్నట్లు ఆ నగరం నీ కోసం వేచి ఉంది అని జాబాలి చెప్పిన మాటలని హరిదాసు చెప్పలేదు.

*
మీకో ప్రశ్న
గాయత్రి మంత్రంలోని ఏడవ బీజాక్షరం ‘య’ ఏ కాండలో ఏ శ్లోకంలో వస్తుంది?
*
గత వారం ‘మీకో ప్రశ్న’కి జవాబు

గాయత్రి మంత్రంలోని ఆరవ బీజాక్షరం ‘రే’ ఏ కాండలో ఏ శ్లోకంలో వస్తుంది?
అయోధ్య కాండ 71-33లోని ద్వారేణ వైజయంతేన ప్రావిశ చ్చాంత్రవాహనః శ్లోకంలో.

-మల్లాది వెంకట కృష్ణమూర్తి