S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఏ కంచంలో తింటే మంచిది?

ఫ్రశ్న: రకరకాల లోహాలతోనూ, గాజుతోను, ప్లాస్టిక్‌తోనూ, ఫైబర్‌తోనూ కంచాలు వస్తున్నాయి. వీటిలో దేనిలో అన్నం తినటం మంచిది.
-ప్రసాదరావు (జమ్మలమడుగు)

జ: సింధూ నాగరికతా కాలంలో కంచు పళ్లెంలో తినటం పుణ్యప్రదంగా ఉండేది. ఎందుకంటే ఆ నాగరికతా కాలంలో అక్కడ కొత్తగా రాగిని కనుగొన్నారు. సింధు నాగరికత త్రవ్వకాలలో ఇప్పుడు మనం తింటున్న కంచం లాంటిదే గుండ్రని ‘కంచు కంచం’ దొరికింది. కాంస్యం అంటే కంచు. కంచుతో చేసింది కంచం అయ్యింది. కంచరి అంటే కంచుతో పని చేసే లోహకారుడు! ఏ లోహంతో చేసిన పళ్లాన్నయినా అన్నం తినేందుకు వాడే దాన్ని కంచం అనే అంటున్నాం ఇప్పుడు.
సింధు నాగరికతలో కంచు వాడకంలో ఉన్న సమయంలో, తెలుగు నేల మీద ఇనుమును కరిగించ గలిగారు. అందుకని, కంచు కంచాలతో పాటు స్టీలు పాత్రల వాడకం అనాది కాలంగా మనకి ఉంది. కానీ, యాగాలు, క్రతువుల సమయంలో రాగి చెంబులూ, రాగి అరివేణము, ఉత్తరిణి (చెంచా) ఇతర రాగి పాత్రలే వాడతారు. లేదా కంచు పాత్రలు వాడుతారు. స్టీలు వాడరు. ఎందుకంటే వేదకాలం వారికి స్టీలు తెలియదు కాబట్టి!
మన సమాజం వ్యావసాయిక సమాజంగా పుట్టి ఆర్థిక సమాజంగా ఎదిగి, వాణిజ్య సమాజంగా మారింది. వ్యావసాయిక సమాజం నడుస్తున్న కాలంలో కూరలో నూనె వేసి వండేవారు. ఆర్థిక సమాజంలో నూనె బాగా పోసి కూర వండటం మొదలు పెట్టారు. 2000 సంవత్సరం తరువాత నూనెలో కూర వేసి వండుతున్నారు. అదీ తేడా! ‘నా డబ్బు - నా ఇష్టం’ అనే ధోరణి వాణిజ్య సమాజంలో ఎక్కువగా ఉంటుంది. దాని ప్రభావం అన్ని రకాలుగా జీవన విధానంపైన ప్రసరిస్తుంది. ఆహారం తయారీలోనే కాదు ఈ ప్రభావాన్ని ఆహారం తినే విధానంలో కూడా మనం గమనించవచ్చు. భోజనం ఎందులో తినాలి అనే ప్రశ్నకు సమాధానాన్ని ఈ కోణంలోంచి పరిశీలిద్దాం.
మొన్నటిదాకా అంటే, సుమారుగా 1970-80 ల దాకా వ్యావసాయిక సమాజం నడిచిన కాలంలో భోజనం చేయటానికి కుటుంబంలో అందరూ కలిసి వంట గదిలో ఒక వారగా కూర్చుని, వండినవన్నీ విస్తట్లో వడ్డించే వరకూ ఆగి, భగవన్నామ స్మరణ చేసి సంతోషంగా భోజనం చేసేవారు. ఆ తరువాత ఆర్థిక సమాజం వచ్చి, ఈ విధాలను మార్చేసింది. డైనింగ్ టేబులూ, ఫ్రిజ్జూ, టీవీలు వచ్చాక పరిస్థితి పూర్తిగా మారిపోయింది. టీవీలో హత్యల వార్తలు చూస్తూ టేబుల్ భోజనం చేయటానికి అలవాటు పడసాగారు జనం. ఇప్పుడు తాజాగా వాణిజ్య సంస్కృతి మన సమాజంలో ప్రవేశించింది. మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ఇళ్లల్లో అన్నం తినే పద్ధతుల్లో చాలా మార్పులు వచ్చాయి. సోఫాలో కూర్చుని, పళ్లెం ఒళ్లో పెట్టుకొని ఒక్కొక్క మెతుకే తింటూ ఇంకో చేత్తో రిమోటు నొక్కుకుంటూ, భోజన కార్యక్రమానికి రెండో ప్రాధాన్యత నిచ్చే పరిస్థితి ప్రస్తుతం నడుస్తోంది.
సాంప్రదాయ బద్ధంగా భోజనం చేసేవారిని అనాగరికులుగా, ఛాందసవాదులుగా, మూర్ఖులుగా ముద్ర వేసి, భోజనం పట్ల శ్రద్ధ, గౌరవం, భక్తి వదిలేసి, విచిత్రమైన వ్యవస్థను సృష్టించుకుంటున్నాం మనం. ఇందులో అందరూ భాగస్వాములే!
‘ఆరోగ్యకరమైన కంచం’ అంటే, ఆరోగ్యకరమైన ఆహారం అని అర్థం. మనవి ఆరోగ్యకరమైన కంచాలేనా ఒక్కసారి పరిశీలించి చూద్దాం. ఆరోగ్యకరమైన అన్నాన్ని, ఆరోగ్యకరమైన కంచంలో తినటం కూడా అవసరమే! గొంగట్లో తింటూ వెంట్రుకలు వచ్చాయనటం సరికాదు. కంచమూ ముఖ్యమే!
మన నాయనమ్మల కాలం నాటి డిన్నర్ సెట్లలో ప్లాస్టిక్ కంచాలు, ధర్మోకూల్ పళ్లాలు లేవు. ఆ రోజుల్లో ఎవరి మరచెంబు, గ్లాసూ వాళ్లు వెంట తీసుకుని విందు భోజనాలకు వెళ్లేవాళ్లు. భోజనాలను విస్తరాకుల్లోనే వడ్డించేవాళ్లు. అనారోగ్యానికి ఆస్కారాలు తక్కువగా ఉండేవి. మరచెంబు స్థానంలో ఇప్పుడు వాటర్ బాటిల్స్ వచ్చాయి. వాటివలన కలిగే చెడు గురించి ఆలోచించే తీరిక ఎవరికీ లేదు.
పోలీ ఎథిలీన్, పివిసి, నైలాన్, ఇలాంటి పోలిమర్స్‌ని ఉపయోగించి కావలసిన ఆకారంలోకి మలిచేందుకు వీలైన ద్రవ్యాన్ని ప్లాస్టిక్ అంటారు. కృత్రిమం, మోసపూరితం, అనుకరణం, అబద్ధం లాంటి అర్థాలతో కూడుకున్న ఈ ప్లాస్టిక్‌ని పర్యావరణ నిపుణులు అది నశించదు కాబట్టి వాడవద్దంటున్నారు. కానీ, ఆహార శాస్త్ర నిపుణులు అవి విషపూరితమైనవి కూడా కాబట్టి ఆహార పదార్థాలకు ప్లాస్టిక్‌ని దూరంగా ఉంచండని చెప్తున్నారు. క్షణాన ప్లాస్టిక్‌ని నిషేధించి, కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు ఇస్తే, మనుషులకు ప్లాస్టిక్ లేకపోతే జీవించటం ఎలాగో అర్థం కాని పరిస్థితుల్లో పడతారు. వంట గదిలో ప్లాస్టిక్ డబ్బాలు, సీసాలు, క్యారేజీలు, బాక్సులు, కొన్ని కరెంటు ఉపకరణాలు, వాటర్ ఫిల్టర్లు, ఒకటేమిటీ మూడొంతులు ప్లాస్టిక్కే ఆక్రమించి ఉంది. ప్లాస్టిక్‌కి ప్రత్యామ్నాయంగా మరో ఉపాయం ఏదీ సామాన్యుడికి అందుబాటులో లేకుండా ప్రభుత్వం వారు ప్లాస్టిక్ మీద ఎన్ని ఉత్తర్వులు ఇచ్చినా ఉపయోగం లేదు. 5-6 కిలోల కూరగాయల పట్టే ప్లాస్టిక్ సంచీని మార్కెట్లో 4 రూపాయలకు అమ్ముతున్నారు. దాని స్థానంలో ఒక గుడ్డ సంచీని సబ్సిడీ ఇచ్చి అయినా సరే, అదే రేటుకు తయారు చేయించి అందుబాటులోకి తెస్తే మనిషన్న వాడెవడూ ప్లాస్టిక్ సంచీ వాడడు. ఇలా చేస్తే చేనేత కుటుంబాలకు ఆసరా అందుతుంది. ప్లాస్టిక్ సంచీలు, ప్లాస్టిక్ పళ్లాలు, ప్లాస్టిక్ గ్లాసులు, పాత్రలు, డబ్బాలు, సీసాలు విష పూరితమైనవనీ, వీటికి ఆహార పదార్థాలను దూరంగా ఉంచాలనే ప్రబోధాన్ని సామాన్యుడికి చేరేలా చూడాలి. ప్రత్యామ్నాయాలను వెదకటం గురించి ఆలోచించాలి.
(మిగతా వచ్చేవారం)

- డా. జి.వి.పూర్ణచందు సెల్ : 9440172642 purnachandgv@gmail.com