S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

అది ఆత్మ పరమాత్మల సంయోగం! (రాస క్రీడాతత్త్వము-5)

పదకొండవ దృక్కోణం :-
‘‘శ్రీకృష్ణుడు ఎంత సర్వాంతర్యామి అయితే మాత్రం, అధర్మ ప్రవృత్తి తగునా?’’ అనే సందేహం నిన్ను వదలకుండా వుంది. కానీ, భగవంతుడికి ఒక సమస్య వుంది. జీవులు బహిర్ముఖులై వున్న సమయాలలో, వారి హృదయాలను శృంగార రసం పట్టి గుంజుతూ వుంటుంది. అలాంటి జీవులను ఆయన ఉద్ధరించాలి. అంటే, వారికి శృంగారభావన లేకుండా చేయాలి.
శృంగార ప్రవాహంలో వున్న జీవుణ్ణి వున్నట్టుండి ఒక్క సారిగా ఆపేస్తే, వాడి మనస్సు తట్టుకోలేదు. అందువల్ల, వారి మార్గంలోనే తాను గూడా కొంత దూరం నడిచి, వారిని నడిపించి, క్రమంగా వాళ్ళకు తెలియకుండానే వాళ్ళను అంతర్ముఖులుగా చేయాలి. ఇదొక్కటే ప్రమాదంలేని ఉపాయం. అందుకే భగవంతుడు గోపికల విషయంలో ఈ మార్గానే్న ఆశ్రయించాడు.
పనె్నండవ దృక్కోణం (చివరి దృక్కోణం) :-
రాజా! దాచడమెందుకు? అసలు రహస్యం చెబుతాను విను. శ్రీకృష్ణుడు రాసక్రీడ చేసే సమయాలలో, ఆ యా గోపికల స్థూలశరీరాలు వాళ్ళ ఇండ్లలోనే వుండేవి. అందువల్లనే, వారి భర్తలు గానీ, బంధువులు గానీ, శ్రీకృష్ణుడి యెడల ఏ మాత్రమూ అసూయపడలేదు.
ఇతరులు కూడా కృష్ణుడి లాగానే చేసి ‘‘వాళ్ళ నుద్దరించేందుకే అలా చేశాను’’ అని చెపుతా రేమోనని సందేహం వ్యక్తం చేశావు. ఇలా చేసే అర్హత జీవుల దేహబంధాలను ఈ రీతిగా విడిపించగల సామర్థ్యం గలవారికి మాత్రమే వుంటుంది. అది లేనివారు అలా చేస్తే, వారు పాపాత్ములే అవుతారు.
ఆ గోపికల స్థూలశరీరాలు అలా పడి వుండగా, సూక్ష్మశరీరాలు శ్రీకృష్ణ మురళీగానానికి ఆకర్షింపబడి, పరమాత్ముని కోసం పరుగులు తీసేవి. ఈ విషయం ఆ గోపికలకే తెలియదు. వాళ్ళు పారవశ్య స్థితిలో వున్నందువల్ల, తాము పరిపూర్ణ దేహంతో ఉన్నట్టూ, తమకు ఆభరణాలూ, చీరలూ, అన్నీ వున్నట్లూ, భావించుకుంటూ పరమాత్మ భావనలో ఒళ్ళు మరచిపోతూ వుండేవారు. ఇక్కడ ఒళ్ళు మరచిపోవటం అంటే, తమ సూక్ష్మదేహాలను కూడా మరచిపోవటమే. సూక్ష్మదేహాన్ని కూడా మరచిపోతే జరిగేది, ఆత్మపరమాత్మల సంయోగమే. వాళ్ళకు ఆ స్థితి అందించేందు కోసమే భగవానుడు మురళీగానాన్నీ, తన సమ్మోహన మందహాసాన్నీ, యమునా తీరాన్నీ, వెనె్నల రాత్రులనూ, వినియోగించుకున్నాడు. ఆయన ఆ జీవుల మధ్యలో తానూ ఒక జీవుడైనట్లు నటిస్తూ, ఆ గోపికలను పరమాత్మ భావనలోకి తీసుకువెళ్ళి, వారిని ఉద్ధరించాడు. ఇదే రాసక్రీడ.
ఈ భావాల్ని మనసులో పెట్టుకుని పోతన మహాకవి ఇక్కడ ఒక గొప్ప పద్యం చెప్పాడు.
తలచి తలచి జనులు తబ్బిబ్బు పడనేల?
వింతలన్నిటికిని వింతయైన
నీదు సృష్టి వింత నెమ్మది దలపోయ
ఇవియు వింతలగునె? యిద్ధచరిత
సంస్క ృత మూలంలో ఈ పద్యం లేదు. శుక పరీక్షిత్తుల మధ్య జరిగిన చర్చల ఫలితాన్ని మొత్తాన్నీ క్రోడీకరిస్తూ ఆ మహాకవి ఈ పద్యం వ్రాశాడు. ఈ ఘట్టంలో రాగల సందేహాలన్నిటినీ పై చర్చ ద్వారా వ్యాసభగవానుడే తొలగించాడు. ఇక్కడ పాఠకులమైన మనం గమనించదగ్గ అంశాలు మరో రెండు వున్నాయి.
ఒకటి శ్రీకృష్ణుడి శీలాన్ని గురించి అతని శత్రువులు ఏమి భావించారు?- అనేది. శ్రీకృష్ణుణ్ణి బాగా ద్వేషించి నిందించినవారిలో శిశుపాలుడు ముఖ్యుడు. ఇతడు ధర్మరాజ రాజసూయాంతంలో జరిగిన శ్రీకృష్ణ సన్మానాన్ని చూసి సహించలేక, శ్రీకృష్ణుణ్ణి రకరకాలుగా నిందించాడని భారతంలో వివరంగా వుంది. ఆ నిందల్లో శ్రీకృష్ణుడు వ్యభిచారి అనే మాట లేనే లేదు.
శ్రీకృష్ణుడికన్నా తనే గొప్పవాడినని విర్రవీగిన పౌండ్రక వాసుదేవుడు గూడా శ్రీకృష్ణుణ్ణి చాలా నిందించాడు. గో స్ర్తి బాల హత్యలు చేశావని చాలా తిట్టాడు గానీ, వ్యభిచారివని ఒకసారి కూడా అనలేదు. శ్రీకృష్ణుడి సమకాలీన శత్రువులే చేయని అభియోగాన్ని మనం ఏ ఆధారంతో చేయగలం?
అదీ గాక రాసక్రీడ జరిగిన కొద్ది రోజులకే శ్రీకృష్ణుడు మధురకు వెళ్ళిపోయాడు. ఆయన మళ్ళీ బృందావనానికి వచ్చి తన పాత స్నేహితులతో క్రీడించనే లేదు. శ్రీకృష్ణుడిది కామదృష్టి అయివుంటే, ఇలా మళ్ళీ వెనక్కి రాకుండా వుండటం సాధ్యమా?!
(ఇంకా వుంది)

- కుప్పా వేంకట కృష్ణమూర్తి.. 9866330060