S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

కళలతో మనో వికాసం

ప్రఖ్యాత నర్తకి శ్రీమతి గంటి ఇందుమతి గురువు, పరిశోధకురాలు, సంగీత విద్వాంసురాలు. వ్యక్తిగతంగా ఎన్నో బాధ్యతలు నిర్వహిస్తూ నృత్యంలో సంగీతంలో దశాబ్దాలుగా కళాసేవ చేస్తున్నారు. వీరు తమ తల్లి వద్దే కర్ణాటక సంగీతం నేర్చుకున్నారు.
జీవన ప్రస్థానం..
1972 మార్చిలో రాజమహేంద్ర వరంలో ఎ.బి.శంకరశాస్ర్తీ, శ్రీమతి సరస్వతి దంపతులకు ఇందుమతి జన్మించారు. చిన్నప్పటి నుండే నృత్యం, సంగీతం అంటే ప్రేమ. ఐదవ ఏట నిడమర్తి సత్యనారాయణ గారి వద్ద నాట్యాభ్యాసం మొదలైంది. తరువాత హేమాద్రి చిదంబర దీక్షితులు గారి వద్ద గురుకుల పద్ధతిలో నాట్య శిక్షణ. వీరి అరంగేట్రం వెదురుపాకు అమ్మవారి పీఠంలో జరిగింది. కళ అంటే జవము జీవము అంటారు ఇందుమతి.
విద్య
వీరు నృత్యంలో సర్ట్ఫికెట్, డిప్లొమా చేసి తరువాత హైదరాబాద్‌లో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో బి.ఎ. నృత్యం (1990-93), ఎం.ఏ. నృత్యం (1993-95) చేశారు. అక్కడ ఎంతోమంది గొప్ప గురువుల దగ్గర నృత్యం నేర్చుకోవడం, శిక్షణ పొందడం ఒక అదృష్టం అంటారీమె. బంగారానికి తావి అబ్బిన విధంగా నృత్యంతోపాటు, సంగీత సాధన ఎంతో తోడ్పడింది. తరువాత ఆచార్య డా.్భగవతుల సేతురాం గారి వద్ద నృత్యంలో తుది మెరుగులు దిద్దుకున్నారు. వీరు అభినయానికి, నృత్త, నృత్యాలకు ప్రఖ్యాతులు. ‘లాస్యాంజలి’ అనే కూచిపూడి శిక్షణాలయం స్థాపించి దశాబ్దాలుగా ఉత్తమ కళాకారులను తీర్చిదిద్దుతున్నారు. తల్లి సరస్వతీ దేవిగారితో ఎన్నో సంగీత ప్రదర్శనలు ఇచ్చారు. అలాగే కూతురు లాస్యప్రీతితో కూడా ఎన్నో నృత్య ప్రదర్శనలిచ్చారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్, న్యూఢిల్లీలో రవిశంకర్ గారి సమక్షంలో శిష్యులతో ప్రదర్శించడం గొప్ప అనుభూతి అంటారు.
ఈమె ప్రతిభ, వ్యుత్పత్తి, సృజన గుర్తించి, శ్రీ సద్గురు సన్నిధి సంస్థ వారు ‘కూచిపూడి నర్తన శిరోమణి’ అనే బిరుదునిచ్చి ఘన సత్కారం చేశారు. వీరు యూరోప్‌లో ఎన్నో సంవత్సరాలు ఉండి నృత్యాన్ని ప్రచారం చేశారు.
ఇందుమతి గారితో ముఖాముఖి.
ధనవంతులు, పరపతి ఉన్నవారికే ప్రోత్సాహం దొరికేది నా చిన్నప్పుడు. ఇప్పుడు కూడా అలాంటివి జరుగుతున్నాయి. కానీ అలా ఉండకూడదు. నాన్నగారు ప్రభుత్వ పాఠశాల హెడ్‌మాస్టర్. అమ్మ సంగీతం టీచర్. అమ్మ ఎక్కడ సంగీత కచేరీలు ఇచ్చేదో అక్కడ నేను కూడా నృత్యం ప్రదర్శించేదాన్న. కేవలం నా ప్రతిభ, వ్యుత్పత్తి, సృజన, పట్టుదలతో పైకి వచ్చాను.
పెళ్లికి ముందు అమ్మా నాన్న నన్ను ఎంతో ప్రోత్సహించారు. పెళ్లి తరువాత మా వారు, కుటుంబ ప్రోత్సాహం ముఖ్యం. అందులో పెళ్లైన తరువాత నేను పెరిగిన రామచంద్రాపురంలో అందరూ, మా బంధువర్గం, గురువులు అందరూ ప్రోత్సహించారు. నాన్న కూడా మంచి సంగీత విద్వాంసులు. నాటక రంగంలో డిప్లొమా చేశారు. కాని వారి చిన్నప్పుడు పెద్దగా ప్రోత్సాహం రాలేదు నాన్నకి. తనకు రాని ప్రోత్సాహం నాకు ఇచ్చారాయన. నన్ను హైదరాబాద్ పంపి, తెలుగు విశ్వవిద్యాలయంలో బి.ఏ. ఎం.ఏ. నృత్యం చదివించారు. ఇప్పుడు చాలామంది చదువుతున్నారు, కానీ ఆ రోజుల్లో మా ఊరి నుండి వేరే ఊరు వెళ్లి అమ్మాయిలు చదవడం ఉండేది కాదు. పెళ్లయ్యాక చండీగఢ్, బాంబే, లండన్ వెళ్లాను. ఇప్పుడు మా పాప కూడా మంచి నర్తకి. మేమిద్దరం కలిసి ప్రదర్శనలు ఇవ్వడం చక్కటి అనుభూతి. చిన్నప్పుడు అమ్మాయిలకు నృత్యం నేర్పిస్తే పెళ్లి ఎలా అవుతుంది? అనే వాళ్లు. ఇప్పుడు అలా కాదు. సమాజంలో, వారి ఆలోచనా సరళిలో, భావాలలో మార్పు వచ్చింది. కళలకు ప్రోత్సాహం లభిస్తోంది. అది చాలా ముఖ్యం. కళ సమాజం పరస్పర ఆధారితమైనవి. రెండూ కలిసి వికసిస్తాయి.
చదువు, కళ రెండూ ముఖ్యం. కేవలం కళపై ఆధారపడకుండా చదువు కూడా డిగ్రీలు పొందాలి. అలాగే ఈ రోజుల్లో మొబైల్, లాప్‌టాప్ తప్ప పిల్లలు ఏమీ చేయటం లేదు. కళల వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుంది. ముఖ్యంగా నృత్యం వల్ల శారీరక, మానసిక వత్తిడి తగ్గి వికాసం కలుగుతుంది. దీనివల్ల చదువులో కూడా రాణిస్తారు. ఒక బాటరీ రీచార్జి అయినట్లు రెండింతలు శక్తి వస్తుంది. రోజూ అరగంట నృత్యం చేస్తే ఎంతో హాయిగా యోగా చేసినట్లు ఉంటుంది. కళలు నేర్చుకోవడం చాలా మంచిది. ఎప్పుడు ఏ విద్య ఎక్కడ అలా అవసరం వస్తుందో తెలియదు. అందుకే కళలు నేర్చుకోవడం వల్ల మనం అభివృద్ధి చెందుతాం. మన సంస్కృతి కూడా కాపాడుకుంటాం.

-డా. శ్రీలేఖ కొచ్చెర్లకోట, పిహెచ్.డి