S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

విరామమెరుగని కళాసాధన

శ్రీమతి కె.నిర్మల ప్రఖ్యాత గాయని, నటి, రచయిత్రి. అమెరికాలో 40 ఏళ్లు నివసించారు. గృహిణిగా, తల్లిగా వ్యక్తిగత బాధ్యతలు నిర్వర్తిస్తూ, 36 సంవత్సరాలు సైంటిస్టుగా పనిచేసి ఎంతో పేరు తెచ్చుకున్నారు. స్పెక్స్ ఇండస్ట్రీలో సైంటిస్టు, వైస్ ప్రెసిడెంట్‌గా దశాబ్దాలు పనిచేసి రిటైరయ్యారు. లలిత సంగీతంలో కొన్ని వందల ప్రదర్శనలు ఇచ్చారు. ఎంతోమందికి సంగీతం నేర్పిస్తున్నారు. ఇండియన్ ఫిష్ ఇన్ అమెరికా, అటు అమెరికా ఇటు ఇండియా సినిమాలు, గీతాంజలి (ఈటీవీ సీరియల్)లో నటించారు. ఆమెకు 78 సంవత్సరాలు నిండినప్పటికీ ఇప్పటికీ ప్రతిరోజూ సంగీత సాధన చేస్తారు. కళకు వయోపరిమితి లేదంటారీమె.
* * *
మా అమ్మ నాన్నగార్లు శ్రీకృష్ణ శాస్ర్తీ - శకుంతల. నేను ఆగస్టు 25, 1940లో హైదరాబాద్‌లో జన్మించాను. నిజామ్స్ కాలేజీలో బిఎస్సీ (1961), ఎంఎస్‌సి (ఉస్మానియా యూనివర్సిటీ - 1963) చేశాను. ఫిజిక్స్‌లో మొట్టమొదటి మహిళా గోల్డ్‌మెడలిస్ట్‌ని నేను. నాకు తెలుగు చదువుకోవాలని ఉండేది. కానీ నాన్నగారు నన్ను ఫిజిక్స్ చేయమని, దానికి మంచి భవిష్యత్తు ఉంటుందని ఎమ్మెస్సీ ఫిజిక్స్ చదివించారు. మాది పెద్ద కుటుంబం. మొత్తం 8 మంది పిల్లలం మేము. ఆ రోజుల్లో గవర్నమెంట్ మ్యూజిక్ కాలేజీ హైదర్‌గూడలో ఉండేది. అక్కడ సంగీతం నేర్చుకున్నాను. నాకు లలిత సంగీతం చాలా ఇష్టం. మా వారు పరంజ్యోతి తబలా విద్వాంసులు.
నేను డిఎంఆర్ ఎల్ - డిఫెన్స్ మెటలర్జికల్ రీసెర్చ్ ల్యాబ్‌లో మొట్టమొదటి మహిళా సైంటిఫిక్ ఆఫీసర్‌ని. అక్కడ మొట్టమొదటి మహిళా గెజిటెడ్ ఆఫీసర్‌ని కూడా. 1964-70 దాకా అక్కడ పని చేసి, 1970లో యుఎస్ వెళ్లాం. అమెరికాలో నేను ఎన్నో సంగీత ప్రదర్శనలు ఇచ్చాను. ఆ రోజులలో తెలుగు, తమిళం, కన్నడ అందరూ కలిసి భారతి సొసైటీ అని దగ్గరగా 200 సభ్యులతో ఉండేది. ఒకటే ఆశయం. మన భారతీయ సంస్కృతి, మన భాష, మన పిల్లలకి నేర్పించాలి. ప్రతి స్వాతంత్య్ర దినోత్సవం నాడు పండుగ చేసుకుని దేశభక్తి గీతాలు పాడేవాళ్లం. త్యాగరాజ ఉత్సవం చేసేవాళ్లం. దసరా, దీపావళి, ఉగాది ఇలా మన పండుగలన్నీ సంగీతం, నృత్యం, నాటకాలతో జరుపుకునేవాళ్లం. న్యూయార్క్‌లో మొట్టమొదటి తానా సభ 1974లో జరిగింది. అందులో పాడాను. మా అబ్బాయి ప్రశాంత్‌కి తెలుగులో మాట్లాడితేనే అన్నం పెట్టేదాన్ని. మేము ఉద్యోగాలలో బిజీగా ఉన్నప్పటికీ సంగీత, నృత్య కళలను ప్రోత్సహించేవాళ్లం.
అమెరికాలో మేము నాటకాలు రాసుకొని ప్రదర్శించేవాళ్లం. ముఖ్యంగా సామాజిక సమస్యలను హైలైట్ చేస్తూ, ప్రవాస భారతీయులు పడే కష్టాల గురించి నాటకాలు రాసి, వేసేవాళ్లం. ప్రపంచం మొత్తం పర్యటించాను. ఎన్నో వర్క్‌షాప్‌లు చేశాను. పత్రాలు సమర్పించాను.
తెలుగంటే పిచ్చి ప్రేమ. ఒక వేసవిలో 200 పుస్తకాలు చదివాను. వేయి పడగలు కూడా చదివాను. అమెరికాకు వెళ్లాక మారడానికి చాలా కష్టపడ్డాను. చీర కట్టుకొని ఉద్యోగం కోసం ఇంటర్వ్యూలకి వెళ్లేదాన్ని. మూడేళ్లు నాకు ఉద్యోగం రాలేదు. ఇక లాభం లేదని పాశ్చాత్య దుస్తులు, సూట్స్, పాంట్స్ వేసుకోవడం మొదలుపెట్టాను. మారక తప్పలేదు. నాకు అక్కడి భోజనం నచ్చేది కాదు. నాతో పనిచేసేవాడు నాకు పిజ్జా ఇచ్చి ‘మసాలా దోసె అనుకుని తిను. లేకపోతే ఛస్తావు’ అని బెదిరిస్తే అప్పుడు తిన్నాను.
కళకి వయసుతో పనిలేదు. పరిమితి లేదు. ఏదైనా సాధించవచ్చు. ముఖ్యంగా రిటైర్‌మెంట్ అయ్యాక కళలు మానసిక ఉల్లాసం, ఉత్సాహం, ఆరోగ్యానికి తోడ్పడుతాయి. వ్యాపకంగా ఉంటుంది.

-డా. శ్రీలేఖ కొచ్చెర్లకోట, పిహెచ్.డి