S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

అరకు నుంచి పారిస్‌కు..

తూర్పు కనుమల్లోని ‘కాఫీ ఘుమఘుమలు’ ఇప్పుడు దూ రతీరాలు దాటి పారిస్ నగరాని కి వ్యాపించాయి. ‘అరకు కాఫీ’ నేడు విశ్వవిపణిలో విశిష్టతను చాటుకుంటోంది. విశాఖ ఏజెన్సీలోని అరకు ప్రాంత ఆదివాసీలు ఉత్పత్తి చేస్తున్న కాఫీ త్వరలోనే దేశీయ మార్కెట్‌లోనూ సత్తా చాటబోతోంది. ప్రపంచంలోనే ప్రఖ్యాతి పొందిన సుమత్రా, కొలంబో కాఫీ రుచులకు దీటుగా ‘అరకు కాఫీ’ అరుదైన ఘనతను సాధించింది. కొద్దిరోజుల క్రితం ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో మేలైన కాఫీరుచులకు ఇచ్చే ‘ప్రిక్స్ ఎపిక్యూర్స్-ఓఆర్- 2018’ పురస్కారానికి ‘అరకు కాఫీ’ ఎంపికైంది. ఎక్కడో మారుమూల విశాఖ జిల్లా ఆదివాసీలు సృష్టించిన ‘అరకు కాఫీ’కి ఈ పురస్కారం కింద బంగారు పతకం దక్కింది. దేశదేశాల్లో ఇప్పటికే పేరెన్నిక గన్న ప్రముఖ ‘కాఫీ ఉత్పత్తుల’ను అరకు కాఫీ వెనక్కి నెట్టేసింది. ప్రస్తుతం పారిస్‌లో లభిస్తున్న ‘అరకు కాఫీ’ త్వరలో వివిధ దేశాల వినియోగదారులకు అందుబాటులోకి వస్తుంది. అంతర్జాతీయంగా సంచలనం సృష్టిస్తున్న అరకు కాఫీ నాణ్యత గురించి ఇపుడు ప్రముఖ బహుళజాతి సంస్థలు సైతం ఆరా తీస్తున్నాయి. మన దేశంలోని వివిధ రాష్ట్రాలు, వాణిజ్య సంస్థలు అరకులో కాఫీ తోటల సాగు, ఉత్పత్తుల తయారీ తీరుతెన్నులను అధ్యయనం చేస్తున్నాయి.
సముద్ర మట్టానికి 2,985 అడుగుల ఎత్తులో ఉన్న అరకు ప్రాంతం నుంచి ‘కాఫీ రుచులు’ ఫ్రాన్స్‌లోని ‘పర్షియన్ కేఫ్’లను తాకాయంటే- ఈ ఘనత వెనుక ఆదివాసీల శ్రమ ఎంతో ఉంది. అరకు సహా ఏడు మండలాలకు కాఫీ పంట విస్తరించడంతో గిరిజన రైతులకు ఇపుడు చేతినిండా పని ఉంటోంది.
ఆదివాసీ మహిళలు తెల్లవారుతుండగానే నిద్రలేచి కొండలపైకి రెండు, మూడు కిలోమీటర్ల వరకూ నడిచి కాఫీ తోటలకు చేరుకుంటారు. కాఫీ పండ్లను ఏరుకుని బుట్టల్లో నింపి తమ గ్రామాలకు తెస్తారు. పక్వానికి వచ్చిన ఎర్రటి కాఫీ పండ్లను ఎండబెట్డడం, నాణ్యమైన గింజలను వేరుచేయడం, వాటిని మెత్తటి పొడిగా చేసేందుకు చిన్న చిన్న ఫ్యాక్టరీలకు తరలించడం వంటి పనుల్లో మహిళలు తీరికలేకుండా కనిపిస్తారు. కొండలపై సిల్వర్ ఓక్, మల్బరీ, సపోటా, కలపనిచ్చే ఇతర వృక్షాల మధ్య అంతర పంటగా కాఫీని సాగుచేస్తారు. కాఫీ తోటలకు చేరుకునేందుకు కొండలు ఎక్కడం, కాఫీ పండ్లను గంపల్లోకి ఎత్తి కిందకు తీసుకుని రావడం కాయకష్టంతో కూడిన పనే. ఎండిన కాఫీ గింజలను వాటి నాణ్యత మేరకు విడదీయడంలోనే ఇంకా ఎక్కువ శ్రమ కనిపిస్తుంది. భారీ వృక్షాల నడుమ నీడనిచ్చే ప్రాంతాల్లో కాఫీ పంటను సాగుచేస్తున్నా, ఆ తోటలకు వెళ్లేందుకు గిరిజనులు ఎండను సైతం లెక్కచేయక మైళ్లకొద్దీ నడుస్తుంటారు. కొండలపైకి ఎలాంటి రోడ్డు సౌకర్యం ఉండదు గనుక రాళ్లురప్పలను దాటుకుంటూ దుమ్ము ధూళిని తట్టుకుంటూ ఆదివాసీలు కాఫీ తోటలకు చేరుకుంటారు. కాఫీ పండ్లను ఎండబెట్టాక ‘ప్రాసెసింగ్ యూనిట్ల’కు చేరవేసేందుకు తగినన్ని రవాణా సౌకర్యాలు కూడా లేవు.
ఓ దశాబ్దం క్రితం వరకూ అరకు ప్రాంతంలో కాఫీ పంట సాగుచేస్తారన్న విషయం బాహ్య ప్రపంచానికి అంతగా తెలియదు. 2008లో ‘నాంది ఫౌండేషన్’ సంస్థ ఇక్కడి గిరిజనులు కాఫీ పండించేందుకు ప్రోత్సాహాన్ని ఇచ్చింది. పంటను సాగుచేసే విధానం, కాఫీ పండ్లలో నాణ్యత, గింజలను ఎండబెట్టడం, ప్రాసెసింగ్ యూనిట్లలో కాఫీ పొడిని తయారు చేయడం వంటి అంశాల్లో ఆదివాసీలకు ‘నాంది ఫౌండేషన్’ శిక్షణ ఇచ్చింది. ఈ క్రమంలో ‘అరకు కాఫీ’కి అంతర్జాతీయ మార్కెట్‌లో స్థానం లభించింది. అడవిని నమ్ముకున్న గిరిజనులు కాఫీ తోటల సాగుతో మంచి ఆదాయం లభిస్తుందని గ్రహించారు. కాఫీ రైతులంతా కలసి ఒక సహకార సంఘంగా ఏర్పడ్డాక నాణ్యతా ప్రమాణాలతో ఉత్పత్తులను ఎగుమతి చేసే స్థాయికి వచ్చారు. 2007-08 ప్రాంతంలో కిలో కాఫీని కేవలం 42 రెండు రూపాయలకు గిరిజనులు స్థానిక మార్కెట్లలో విక్రయించేవారు. ఇపుడు ఇదే కాఫీకి కిలోకు 275 రూపాయల ధర లభిస్తోంది.
కాఫీ తోటలను ఎక్కడపడితే అక్కడ సాగుచేయడానికి పరిస్థితులు అనుకూలించవు. నీరు నిలవని కొండవాలు ప్రాం తాల్లో నీడ ఉండే ప్రదేశాలు ఈ పంటకు అనుకూలం. భూసారం, వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తేనే కాఫీ పంటలో మంచి దిగుబడులు వస్తాయి. వ్యవసాయ శాస్తవ్రేత్తలు ఇచ్చే సూచనలకు ఆధునిక పరిజ్ఞానాన్ని జోడించి కాఫీ తోటలను సాగుచేయడంలో ‘నాంది ఫౌండేషన్’ ఆదివాసీ రైతులకు అండగా నిలిచింది. కాఫీ విత్తనాలను ఎంపిక చేసుకోవడం, పంటలను తెగుళ్ల నుంచి కాపాడుకోవడం వంటి విషయాల్లో రైతులు నిపుణుల సూచనలను పాటిస్తుంటారు. కాఫీ పండ్లను సేకరించిన తర్వాత వాటిని నాణ్యతా ప్రమాణాల ప్రాతిపదికగా వేరుచేయడం, ఎండబెట్టడం వరకూ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. ఎండబెట్టిన గింజలను 40 నుంచి 60 రోజుల వరకూ గోడౌన్లలో నిల్వచేస్తారు. ఆ తర్వాత వాటిని ‘ప్రాసెసింగ్ యూనిట్ల’కు తరలిస్తారు.
తొలిసారి గుర్తింపు..
అరకు కాఫీకి తొలిసారిగా 2009లో అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ‘అంతర్జాతీయ కాఫీ రుచుల సమ్మేళనం’లో ‘జెమ్స్ ఆఫ్ అరకు’ పేరిట ‘నాంది ఫౌండేషన్’ ఆదివాసీ కాఫీని పరిచయం చేసింది. అమెరికాకు చెందిన ‘స్పెషాలిటీ కాఫీ అసోసియేషన్’ నిర్ధారించిన నాణ్యతా ప్రమాణాలు ‘అరకు కాఫీ’లో పుష్కలంగా ఉన్నాయి. 2009 తర్వాత అనేక దేశాలకు ‘అరకు కాఫీ’ రుచులు విస్తరించాయి. ప్రస్తుతం ‘నాంది ఫౌండేషన్’ ఆధ్వర్యంలో పారిస్ నగరంలో 30 చోట్ల ‘అరకు కాఫీ’ని విక్రయిస్తున్నారు. ఇదే నగరంలో వంద చోట్ల కాఫీ విక్రయ కేంద్రాలను తెరిచేందుకు ఈ ఫౌండేషన్ సన్నాహాలు చేస్తోంది. న్యూ యార్క్, టోక్యో మార్కెట్లలోనూ త్వరలోనే ‘అరకు కాఫీ’ ప్రవేశించబోతోంది.
ఆదివాసీలకు అండగా..
అందచందాలకు ఆలవాలమైన అరకులోయ గురించి నాలుగైదు దశాబ్దాల క్రితం వరకూ దేశంలోని ఇతర ప్రాంతాల వారికి అంతగా తెలియదు. అరుదైన జీవ వైవిధ్యం, అద్భుతమైన ప్రకృతి రమణీయత కలగలసిన అరకు ప్రాంతం తూర్పు కనుమల్లో అనాదిగా అభివృద్ధి ఎరుగని ప్రాంతంగా ఉండేది. రహదారులు, కమ్యూనికేషన్ సౌకర్యాలు లేకపోవడం, నక్సలైట్ల సమస్య, గిరిజనుల పేదరికం వంటివి ఈ ప్రాంతానికి శాపాలుగా ఉండేవి. ఇక్కడి ప్రకృతి దృశ్యాలను వీక్షించేందుకు వచ్చే సందర్శకుల సంఖ్య క్రమంగా పెరగడంతో పర్యాటక రంగంలో అరకులోయకు మంచి గుర్తింపు వచ్చింది. ప్రభుత్వ సహకారం అంతంత మాత్రంగా ఉండడంతో నాంది ఫౌండేషన్, మహీంద్రా హరియాలి వంటి స్వచ్ఛంద సంస్థలు గిరిజన సంక్షేమంపై దృష్టి సారించాయి. ఆరోగ్య సౌకర్యాలు అరకొరగా ఉండడం, అక్షరాస్యత అంతగా లేకపోవడంతో ఏజెన్సీ ప్రాంతంలో మాతాశిశు మరణాల సంఖ్య ఎక్కువగా ఉండేది. వైద్య, విద్య రంగాల్లో ఎలాంటి సౌకర్యాలు అందక గిరిజనులు ప్రధాన స్రవంతికి దూరమయ్యారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో ‘నాంది ఫౌండేషన్’ 2000 సంవత్సరంలో అరకు ప్రాంతంలో తన సేవా కార్యమ్రాలకు శ్రీకారం చుట్టింది. విద్య, వైద్యం వంటివి అందించడమే కాదు, ఆదివాసీలకు ప్రత్యామ్నాయ మార్గాల్లో ఉపాధి కల్పించేందుకు దృష్టి సారించింది. వ్యవసాయంలో ఆధునిక పద్ధతులను ఆచరించేలా గిరిజనులకు ‘నాంది ఫౌండేషన్’ పలు విషయాలపై అవగాహన కల్పించింది. అటవీ సంపదను పరిరక్షించుకోవడంతో పాటు ప్రత్యామ్నాయ పంటలను సాగుచేసి ఉపాధి అవకాశాలను మెరుగుపరచుకునేలా వారిని సంసిద్ధులను చేయడంలో ప లు స్వచ్ఛంద సంస్థలు విజయం సాధించాయి. మహీంద్రా సంస్థకు చెందిన ‘హరియాలి ఇనీసియేషన్’ ప్రతినిధులు 2007లో ఈ ప్రాంతానికి చేరుకొని వనసంపదను పెంచేలా ‘అడవిబిడ్డల’ల్లో ఆసక్తి కలిగించారు. కొండలపై ఏడాదికి పది లక్షల మొక్కలను పెంచే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇక్కడి వాతావరణం ఎంతో అనుకూలంగా ఉండడంతో కాఫీ తోటలను పెంచేందుకు ‘నాంది ఫౌండేషన్’, మహీంద్రా సంస్థలు గిరిజనులను కార్యోన్ముఖులను చేశాయి. కాఫీ తోటలకు నీడనిచ్చేలా భారీ వృక్షాలను పెంచడం, మిరియాల సాగును అంతర పంటగా ప్రోత్సహించడంతో గిరిజనులకు ఆదాయం మెరుగుపడింది. న్యూజిలాండ్‌కు చెందిన వ్యవసాయ, భూసార నిపుణులు ఇక్కడికి చేరుకుని కాఫీ తోటల సాగును అధ్యయనం చేశారు. ఇపుడు అరకు ప్రాంతంలోని కొండలపై టేకు, సిల్వర్ ఓక్, సపోటా, మామిడి తదితర వృక్షజాతులు విరివిగా కనిపిస్తాయి. ఈ భారీ వృక్షాల నీడలో కాఫీతోటల సాగు అనూహ్యంగా పెరిగింది. కాఫీ , మిరియాలు, సపోటా, మామిడి వంటి 16 రకాల ఫలవృక్షాలు గిరిజనులకు దండిగా ఆదాయాన్ని ఇస్తున్నాయి. అన్నింటికంటే ‘అరకు కాఫీ’ అంతర్జాతీయ ఖ్యాతిని గడించింది. ‘హరియాలి ఇనీషియేటివ్’ సంస్థ ఆధ్వర్యంలో గత మార్చి అంతానికి 7.5 మిలియన్ల మొక్కలను కొండలపై నాటారు. దీంతో 350 గ్రామాల్లోని సుమారు లక్షమంది గిరిజనులకు లబ్ధి చేకూరింది. సుమారు 15వేల ఎకరాలను సాగులోకి తేవడం ద్వారా 14, 750 మంది రైతులు పంటలను సాగుచేస్తున్నారు. ఆదివాసీలు కొండకోనల్లో అటవీ సంపదను తామే పెంచుకుంటూ ఉపాధి పొందుతున్నారు.
ఎగుమతులపై దృష్టి..
మన దేశంలో కేరళ, కర్నాటక, తమిళనాడు రాష్ట్రాలు అనాదిగా కాఫీ సాగులో ప్రసిద్ధి చెందాయి. కాఫీ ఎగుమతుల్లో ఈ రాష్ట్రాలదే ఆధిపత్యం. ఆంధ్రప్రదేశ్‌లోని మారుమూల అరకులో కాఫీ పంట సాగుచేస్తున్నారన్న విషయం ఒకప్పుడు ఎలాంటి ప్రచారానికి నోచుకోలేదు. ఇటీవలి కాలంలో ‘అరకు కాఫీ’ ప్రాచుర్యం పొందడంతో పరిస్థితిలో అనూహ్య మార్పులు చోటుచేసుకున్నాయి. గత ఏడాది తొలిసారిగా పారిస్ నగరంలో ‘అరకు కాఫీ’ విక్రయాలు ప్రారంభమయ్యాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆధ్వర్యంలోని ‘గిరిజన సహకార సంస్థ’ (జీసీసీ) సహా పలు ప్రైవేటు సంస్థలు ‘అరకు కాఫీ’కి విస్తృత ప్రచారం చేస్తున్నాయి. ప్రపంచ ప్రసిద్ధి చెందిన సుమత్రా, కొలంబో కాఫీ రుచులకు భిన్నంగా ఉండడంతో పారిస్‌లో అనతికాలంలోనే ‘అరకు కాఫీ’కి ఆదరణ పెరిగింది. వివిధ సైజుల ప్యాకెట్లలో అరకు కాఫీ ఇపుడు అనేక ప్రాంతాల్లో అందుబాటులో ఉంది. ఫ్రాన్స్‌తో పాటు జపాన్, దక్షిణ కొరియా, స్విట్జర్లాండ్ వంటి దేశాల్లో దీనికి గిరాకీ పెరిగింది.
నిజానికి 1950 ప్రాంతంలోనే కాఫీ పంటను అరకు ప్రాంతానికి పరిచయం చేసినా అప్పట్లో వాణిజ్య దృష్టి లేనందున దీని గురించి ఎవరూ అంతగా పట్టించుకోలేదు. అటవీ ఉత్పత్తుల ద్వారా గిరిజనులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1956లో ‘జీసీసీ’ని ఏర్పాటు చేసినప్పటికీ కాఫీతోటల విస్తీర్ణం నామమాత్రంగానే ఉండేది. కాఫీ తోటలకు ఈ ప్రాంతం ఎంతో అనువైనదని నిపుణులు గుర్తించాక పరిస్థితి మారింది. పంట విస్తీర్ణం పెరగడమే గాక, నాణ్యమైన కాఫీని ఎగుమతి చేసేందుకు ఇపుడు ప్రాధాన్యత ఇస్తున్నారు.
ప్రముఖుల ప్రోత్సాహం..
ఇపుడు దేశంలో ‘అరకు కాఫీ’ ఓ బ్రాండ్‌గా అవతరించడంతో పారిశ్రామిక, వాణిజ్య ప్రముఖులు సైతం అరకుపై దృష్టి సారించారు. ‘ఇన్ఫోసిస్’ సహ వ్యవస్థాపకుడు క్రిష్ గోపాలకృష్ణన్, మహీంద్రా గ్రూప్ సీఎండీ ఆనంద్ మహీంద్రా వంటి ప్రముఖులు ‘అరకు కాఫీ’కి అంతర్జాతీయ ఖ్యాతి దక్కేలా ప్రోత్సాహం ఇస్తున్నారు. పూర్తిస్థాయి సేంద్రియ పద్ధతుల్లో ఉత్పత్తి చేస్తున్న ‘అరకు కాఫీ’ నాణ్యతలోనూ అగ్రగామిగా నిలిచి పారిస్‌లో అడుగుపెట్టింది. ఈ ఘనత ఒక్కరోజులో సాధించింది కాదని, వేలాదిమంది గిరిజనులు ఎన్నో కష్టనష్టాలను భరిస్తూ కాఫీ పండ్లను సేకరించి నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వడం వల్లే సాధ్యమైందని పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు గుర్తుచేస్తున్నారు. కొండలపై వృక్షాల సంఖ్య పెరగడంతో పక్షులు, తేనెటీగల సందడి పెరిగిందని వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇది- ‘అరకు నుంచి పారిస్‌కు ఆదివాసీలు సాగించిన జైత్రయాత్ర’ అని వారు అభివర్ణిస్తున్నారు.
కాఫీ మ్యూజియం..

కాఫీ చరిత్ర, కాఫీ పొడి తయారీ, విభిన్న రుచుల కాఫీ.. ఈ అంశాలన్నీ ఎవరికైనా ఆసక్తిని కలిగిస్తాయి. ఇలాంటి విషయాలపై ప్రజల్లో అవగాహన కలిగించేందుకు అరకులోయలో ‘కాఫీ మ్యూజియం’ను ఏర్పాటు చేశారు. కాఫీ తోటల పెంపకం, గింజల సేకరణ, ఉత్పత్తుల తయారీ వరకూ ఈ మ్యూజియంలో సమస్త సమాచారం అందుబాటులో ఉంటుంది. వినియోగదారుల కోసం ఇక్కడ కాఫీ స్టోర్, స్నాక్ బార్‌ను కూడా ఏర్పాటు చేశారు. చాకొలెట్ కేక్, విభిన్న రుచుల కాఫీలను ఇక్కడ రుచి చూడవచ్చు. పిల్లలకు, పెద్దలకు క్రీడాపోటీలు, సాంస్కృతిక ఉత్సవాలను తరచూ మ్యూజియం ఆవరణలో ఏర్పాటు చేస్తుంటారు. ‘అరకు కాఫీ’కి ఆదరణ పెంచడమే కాదు, ఈ ప్రాంత సంస్కృతిని పర్యాటకులకు చాటిచెప్పేలా మ్యూజియంను తీర్చిదిద్దారు.
కాఫీ ఆకుల నుంచి ‘టీ’!
కాఫీ ఆకుల నుంచి ‘టీ’ పొడి తయారు చేయడం అంటే వినడానికి వింతగా ఉన్నా.. ఇది నిజమేనని మనం ఒప్పుకోవాల్సిందే! అరకు ప్రాంతంలోని కాఫీ తోటల నుంచి సేకరించిన ఆకులతో ‘టీ’ పొడి తయారు చేయడంలో ఆశాజనకమైన ఫలితాలు వస్తున్నాయట! అయితే, ఈ ‘టీ’ పొడిని పాలతో కలిపి కాకుండా నీళ్లలో కలిపి ‘గ్రీన్ టీ’ మాదిరి తయారు చేసుకుని తాగాలట! సాధారణంగా కాఫీ ఆకులను వృథాగా పారవేసి, గింజలను ఎండబెట్టి కాఫీ పొడి తయారు చేస్తారు. ఎందుకూ పనికిరావని భావించే కాఫీ ఆకుల నుంచి ‘టీ’ పొడి తయారు చేసేందుకు అమెరికాకు చెందిన ప్రవాస భారతీయుడు రామన్ మాదాల విశేషంగా కృషి చేస్తూ ఇప్పటికే మంచి ఫలితాలను సాధించారు. సహజమైన ఉత్పత్తులను తయారు చేసేందుకు ఆయన ‘నేచురల్ ఫార్మసీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్’ పేరిట ఓ సంస్థను ప్రారంభించారు. అరకు కాఫీ ఆకులపై రెండున్నరేళ్లుగా అనేక పరిశోధనలు చేశాక ఆశాజనకమైన ఫలితాలు లభించాయని రామన్ చెబుతున్నారు. వెయ్యేళ్లకు పూర్వమే ఇథియోపియాలో కాఫీ ఆకుల నుంచి ‘టీ’ పొడిని తయారు చేశారని ఆయన గుర్తుచేస్తున్నారు. ఇథియోపియాలో అనుసరించిన పద్ధతుల్లోనే అరకులో కాఫీ ఆకుల నుంచి ‘టీ’ని తయారు చేసే పరిశోధనలు ఒక కొలిక్కి వచ్చాయంటున్నారు. కాఫీ ఆకుల నుంచి తయారయ్యే ‘టీ’ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని భరోసా ఇస్తున్నారు. లవంగాలు, నిమ్మగడ్డి, మిరియాలు, లావెండర్‌ల నుంచి తాను ఇప్పటికే విభిన్న రుచుల ‘టీ’ పొడులను తయారు చేశానని అంటున్నారు. ‘అరకు ఛాయ్’ని ఆవిష్కరించేందుకు తాను చేస్తున్న ప్రయత్నాలకు ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ అండగా నిలుస్తోందని రామన్ చెబుతున్నారు.
కేరళకు స్ఫూర్తి..

విశ్వవిపణిలో ‘అరకు కాఫీ’ సంచలన విజయం గురించి ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు కేరళ ఆర్థిక మంత్రి టీఎం థామస్ ఇసాక్ నేతృత్వంలో ఓ ప్రతినిధి బృందం తాజాగా విశాఖ ఏజెన్సీలో పర్యటించింది. పలు గ్రామాల సమీపంలో కాఫీ తోటల సాగును పరిశీలించి, గిరిజన రైతులతో మంత్రి థామస్ సమావేశమయ్యారు. కాఫీ, మిరియాల పంటల సాగుతో గిరిజనులకు లభిస్తున్న ఆదాయం, వారి పిల్లల చదువులు, ఆరోగ్యం వంటి విషయాలపైనా ఆయన ఆరా తీశారు. గేతువలస, హత్తగూడ గిరిజన గ్రామాల్లో పరిస్థితులను స్వయంగా చూశారు. ‘నాంది ఫౌండేషన్’ ఆధ్వర్యంలో ఆదివాసీలు కాఫీ ఎగుమతుల్లో అద్భుత విజయాలను సాధించారని థామస్ కొనియాడారు. అరకులోని సమగ్ర కాఫీ ప్రాజెక్టును, కాఫీ పల్ప్ ప్రాసెసింగ్ యూనిట్‌ను కేరళ బృందం సందర్శించింది. కేరళలో కాఫీ తోటలను సాగుచేసే వారంతా వంద ఎకరాలకు పైబడి ఉన్న పెద్ద రైతులేనని, దీనికి భిన్నంగా అరకులో గిరిజన రైతులు భారీ సంఖ్యలో లబ్ది పొందుతున్నారని మంత్రి థామస్ అన్నారు. తమ రాష్ట్రంలో కాఫీ గింజలను ఎండబెట్టి ‘పొడి’గా చేస్తారని, అరకు ప్రాంతంలో గింజలను ‘గుజ్జు’ రూపంలో ‘ప్రాసెసింగ్’ చేయడంతో నాణ్యమైన కాఫీ లభిస్తోందని ఆయన వివరించారు. కేరళలో తాము అవలంబిస్తున్న పద్ధతిలో కాఫీకి అనుకున్నంత నాణ్యత, రుచి రావడం లేదన్నారు. నాణ్యతాప్రమాణాల కారణంగా ‘అరకు కాఫీ’కి మార్కెట్‌లో మంచి ధర లభిస్తోందన్నారు. ఇక్కడ చిన్నకారు రైతులు సమష్టిగా పనిచేస్తూ అద్భుతాలు సృష్టిస్తున్నారని కేరళ మంత్రి ప్రశంసించారు. అరకు గిరిజన రైతులు తమకు స్ఫూర్తినిస్తున్నారని అన్నారు.

-పి.ఎస్.ఆర్.