S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఉగాది పచ్చడి స్వచ్ఛ ఆరోగ్యం

ఒక రాజుగారు తన రాజ్యంలో పరిస్థితులు స్వయంగా తెలుసుకోవాలని మారువేషంలో తిరుగుతూ ఒక తోటకు వెళ్లాడు. అక్కడ కమ్మని మామిడి పళ్లు చూస్తే ఆయనకు దాహం గుర్తుకొచ్చింది. దాని రైతును కలిసి దాహం అడిగాడు. రైతుకు ఆయన రాజుగారని తెలీదు. అయినా అతిథి మర్యాదలు చేసి, ఓ మామిడి పండుని పిండి పెద్ద గ్లాసుడు రసం తీసి ఇచ్చాడు. ఒక్క మామిడి పండుకు ఇంత మధుర రసమా...’ అని ఆశ్చర్యపోయాడు రాజు.
‘రాజు, ప్రజలు ధర్మవర్తనులై ఉంటే మొక్కలు అధికంగా పుష్పిస్తాయి. అధికంగా ఫలిస్తాయి’ అన్నాడు రైతు. రాజుకు ఇంకో గ్లాసు రసం తాగాలనిపించింది. రైతు సరేనని మరో మామిడి పండు కోసం పిండటం మొదలు పెట్టాడు.
ఈలోగా రాజు మనసులో కొత్త ఆలోచనలొచ్చాయి. ‘నా మంచితనాన్ని ఆసరా చేసుకుని ఈ రైతులు అన్యాయంగా లాభపడ్తున్నారు కాబట్టి, ఇంత సంపన్నమన తోటల మీద అధిక పన్ను వెయ్యాల్సిందే’ అనుకున్నాడు మనసులో. అంతే మామిడి పండులోంచి రసం రావటం ఆగిపోయింది. ఎంత పిండినా గ్లాసులో నాలుగో వంతు కూడా రాలేదు. అది కూడా పులుపు రొడ్డు. ఎందుకిలా జరిగిందని అడిగాడు రాజు. రైతు సన్నగా నవ్వి ‘బహుశా మా రాజుగారి మనసులో ఏదైనా దుష్ట ఆలోచన ప్రవేశించి ఉంటుంది’ అన్నాడు. ‘పాలకులు కావచ్చు. ప్రజలు కావచ్చు. ఎవరు ధర్మం తప్పినా ప్రకృతి ఇలా నిర్వీర్యం అవుతుంది’ అని గుర్తు చేశాడు. రైతు.
నిజంగా ఇలా జరుగుతుందా అని ఎవరూ ఆశ్చర్య పోనవసరం లేదు. మన ఆహార నాణ్యతనూ, పాలకుల తీరునూ చూశాక కూడా ఈ కథలో అసత్యం ఉందని అనగలమా? ప్రకృతి, అమ్మలా అన్నీ మనకు ఇస్తోంది. మనం వాటిని ఎంత సద్వినియోగం పరచుకోగలుగుతున్నాం అన్నదే ప్రశ్న. మనిషిని బట్టే ప్రకృతి స్పందిస్తుంది. ఈ చిన్ని సూక్ష్మాన్ని గ్రహించలేక పోవటం ఆశ్చర్యమే!
భారతీయులకు పండుగల కొదువ లేదు. పంటల పండుగలు, పశువుల పండుగలు, మొక్కల పండుగలు, నదుల పండుగలు, దీపాల పండుగలు వీటిలోని ప్రకృతి ఆరాధనను మనం విస్మరిస్తున్నాం. ప్రకృతి మనకు వ్యతిరేకంగా స్పందించినప్పుడు డీలా పడిపోతున్నాం. ప్రకృతిని గౌరవించటం నేర్పే ఉగాది పండుగ ఆంతర్యాన్ని అర్థం చేసుకోవటం అవసరం.
మానవ సంబంధాల వేడుక
ఉగాది ఊరుమ్మడి పండుగ మనకి. కుల మతాలకు అతీతంగా ఆ రోజున అందరూ కలిసి మేథోపరమైన అంశాలు పంచుకుంటారు. కవులు కవితా గానం చేస్తారు. గాయకులు పాడతారు. నర్తకులు నాట్యం చేస్తారు. ఐంద్రజాలికులు తమ విద్యలు ప్రదర్శిస్తారు. పండితులు పంచాంగ శ్రవణం చేస్తారు. ప్రపంచ మనుగడ ఎలా ఉంటుందో పెద్దలైన వారి ద్వారా విని, విషయాలు తెల్సుకుంటారు. లోకం సుఖంగా ఉండాలని ఆశిస్తారు. ఎల్లరూ సుఖంగా ఉండాలని పంచాంగాన్ని పూజిస్తారు. రాశిఫలాలు తెలుసుకోవటం ద్వారా ప్రపంచం పోకడనీ, దేశ గమనాన్ని రాష్ట్ర మనుగడనీ స్థూలంగా పరిశీలిస్తారు. తమ బతుకుబండిని ఎలా నడుపుకోవాలో తగిన ప్రణాళికలు వేసుకోవాలనే సూచన ఈ పండుగలో కనిపిస్తుంది.
పంచాంగానికి ఉగాది పచ్చడి నైవేద్యం పెట్టి ప్రసాదంగా తీసుకోవటాన్ని సెంటిమెంటు అంటుంటారు కొందరు. జనవరి ఒకటిన భూమ్యాకాశాలను ఏం చేసి, ధూంధాం సృష్టించటం సెంటిమెంటు కాదని, ఉగాది పచ్చడి తినటం ఫూలిష్‌నెస్ అనీ వీళ్ల అభిప్రాయం. నిజానికి, జనవరి ఒకటితో మన ఆర్థిక సంవత్సరం గానీ, విద్యా సంవత్సరం కానీ ప్రారంభం కావట్లేదు. ఆ తేదీతో మొదలుపెట్టి మనం ఏ పనీ చేయట్లేదు. అయినా మమేకమై పోతారు కొందరు. దీని వెనుక ‘వాణిజ్య సంస్కృతి పరివ్యాప్తి’ అనే పరమ ప్రయోజనం దాగుంది.
వాణిజ్య సంబంధాలు మానవ సంబంధాల్ని తిరస్కరిస్తాయి. వాణిజ్య వేత్తలు తమ లాభం నెరవేరే వరకే సంబంధాలు నడుపుతారు. నీ ఎదుగుదలను నీ చుట్టూ ఉన్న వాళ్లు మోహరించి అడ్డుకుంటారనీ, అందర్నీ తోసిరాజని ఒక్కడివై సాగిపోవాలనీ, ఎవ్వరి కోసమూ ఆగవద్దనీ వాణిజ్య సంస్కృతి ప్రబోధిస్తుంది. ఏరు దాటాక కూడా ఇంకా ఆ తెప్పని ఎందుకు అట్టేపెట్టావని అడుగుతుంది. జనవరి ఒకటి అలాంటి వాణిజ్య సంస్కృతిని పెంచి పోషించే ఒక లాభాపేక్ష పండుగ. దేశీయత, జాతీయత కానరాని చిత్రమైన పండుగ. కేవలం క్యాలెండరు మొదటి రోజు అనే సెంటిమెంటుని చుట్టుకున్న పండుగ ఇది.
ఋగ్వేదంలో పణులు వ్యాపారులు. పణి - సరమ సంవాదం చదివితే, పణుల (వాణిజ్య వర్గాల) ఆలోచనా ధోరణి ఎలా ఉంటుందో తెలుస్తుంది. జనవరి 1న ఇది ప్రతిఫలిస్తుంది. అంతమాత్రాన ఆ జరుపుకొనే వాళ్లంతా వాణిజ్య సంస్కృతి కలిగిన వాళ్లని అనలేము. కానీ, పరోక్షంగా ఆ రకమైన ఆలోచనా ధోరణినే ప్రదర్శిస్తున్నారు. లేదా అందుకు దోహద పడ్తున్నారు. నిన్నను తరిమేయాలని ఆ పండుగ కోరితే, నిన్న పండిన పంటనే నేడు వండుకుంటున్నాం అనే స్పృహని ఉగాది కలిగిస్తోంది.
తెలుగు భాషాసంస్కృతుల కలయక
బాహ్య ప్రకృతినే కాదు, అంతరంగంలోనూ స్వచ్ఛత కోరుతుంది ఉగాది. భాషా సంస్కృతులు స్వచ్ఛ అంతరంగాన్ని సృష్టిస్తాయి. ఉగాది తెలుగు భాషా సంస్కృతుల పండుగ. తెలుగు మాతృభాషగా కలిగిన వారందరి పండుగ. దీనికి కులం లేదు. మతం లేదు. ప్రాంతం లేదు. ఇందులో ఆస్తిక, నాస్తిక విచికిత్స ఏమీ లేదు. ఇది తెలుగు పండుగ. అనుక్షణం అమ్మ భాషను కాపాడుకోవాలని మనల్ని పురమాయించే పండుగ. ఆ రోజున భాష కోసం మనం ఏ కొంచెం చేసినా గొప్ప విషయమే! మన వృథా వ్యామోహాల కారణంగా భాషా సంస్కృతులు ప్రమాదం అంచుకు చేరుతున్న ఈ రోజుల్లో మన దృక్పథంలో మార్పు చాలా అవసరం. అన్నీ కలుషితం అవుతున్నాయి. ఉగాదినైనా భాషా కాలుష్యానికి బలి కాకుండా కాపాడుకోవటం మన ధర్మం. మాతృభాషను మాతృదేవతగా భావించుకున్న సంస్కారం

మనది. తెలుగు తల్లికి ‘ఉగాది సారె’ పెట్టి, మంచి భవిష్యత్తు చెప్పుకుని, కలకాలం ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని సంకల్పించుకునే పండుగ. ఇది స్వచ్ఛ అంతరంగాన్ని ప్రబోధించే పండుగ.
స్వచ్ఛ ఆహార ఆరోగ్యాల పండుగ
ఉగాది ప్రసాదానే్న మనం ఉగాది పచ్చడి అంటున్నాం. వివిధ ఆహార ద్రవ్యాలను కలగలిపి ఆరు రుచులను రంగరించిన పచ్చడి ఇది. దీని గురించి చెప్పుకోవలసింది చాలా ఉంది.
ఆధునిక వైద్య శాస్త్రం విటమిన్లు, ఖనిజాలు, లవణాలు ఇతర పోషకాల తూకాన్నిబట్టి ఆహార ద్రవ్యాల పోషక విలువల్ని లెక్కగడుతుంది. ఇది ఒక పద్ధతి. ఆయుర్వేదం ఆరు రుచుల సిద్ధాంతాన్ని అనుసరిస్తుంది. తీపి, పులుపు, ఉప్పు, కారం, వగరు, చేదు ఈ ఆరు రుచులూ తగు నిష్పత్తుల్లో ఉంటేనే అది షడ్రసోపేతమైన భోజనం అవుతుంది. ఒక్కో ద్రవ్యానికి వాటిలో ఉండే విటమిన్లు వగైరా పోషకాలే ఆ రుచిని ఇస్తున్నాయి. సామాన్యుడు తన ఆహారం విలువని తనకు తానుగా అంచనా వేసుకోవటం ఆరు రుచుల పద్ధతిలో తేలికౌతుంది.
ఆరు రుచుల్లో వగరు చేదు గురించి మనం ముఖ్యంగా మాట్లాడుకోవాలి. ఈ రెండు రుచులనూ దాదాపుగా మనం మరచిపోతున్నాం. వగరూ చేదు తినని వాళ్లంతా ఆ రెండు రుచుల స్థానంలో తీపి, పులుపు, ఉప్పు, కారం ఈ నాలుగింటినీ అవసరానికి మించి తింటున్నట్టే కదా! షుగరు, బీపీ, కీళ్ల వ్యాధులు పెచ్చుమీరటానికి ఇదే కారణం అవుతోంది. ఆయా కాయగూరలకు వగరు చేదు రుచుల్ని వాటిలోని పోషక ద్రవ్యాలే ఇస్తున్నాయి. ఆ మేరకు వాటిని మనం కోల్పోతున్నాం కదా!
ఉగాది పండుగ వగరు చేదు రుచుల పక్షం వహిస్తుంది. ఇతర ప్రసాదాల్లో తీపి, పులుపు, ఉప్పు, కారం దండిగానే ఉంటాయి. ఒక్క ఉగాది ప్రసాదంలోనే వగరు చేదు అదనంగా కలుస్తాయి. మన ఆహారం పోషక విలువలతో ఆరోగ్యదాయకంగా ఉండాలని, ‘స్వచ్ఛ ఆహార ఆరోగ్యాల పండుగ’గా మనం ఉగాదిని జరుపుకుంటున్నాం.
‘అబ్దాదౌ నింబకుసుమం శర్కరామ్ల ఘృతైర్యుతమ్/ భక్షితం పూర్వయామేతు తద్వర్షే సౌఖ్య దాయకమ్’ సంవత్సరం మొదటి రోజున వేపపూవు, పంచదార, చింతపండు, నెయ్యి కలిపిన పచ్చడిని పొద్దునే్న తింటే ఆ సంవత్సరం అంతా సౌఖ్యదాయకంగా ఉంటుందనేది ఈ పండుగలో స్ఫూర్తి. తీపి కోసం బెల్లం/ పంచదార, పులుపు కోసం చింతపండు లేదా ఇంకేదైనా పుల్లని పదార్థం, ఉప్పు అలాగే, కారం కోసం మిరియాల పొడి, వగరు కోసం లేత మామిడి పిందెలు, చేదు కోసం వేపపువ్వు కలిపి ఈ పచ్చడిని తయారుచేసుకుంటున్నాం. నెయ్యి కూడా కొద్దిగా కలుపుకోమంటున్నారీ శ్లోకంలో.
చేదు ద్రవ్యాల్లో వేప అత్యున్నత మయ్యింది. తినగ తినగ వేము తియ్యనుండు అన్నట్టు రోజూ వేప పూవుల్ని తినటం అలవాటు చేసుకుంటే, చాలా లాభాలున్నాయి. ఉగాది రోజు ఉదయానే్న ఒక చెంచాడు ‘ఉగాది పచ్చడి’ తినేస్తే ఈ ప్రయోజనాలన్నీ దక్కుతాయనుకోవటమూ అపోహ! ఈ పచ్చడిని శ్రీరామ నవమి వరకు రోజూ తినాలని కొన్ని గ్రంథాల్లో ఉంది. ఏడాది పొడుగునా తినవచ్చని మరికొందరు చెప్తారు. కనీసం రెండు మూడు నెలల పాటు రోజూ సేవిస్తే వాత, పిత్త, శే్లష్మాల వల్ల ఏర్పడే దోషాలు హరిస్తాయి. రానున్న వేసవిని తట్టుకునే శక్తి నిస్తుందీ ఆరు రుచుల పచ్చడి. ‘త్వామష్ఠ శోక నరాభీష్ట మధుమాస సముద్భవ నిబామి శోక సంతప్తాం మమ శోకం సదా కురు’ మంత్రం చదువుతూ ఉగాది పచ్చడి తినాలని పెద్దల మాట. ఆహారంలో రోజూ ఈ ఆరు రుచులకూ ప్రాధాన్యత ఉండాలనేది ఉగాది పచ్చడి చేసే హితబోధ. పర్యావరణం, వృక్షాల సంరక్షణ, ఆయుర్వేదీయ పద్ధతిలో ఆహార సేవనలను ఈ పచ్చడి గుర్తు చేస్తుంది.
వేపపూలను ఆహారంగా తీసుకుంటే, జీర్ణాశయ వ్యవస్థ బలంగా ఉంటుంది. కడుపులో విష దోషాలను హరిస్తుంది. వాతం పెరగకుండా కాపాడుతుంది. కంటిచూపు మెరుగు పరుస్తుంది. తరచూ వచ్చే తలనొప్పికి మంచి నివారకంగా ఉంటుంది. చర్మానికి మంచి వర్ఛస్సునీ, వర్ణాన్నీ, తేజస్సునీ, మృదుత్వాన్నీ ఇస్తుంది. కుష్టు, బొల్లి, ఎగ్జీమా, సొరియాసిస్ వ్యాధుల్లో ఇది ఔషధంగా పని చేస్తుంది. రక్త దోషాలను నివారిస్తుంది. షుగరు వ్యాధి, స్థూలకాయం, బీపీ, కీళ్లనొప్పుల వ్యాధుల్లో మేలు కలుగుతుంది. ఆపరేషన్లు అయిన వారికి వేపపూలతో వంటకాలు పెడితే పుండు త్వరగా మానుతుంది.
కొన్ని ప్రాంతాల్ల వేప పూవును నేతితో వేయించి పులిహోరలాగా చేసుకుంటారు. వేపపూవుతో పచ్చడి, వేపపూవు రసం (చారు) కూడా కాచుకుంటారు. ఉగాది రోజుల్లోనే ఏడాది మొత్తం సరిపోయే విధంగా వేపపువ్వు సేకరించుకుని ఎండించి ఒక సీసాలో భద్రపరచుకోండి. ఈ వేపపూతతో ఔషధ విలువలు కలిగిన ఆహార పదార్థం ఇది. దీన్ని తయారుచేసుకుని రోజూ అన్నంలో తింటే షుగరు వ్యాధి, స్థూలకాయం, కేన్సర్, ఉబ్బసం వ్యాధులు దరి చేరకుండా విష దోషాలను హరించేదిగా ఉంటుంది. ఒక చెంచా ఇంగువ, రెండు చెంచాల అల్లం ముద్ద, నాలుగు చెంచాల జీలకర్ర, ఎనిమిది చెంచాల వేపపువ్వుల పొడి, ఎనిమిది చెంచాల మిరియాల పొడి, పదారు చెంచాల ధనియాల పొడి, పదారు చెంచాల పసుపు ఈ ఏడింటినీ చెప్పిన పాళ్లలో కలిపి తగినంత ఉప్పువేస్తే కమ్మని కారప్పొడి అవుతుంది. ఇది అద్భుతమైన టానిక్‌లా పని చేస్తుంది.
ప్రకృతిని, పర్యావరణాన్ని, భాషను, సంస్కృతినీ కలుషితం కాకుండా స్వచ్ఛంగా ఉంచుకోవాలనే సందేశం ఉగాది పండుగ మనకు అందిస్తోంది. జనవరి ఒకటి పద్ధతిలో విష్యూ హాపీ ఉగాది అనటం దాన్ని అవమానించటమే అవుతుంది. వాణిజ్య బంధాలకన్నా మానవ సంబంధాలే జాతికి బలం!

-డా.జి.వి.పూర్ణచందు