S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

డైరీ ( సండేగీత)

కొత్త సంవత్సరం రాగానే కొత్త కాలెండర్లు, కొత్త డైరీలు ఇంట్లోకి వస్తాయి. ఉగాది రాగానే కొత్త పంచాంగాలు ఇంట్లోకి వస్తాయి. అదే విధంగా కొత్త నిర్ణయాలు, కొత్త ప్రణాళికలు రూపొందిస్తాం.
ఈ మధ్యకాలంలో చాలా డైరీలు ఇంట్లోకి వచ్చి చేరుతున్నాయి. బ్యాంక్ మేనేజర్లు, ఎల్‌ఐసి అధికారులు, లా పుస్తకాల పబ్లిషర్స్ ఇట్లా చాలామంది డైరీలను బహుమతిగా ఇస్తున్నారు.
కాలేజీలో చదువుకునేటప్పుడు డైరీ రాయడం అలవాటుగా ఉండేది. అప్పుడు డైరీలు ఎవరూ బహుమతిగా ఇచ్చేవాళ్లు కాదు. డైరీలు కొనుక్కోవాల్సి వచ్చేది. ఇప్పుడు డైరీలు ఎక్కువగా ఉంటున్నాయి. కానీ రాసే మూడ్ లేకుండా పోయింది. చాలామందికి డైరీలు ఇవ్వగా కూడా ఇంకా ప్రతి సంవత్సరం మిగిలిపోతూనే ఉన్నాయి. జూనియర్ న్యాయవాదిగా ఉన్నప్పుడు కూడా డైరీలు ఎక్కువగానే వుండేది. సీనియర్ దగ్గర చాలా ఉండేవి. ఆయన దగ్గర నుంచి తీసుకొని వచ్చేవాణ్ని.
రోజురోజుకీ ఇంట్లో పుస్తకాల సంఖ్య పెరిగిపోతూనే ఉన్నాయి. స్థలం తగ్గిపోతూ వస్తుంది. అవసరం లేని పుస్తకాలని, రాయకుండా వదిలివేసిన డైరీలను తీసివేద్దామని వెదకడం ప్రారంభించాను. అలా వెతుకుతుంటే ఓ పాత డైరీ దొరికింది. అదెప్పటిదో ముప్పై సంవత్సరాల క్రితం డైరీ. అప్పుడు నా చేతి రాత ఎలా ఉంది నా అభిప్రాయాలు, నా అనుభూతులు ఎలా వున్నాయని డైరీని తెరిచాను. అలాంటివి ఏవీ అందులో కన్పించలేదు. కానీ ఓ పది పేజీల్లో జమా ఖర్చులు, లెక్కలు కన్పించాయి. ఆ డైరీ మా పెళ్లైన కొత్తలోనిది. అప్పుడు నేను కరీంనగర్‌లో జూనియర్ న్యాయవాదిగా పని చేస్తున్నాను. అప్పుడు మా పెద్ద వాళ్లు మాకిచ్చే డబ్బు నెలకి ఐదు వందలు. అందులో ఇంటి కిరాయి (అద్దె)కు 225 రూపాయలు పోయేది. మిగిలిన 275 రూపాయలతో నెల గడిచేది. పప్పులూ ఉప్పులూ ఇంటి నుంచి వచ్చేవి.
కుతూహలంగా వాటిని పరిశీలించాను. సినిమాకి ఐదు రూపాయలు, పెట్రోలుకి పది రూపాయలు, దిన పత్రికకి పది రూపాయలు, పూలకి పళ్లకీ ఇట్లా ఎన్నో విషయాలు కన్పించాయి. అప్పటికీ ఇప్పటికీ కాలం ఎంత మారిపోయింది? మూడు గదుల చిన్న ఇల్లు ఇప్పుడు లభిస్తుందా? ఐదు రూపాయలతో ఇద్దరు సినిమా చూసే అవకాశం ఉందా? పది రూపాయలతో నెల రోజులు స్కూటర్ నడిపే అవకాశం ఉందా?
డైరీలోని ఆ పది పేజీలు నా మనస్సుని ఎక్కడికో తీసుకొని పోయాయి. ఆ యవ్వనపు తొలి రోజుల్లో ఆ కొద్ది డబ్బుతో జీవితాన్ని ఎలా గడిపాం? ఆలోచనలతో, మనస్సు తడిసి ముద్దైపోయింది. జ్ఞాపకాలతో మనస్సు చేపపిల్లలా కొట్టుకుంది. పుస్తకాలు సర్దడం ఎటో పోయింది. యవ్వనపు తొలి రోజుల ఆలోచనలతో మనస్సు ఆనందంతో నిండిపోయింది. భారంగా కూడా అన్పించింది.
ఆ డైరీలో నా ఫీలింగ్స్ లేవు. జమా ఖర్చులు మాత్రమే వున్నాయి. కానీ ఆ జమాఖర్చులు నాలో ఎన్నో అనుభూతుల్ని కలుగజేసాయ. ఓ గంట వరకు ఏదో లోకంలో ఉండిపోయాను. మైకంలో పడిపోయాను. పారేద్దామని అనుకున్న డైరీని భద్రంగా ఆల్మైరాలో దాచాను.
స్వర్గాలు లేవు. మనం కోల్పోయినవే స్వర్గాలు. ఆ డైరీ చెప్పిన విషయం ఇదే.