S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

రామాయణం.. 109 మీరే డిటెక్టివ్

మహామంత్రైన వశిష్ఠుడు రాముడితో ఇలా చెప్పి, మళ్లీ ధర్మసమ్మతమైన ఈ మాటలని కూడా చెప్పాడు.
‘ఓ రామా! జన్మించిన ప్రతీ పురుషుడికీ ఆచార్యుడు, తండ్రి అనే ఇద్దరు గురువులు ఉంటారు. ఓ పురుష శ్రేష్ఠుడా! తండ్రి పురుషుడ్ని పుట్టిస్తాడు. ఆచార్యుడు అతనికి జ్ఞానం ఇస్తాడు. అందువల్ల అతను గురువు అవుతున్నాడు. నేను నీకు, నీ తండ్రికీ కూడా ఆచార్యుడ్ని. నేను చెప్పినట్లు చేస్తే నువ్వు సత్పురుషుల మార్గాన్ని అతిక్రమించిన వాడివి కావు. ఈ పండిత పరిషత్తులు, శ్రేణులు, బ్రాహ్మణులు వీరంతా నీ వాళ్లు. వీరి విషయంలో నువ్వు పాలనారూపమైన ధర్మాన్ని ఆవరించినట్లైతే సత్పురుషుల మార్గాన్ని అతిక్రమించిన వాడివి కావు. నువ్వు వృద్ధురాలు, ధర్మం చేసే స్వభావం గల తల్లికి సేవ చేయకుండా ఉండకూడదు. ఈవిడ చెప్పినట్లు ఆచరించినట్లైతే నువ్వు సత్పురుషుల మార్గాన్ని అతిక్రమించినట్లు కాదు. సత్య, ధర్మ, పరాక్రమాలు గల ఓ రామా! ఇలా ప్రార్థించే భరతుడి మాటలకి అంగీకరించినట్లైతే నువ్వు స్వధర్మాన్ని అతిక్రమించినట్లు కాదు.’
పురుష శ్రేష్టుడైన రాముడు, గురువైన వశిష్ఠుడు స్వయంగా చెప్పిన మధురమైన మాటలు విని తన పక్కనే కూర్చున్న వశిష్ఠుడితో చెప్పాడు.
‘తల్లిదండ్రులు కొడుకు విషయంలో ఎప్పుడూ ఏ విధంగా ప్రవర్తిస్తూంటారో, యథాశక్తిగా ఆయా వస్తువులని ఇచ్చి నిద్ర పుచ్చుతూ, స్నానం చేయిస్తూ, నిత్యం మంచి మాటలు చెప్తూ పెంచే తల్లీ, తండ్రి ఏ ఉపకారం చేస్తారో దానికి ప్రత్యుపకారం చేయడం సులభమైన పని కాదు. మా తండ్రి దశరథుడు నాకు జన్మని ఇచ్చాడు. ఆయన ఎదుట నేను చేసిన ప్రతిజ్ఞ వ్యర్థం కాకూడదు.’
గొప్ప ఉదారుడైన భరతుడు రాముడి మాటలు విని చాలా విచారించి వశిష్ఠుడితో చెప్పాడు.
‘ఇక్కడ నేల మీద వెంటనే దర్భలని పరుచు. నా విషయంలో ప్రసన్నుడయ్యేంత వరకూ అన్నని అడ్డగిస్తూ దాని మీద కూర్చుంటాను. డబ్బు లేని బ్రాహ్మణుడిలా ఆహారం తీసుకోకుండా, వెలుతురు చూడకుండా ఈ పర్ణశాల ముందు రాముడు అయోధ్యకి తిరిగి వచ్చే దాకా పడుకుంటాను.’
రాముడి ఆజ్ఞ కోసం అతని వైపు చూసే వశిష్ఠుడ్ని చూసి, దుఃఖితుడైన భరతుడు తనే స్వయంగా దర్భలని తీసుకొచ్చి నేల మీద పరిచాడు. మహాతేజశ్శాలి, రాజర్షుల్లో శ్రేష్ఠుడైన రాముడు వెంటనే భరతుడితో చెప్పాడు.
‘నాయనా భరతా! నేను ఏ చెడ్డ పని చేశానని నువ్విలా అడ్డంగా పడుకుంటావు? తన దగ్గర అప్పు తీసుకుని ఎగ్గొట్ట చూసే వారిని అడ్డగించడానికై బ్రాహ్మణుడు ఓ పక్క పడుకోవచ్చు. కాని ఇలా అడ్డగించడం క్షత్రియ ధర్మం కాదు. దారుణమైన దీన్ని వదిలి వెంటనే పట్టణాల్లో శ్రేష్ఠమైన అయోధ్యకి వెళ్లు.’
భరతుడు దర్భల మీద కూర్చునే అక్కడ ఉన్న పౌరులని, జానపదుల్ని చూస్తూ అడిగాడు.
‘మీరు అన్నకి ఎందుకు ఏమీ చెప్పడం లేదు?’
ఆ పౌర జానపదులు మహాత్ముడైన భరతుడితో చెప్పారు.
‘రాముడి గురించి మాకు బాగా తెలుసు. రాముడు చెప్పేది యుక్తంగానే ఉంది. మహాభాగ్యశాలైన ఈ రాముడు తండ్రి మాట మీద నిలబడ్డాడు. అందువల్ల మేం ఇతన్ని మళ్లించలేక పోతున్నాం.’
వారి మాటలు విన్న రాముడు చెప్పాడు.
‘ధర్మదృష్టి గల మన మిత్రులు చెప్పే మాటలు విను. భరతా! నా మాటలు, వీరి మాటలు చక్కగా ఆలోచించి లే. నన్నూ, నీటినీ స్పృశించు.’
భరతుడు లేచి నీటితో ఆచమనం చేసి చెప్పాడు.
‘విద్వత్ పరిషత్తులు, మంత్రులు, శ్రేణులు నేను చెప్పే మాటలని వినండి. నేను ఎప్పుడూ నాకు రాజ్యాన్ని ఇవ్వమని నా తండ్రిని అడగలేదు. రాజ్యం వచ్చేలా చేయమని నా తల్లిని ప్రేరేపించలేదు. పరమ ధర్మవేత్త, పూజ్యుడైన రాముడు అరణ్యాలకి వెళ్లాలని నేను ఎన్నడూ సమర్థించలేదు. తండ్రి మాట ప్రకారం అరణ్యాల్లో నివసించాలని ఉంటే, నేనే పధ్నాలుగు సంవత్సరాలు అడవిలో ఉంటాను.’
ధర్మాత్ముడైన రాముడు తన తమ్ముడు దృఢ నిశ్చయంతో చెప్పిన ఆ మాటలు విని, ఆశ్చర్యంగా పౌరజానపదులతో చెప్పాడు.
‘మా తండ్రి జీవించి ఉండగా చేసిన అమ్మకం, తాకట్టు, కొనుగోలు మొదలైన వ్యాపారాన్ని నేను కాని, భరతుడు కాని మార్చడానికి వీల్లేదు. వనవాస విషయంలో నాకు బదులు మరొకర్ని ప్రతినిధిగా పంపడం చాలా జుగుప్సాకరమైన పని. కైకేయి రాజ్యాన్ని ఇవ్వమని కోరడం సబబే. తండ్రి చేసిన పని కూడా సబబే. భరతుడు ఓర్పు గలవాడు, పెద్దలని పూజించే వాడు అని నాకు తెలుసు. సత్యసంధుడు, మహాత్ముడైన ఈ భరతుడికి అంతా మంగళకరం అవుతుంది. నేనీ అడవి నించి తిరిగొచ్చి, ధర్మశీలుడైన ఈ సోదరుడితో కలిసి భూమిని పాలిస్తాను. కైకేయి దశరథ మహారాజుని కోరినట్లుగా నేను వనవాసం చేస్తున్నాను. అందువల్ల నువ్వు కూడా రాజ్యాన్ని అంగీకరించి మహారాజైన తండ్రికి అసత్య దోషం కలగకుండా చేయి’ (అయోధ్యకాండ, 111వ సర్గ) హరిదాసు ఆనాటి కథ ముగిస్తూ చెప్పాడు.
‘అయోధ్యకాండ నూట పనె్నండో సర్గ సమాప్తం. ఆ రామచంద్రుడి దయ కథ విన్న అందరి మీదా ప్రసరించు గాక!’
ఆ కథ విన్నాక తిరిగి ఇంటికి వెళ్తూ ఆశే్లషతో వచ్చిన వాడి తల్లి శారదాంబ చెప్పింది.
‘హరిదాసు కంఠం బావుంటుంది. భావయుక్తంగా కథ చెప్తాడు. కాని ప్రతీసారి కొన్ని తప్పులు చెప్తూంటాడు. ఈ రోజు కథలో ఐదు తప్పులు చెప్పాడు.’

మీరా ఐదింటిని కనుక్కోగలరా?

1.్భమిని ఉద్ధరించింది బ్రహ్మదేవుడు. కాని హరిదాసు తప్పుగా విష్ణుమూర్తి అని చెప్పాడు.
2.వరాహ రూపం ధరించి భూమిని ఉద్ధరించాడు. హరిదాసు కూర్మరూపం ధరించి అని తప్పుగా చెప్పాడు.
3.నికుక్షి కొడుకు బాణుడు. బాణుడి కొడుకు అనరణ్యుడు. హరిదాసు వికుక్ష కొడుకు అనరణ్యుడని, అనరణ్యుడి కొడుకు బాణుడని మార్చి చెప్పాడు.
4.చ్యవన మహర్షి పేరుని హరిదాసు తప్పుగా ధన్వంతరిగా చెప్పాడు.
5.దశరథుడు అజుడి కొడుకు. హరిదాసు తప్పుగా సువ్రతుడి కొడుకు అని చెప్పాడు.
*
మీకో ప్రశ్న

గాయత్రి మంత్రంలోని తొమ్మిదవ బీజాక్షరం ‘గ’ ఏ కాండలో ఏ శ్లోకంలో వస్తుంది?
*
గత వారం ‘మీకో ప్రశ్న’కి జవాబు

గాయత్రి మంత్రంలోని ఎనిమిదవ బీజాక్షరం ‘య’ ఏ కాండలో ఏ శ్లోకంలో వస్తుంది?
అరణ్యకాండ 47-10లో మమ భర్తా మహాతేజాః వయసా పంచవింశకః శ్లోకంలో

-మల్లాది వెంకట కృష్ణమూర్తి