S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఉత్తరం

ఇల్లు మారిన తరువాత పుస్తకాలని సర్దుతుంటే రెండుత్తరాలు దొరికాయి. ఒకటి మా అమ్మాయికి రాసిన ఉత్తరం. అప్పుడు మా పాప ఐదవ తరగతి చదువుతోంది. హైదరాబాద్‌లో హాస్టల్‌లో వుంది. ఆ ఉత్తరంలో నేను ఒక పేజి, మా అబ్బాయి రెండో పేజీలో రాశాడు. అప్పుడు వాడు మూడవ తరగతి చదువుతున్నాడు.
మా పాప హాస్టల్‌లో ఉండలేకపోతున్నప్పుడు మేం రాసిన ఉత్తరం అది. అప్పటి మా పాప మానసిక స్థితి నా ఆలోచనా విధానం, మా అబ్బాయి పరిపక్వత అందులో కన్పించాయి.
ఇక రెండవ ఉత్తరం నాకు హైదరాబాద్ నుంచి తిరుపతి బదిలీ అయిన తరువాత మా శాంతక్క రాసిన ఉత్తరం. చాలా అయిష్టంగా నేను అక్కడికి వెళ్లడం జరిగింది. మా అక్కయ్య రాసిన పద్ధతి అందరినీ సంబోధించిన పద్ధతి చాలా ముచ్చటేసింది. మా పాపకి ఉత్తరం రాసినప్పుడు ఆమెది నాలాంటి పరిస్థితే. హాస్టల్‌కి వెళ్లడం ఆమెకు ఇష్టం లేదు. ’94వ సంవత్సరంలో మా పాపకి ఉత్తరం రాశాను. ’93వ సంవత్సరంలో మా అక్కయ్య నాకు తిరుపతికి ఉత్తరం రాసింది. ఆమె చనిపోయి ఇరవై సంవత్సరాలు గడిచాయి.
మా శాంతక్క రాసిన ఉత్తరం నన్ను ఎక్కడికో తీసుకొని వెళ్లింది. మా చిన్నప్పుడు మా అక్కయ్యతో గడిపిన రోజులు, హైదరాబాద్‌లో వున్నప్పుడు ఆమెను కలిసిన రోజులు, ఆమె ఆసుపత్రి పాలైనప్పుడు ఆమె కష్టపడిన తీరు అన్ని గుర్తుకొచ్చి మనస్సు ద్రవించిపోయింది.
ఉత్తరాలు రాయడం దాదాపు తగ్గిపోయింది. సెల్‌ఫోన్లు వచ్చిన తరువాత మాట్లాడటం పెరిగిపోయింది. ఆత్మీయత తగ్గిపోయినట్టు అన్పిస్తుంది.
టెలిఫోన్‌లో మాట్లాడటాన్ని, చూస్తూ మాట్లాడుకోవడం అత్యద్భుతం. కాదనలేం.
కానీ ఉత్తరం వేరు.
ఆలోచించి రాస్తాం.
తరచూ చదువుకోవచ్చు.
అప్పటి విషయాలు, వాతావరణం కళ్లకు కన్పిస్తాయి. మన ప్రకటన విధానం, భాష, ఇతరుల పట్ల మన గౌరవ ప్రపత్తులు, అభిప్రాయాలు అన్నీ అందులో కన్పిస్తాయి.
మళ్లీ ఒక్కసారి ఉత్తరాలవైపు ప్రయాణం చేస్తే ఎంత బావుంటుంది.
ఉత్తరం ఒక జ్ఞాపకంగా కాకుండా జ్ఞాపకాలని తవ్వే పనిముట్టుగా మారాలన్నది నా కోరిక.

మంగారి రాజేందర్ ‘జింబో’ 94404 83001