S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

సుస్వర కంఠాలు- సన్నుతి గీతాలు

జీవనది లాంటి సంగీతం ఏ ఒక్కరి సొత్తూ కాదు. అదో గంగా స్రవంతి. ఎవరెవర్ని పునీతుల్ని చేస్తుందో? ఎవరి కెరుక?
‘కొనియాడ తరమే నిను కోమల హృదయా’ అనే పాట వినే వుంటారు. ఎప్పుడో 5,6 దశాబ్దాల క్రితం నాటి పాట. కుమారి శ్రీరంగం గోపాలరత్నం సోదరుడు గోవిందాచారి రేడియో కోసం పాడిన క్రైస్తవ భక్తిగీతం. ‘ఖమాస్’ రాగంలోని అందచందాలన్నీ ఇందులో, మృదువుగా పలికిస్తూ గానం చేశాడు. ఈనాటికీ ఆదివారాల్లో భక్తిరంజనిలో ప్రసారమవుతోంది.
ఏ భాషైనా, మతమైనా ఏ ప్రాంతమైనా పాట లేనిదే ప్రపంచమే లేదు. డా.సి.నారాయణరెడ్డి అన్నట్లుగా ‘ప్రపంచంలో ఏ భాషలోనైనా, ఏ మతంలోనైనా ముందు పాటే పుట్టి వుంటుంది.
పదిమందీ కలిసి పాడే పాట, ఆ గాయకుల్లో మాత్రమే కాదు సమాజంలో స్నేహ భావాన్ని పంచుతుంది. ఒకరిపై మరొకరికి మమతానురాగాలను పెంచుతుంది. విడతీయలేని బంధాన్ని కల్పిస్తుంది. ఈ మాయ ఒక్క సంగీతంలోనే ఉంది. 1956-60 మధ్య బాలాంత్రపు రజనీకాంతరావు విజయవాడలో ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్‌గా పనిచేసే రోజుల్లో ‘్భక్తిరంజని’ కార్యక్రమంలోకి చేర్చుకుంటూ వచ్చి చేరిన వివిధ రకాలైన భక్తి కీర్తనలలో క్రైస్తవ భజన కీర్తనలు ఆ రోజుల్లో ఒక అంశంగా వుండేవి.
విజయవాడలోని ఒక క్రైస్తవ భక్తి ప్రచార ప్రసార కేంద్రానికి డైరెక్టర్‌గా ఉండే రెవరెండ్ సాల్మన్‌రాజు తమ సంస్థ కోసం చేసిన కొన్ని కార్యక్రమాలలో కొన్ని పాటలు విజయవాడ రేడియోలో ప్రసారమయ్యే ‘్భక్తిరంజని’ కోసం ఇచ్చిన సందర్భంలో రికార్డైన పాటల్లో ఇదొకటి. చంద్రకాంత కొట్నీస్ అనే మధురమైన గాయని కొన్ని మరవలేని క్రైస్తవ భక్తి గీతాలు పాడింది. ఎంతో మధురమైన కంఠం ఆమెది.
ఈ రోజుకీ ఆ పాటలు విజయవాడ రేడియో కేంద్రం నుంచి ప్రసారమవుతూనే ఉన్నాయి. అప్పట్లో సాల్మన్ రాజు రాసిన పాటలు గ్రామఫోన్ రికార్డులుగా కూడా విడుదలయ్యాయి.
ఆ రోజుల్లో సినీ నేపథ్య గాయకుడుగా కొన్ని పాటలు పాడిన జి.ఆనంద్ ‘నడిపించు నా నావ నడిసంద్రమున దేవా’ అనే పాటతో మరింత ప్రసిద్ధుడయ్యాడు.
సినీ నేపథ్య గాయకుడుగా అప్పుడే సినీ రంగంలో అడుగుపెట్టిన కొత్తల్లో ‘దేవునికి స్తోత్రము పరిశుద్ధుడగు మా దేవునికి స్తోత్రము’ పాట ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యానికి మంచి గుర్తింపు తెచ్చింది. బాలు గొంతు ఎంతో మృదువుగా వుండేది.
హెచ్‌ఎంవి ఆర్కెస్ట్రాతో ఎ.పి.కోమల, జిక్కి వంటి గాయనీ మణుల క్రైస్తవ భక్తిగీతాలు, ఊరూ వాడ మారుమ్రోగేవి. కృష్ణన్ కోయిల్ వేంకటాచలం మహదేవన్ అసలు పేరై, ఆ తర్వాత ప్రసిద్ధుడైన ప్రఖ్యాత సినీ సంగీత దర్శకుడు కె.వి.మహదేవన్, కోమల కలిసి కొన్ని పాటలు పాడారు. ‘సంతోషించుడి అందరు కలిసీ’ అనే పాట ఎంతో ప్రసిద్ధం.
ఎం.ఎస్.విశ్వనాథన్ దగ్గర ఎకార్డియన్ వాయించే టి.ఎ. కల్యాణం హెచ్‌ఎంవి కోసం ఒకప్పుడు కొన్ని క్రైస్తవ భక్తి గీతాలు కూర్పు చేసి జిక్కి, ఎ.పి.కోమలచే పాడించిన పాటల సంఖ్య ఎక్కువే. కోమల, ఘంటసాలతో సినిమాలకు పాడిన పాటలన్నీ ప్రసిద్ధమైనవే. ఆమెకు ఇప్పుడు 85 ఏళ్లు.
ఆనాడు బ్రిటీష్ పరిపాలనలోని దక్షిణ భారతానికంతకూ అవిభక్త మద్రాసు రాష్ట్రానికి రాజధానియైన మద్రాసు ఒకటే 1938 జూన్ 16న ఏకైక రేడియో కేంద్రంగా ప్రారంభమయ్యింది.
1939లో తిరుచ్చిరాపల్లి కేంద్రం ఆవిర్భవించింది. కేవలం తమిళంలోనే ఈ కేంద్రంలో నడిచేవి.
కానీ ఒక్క మద్రాసు కేంద్రంలో మాత్రం తమిళం, తెలుగు, కన్నడం, మలయాళ భాషల్లో, అన్ని ప్రాంతాల సంస్కృతులూ ప్రతిబింబించేలా కార్యక్రమలుండేవి. ఆ రోజుల్లో ఆ కేంద్రాలు నిర్వహించిన డైరెక్టర్లందరూ, వ్యక్తిగత సామర్థ్యంలో, విశిష్ట చాతుర్యంలో, వివిధ విషయ పరిజ్ఞానంలో ఎంతో విలక్షణమైన వ్యక్తులుగా వుండేవారని రజనీకాంతరావు చెబుతూండేవారు.
మద్రాసు కేంద్ర డైరెక్టర్లలో మొట్టమొదటి ఆయన పేరు విక్టర్ పరంజ్యోతి. ఆయన మద్రాసులోని సెయింట్ ఆండ్రూస్ చర్చిలో క్వైర్ లీడర్‌గా ఆ గాయక బృందానికి నాయకుడు.
1938 జూన్‌లో మద్రాసు కేంఅదం మొదటి డైరెక్టర్ ఆయనే. క్వైర్ లీడర్‌గా, పాశ్చాత్య సంగీత ప్రయోక్తగా ప్రొడ్యూసర్ ఎమిరటస్ రాష్టప్రతి గౌరవాన్ని అందుకున్న ‘హెండెల్ మాన్యూల్’ ఈ పరంజ్యోతికి శిష్య వర్గంలో ప్రధానుడు.
1940, 60 మధ్యకాలంలో వీరు కంపోజ్ చేసిన ట్యూన్‌లే ప్రసిద్ధమై గ్రామఫోన్ రికార్డులుగా విడుదలయ్యాయి.
విజయవాడ రేడియో కేంద్రానికి ఎప్పుడూ తలమానికంగా నిలిచిన కార్యక్రమాల్లో ప్రధానమైన కార్యక్రమం ‘్భక్తిరంజని’లో క్రైస్తవ భక్తి గీతాలకు ఆదరణ ఎక్కువ.
శరణాగతి ప్రధానంగా వుండే క్రైస్తవ భక్తి గీతాలలోని సాహిత్యానికి కనిపించే మొదటి లక్షణం ఆర్తి. సరళమైన భాషలో తేలికైన మాటలతో హృదయానికి చేర్చే భావభరితమైన పాటల రచయితలెందరో వున్నారు.
నేను విజయవాడలో రేడియో కేంద్రానికి సమీపంలో కాపురముండే రోజుల్లో పొద్దు పోయే వరకూ క్రైస్తవ మత సభలెన్నో జరుగుతూండేవి. ఆ రోజుల్లో (1970-75 ప్రాంతాల్లో) మనసు రంజిల్లేలా పాడిన గాయకులలో నేను విన్న గొంతు జాన్ బిల్‌మోరియా. అప్పుడతని వయస్సు 25-30 మధ్య. ఆయన సంగీత నేపథ్యం నాకు తెలియదు. కానీ ఎంతో ఆసక్తిగా వినేవాణ్ణి. కారణం, ఆయన గొంతులో సహజంగా వుండే శ్రుతి మాధుర్యం, అవసరమైనంత వరకే పలికించగల గమక సౌందర్యం, వింటున్నప్పుడు కలిగే భావ పరిణతితో కూడిన నాదం. సంగీతం బాగా నేర్చుకోకపోయినా అలవాటవ్వగల ప్రజ్ఞ. లబ్దప్రతిష్టులైన చాలామంది గాయనీ గాయకులకు ఆయన ఓ ఆదర్శ గాయకుడనుకునేవారు.
ఏ పాటకైనా ఒక్కొక్క భావం వ్యక్తం కావటానికి తగిన మాటలుండాలి. అలాగే ఒక్కో సాహిత్యానికి ఒక్కొక్క బాణీయే నప్పుతుంది. సంగీత సాహిత్య స్రవంతులు ఒకదానితో మరొకటి కలిసిపోయి, పది కాలాలపాటు, పది మంది నోళ్లలో పడి బ్రతికే ఈ పాటలు ఎప్పుడూ చిరంజీవులే.
పున్నమ్మ తోటలో విజయవాడ రేడియో కేంద్రం నూతన భవనం ప్రారంభించిన తొలి రోజుల్లో క్రిస్మస్ కోసం నేను కంపోజ్ చేసిన మొదటి సంగీత రూపకం ఆంధ్రా లయోలా కళాశాలలో పని చేసిన డా.శనగన నరసింహస్వామి రాశారు. ‘యువవాణి’లో ప్రసారమైంది.
తిరుమల తిరుపతి దేవస్థానం ఇప్పుడు ఆస్థాన గాయకుడుగా ప్రసిద్ధి చెందిన పారుపల్లి రంగనాథ్ పాడిన ‘ఎంత దయానిధివయ్యా’ ‘తరలి పోదాం రండి’ ‘ఆశలు చిగురించెను గద’ వాంటి పాటలన్నీ అప్పట్లో భక్తి రంజనిలో ప్రసారమవుతూండేవి. సంగీతానికి భాష విషయంలో గానీ కులాలు, మతాల విషయంలో గానీ ఎటువంటి ప్రతిబంధకం వుండదు.
మనుషుల్ని కలిపేదే సంగీతం. మమతల పందిరిలో కూర్చోపెట్టేదే గానం. నలుగురూ కలిసి పాడుతూ, తన్మయత్వం చెందే సంప్రదాయం క్రైస్తవ దేవాలయాల్లో అనాదిగా వస్తున్న సంప్రదాయం. హిందూ దేవాలయాల్లో వేద పఠనమే కనిపిస్తుంది.
ఈ పాటల్లో కొన్ని సంప్రదాయ గీతాలున్నాయి. మరి కొన్ని అప్పటికప్పుడు తయారుచేసి పాడుకునేవి వున్నాయి.
సంప్రదాయ సిద్ధమైన బాణీల్లోని పాటలు మార్చరు. యథాతథంగానే పాడతారు. ‘కనపడవదేమిరా! జగము కల్పన చేసిన గారడీడ!’ అని దేవుణ్ణే ప్రశ్నించిన కవి కోకిల జాషువా చెప్పినట్లు శుద్ధమైన మనసుతో మానవాతీతమైన వ్యక్తినో, శక్తినో పొగుడుతూ చేసే గానానికి ఎల్లలు లేవు.

- మల్లాది సూరిబాబు 90527 65490