S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

రామాయణం.. 110 మీరే డిటెక్టివ్

అక్కడ గుమిగూడిన మహర్షులంతా సాటిలేని తేజస్సు గల ఆ సోదరుల గగుర్పాటు కలిగించే సంగమాన్ని చూసి ఆశ్చర్యపడ్డారు. అక్కడ అంతర్థానంగా ఉండి చూసే మునిగణాలు, సిద్దులు, దేవర్షులు మహాత్ములైన ఆ రామభరతులని ప్రశంసించి ఇలా అనుకున్నారు.
‘్ధర్మవేత్తలు, ధర్మం మీద ఆసక్తిని చూపించే ఆ సోదరులని కొడుకులుగా కన్న దశరథుడు ధన్యుడు. వీరి మాటలని విని వీరి మీద మనకి ఇష్టం కలుగుతోంది కదా?’
తర్వాత ఆ ఋషులంతా కలిసి వచ్చి భరతుడితో చెప్పారు.
‘ఓ భరతా! నువ్వు ఉత్తమ కులంలో పుట్టావు. గొప్ప బుద్ధిమంతుడివి. మంచి ఆచారాలు కలవాడివి. గొప్ప కీర్తి కలవాడివి. నీకు తండ్రి మీద గౌరవ భావం ఉంటే రాముడు చెప్పినట్లు చెయ్యి. రాముడు తండ్రి ఋణాన్ని తీర్చాలని మేం ఎల్లప్పుడూ కోరుకుంటాము. దశరథుడు కైకేయి ఋణాన్ని తీర్చబట్టే స్వర్గానికి వెళ్లాడు.’
గంధర్వులు, మహర్షులు, రాజర్షులు అంతా ఇంత దాకానే చెప్పి తమ స్థానాలకి వెళ్లిపోయారు.
చూసే వాళ్లకి శుభాలని ఇచ్చే రాముడు మంగళకరమైన ఆ మాటలని విని సంతోషించి, వికసిత ముఖంతో ఆ ఋషులని పూజించాడు. భరతుడు మాత్రం చాలా భయపడుతూ చేతులు జోడించి, తొట్రుపాటుతో రాముడితో మళ్లీ చెప్పాడు.
‘ఓ రామా! రాజధర్మం, కులధర్మం అవిచ్ఛిన్నంగా జరగడాన్ని దృష్టిలో ఉంచుకుని నా ప్రార్థనని, నా తల్లి ప్రార్థనని మన్నించు. ఈ విశాలమైన రాజ్యాన్ని రక్షించడానికి అనురాగం గల ఈ పౌరులని, జానపదులని సంతోషపెట్టడానికి నేను ఒక్కణ్ణే సమర్థుడిని కాను. మన బంధువులు, సైనికులు, మిత్రులు, శ్రేయోభిలాషులు అంతా, భూమిని దునే్న వాళ్లు మేఘాల కోసం ఎదురు చూసినట్లుగా నువ్వే కావాలని ఎదురు చూస్తున్నారు. మహా బుద్ధిశాలివైన ఓ రామా! ఈ రాజ్యాన్ని స్వీకరించి నిలబెట్టు. ఈ లోకాన్ని పాలించడానికి నువ్వే సమర్థుడివి.’
భరతుడు అలా ప్రేమగా మాట్లాడుతూ రాముడ్ని ప్రార్థిస్తూ అతని పాదాల మీద పడ్డాడు.
నల్లనివాడు, కలువ రేకుల్లాంటి కళ్లు గల, మదించిన హంస స్వరం లాంటి స్వరం గల భరతుడ్ని రాము తన ఒళ్లో కూర్చోపెట్టుకుని చెప్పాడు.
‘నాయనా! నీకు సహజంగాను, గురుశిక్షణ వల్ల మంచి బుద్ధి ఉంది. దాంతో నువ్వు ఈ భూమిని పాలించడానికి సమర్థుడివి. బుద్ధిమంతులైన మంత్రులతోను, అమాత్యులతోను, మిత్రులతోను కలిసి ఆలోచించి, ఎంత పెద్ద పనులైనా చేయించు. చంద్రుడి కాంతి తొలగిపోవచ్చు. హిమవత్ పర్వతం మీద మంచు లేకుండా పోవచ్చు. సముద్రం తీరాన్ని దాటచ్చు. నేను మాత్రం తండ్రి ప్రతిజ్ఞని అతిక్రమించను. కోరిక వల్లో, ఆశ వల్లో నీ తల్లి కైక ఇదంతా చేసిందని నువ్వు మనసులో ఉంచుకోక తల్లిగా ఆమెని గౌరవించు.’
తేజస్సులో సూర్యుడితో సమానమైన వాడు, ప్రతిపత్తులో ఉదయించిన చంద్రుడి దర్శనం వంటి దర్శనం కలవాడు, కౌసల్య కొడుకైన రాముడి మాటలు విని భరతుడు చెప్పాడు.
‘ఓ పూజ్యుడా! బంగారం తో అలంకరించిన ఈ పాదుకల పైన నీ పాదాలని ఉంచు. ఈ పాదుకలే సమస్త లోకానికి యోగ క్షేమాలు సమకూర్చగలవు’
మహా తేజశ్శాలైన రాముడు ముందు అభ్యంతరం చెప్పినా చివరికి జనుల కోరిక మీద పాదుకలని తొడుక్కుని, విడిచి వాటిని మహాత్ముడైన భరతుడికి ఇచ్చాడు. భరతుడు వాటికి నమస్కరించి రాముడితో చెప్పాడు.
‘శతృసంహారకుడివి, వీరుడివైన ఓ రామా! నేను జటలని, నార చీరలని ధరించి, ఫల మూలాలనే తింటూ రాజ్య భారాన్నంతా నీ పాదుకల మీదే ఉంచి నగరం బయటే నీ రాకకై ఎదురుచూస్తూ పధ్నాలుగు సంవత్సరాలు నివసిస్తాను’
రాముడు భరతుడి మాటలకి అంగీకరించి, అతన్ని, శతృఘు్నణ్ణి ప్రేమపూర్వకంగా కౌగిలించుకుని భరతుడితో చెప్పాడు.
‘ఓ భరతా! నా మీద, సీత మీద ఒట్టు పెట్టి చెప్తున్నాను. నీ తల్లైన కైకేయిని భక్తిగా చూసుకో. ఆమె మీద కోపం చూపించకు.’
రాముడు కళ్ల నించి నీళ్లు కారుతూండగా వెళ్లడానికి భరతుడికి అనుమతి ఇచ్చాడు. ప్రతాపవంతుడు, ధర్మవేతె్తైన భరతుడు చక్కగా అలంకరించబడ్డ ఆ పాదుకలని పూజించి, రాముడికి ప్రదక్షిణం చేసి వాటిని నెత్తిన ధరించి బయలుదేరాడు. స్వధర్మం పైన హిమవత్ పర్వతంలా స్థిరంగా నిలబడ్డ రాముడు అక్కడికి వచ్చిన అందరినీ, గురువులని, మంత్రులని, ప్రకృతులనీ భరత శతృఘు్నలని యథాక్రమంగా అభినందించి వాళ్లని పంపేశాడు. విచారంతో కంఠాల్లో కన్నీళ్లు అడ్డం పడటంతో తల్లులు రాముడికి వీడ్కోలు మాటలు చెప్పలేకపోయారు. రాముడే తల్లులు అందరికీ నమస్కరించి, అందర్నీ కౌగిలించుకుని వీడ్కోలు పలికాడు.

(అయోధ్య కాండ సర్గ 112)
హరిదాసు ముగించిన వెంటనే ఓ పాతికేళ్ల యువకుడు లేచి హరిదాసుతో చెప్పాడు.
‘నా పేరు రామదాసు. నేను రామాయణం మీద రీసెర్చ్ స్కాలర్‌ని. మీరు చెప్పిన కథంతా బావుంది కాని కొన్ని తప్పులు ఉన్నాయి. వాటిని చెప్తాను వినండి.’

మీరా తప్పులని కనుక్కోగలరా?

1.వశిష్ఠుడు రాజ పురోహితుడు. హరిదాసు మహామంత్రి అని మొదట్లోనే తప్పు చెప్పాడు.
2.ప్రతీ పురుషుడికీ ఆచార్యుడు, తండ్రి, తల్లి అనే ముగ్గురు గురువులు ఉంటారు అని వాల్మీకి చెప్పాడు. కాని హరిదాసు తల్లిని వదిలేసి ఇద్దరు గురువులు అని చెప్పాడు.
3.్భరతుడు దర్భలు పరవమని సుమంత్రుడితో చెప్పాడు. హరిదాసు వశిష్ఠుడితో చెప్పినట్లుగా తప్పు చెప్పాడు.
4.హరిదాసు 111వ సర్గ ముగించి 112 ముగించినట్లుగా తప్పు చెప్పాడు.
5.హరిదాసు చెప్పింది ఐదు కాదు. నాలుగు తప్పులే. + ఐదని చెప్పడం తప్పు.
---------------------------------------------------------------------------------------------------
మీకో ప్రశ్న

సగరుడు గర్భంలో ఉండగా అతని తల్లికి విషం పెట్టిన సవతి పేరేమిటి?
*
గత వారం ‘మీకో ప్రశ్న’కి జవాబు
*
గాయత్రి మంత్రంలోని తొమ్మిదవ బీజాక్షరం ‘గ’ ఏ కాండలో ఏ శ్లోకంలో వస్తుంది?
కిష్కింధ కాండ 4-3లో తతః పరమ సంతుష్టో హనుమాన ప్లవ గర్షభః శ్లోకంలో.

-మల్లాది వెంకట కృష్ణమూర్తి