S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఆరోగ్యానికి ‘పంచసూత్ర’

కొత్త సంవత్సరం వచ్చేసింది..
ఇంకా కోలాహలం తగ్గలేదు..
కొత్త ఏడాదిలో కచ్చితంగా సిగరెట్ తాగడం మానేస్తాను.. ప్రతిరోజూ పొద్దునే్న లేచి, క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తాను.. ఆరునూరైనా మద్యం వైపు అస్సలు చూడను.. జంక్‌ఫుడ్ గురించిన ఆలోచన కనీసం మెదడు పొరల్లోకైనా అడుగు పెట్టనివ్వను.. ఇలా.. చాలామంది రకరకాల తీర్మానాలు చేసుకుంటూ ఉంటారు. కొత్తసంవత్సరం మొదటి రోజు దాటి నాలుగు రోజులు గడిచిందిగా.. ఇక ఇప్పుడు.. తీసుకున్న నిర్ణయాలను ఇష్టంగా కంటే కష్టంగా ముందుకు సాగించడానికి ప్రయత్నాలు అప్పుడే మొదలుపెట్టేశారు. కొత్త సంవత్సరం ‘జోష్’ ఇంకా తగ్గనేలేదు కానీ చేసుకున్న తీర్మానాలు మాత్రం అటకెక్కేశాయి. తీసుకున్న కొత్త సాలు నిర్ణయాలు ఉక్కు సంకెళ్లలా మారాయి. ఇప్పుడే ఇలా ఉంటే నెల తర్వాత.. అసలు వాటి ఊసే ఉండదు.. ఇదే వద్దంటోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ.
పండంటి ఆరోగ్యానికి ప్రతి ఒక్కరూ కొత్త సంవత్సరం నుంచే నిత్యం కచ్చితంగా ఐదు సూత్రాలను పాటించాలని ఇటీవలే.. అంటే కొత్త సంవత్సరం రాక మునుపే పిలుపునిచ్చింది డబ్ల్యూ.హెచ్.ఓ. ఏ వయసువారైనా, ఆహారపరంగా ఈ పంచసూత్రాలను పాటిస్తే జబ్బుల గుప్పిట చిక్కుకోకుండా ఆనందంగా జీవించడానికి ఆస్కారం ఉంటుందని, ఇందుకు 2019 నుంచే శ్రీకారం చుడితే ఉత్తమమని గట్టిగా చెప్పింది ఈ సంస్థ.
మన ఆరోగ్యానికి ఆహారమే ప్రధానం. నిత్యం మనం తినే, తాగే పదార్థాలు మన శరీరాన్ని వివిధ రకాల వ్యాధులతో, క్రిములతో పోరాడే శక్తిని ఇస్తాయి. క్యాన్సర్ వంటి మహమ్మారుల దగ్గరనుంచి గుండెజబ్బుల వంటి సమస్యల వరకు.. మన దరిజేరకుండా చూసే బాధ్యత, మనం తీసుకునే ఆహారంతోనే ముడిపడి ఉందనే విషయాన్ని ఎవ్వరూ మర్చిపోకూడదు. ప్రపంచంలో ఏ ప్రాంతం వారైనా, ఏ వయసు వారైనా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రవేశపెట్టిన పంచసూత్రాలను పాటించడం ద్వారా చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చనీ, వీటిని అమలును కొత్త సంవత్సరం నిర్ణయాల్లో భాగంగా తీసుకుంటే మంచిదని ఈ సంస్థ నొక్కి చెబుతోంది. మరి ఆ పంచసూత్రాలేమిటో చూద్దామా..
ఉప్పు తగ్గాలి
‘వైట్స్ ఆర్ డెవిల్స్’ అనే నానుడిని చాలామంది వినే ఉంటారు. అందులో ఉప్పు, పంచదార ముఖ్యమైనవి. కూరల్లో ఉప్పు తక్కువో, ఎక్కువో కావడం.. భార్యపై భర్త కోప్పడ్డం ప్రతి ఇంట్లోనూ సహజమే.. భర్త కోప్పడ్డాడని కాకుండా.. ఉప్పు విషయంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. ఉప్పును అధికంగా వినియోగించడం వల్ల రక్తపోటు పెరగడం తప్ప మరే ప్రయోజనం లేదు. అధిక రక్తపోటు.. గుండెజబ్బులకు దారితీస్తుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించినట్లుగానే చాలామంది రోజుకు కేవలం ఐదు గ్రాములకు మించి ఉప్పు తింటున్నారు. రోజువారీ ఆహారంలో ఉప్పు ఐదు గ్రాములకు మించకూడదు. ఉప్పు ఎక్కువగా తినేవారు ఒకేసారి తగ్గించడం కష్టం కనుక రోజూ కొద్దికొద్దిగా తగ్గిస్తుంటే.. కొన్ని రోజులకు రుచి మొగ్గలు వాటంతట అవే సర్దుకుపోతాయి. సోయాసాస్, ఇతర సాస్‌లు, మసాలాలు, ఊరగాయలు, వడియాలు, అప్పడాల వంటి వాటిల్లో ఉప్పు అధికంగా ఉంటుంది కాబట్టి వీటిని రోజువారీ ఆహారంలో తగ్గించాలి. బయట దొరికే పదార్థాల్లో, పానీయాల్లో ఉప్పు ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాటిని అస్సలు తినకూడదు, తాగకూడదు. డైనింగ్ టేబుల్‌పై ఉప్పు లేకుండా చూసుకోవాలి.
పంచదార
పంచదారను విపరీతంగా తీసుకోవడం వల్ల దంతాలు పాడవడంతో పాటు మధుమేహం, స్థూలకాయం, బరువు పెరగడం వంటి సమస్యలు కూడా వస్తాయి. ఉప్పు తరహాలోనే పంచదార కూడా ఆహారపదార్థాల్లో పైకి కనిపించకుండా ఉంటుంది. దీనితో చాలా జాగ్రత్తగా ఉండాలి. రోజుకు 25 గ్రాముల పంచదారకు మించి వాడకూడదు. అంటే ఆరు చిన్నస్పూనుల పంచదార అన్నమాట. ఓ గ్లాసు కూల్‌డ్రింకులోనే దాదాపు పది స్పూన్లకు పైగా పంచదార ఉంటుంది. వీటితో పాటు మిఠాయిలు, సోడాలు, ఫ్లేవర్డ్ మిల్క్, కేకులు వంటివి తీసుకుంటే అంతే సంగతులు. నిజంగా చెప్పాలంటే పంచదారను అసలు తీసుకోకపోవడమే ఉత్తమం. పిల్లలకు కూడా చాక్లెట్స్, కేక్స్ వంటివాటిని అతిగా అలవాటు చేయకూడదు. రెండేళ్లలోపు పిల్లలకు బయట దొరికే ఉప్పు, చక్కెరలు అధికంగా ఉండే ఆహార పదార్థాలను అస్సలు పెట్టకూడదు. పెద్దయ్యాక కూడా ఇవ్వాల్సివస్తే చాలా తక్కువగా ఇవ్వాలి. ఏవైనా తినే పదార్థాలను బయట కొనేటప్పుడు దానిపై రాసి ఉన్నవాటిని క్షుణ్ణంగా చదవాలి. పంచదార, సోడియం స్థాయిలను అనుసరించి తక్కువగా ఉన్నవాటినే ఎంపిక చేసుకోవాలి.
కూరగాయలు
మన శరీరం అతి సంక్ష్లిష్టమైన నిర్మాణం. దీనికి ఏదో ఒక రకమైన ఆహారం తింటే సరిపోదు. పసిబిడ్డలకైతే తల్లిపాలే సంపూర్ణ ఆహారం. కాస్త పెద్దయ్యాక కేవలం ఒక ఆహారంతో శరీరానికి కావలసిన అన్ని రకాల పోషకాలు అందుతాయనుకుంటే అది భ్రమే.. మనం బలంగా ఉండాలంటే.. ఆహారంలో కచ్చితంగా వివిధ రకాలైన తాజా, పౌష్టికాహారం ఉండాలి. రోజువారీ ఆహారంలో ప్రధానంగా ఉండే బియ్యం, గోధుమలు, జొన్న వంటివాటికి తోడు బీన్స్, దుంపలు, కాయధాన్యాలు, చిక్కుళ్లు, తాజా కూరగాయలు, పండ్లు, జంతు సంబంధ పదార్థాలు అంటే చేపలు, గుడ్లు, మాంసం, పాలు వంటివి కొన్నైనా ఉండాలి. బియ్యం అంటే వీలైనంతవరకూ ముడి బియ్యం, ముడి జొన్నలు, ముడి గోధుమలు, చిరుధాన్యాలు, ఓట్స్ వంటి వాటినే ఎంచుకోవాలి. ఎందుకంటే వీటిలో పుష్కలంగా ఉండే పీచు శరీరానికి చాలా మేలు చేస్తుంది. వేపుడు పదార్థాలను పూర్తిగా మానేయాలి. ఉడికించిన లేదా ఆవిరితో చేసిన పదార్థాలను తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది.
కొవ్వులు
మనం తినే ఆహారంలో కచ్చితంగా కొంత కొవ్వు ఉండాలి. అదే సమయంలో విపరీతంగా కొవ్వు పదార్థాలు లేదా హానికరమైన కొవ్వులు తీసుకోవడం వల్ల స్థూలకాయం, గుండె జబ్బుల బారిన పడే ప్రమాదం ఉంది. పారిశ్రామికంగా ఉత్పత్తిచేసే ట్రాన్స్‌ఫ్యాట్స్ అత్యంత ప్రమాదకరమైనవి. ఆహారంలో ట్రాన్స్ ఫ్యాట్స్ ఉండే గుండె జబ్బులకు వచ్చే అవకాశం 30 శాతం మేర పెరిగినట్లే. వెన్న, నెయ్యి వంటి వాటికి బదులు సోయా, కనొలా, జొన్న, కుసుమ, పొద్దుతిరుగుడు నూనెలను వాడటం మంచిది. మాంసం కంటే కొవ్వు తక్కువగా ఉండే కోడిమాంసం, చేపలు వంటివాటికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. పారిశ్రామికంగా ఉత్పత్తిచేసే కొవ్వు పదార్థాలు అధికంగా ఉండే శుద్ధిచేసిన, వేయించిన ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి.
మద్యం
మద్యం అనేది అసలు మన ఆహారమే కాదు. మితిమీరిన మద్యపానం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశంతో పాటు, దీర్ఘకాలంలో కాలేయం దెబ్బతినడం, క్యాన్సర్, గుండెజబ్బులు, మానసిక రుగ్మతలు వంటివి తలెత్తుతాయి. కొంతమంది రోజుకు రెండు పెగ్గులు అంటారు కానీ.. నిజానికి రోజుకు ఇంతే మద్యం తాగాలన్న సురక్షిత స్థాయి లేనే లేదు. మద్యం కొద్ది పరిమాణంలో తీసుకున్నా ఆరోగ్యానికి ముప్పే. కొన్ని వైద్యపరమైన అధ్యయనాలు స్వల్పంగా మద్యం తీసుకోవడం మంచిదని చెప్పినా కూడా మద్యం తాగకపోవడమే ఉత్తమం. అనారోగ్యంతో ఉన్నవారు, మందులు వాడుతున్నవారు, రక్తపోటు, మధుమేహం ఉన్నవారు, గర్భిణులు, పాలిచ్చే తల్లులు అస్సలు మద్యం జోలికి వెళ్లకూడదు. మద్యానికి అలవాటు పడిన వారు ఎంత వీలైతే అంత త్వరగా వైద్యసహాయం సాయంతో ఆ అలవాటును వదిలించుకోవడం మేలు.
ఊపిరి ద్వారానే..
ఆస్ట్రేలియాలో యూనివర్శిటీ ఆఫ్ న్యూ సౌత్‌వేల్స్‌కు చెందిన శాస్తవ్రేత్త రూబెన్ మీర్మన్ శారీరక శ్రమ చేశాక- కరిగిన కొవ్వు ఎటు పోతుంది? అనే అంశంపై ఓ సర్వేను నిర్వహించారు. ఈ అధ్యయనంలో కరిగిన కొవ్వు శక్తిగా మారుతుంది అని చాలామంది సమాధానం చెప్పారు. కానీ ద్రవ్య, శక్తి నిత్యత్వ నియమం (లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మేటర్)కు ఇది విరుద్ధం. కాబట్టి కరిగిన కొవ్వు కార్బన్ డయాక్సైడ్, నీరుగా రూపాంతరం చెందుతుంది. 2014లో రూబెన్ చేసిన ఓ అధ్యయనం వివరాలను బ్రిటీష్ మెడికల్ జర్నల్‌లో ప్రచురించారు. అందులో కొవ్వును విసర్జించడంలో ఊపిరితిత్తులు కీలకపాత్ర పోషిస్తాయని రూబెన్ పేర్కొన్నారు. మానవ శరీరంలోని కొవ్వు.. మూత్రం, చెమట, ఊపిరి ఇతరత్రా రూపాల్లో బయటకు వెళుతుందట. మనిషి ఓ పది కిలోలు బరువు తగ్గారనుకోండి.. అందులో 8.4 కిలోలు ఊపిరితిత్తుల ద్వారా, తక్కిన 1.6 కిలోలు ద్రవ రూపంలో బయటకు వెళుతుంది. సూటిగా చెప్పాలంటే మనిషి వ్యాయామం ద్వారా కరిగించే కొవ్వును ఊపిరి ద్వారానే బయటకు పంపుతాడు అని ‘ది కన్వర్జేషన్ వెబ్‌సైట్’లో రూబెన్ పేర్కొన్నాడు. *

బ్రెస్ట్ క్యాన్సర్
2020 నాటికి ప్రతి ఎనిమిది మంది మహిళల్లో ఒకరికి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదముందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిక చేసింది. ఆహార సమతుల్యతలో ఎలాంటి రోగాన్నైనా ఎదుర్కోవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో చూద్దాం...
* ఆహారంలో ప్రతిరోజూ కూరగాయలు ఉండేలా చూసుకోవాలి.
* ప్రతిరోజూ రెండు రకాల పండ్లను తప్పనిసరిగా తీసుకోవాలి.
* రొమ్ము క్యాన్సర్‌ను అరికట్టడంలో పసుపు కీలకపాత్ర పోషిస్తుంది. అందుకే వంటల్లో పసుపు వాడటం తప్పనిసరి.
* ప్రతిరోజూ అరవై గ్రాముల వాల్‌నట్స్ తీసుకోవాలి. ఇలా తినడం వల్ల రొమ్ము కేన్సర్ కణతుల పెరుగుదల ఆగిపోతుంది. వీటిలో ఉండే ఒమెగా-3 ఫ్యాటీ ఆసిడ్లు, యాంటీ ఆక్సిడెంట్లు, పైతోస్టెరాల్స్ క్యాన్సర్ కారక కణాల పెరుగుదలను నివారిస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
* రోజూ తినే ఆహారంలో ఉల్లిపాయ, వెల్లుల్లిపాయలను భాగం చేసుకోవడం ద్వారా రొమ్ము క్యాన్సర్‌ను నివారించవచ్చు.
* అవిసె గింజలను ఎక్కువగా తీసుకుంటే కూడా చాలామంది.
* ముఖ్యంగా చెప్పేది ఏంటంటే.. అతిగా సెల్‌ఫోన్ వాడకం కూడా క్యాన్సర్‌కి కారణం.

వ్యాయామం
ఆహారపరంగా పంచ సూత్రాలనే కాదు, ప్రపంచవ్యాప్తంగా శారీరక వ్యాయామం కూడా బాగా తగ్గిపోతోందని కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రపంచంలో నాలుగో వంతు జనాభా, అంటే 140 కోట్ల మంది తగినంత శారీరక వ్యాయామం చేయడం లేదని, 2001 తర్వాత వ్యాయామం చేసేవారి సంఖ్య చాలా తక్కువగా పెరిగిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒక నివేదికలో చెప్పింది. వ్యాయామం చేయకపోవడం వల్ల గుండె వ్యాధులు, టైప్-2 మధుమేహం, కొన్ని రకాల క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉందని చెబుతోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ. బ్రిటన్ సహా అధిక ఆదాయం వచ్చే దేశాల్లో కూడా చాలా తక్కువ మంది వ్యాయామం చేస్తున్నారని ఈ నివేదికలో చెప్పింది. ఆఫ్రికాలోని రెండు ప్రాంతాలు మినహా, ప్రపంచవ్యాప్తంగా మహిళలు ఎక్కువగా వ్యాయామం చేయడం లేదని ఈ పరిశోధనలో గుర్తించారు నిపుణులు..
168 దేశాల్లో పందొమ్మిది లక్షల మందిపై చేసిన 358 జనాభా ఆధారిత సర్వేల్లోని వ్యాయామం వివరాలను ప్రపంచ ఆరోగ్య సంస్థ పరిశీలించింది. లానె్సట్ పబ్లిక్ హెల్త్ అధ్యయనం కోసం గణాంకాలను రూపొందించింది. బ్రిటన్, అమెరికా సహా ఎక్కువ ఆదాయం వచ్చే దేశాల్లో శారీరక శ్రమ చేయకుండా ఉన్నవారి సంఖ్య 2001లో 32 శాతం నుంచి 2018లో 37 శాతానికి పెరిగిందని ఇందులో గుర్తించారు. అయితే తక్కువ ఆదాయం వచ్చే దేశాల్లో మాత్రం అది స్థిరంగా పదహారు శాతం దగ్గరే ఉంది. ఒక వారంలో 150 నిముషాల కంటే తక్కువగా సాధారణ వ్యాయామం చేసేవారు లేదా 75 నిముషాల కంటే తక్కువగా కఠిన వ్యాయామం చేసేవారిని కూడా ఈ జాబితాలోనే చేర్చారు. తగినంత శారీరక వ్యాయామం చేయని వారున్న దేశాల్లో జర్మనీ, న్యూజిలాండ్, అమెరికా కూడా ఉన్నాయి. తూర్పు, ఆగ్నేయ ఆఫ్రికాలో తప్ప దక్షిణాసియా, మధ్య ఆసియా, మధ్యప్రాచ్యం, ఉత్తర ఆఫ్రికా, పశ్చిమ దేశాల్లో పురుషుల కంటే మహిళలు తక్కువ హుషారుగా ఉన్నారని ఈ నివేదికలో తేలింది. పిల్లల పోషణ, కొన్ని ప్రాంతాల్లో ఉన్న సంప్రదాయాల వంటి అనేక కారణాల వల్ల మహిళలకు వ్యాయామం చేయడం కష్టమై ఉండవచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. బ్రిటన్‌లో శారీరక శ్రమ చేయనివారు 2016లో మొత్తంగా 36 శాతం ఉండగా, పురుషులను, స్ర్తిలను విడివిడిగా చూసినట్లైతే.. పురుషుల్లో 32 శాతం, మహిళల్లో నలభై శాతంగా ఉంది.
సంపన్న దేశాల్లో ఎక్కువగా స్థిరమైన ఉద్యోగాలు ఉండడం, రవాణాకు ఎక్కువగా తమ వాహనాలు ఉపయోగించడం, వారి అలవాట్లు కూడా శారీరక వ్యాయామం లేకుండా చేస్తున్నాయని ఈ పరిశోధనలో తేలింది. అయితే తక్కువ ఆదాయం వచ్చే దేశాల్లో మాత్రం ప్రజలు ఎక్కువగా తమ పనుల్లో చాలా చురుకుగా ఉంటున్నారు. నడవడం లేదంటే ప్రజా రవాణాను ఉపయోగించడం వంటివి చేస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ 2025 నాటికి శారీరక వ్యాయామం చేయకపోవడం అనే సమస్యను 10 శాతం తగ్గించాలనుకుంటోంది. కానీ ఇది ఇలాగే కొనసాగితే ఆ లక్ష్యం చేరలేకపోవచ్చని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ప్రపంచంలో చాలామంది తగినంత శారీరక శ్రమ చేస్తున్నారు. కానీ పెద్దవారిలో సగటున నాలుగోవంతు మంది ఆరోగ్యంగా ఉండటానికి నిర్దేశించిన శారీరక వ్యాయామం చేయలేకపోతున్నారని ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన డబ్ల్యుహెచ్‌ఓ డాక్టర్లు చెబుతున్నారు. ప్రతిరోజూ తగినంత శారీరక వ్యాయామం చేయని వారి సంఖ్య పెరుగుతూ ఉండడంతో ప్రజల ఆరోగ్యం, వ్యాధుల నివారణ, వాటి అదుపు గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వ్యాయామం చేయని పురుషులు, స్ర్తిల మధ్య ఉన్న ఈ అసమానతల ప్రకారం గ్లోబల్ యాక్టివిటీ టార్గెట్ సాధించడం కష్టం మహిళలకు సురక్షితంగా తక్కువ ధరలో, వారి వారి సంస్కృతికి ఆమోదయోగ్యంగా వ్యాయామం చేసే అవకాశాలను కల్పించాలి. వాటి గురించి ప్రచారం జరగాలి అనేది డబ్ల్యూహెచ్ ఓ నిపుణుల అభిప్రాయం.
మార్గదర్శకాలు...
* ప్రతి ఒక్కరూ వారానికి కనీసం 150 నిముషాలు మితంగా ఉండే ఏరోబిక్ యాక్టివిటీ లేదా డెబ్భై ఐదు నిముషాల పాటు కఠిన వ్యాయామం చేయాలి.
* వారంలో రెండు లేదా అంతకంటే ఎక్కువ రోజులు ప్రధాన కండరాలన్నీ పనిచేసేలా బలమైన వ్యాయామం చేయాలి.
* తేలికపాటి పనులు చేసేటప్పుడు ఎక్కువసేపు కూర్చోకుండా విరామం ఇస్తుండాలి.
* వేగంగా నడవడం, వాటర్ ఏరోబిక్స్, సమంగా ఉన్న నేలపై లేదా గుట్టలపై సైకిల్ తొక్కడం, టెన్నిస్ డబుల్స్ ఆడడం, లాన్ మూవర్ నెట్టడం, హైకింగ్, స్కేట్ బోర్డింగ్, రోలర్ బ్లేడింగ్, వాలీబా, బాస్కెట్ బాల్ ఆడటం వంటివి మిత ఏరోబిక్ వ్యాయామాలు.
* జాగింగ్ లేదా రన్నింగ్, వేగంగా ఈత కొట్టడం, వేగంగా కొండపై సైకిల్ తొక్కడం, సింగిల్స్ టెన్నిస్, ఫుట్‌బాల్, రగ్బీ, రోప్ స్కిప్పింగ్, హాకీ, ఏరోబిక్స్, జిమ్నాస్టిక్స్, మార్షల్ ఆర్ట్స్ వంటివి కఠిన వ్యాయామాలు.
* బరువులు ఎత్తడం, సాగే బ్యాండ్స్‌తో వ్యాయామం, శరీరం బరువును ఉపయోగించి పుషప్స్ చేయడం, సిటప్స్ వంటి వ్యాయామం, గుంతలు తవ్వడం, కఠినమైన తోట పనులు, యోగా చేయడం వంటివి కండరాలకు బలాన్నిచ్చే వ్యాయామాలు.
* సర్య్కూట్ ట్రైనింగ్, ఏరోబిక్స్, రన్నింగ్, ఫుట్‌బాల్, రగ్బీ, నెట్‌బాల్, హాకీ వంటివి కూడా ఏరోబిక్ వ్యాయామాలుగా ఉంటూ కండరాలకు బలాన్ని చేకూరుస్తాయి.
శారీరక వ్యాయామం చేయనివారు ఎక్కువగా ఉన్న దేశాలు:
కువైట్‌లో 67 శాతం
సౌదీ అరేబియాలో 53 శాతం
ఇరాక్‌లో 52 శాతం
వ్యాయామం చేయనివారు తక్కువగా ఉన్న దేశాలు:
యుగాండాలో ఆరు శాతం
మొజాంబిక్‌లో ఆరు శాతం
ఏది ఏమైనా మనిషి వ్యాధుల బారిన పడకుండా ఉండాలన్నా, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నా తక్కువ మొత్తంలో ఆహారం తీసుకుంటూ.. శారీరక శ్రమ ఎక్కువగా చేయాలి. ఆహార విషయంలో కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పినట్లు పంచసూత్రాలను పాటించినట్లైతే మనిషి పూర్తి ఆరోగ్యాన్ని తన చేతిలో ఉంచుకున్నట్లే..

-ఎన్.ఎస్.ఉమామహేశ్వరి