S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

సంక్రాంతి లక్ష్మి

తే.గీ. భోగిమంటల వెలుగులో మూఢ జనుల
మలిన భావాలు చేతలు మాసిపోయి
స్వచ్ఛతా పరీమళములు పరిఢవిల్లి
వచ్చెనదిగొ సంక్రాంతి సౌభాగ్యలక్ష్మి!

సీ.ముద్దబంతి విరులు ముద్దుగా వికసించి
పసిడి వెలుగులెల్ల పరచుకొనగ
కర్పూరధూళిగా కనిపించుతుహినంబు
రజత రజమువోలె రాలుచుండ
హరిదాసు పాడెడు హరినామ కీర్తనల్
వింత సౌందర్యాలు సంతరింప
ముత్యాల పొడితోడ ముగ్గులు వెట్టిరా
యనునట్లు ముంగిళులలరుచుండ

తే.గీ.క్రొత్త యల్లుళ్ల రాకతో క్రొత్తవెల్గు
అత్తవారిండ్లయందున అందగింప
ముగ్ధల కిలకిలంబులు ముద్దుగొలుప
వైభవంబుగ నేతెంచె పౌష్యలక్ష్మి

తే.గీ.ముంగిళులయందు నలరారు రంగవల్లి
కలను జూడంగ హేమంత కాలమందు
అలరు సంక్రాంతి లక్ష్మికి అతివలెల్ల
రమ్య సంకేత భాషలో వ్రాసినట్టి
స్వాగతపు పత్రమనదోచు స్వాంతమందు

తే.గీ.శుభద సంక్రాంతి వేళలో సుజనులార!
సిరుల తులదూగి సంతోషచిత్తులయ్యు
ఆయురారోగ్య సౌభాగ్యమంది మీరు
వరలుచుండుడు శ్రీపతి కరుణచేత

-డి.వి.ఎం.సత్యనారాయణ 9885846949