S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

తక్కువ ఆదాయం ఉన్న ఆలయాల బాధ్యత అర్చకులకే

అమరావతి, జనవరి 18: తక్కువ ఆదాయం కలిగిన ఆలయాల యాజమాన్య బాధ్యతలను సంబంధిత అర్చకులకు అప్పగించేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉందని ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి వెల్లడించారు. ఇందుకు సంబంధించి త్వరలో ఉత్తర్వులు జారీచేసేందుకు ముఖ్యమంత్రితో చర్చిస్తామన్నారు. సచివాలయంలో శుక్రవారం దేవదాయశాఖ, అనుబంధ సంస్థలతో కేఈ సమీక్ష జరిపారు. పేద బ్రాహ్మణులు, అర్చకులను ఆదుకునేందుకు తీసుకుంటున్న చర్యలను ఈ సందర్భంగా అధికారులను అడిగి తెలుసుకున్నారు. పేద బ్రాహ్మణులతో పాటు విద్యార్థులను ఆదుకునేందుకు బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా వివిధ పథకాలు రూపొందించామని కార్పొరేషన్ చైర్మన్ వేమూరి ఆనందసూర్య వివరించారు. సమావేశానికి దేవదాయశాఖ సలహాదారు రామకోటయ్య, హిందూ ధార్మిక పరిషత్ ట్రస్ట్ చైర్మన్ ప్రసాద్, వేదిక్ యూనివర్శిటీ వైస్‌చాన్స్‌లర్ సుదర్శన శర్మ, దేవదాయశాఖ అధికారులు హాజరయ్యారు. అనుబంధ సంస్థల ద్వారా నిర్వహిస్తున్న కార్యక్రమాలపై ఉప ముఖ్యమంత్రి కేఈ ఆరా తీశారు. వృద్ధ బ్రాహ్మణులు, వితంతువులకు కార్పొరేషన్ ద్వారా వెయ్యి రూపాయలు పింఛను అందిస్తున్నామని వీరికి కూడా రెండువేలు పెంచేందుకు ప్రభుత్వం యోచిస్తోందని, ఈ విషయాన్ని త్వరలో ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. వంశపారంపర్య అర్చకత్వంపై ప్రభుత్వం సానుకూలంగా ఉందన్నారు. ఇందుకు సంబంధించిన విధివిధానాలు రూపొందించేందుకు పభుత్వం కమిటీని నియమించిందన్నారు. సాధ్యమైనంత త్వరలో జీవో 76 విడుదల చేస్తామని ప్రకటించారు. తక్కువ ఆదాయం గల దేవాలయాల యాజమాన్య హక్కులు అర్చకులకు ఇచ్చే ఆలోచన ప్రభుత్వం పరిశీలనలో ఉందన్నారు. ఎంత ఆదాయం ఉన్న దేవాలయాలను ఈ పరిధిలోకి తీసుకురావాలనే విషయమై చర్చలు జరుగుతున్నాయని చెప్పారు. దీనివల్ల అర్చకుల సమస్యలు దాదాపు తీరతాయన్నారు.
త్వరలో విజయవాడలో 46 మంది
పీఠాధిపతులతో సమావేశం
దేవదాయశాఖ- అనుబంధ సంస్థల ద్వారా నిర్వహించే కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు శంఖారావం పేరుతో మ్యాగజైన్ ఆవిష్కరించనున్నట్లు హిందూ ధార్మిక పరిషత్ ట్రస్ట్ చైర్మన్ ప్రసాద్ ఉప ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. హైందవ సంస్కృతిని ప్రజల్లోకి తీసుకువెళ్లడంతో పాటు హిందూ మత పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించేందుకు త్వరలో విజయవాడలో 46 మంది పీఠాధిపతులతో సమావేశం నిర్వహిస్తున్నామని వివరించారు.
వేదిక్ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా రాజధానితో పాటు ఇతర ప్రాంతాల్లో వేద విశ్వవిద్యాలయాల శాఖలు ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టాలని వేదిక్ యూనివర్శిటీ ప్రిన్సిపాల్ సుదర్శన శర్మ ఉప ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. సమావేశంలో చర్చించిన అంశాలను నివేదిక రూపంలో సమర్పించాలని దేవదాయ అనుబంధ సంస్థల ప్రతినిధులను కేఈ ఆదేశించారు. సమావేశంలో అందజేసిన సూచనలు, ప్రతిపాదనలు ముఖ్యమంత్రికి వివరించి సాధ్యమైనంత త్వరలో పరిష్కరిస్తామని స్పష్టం చేశారు.