S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

రికార్డులు ఎన్‌ఐఏకు అప్పగించండి

విజయవాడ (క్రైం), జనవరి 18: ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డిపై హత్యాయత్నం కేసు దర్యాప్తుకు సంబంధించి పూర్తి వివరాలను తక్షణమే జాతీయ దర్యాప్తు సంస్ధ (ఎన్‌ఐఏ)కు అప్పగించాలని ఏపీ సిట్‌ను ప్రత్యేక న్యాయస్ధానం ఆదేశించింది. విశాఖ ఎయిర్‌పోర్టులో జగన్‌పై కోడికత్తి దాడి ఘటనకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) చేతుల నుంచి విచారణ అధికారం ఎన్‌ఐఏకు బదిలీ అయిన విషయం తెలిసిందే. దీంతో రంగంలోకి దిగి ఎన్‌ఐఏ అధికారులు దర్యాప్తును ముమ్మరం చేసిన నేపధ్యంలో నిందితుడు శ్రీనివాసరావును కోర్టు అనుమతితో తమ కస్టడీకి తీసుకుని విచారించారు. దీనిలో భాగంగా సిట్ అధికారులు తమకు సహకరించడం లేదని, కేసుకు సంబంధించి దర్యాప్తు వివరాలు, డాక్యుమెంట్లు తమకు ఇవ్వడానికి నిరాకరిస్తున్నట్లు విజయవాడలోని ఎన్‌ఐఏ ప్రత్యేక న్యాయస్ధానంలో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌పై వాదనలు విన్న న్యాయస్ధానం.. సిట్ అధికారి నాగేశ్వరరావును ఆదేశిస్తూ సిట్ దర్యాప్తు వివరాలు మొత్తం ఎన్‌ఐఏకి వెంటనే అప్పగించాలని శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. కేసు రికార్డు, కేసు డైరీ, కేసు ప్రాపర్టీ తదితర వాటిని ఎన్‌ఐఏ చీఫ్ ఇన్విస్టిగేషన్ ఆఫీసర్‌కు అప్పగించాలని సిట్ అధికారిగా నియమితులైన విశాఖపట్నం నార్త్ జోన్ ఏసీప బివిఎస్ నాగేశ్వరరావును న్యాయమూర్తి ఆదేశించారు.
ఇదిలావుండగా.. ఈ కేసులో నిందితుడు శ్రీనివాసరావును ఎన్‌ఐఏ అధికారులు శుక్రవారం విజయవాడలోని ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు. విచారణలో ఎన్‌ఐఏ అధికారులు ఇబ్బంది పెట్టారా అని జడ్జి ప్రశ్నించగా లేదని శ్రీనివాసరావు సమాధానమిచ్చారు. కాగా జైలులో తాను రాసుకున్న 22పేజీల పుస్తకాన్ని జైలు అధికారులు బలవంతంగా తీసుకున్నారని, అదేవిధంగా తనకు ప్రజలతో మాట్లాడే అవకాశం కల్పించాలని నిందితుడు న్యాయమూర్తిని కోరాడు. ఇదిలావుండగా.. విజయవాడ జైలులో తగిన సౌకర్యాలు లేకపోగా.. తగిన భద్రత లేదని, విశాఖ లేదా రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించాలని శ్రీనివాసరావు తరుఫున న్యాయవాది సలీమ్ కోర్టు దృష్టికి తీసుకువస్తూ పిటిషన్ దాఖలు చేశారు. అయితే అదేం లేదని శ్రీనివాసరావు జవాబిచ్చాడు. దీంతో న్యాయమూర్తి ప్రభుత్వ న్యాయవాదిని వివరణ కోరగా.. విజయవాడ జైలులో భద్రత కల్పించలేమని చెప్పారు. దీంతో నిందితుడుని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించాలని న్యాయమూర్తి ఆదేశించారు. కోర్టు ఆదేశాలతో శ్రీనివాసరావును విజయవాడ నుంచి రాజమండ్రి తరలించారు. ప్రస్తుతం నిందితుడు జ్యుడీషియల్ రిమాండులో కొసాగుతున్నందున ఈనెల 25తో గడువు ముగియనుంది.
రెస్టారెంట్ ఓనర్ వాంగ్మూలం
విశాఖపట్నం: వైసీపీ అధినేత జగన్‌పై దాడి కేసుకు సంబంధించి జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) విచారణ ముమ్మరం చేసింది. ఇప్పటికే పలువురిని విచారించిన ఎన్‌ఐఏ అధికారులు నిందితుడు జనిపల్లి శ్రీనివాస్ పనిచేస్తున్న రెస్టారెంట్ యజమాని హర్షవర్దన్ ప్రసాద్‌ను విచారించి వాంగ్మూలం నమోదు చేశారు. విచారణకు హాజరు కావాలంటూ ఎన్‌ఐఏ జారీ చేసిన నోటీసుకు స్పందించిన హర్ష అనారోగ్యం కారణంగా ఎన్‌ఐఏ కార్యాలయానికి హాజరుకాలేనని చెప్పడంతో అధికారులు ఆయన్ను ఇంటి వద్దనే విచారించారు. ఇదే విషయాన్ని హర్ష ‘ఆంధ్రభూమి’ వద్ద ధ్రువీకరించారు. జరిగిన ఘటనకు సంబంధించి సాధారణ ప్రశ్నలే అడిగారని, ఎన్‌ఐఏ అధికారులు అడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పినట్టు వెల్లడించారు. తన వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్నారని ఆయన తెలిపారు.