S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

గొప్పదనం

గొప్పదనం ఎక్కడ ఉన్నా గొప్పగానే ఉంటుంది. దాన్ని చూడగలగటమే కష్టం. ప్రొఫెసర్ రామ్మూర్తిగారిని నేను చూసినట్టే జ్ఞాపకం. ఎక్కడ చూశాను అన్నది మాత్రం చటుక్కున గుర్తు రావడం లేదు. ప్రొఫెసర్ రామ్మూర్తిగారు అంటే నాకు వెంటనే ఇద్దరు గుర్తుకొస్తున్నారు. ఇద్దరినీ చూశాను. వారిలో ఒకరితో మాట్లాడాను కూడా. మాట్లాడిన ప్రొఫెసర్ గారు వెంకటేశ్వర విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్‌గా చేశారు. అయితే నేను ఇవ్వాళ చెప్పదలుచుకున్నది ఆయన గురించి కాదు. అలాగని ఆయన గొప్పతనానికి ఏ రకంగానూ లోటు రాదు. కానీ మద్రాసులో పేరుగాంచిన న్యూరో సర్జన్ ప్రొఫెసర్ బి.రామ్మూర్తి గారు ముందుగా గుర్తుకు వస్తున్నారు. ఆయన గురించి ఈ మధ్యనే ఏదో ఒక పాత పత్రికలో కొంత సమాచారం కనిపించింది. మెదడు తెర మీద వెంటనే కొన్ని దృశ్యాలు గిరగిర తిరిగాయి.
రామ్మూర్తి గారిని ఎక్కడ ఎప్పుడు చూశాను అన్నది నాకు గుర్తు రాలేదు అన్నాను. నా వయసు ప్రస్తుతం 65 ప్లస్. అప్పటికే నాకు జ్ఞాపకశక్తి తగ్గుతున్నట్టు ఉంది. ప్రొఫెసర్ రామ్మూర్తిగారు మాత్రం 80 ఏళ్ల వయసు తర్వాత కూడా చక్కగా యువకుని లాగా తిరుగుతూ బుర్రలకు చిల్లులు వేసి మెదడు ఆపరేషన్లు చేసి పడేస్తూ ఉండేవారు. న్యూరో సర్జన్‌గా ఆయనకు చాలా గొప్ప పేరు ఉన్నట్టు అప్పట్లోనే విన్నాను. తరువాత ఆయన గురించి ఎంతో తెలుసుకున్నాను. విద్యార్థులంతా ఆయనను ఇంచుమించు ఒక దేవుడిగా చూచేవారు అని అంటే భక్త్భివం ప్రదర్శించేవారని చెప్పుకోవడం కూడా నాకు తెలుసు.
అప్పట్లో ఎంఆర్‌ఐలు, క్యాట్ స్కాన్‌లు ఉండేవి కాదు. నిజంగా పుర్రెలో రంధ్రం వేసి లోపలి వివరాలను పరీక్షించేవారు. అటువంటి రంధ్రానికి బర్ హోల్ అని పేరు. ఆ రకంగా బి రామ్మూర్తిగారిని బర్ హోల్ రామ్మూర్తి అనేవారట. ఆయనకు ఆ విషయంలో ఎటువంటి అభ్యంతరం ఉండేది కాదు అంటారు.
మూర్తిగారు బక్కపలచని మనిషి. తల మీద వెంట్రుకలు ఎక్కువగా ఉండేవి కాదు. ఆయన బుర్ర కూడా బయటకు కనపడుతూనే ఉండేది. అంటే వెంట్రుకలు ఆ తలను దాచలేదు అని అర్థం. అంతేకాదు, రామ్మూర్తిగారు తన ఆలోచనలను కూడా దాచేవారు కారు అంటారు. తన అనుభవాలను విద్యార్థులతో పంచుకుని వారిని ఉత్సాహపరచడంతో ఈయనకన్నా గొప్పవారు లేరు అంటారు.
సర్జన్ పనికి తగిన శిక్షణ పొందిన తర్వాత మూర్తిగారు మొట్టమొదటిసారిగా డ్యూటీలోకి చేరుతున్నారు. అక్కడ ఒక పెద్ద మనిషికి వెళ్లి తాను వచ్చినట్టు చెప్పుకోవాలి. ఈయన మరి సరదా మనిషి కావచ్చు కానీ, అవతల మనిషికి కూడా అంత సరదా ఉండాలి కదా? రామ్మూర్తి గారు ఒక్క సైనికుని పద్ధతిలో వెళ్లిపోయి, రామ్మూర్తి రిపోర్టింగ్ టు డ్యూటీ, సర్ అన్నారట. అక్కడి నుంచి తనకు ఏదో గొప్ప స్వాగతం దొరుకుతుంది అని భావించారో లేదో నాకు ఇవ్వాళ తెలియదు. అక్కడ అధికారంలో ఉన్న సీనియర్ డాక్టర్, ఇతని సరదా పద్ధతికి ముఖం చిట్లించి, సరే బాగుంది కానీ, ఎన్నీమా ఇవ్వడం ఎలాగో తెలుసా? అని అడిగాడట. సర్జన్ చేయవలసిన పనికి అతను అడిగిన ప్రశ్నకు సంబంధం లేకపోవడం జీవితంలో తనకు మొదటి పాఠం నేర్పింది అంటారు ప్రొఫెసర్. అవును మరి, జీవితం అలాగే ఉంటుంది! అన్నీ అనుకున్నట్టు జరిగితే ఇక మనం ఎందుకు?
రామ్మూర్తి గారు చాలా కాలం పని చేశారు. ఎంతో అనుభవం సంపాదించారు. అయినప్పటికీ తన వద్దకు చికిత్స కోసం వచ్చిన వారి నుండి చదువు కోసం వచ్చిన విద్యార్థుల నుండి కూడా తాను ఎప్పుడో పాఠాలు నేర్చుకుంటారు అని చెబుతూ ఉండేవారు. అటువంటి సందర్భాన్ని ఒకదాని గురించి క్లాసులో చెప్పినట్టు ఆయన విద్యార్థులు చెబుతున్నారు.
మూర్తిగారి వద్దకు చదువు సంధ్య లేని పల్లెటూరి పెద్దమ్మ ఒక ఆవిడ చికిత్స కోసం వచ్చింది. ఆవిడ కూడా కొంచెం పెద్దవయసు మనిషి. డాక్టర్‌గా తన బాధ్యత నిర్వర్తిస్తున్నారు అనుకుని ప్రొఫెసర్‌గారు, ఏం ఫరవాలేదు అని భరోసా ఇవ్వబోయారు. అసలు ఏ మాత్రం చింత అవసరం లేదని కూడా చెబుతున్నారట. ఆ పల్లెటూరి తల్లికి మాత్రం అదేదో నచ్చలేదు. అయ్యా డాక్టర్ బాబూ, నీవు కనీసం చెయ్యి పెట్టి నన్ను ముట్టుకోను కూడా లేదు. అప్పుడే నాకు ఎట్లా బాగవుతుంది? డాక్టర్ ముట్టుకుంటేనే కదా ఎవరికైనా బాగు అయ్యేది! అని తెగేసి అడిగిందట. నిజమే! అంత అనుభవం గల ప్రొఫెసర్ గారికి కూడా అప్పటివరకు వైద్యుడు వద్దకు వచ్చిన వారిని ఒక చేత తాకి ఒకటి చెప్పడం మీద అవగాహన కలిగినట్లు లేదు. మంచి వైద్యుని పద్ధతులను గురించి ఆ పల్లెటూరి ముసలమ్మ తనకు చక్కని పాఠం చెప్పింది అని అంత అనుభవం గల న్యూరో సర్జన్ కూడా ఒప్పక తప్పలేదు.
డాక్టర్‌గారు పై చదువుల కోసం ఇంగ్లండ్ వెళ్లారు. అక్కడ ఒక రోగిని కళ్లను పరీక్షించే ఒక పరికరంతో పరీక్షించమని అడిగారట. సమయస్ఫూర్తి గల మనిషి కనుక ఏదో ఒక రకంగా ఆ పనిని ఆయన చేయగలిగారు. ఆ కాలంలో భారతదేశంలో తమ రంగానికి సంబంధం లేని పరికరాలను గురిచి వైద్యులకు శిక్షణ అంతగా ఇచ్చేవారు కారు అనుకుంటాను. కనుక ఆ పరికరంతో డాక్టర్ గారికి నిజానికి పరిచయం లేదు. అయినా సమయస్ఫూర్తిగా ఏదో పనికానిచ్చారు. అయితే ఆ తరువాత మెదడుకు చికిత్స చేసే డాక్టర్లు అందరు కూడా తప్పకుండా కళ్లను పరీక్షించాలని ఒక ఆచారం మొదలైందట. నీ కళ్లు మెదడులోకి దారి తీసే ద్వారాలు వంటివి కదా! రామ్మూర్తి గారు ఆ తరువాత చాలాకాలం పాటు తమ లెటర్ హెడ్ మీద, కళ్లను పరీక్షించండి, రోగిని కాపాడండి! అన్న నినాదం అచ్చు వేయించి పెట్టుకునేవారట! తను కళ్ల వైద్యుడు కాదు. అసలైన మెదడు వైద్యుడు!
మెడికల్ కాలేజీలో కూడా ప్రత్యేక సందర్భాలలో ఆటలు పాటలు, నాటకాలు కూడా ఉంటాయి. అటువంటి వాటిలో నుంచి కూడా పాఠాలు నేర్చుకోవచ్చు అని ఉదాహరణలతో సహా రామ్మూర్తి గారు చూపించారట. ఒకానొక నాటకంలో తికమక డాక్టర్ స్టెతస్కోప్‌ను రోగి గుండె మీద కాక తల మీద పెట్టి చూస్తాడు. అక్కడ ఉన్న వారంతా వైద్య విద్యార్థులు కనుక జోకు అర్థమైంది. అందరూ నవ్వారు. కానీ న్యూరో సర్జన్‌కు మాత్రం అందులో ఏదో కొత్త సంగతి తోచింది. వాళ్లు పరీక్షించవలసింది మెదడును, గుండెను కాదు మరి!
సాధారణంగా ఏ రంగంలోని డాక్టర్ వద్దకు వెళ్లినప్పటికీ, ముందుగా చెయ్యి పట్టుకుని నాడి చూస్తారు. ఈ కాలంలో విధిగా బీపీ చూస్తారు. డాక్టర్ రామ్మూర్తిగారు ఒకనాడు పరధ్యానంగా ఉండి ఒక వ్యక్తికి బీపీ చూడలేదు. ఆ సంగతి తనకే గుర్తు వచ్చి ఆ తర్వాత ఆయన ఎంతో విచారించినట్టు డాక్టర్‌గారు సొంతంగా చెప్పుకున్నారు.
ప్రొఫెసర్ రామ్మూర్తిగారు వృత్తిలోకి వచ్చే నాటికి మెదడుకు శస్త్ర చికిత్స అన్నది అంతగా అలవాటు అయిన విషయం కాదు. ఆ రంగం అప్పుడప్పుడే రూపు కడుతున్నది. కనుక, చేసిన ఆపరేషన్లలో ఎక్కువ భాగం సక్సెస్ అయ్యేవి కావు. న్యూరో సర్జన్‌లను చూసి ఆ కాలంలో, సహస్ర శిరచ్ఛేద అపూర్వ చింతామణి అంటూ హాస్యం చేసేవారు.
ప్రొఫెసర్ రామ్మూర్తి గారిని సైన్యంలో శస్త్ర చికిత్సల కోసం నియమించి గౌరవ బ్రిగేడియర్ పదవిని ఇచ్చారు. ఒక ఆఫీసర్ లాంఛనప్రాయంగా వచ్చి, మిలిటరీ దుస్తులను తెచ్చి, డాక్టర్ చేత వాటిని ధరింప చేయించారు. ఆగలేదు. ఆయన కారుకు బ్రిగేడియర్‌లకు ఉండవలసిన పద్ధతి ప్రకారం నక్షత్రాలను ఏర్పాటు చేశారు. ఎర్రవి లైట్లు కూడా ఏర్పాటు చేశారు. ఇదంతా డాక్టర్ గారికి చాలా సరదాగా అనిపించింది. నాకు ముచ్చటగా అనిపించింది, అని ఆయన ఆ తరువాత తమ వారితో చెప్పుకున్నారు.
డాక్టర్ రామ్మూర్తి గారికి తరువాతి కాలంలో పద్మవిభూషణ్ బిరుదు కూడా వచ్చింది. అంతేకాదు ఆయన ప్రసిద్ధిగాంచిన వైద్యులు ఆచంట లక్ష్మీపతి గారి అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. తెలుగు ఇంటికి అల్లుడు అయ్యారు. అత్తగారు ఆ కాలంలో మద్రాస్ ప్రభుత్వంలో మంత్రిగా కూడా చేశారు.
మూర్తి గారు ఇంగ్లండ్‌లో చదువుకుంటున్నప్పుడు అక్కడికి ఒక నవాబుగారు వచ్చారట. ఈయనగారు వెళ్లి నవాబు గారిని దర్శనం చేసుకోవాల్సిన పరిస్థితి కూడా వచ్చింది. రాజుల దగ్గరికి ఒట్టి చేతులతో వెళ్లకూడదు. కనుక డాక్టర్‌గారు ఒకటి లేదా రెండు పౌండ్ల నోట్లను ఒక కవర్లో పెట్టి రాజుగారికి నజరానాగా ఇచ్చారట.
మా ఆవిడగారు గైనకాలజీలో ప్రొఫెసర్. నా కూతురు ఎంబీబీఎస్ తర్వాత స్వీడన్ దేశానికి వెళ్లి ఉప్సలా అనే విశ్వవిద్యాలయంలో వైద్య పరిశోధనలో ఎమ్మెస్ డిగ్రీ చేసి, ప్రస్తుతం సింగపూర్‌లోని నేషనల్ యూనివర్సిటీలో పరిశోధకురాలుగా ఉన్నది. మా బావగారు కూడా డాక్టర్‌గారే. కనుక నాకు వైద్య రంగంలో వారితో చాలా దగ్గరి సంబంధాలు ఉన్నాయి. అంతేకాక రేడియోలో ఉద్యోగం చేసిన కాలంలో పేరుగాంచిన వైద్యులతో మాట్లాడవలసిన సందర్భాలు చాలా వచ్చాయి.
ఈ మాట చెప్పగానే నాకు చటుక్కున ఉపమాక బ్రహ్మాజీరావు గారు గుర్తుకు వస్తారు. ఒకసారి నేను ఆయనను రేడియోలో ఇంటర్వ్యూ చేస్తున్నాను. ఆల్ ఇండియా రేడియో అంటే అన్ని విషయాలను చివరకు జోకులను కూడా సీరియస్‌గా చెప్పుకుంటారని అందరికీ ఒక భావన ఉంది. బ్రహ్మాజీరావు గారితో నా సంభాషణ మాత్రం చాలా సరదాగా జరిగింది. మేము ఇద్దరమూ పగలబడి నవ్వుకున్నట్టు కూడా గుర్తుంది. అనుకున్న సమయానికన్నా ఇంటర్వ్యూ నిడివి చాలా ఎక్కువగా వచ్చింది. అందులో ఏ భాగం తొలగించాలన్న నాకు నచ్చలేదు. కనుక ఆ ఇంటర్వ్యూను వీలున్న చోటే ప్రసారం చేసినట్టు జ్ఞాపకం ఉంది. అలాగే శ్రీనివాసులు రెడ్డిగారు అని ప్రసిద్ధ సర్జన్తో కూడా నేను ఒక ఇంటర్వ్యూ రికార్డు చేశాను. ఆయనకు బి.సి.రాయ్ అవార్డు వచ్చింది. ఆ సందర్భంగా ఇంటర్వ్యూ చేయాలని అడిగాను. ఆయనేమో అస్తమానం బిజీగా ఉండే డాక్టర్. మామూలు డాక్టర్ కాదు సర్జన్. అయినా ఓపికగా ఆయన రెండు ఆపరేషన్లకు మధ్యన టైం కుదుర్చుకొని ఇంటర్వ్యూ కొరకు వచ్చారు. ఇంటర్వ్యూ చేస్తుండగా నెలల వయస్సు గల నా కొడుకు అనారోగ్యంగా ఆసుపత్రిలో ఉన్నాడని ఫోన్ వచ్చింది. అయినా సరే ఇంటర్వ్యూ పూర్తి చేసి వెళ్లాను. నా కొడుకు ఆరోగ్యంగా ఉన్నాడు. అయితే వాడు ఇంజనీర్. అది వేరే కథ.
వి వి సుబ్బారావుగారు అని కేన్సర్ సర్జన్‌గారితో కూడా నాకు మంచి పరిచయం ఉండేది. ఇక మా ఆవిడగారి గురువుగారు, నాకు అమ్మ లాంటి వారు శ్రీమతి బాలాంబగారు. ఈ ప్రపంచంలో ఇటువంటి మంచి డాక్టర్లు చాలామంది ఉన్నందుకే మనుషుల ఆరోగ్యాలు బాగుంటున్నాయి. వెనకటి మనవారు వైద్యో నారాయణ హరి అన్నారు. అది నిజమే!

-కె.బి.గోపాలం