తాబేలు కుటుంబం(కథ)
Published Saturday, 2 February 2019అనగనగా ఒక ఊరిలో ఒక పెద్ద బావి ఉంది. అందులో పెద్ద తాబేళ్లు జంటగా నివసిస్తూ విడిపోయాయి. అలా విడిపోయిన తరువాత ఆడ తాబేలుకు సంతానం కలిగి చిన్న మగ తాబేలుకు జన్మనిచ్చింది.
ఆ బావిలో ప్రతిరోజూ తల్లి తాబేలు, పిల్ల తాబేలు, బావే తమ ప్రపంచంగా భావించి ఆడుకుంటూ ఉండేవి. ఎలా? ఆడుకున్నాయంటే తల్లి తాబేలు తన కొడుకు తాబేలును వీపుపై ఎక్కించుకుని బావిలో అటూ ఇటూ తిప్పుతూ ఆడుకుంటూ ఉండేవి.
పిల్ల తాబేలుకు అమ్మంటే ఎంతో ఇష్టం. తల్లి తాబేలు బిడ్డని ఆట పట్టించాలని తన కొడుకుని వదిలి బావి లోతుకు పోయింది.
ఈ బుల్లి తాబేలు ఇంకా ఇప్పుడిప్పుడే ఈత నేర్చుకుంటోంది. ఒక్కసారిగా తన తల్లి కనిపించకుండా పోయేసరికి గుక్క ఆపకుండా ఏడ్వడం మొదలుపెట్టింది. బావి చుట్టూ బుడిబుడిగా ఈత కొడుతూ అమ్మ కనపడలేదని ఏడ్వసాగింది.
అలా ఏడుస్తూ ఉంటే అటుగా వెళ్తున్న ఓ తాబేలు ‘ఏంటి? చిన్నా.. ఏడుస్తున్నావ్?’ అని అడిగింది.
ఈ చిన్ని తాబేలు అమ్మ కన్పించలేదని సమాధానం చెప్పకుండా భోరున ఏడుస్తోంది. ఆగ్రహించిన తాబేలు లెంపకాయ వేసి వెళ్లిపోయింది. ఆ చిట్టి తాబేలు ఇంకా ఎక్కువ ఏడ్వసాగింది.
ఈసారి ఎందుకు ఎక్కువగా ఏడ్చిందంటే అమ్మ కన్పించలేదు, నన్ను ఓదార్చడానికి వచ్చిన తాబేలు కూడా నాకు తోడు లేకుండా పోయిందని ఏడ్వసాగింది.
అదే దారిన వెళ్తున్న పెద్ద మగ తాబేలుకు ఏడ్పు వినిపించి అటువైపు వెళ్లగా ఈ చిన్న తాబేలు ఏడుస్తూ కనిపించింది. పెద్ద తాబేలు రావడం గమనించి, నాకు తోడు ఎవరో వస్తున్నారనే భావనకు వచ్చింది. పెద్ద తాబేలు ఎందుకు నాయనా ఏడుస్తున్నావ్? అని అడిగింది.
అమ్మ కొట్టిందా? ఆకలేస్తోందా? అని అడగసాగింది. ఈ తాబేలుకు కూడా సమాధానం చెప్పకపోతే ఈ తాబేలు కూడా వెళ్లిపోతుందేమో అని విషయం చెప్పసాగింది.
నేను మా అమ్మ ఆడుకుంటూ ఉండగా అమ్మ కన్పించలేదని చెప్పింది. నేను నిన్ను మీ అమ్మ దగ్గరకు తీసుకెళ్తా నా వీపు పైన ఎక్కి కూర్చోమని చెప్పింది. బావి లోతుకు తీసుకెళ్తూ దారిలో కనిపించిన ప్రతి తాబేలును చూపిస్తూ మీ అమ్మను గుర్తు పట్టమని లోనికి తీసుకెళ్లింది. బావి అట్టడుగు భాగాన తల్లి తాబేలు తన కొడుకును చూసి మొదట సంబర పడింది. తరువాత కొడుకును తీసుకువస్తున్న భర్తను చూసి కోపంతో గొడవ పడింది. ఇంతలో పిల్ల తాబేలు కలుగజేసుకుని అమ్మా ఆయన తప్పేమీ లేదమ్మా నేను ఏడుస్తుండగా వచ్చి ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగి నన్ను నీ దగ్గరకు తీసుకువచ్చాడమ్మా అని ఏడుస్తూ ఇంకెప్పుడు నన్ను వదిలి వెళ్ళకమ్మా అని అంది.
ఆ పెద్ద మగ తాబేలు పిల్ల తాబేలును చూసి ఈ బుల్లి తాబేలు మన బిడ్డా? అని సంతోషించాడు. నేను ఎంత తప్పు చేశాను? ఇన్నాళ్లూ నేను నిన్ను చూడడానికైనా రాలేదే. ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొని ఉంటావో? అని భార్యతో అన్నాడు. అప్పుడు భార్య జరిగిన కథ చెప్పుకొచ్చింది. మీరు నన్ను విడిచి వెళ్లిపోయిన తరువాత నేను ఈ బుల్లి తాబేలుకు జన్మనిచ్చాను.
నాకు నా బిడ్డే లోకంగా అన్నీ మర్చిపోయి హాయిగా నేను నా బిడ్డ సంతోషంగా ఉండేవాళ్లం. ఇప్పుడు మిమ్మల్ని నా దగ్గరకు నా బిడ్డే, మన బిడ్డే.. మన ఇద్దరినీ కలిపాడు అంది.
పశ్చిత్తాపపడిన భర్త తాబేలు ఇంకెప్పుడూ మీతో గొడవ పడనని ఇప్పటి నుంచి మనమందరం హాయిగా జీవితాన్ని గడుపుదామని ఆ రోజు నుండి కుటుంబంతో సంతోషంగా జీవించడం మొదలుపెట్టాడు.
నీతి: పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం ఇంకోటి లేదు!