S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

రైతే రాజు( కథ)

పూర్వం భూమి అంతా రాజుల ఆధీనంలో ఉండేది. రాజుని ‘పృథ్వీపతి’ అనేవారు. భూమి మీద హక్కు అంతా రాజుదే. రాజు గ్రామాలలో వుండే పాలెగాండ్ల ద్వారా రైతులకు భూమి కౌలుకి ఇచ్చేవారు. పాలెగాండ్లు రైతుల దగ్గర శిస్తు వసూలు చేసి రాజు కోశాగారానికి ధనాన్ని పంపుతూ ఉండేవారు. రాజు ప్రజల ధన, మాన, ప్రాణాలకు భంగం కలుగకుండా రక్షణ కల్పిస్తూ పరిపాలన సాగించేవారు.
అటువంటి రోజుల్లో సూరయ్య ధర్మవరం గ్రామంలో చిన్నకమతం కౌలుకి సాగు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తూ వుండేవాడు. ఇలా వుండగా సూరయ్యకి వున్న రెండు ఎద్దుల్లో ఒకటి అకాల మృత్యు వాత పడింది. పొలం దున్ని వ్యవసాయం చేయాలంటే కాడికి రెండు ఎద్దులు కట్టాలి. సూరయ్య అభిమానధనుడు. ఇతరులకు తోచిన సహాయం చేయడమే గాని ఎవరినీ సహాయం అడుగడు.
కర్తవ్యం తోచక దిగులు పడుతున్న సూరయ్యకు భార్య అంజమ్మ సలహా ఇచ్చింది.
‘ఒక ఎద్దు చనిపోయినంత మాత్రాన అంతగా దిగులు పడాలా? ఈసారి విజయనగరంలో జరిగే పశువుల సంతకు వెళ్లి మరొక ఎద్దును కొనుక్కుంటే సరిపోతుంది గదా?’
‘చెప్పడం సులభమే. ఎద్దును కొనడానికి ధనం ఏదీ?’ అన్నాడు సూరయ్య.
‘మన దగ్గర లేకపోతే షావుకారో దగ్గరో, పాలెగాడి దగ్గరో అప్పు తీసుకోవాలి.’
‘అప్పు తీసున్న ధనానికి వడ్డీ కట్టాలి. ముందు ముందు వడ్డీ కట్టడమే సరిపోతుంది. అసలు అట్లాగే ఉంటుంది.’
‘పోనీ నీ స్నేహితులను ఎవరినైనా అడగవచ్చుగా!’
‘బంధువుల దగ్గర, స్నేహితుల దగ్గరా చెయ్యి చాచగూడదు. వాళ్లు చిన్నచూపు చూస్తారు. అదీగాక అప్పు లేని వాడు అందరికంటే ధనవంతుడు అనే మాట వినలేదా?’ అన్నాడు సూరయ్య.
భర్త తన మాట వినడని నిశ్చయించుకున్న అంజమ్మ సలహాలు ఇవ్వడం మానుకుంది. తనకు తోచినట్టు చేయనీ అని మిన్నకుంది.
* * *
సూరయ్య ధర్మవరం నుంచి రాజుని కలవడానికి విజయనగరం వెళ్లాడు తనకున్న ఎద్దును తోలుకుని. అక్కడ పశువుల వ్యాపారులు చూసి ఎద్దును తమకు అమ్మమని అడిగారు.
సూరయ్య ససేమిరా అన్నాడు. ఆ ఎద్దును అది పుట్టినప్పటి నుంచి సాకుతున్నాననీ, దానిని అమ్మడం అంటే నన్ను నేను అమ్ముకోవడం వంటిది అన్నాడు.
‘ఎద్దును అమ్మకుండా ఏం చేస్తావు?’ అని వ్యాపారులు ప్రశ్నించారు.
‘రాజుగారికి దానం ఇస్తాను’
సూరయ్య మాటలకు అంతా ఆశ్చర్యపోయారు. రాజు అందరికీ దానాలు ఇస్తాడు. అటువంటి రాజుకు ఒక రైతు ఎద్దును దానం ఇవ్వడమా? వింతగా వుందే అనుకున్నారు.
సూరయ్య కృష్ణ దేవాలయానికి అనుబంధంగా ఉన్న సత్రంలో బస చేశాడు. ఆవరణలో ఒక చెట్టుకు ఎద్దును కట్టేశాడు.
సూరయ్య అనే రైతు రాజుకు దానం ఇవ్వడానికి ధర్మపురి గ్రామం నుంచి వచ్చాడని విజయనగరమంతా తాటాకు మంటలా పాకిపోయింది. ఆ నోటా ఆ నోటా విషయం రాజుకి చేరింది.
‘ఏమీ? రైతు ఎద్దును దానం ఇస్తాడా నాకు? ఎంత పొగరు? అతన్ని తక్షణం నా ఎదుట ప్రవేశపెట్టండి’ అని రక్షణాధికారిని ఆదేశించాడు.
రక్షక భటులు సత్రంలో బస చేసిన సూరయ్యను బంధించి రాజు ఎదుట నిలబెట్టారు.
‘నువ్వేనా సూరయ్య అంటే? నాకు ఎద్దును దానం ఇస్తానని ప్రగల్భాలు పలుకుతున్నావని తెలిసింది. రాజుని అవమానించడం శిక్షార్హమైన నేరమని తెలియదా?’ అని రాజు ప్రశ్నించాడు.
‘ప్రభూ! దానం ఇవ్వడం శిక్షార్హమైన నేరం అని నాకు తెలీదు. దానం స్వీకరించడం అవమానంగా భావిస్తారనీ నా మట్టిబుర్రకు తట్టలేదు. తమరు ఎందరికో ఎన్నో దానాలు చేస్తుంటారు. వారు అవమానంగా భావిస్తున్నారా? అలా అనుకుంటే ఎవరూ దానం తీసుకోరు. ప్రభూ తప్పు మాట్లాడితే క్షమించండి’ అన్నాడు సూరయ్య.
సూరయ్య మాటలతో రాజుకు జ్ఞానోదయమైనట్లు అయింది. అతని మీద కోపం మటుమాయమైంది. బక్క రైతు గొప్ప తాత్వికుడిలా కనిపిస్తున్నాడు రాజు కళ్లకి.
‘సరే! ఆ సంగతి అట్లా వుంచు. నువ్వు సామాన్య రైతువి. రాజుకి దానం ఇచ్చే యోగ్యత నీకుందా?’ అని రాజు ప్రశ్నించాడు.
‘ప్రభూ! రైతే దేశానికి వెనె్నముక అని మీరెగరా? రైతు లేకపోతే రాజ్యమే లేదని విజ్ఞులు చెప్తారు. రైతులు ఎండా వానా చలి గాలులను చెయ్యకుండా ఆరుగాలం కష్టపడి పంట పండిస్తాడు. ప్రభుత్వానికి సుంకం కడతాడు. అది కోశాగారానికి చేరితేనే కదా ప్రభుత్వం నడుస్తుంది. ఉద్యోగుల జీతభత్యాలు అందులో నించే కదా ఇస్తారు. దానం ఇచ్చే యోగ్యత రైతుకు లేకపోతే మరెవరికీ లేదని నా అభిప్రాయం. తప్పు మాట్లాడితే క్షమించండి..’ అన్నాడు సూరయ్య వినయంగా.
సభలో అంతా సూరయ్య మాటలకు కరతాళ ధ్వనులతో తమ హర్షం వెలిబుచ్చారు. లోతుగా ఆలోచిస్తే అసలు రైతే రాజు, రైతు లేకపోతే కోశాగారం నిండుతుందా? ప్రభుత్వం నడుస్తుందా? తను కేవలం పెత్తనం చేసే రాజు. క్షేత్ర స్థాయిలో సంపద చేకూర్చే రైతే రాజు అని రాజుకి జ్ఞానోదయమైంది.
‘సూరయ్యా! నువ్వు సామాన్యుడివి కాదు. గొప్ప తాత్వికుడివి. రాజుననే అహంకారంతో ప్రవర్తించాను. నాకు కనువిప్పు కలిగింది. నువ్వన్న మాటలు నూటికి నూరుపాళ్లు యదార్థం. రైతే రాజు’ అన్నాడు రాజు.
‘అయ్యా! నేను మీరన్నట్టు గొప్పవాడిని మాత్రం కాదు. సామాన్య రైతుని’ అన్నాడు సూరయ్య.
‘సరే! సూరయ్యా! అసలు విషయానికి వద్దాం. నీ ఎద్దుని నాకు ఎందుకు దానం ఇవ్వాలనుకున్నావు?’ అని ప్రశ్నించాడు రాజు.
‘ప్రభూ! రెండు ఎద్దులు వుంటే గాని కాడి నడవదని తమకు తెలిసిందే. ఒక ఎద్దు అకాల మృత్యు వాత పడి చనిపోయింది. ఒక ఎద్దుతో వ్యవసాయం చేయలేను. మరొక ఎద్దు కొనే స్తోమత లేదు. పాలెగాళ్ల దగ్గరో, షావుకారు దగ్గరో ధనం అప్పు తీసుకుంటే అధిక వడ్డీలు కట్టలేను. నా జీవితంలో అప్పు తీరదు. అందుకని ఉన్న ఎద్దును తమకు దానం ఇచ్చి, విజయనగరంలో కూలినాలి చేసుకుని బతకాలని నిర్ణయించుకున్నాను’ చెప్పాడు వీరయ్య.
పల్లెటూళ్లల్లో పాలెగాళ్లు, ధనవంతులు రైతులకు అధిక వడ్డీకి డబ్బులిచ్చి పీడిస్తున్న సంగతి పరోక్షంగా తనకు సూరయ్య చెప్పదలచుకున్నట్టు రాజుకి అర్థమైంది.
‘సూరయ్యా! రైతు కూలీగా మారడం నేను సహించను. రైతులకు కావలసిన ఎద్దులు, నాగళ్లు వంటివి ఉచితంగా అందజేయాలని ఉత్తర్వులు ఇస్తున్నాను. దీనిని పర్యవేక్షించడానికి వ్యవసాయ శాఖకు ప్రత్యేకంగా మంత్రిని నియమిస్తున్నాను’ అన్నాడు రాజు.
సూరయ్యతో సహా సభికులంతా కరతాళ ధ్వనులతో హర్షధ్వానాలతో రాజుని మెచ్చుకున్నారు.

-వాణిశ్రీ 8309860837