S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

చారిత్రక దర్పణం వలి‘కొండ’

నేటి శిథిల దేవాలయాలు, కోటలు, శిల్పాలు గత చరిత్రకు దర్పణాలు ఆనడానికి, మతసామరస్యానికి నిదర్శనం అన్నట్లుగా నిలుస్తోంది యాదాద్రి భువనగిరి జిల్లాలోని మండల కేంద్రంలోని వలిగొండ వలిబాష గుట్ట. ఏటవాలుగా పెద్దపెద్ద బండరాళ్లతో దట్టమైన చెట్లపొదలతో కనిపించే వలిబాష గుట్ట చారిత్రక నేపథ్యంలోకి తొంగిచూస్తే హిందూ, మహ్మదీయ రాజరికపు పాలన కాలం చారిత్రక విశేషాలు నేటికి దర్శనమివ్వడం విశేషం. పట్టణానికి ఉత్తరం వైపున మూసీ నదికి ఆనుకొని ఒకవైపు నిటారుగా, మరోవైపు నుండి ఏటవాలుగా కనిపిస్తుంది. గుట్టపైకి వెళ్లాలంటే మానవ నిర్మితమైన శిథిల మెట్ల ద్వారా వెళ్లాల్సి ఉంటుంది. గుట్టపైన కోనేరు వద్ద బండపై వృత్తాకారంలో చెక్కబడిన దేవుడి పాదాలు ఉండగా వీటిని హిందువులు శివుడివిగా, ముస్లీములు వలిబాషగా పిలిచే తమ దైవానివిగా భావిస్తూ పూజిస్తారు. ఈ పాదాల ప్రక్కనే ప్రాచీన తెనుగు బాషలో చెక్కిన శాసనం కనిపిస్తుండగా, కోనేరులో నీరు అన్ని కాలాల్లో ఉండడం దైవ మహిమగా భావిస్తారు. కోనేరుకు పైభాగంలో మట్టి దిబ్బ వంటి ప్రదేశంలో అద్భుత కళానైపుణ్యంతో శిథిలమైన శిలా మంటపం మధ్యలో హిందూ దేవాలయాల శిల్పాకళ ఆకారంతో కూడిన పైకప్పు కనిపిస్తుండగా, శిథిల మండపానికి సమీపంలో నల్లసరం శిలతో చెక్కిన భారీ శివలింగం గుప్తనిధుల కోసం తవ్విన తవ్వకాల్లో బయలుపడడం జరిగింది. మరికొంత దూరంలో కొండపైన చివరి భాగంలోని రెండు భారీ రాతిగుండ్ల మధ్యలో వలిబాష దేవుడు కొలువుతీరిన స్థలం కనిపిస్తుంది. ప్రతి శుక్రవారం రాత్రి వలిబాషకు దీపం వెలిగిస్తుండడం ఆనవాయితీగా వస్తుండగా ఈ దీపం పట్టణ ప్రజలకు రాత్రివేళ ‘మకరజ్యోతి’ వలె కనిపిస్తుంది. ఇక ఈ గుట్టకు ఉన్న భారీ గుహలు పూర్తిగా చీకటితో, గబ్బిలాల వాసనతో ఉండడంతో నేటికి గుహల ఆద్యంతాలను ఎవరూ చూసిన దాఖలాలు లేవు. గుట్టకు తూర్పు భాగంలో శివాలయం ఉన్న ప్రాంతంలో హనుమాన్ విగ్రహం కనిపిస్తుండగా పట్టణానికి నాలుగువైపుల హనుమాన్ విగ్రహాలు ఉండడం విశేషం. వలిగొండ ప్రాంతం, వలిబాష గుట్ట చారిత్రక విశేషాలు ప్రసిద్ద చరిత్రకారుడు బిఎన్‌శాస్ర్తీ చారిత్రక పరిశోధనల్లో కనిపిస్తాయి. మూసీ నది పరీవాహక ప్రాంతంలోని ఈ మండలం ప్రాచీన చరిత్రలో ప్రస్తావించిన క్రీ.పూ.179-161 ప్రాంతంలోని మూషిక నగరంగా భావిస్తుండగా, వౌర్యులు, శాతవాహనులు, ఇక్ష్వాకులు, పల్లవుల పాలనలో వలిగొండ ప్రాంతం విలసిల్లినట్లుగా చరిత్రకారుల భావన కాగా, పాతరాతియుగం, కొత్తరాతియుగం, లోహయుగం పనిముట్లు, శిస్తు పద్దతిలో నిర్మించిన పాతరాతి యుగం సమాధులు వలిగొండ మూసీ నది వెంట నేటికి కనిపిస్తూ నదిలోయ నాగరికతకు నిదర్శనంగా కనిపిస్తుంది. విష్ణుకుండినిలు పాలనలో మొదటి గోవిందవర్మ(కీ.శ.398-435) కాలం నాటికి సంబంధించిన ఇంద్రపాలనగరం తామ్రశాసనం, విక్రమేంధ్రభట్టారక వర్మ(కీ.శ.476-554) నాటి ఇంద్రపాలనగరం తామ్రశాసనం, సదర్శాపూర్ కాకతీయుల శాసనంలో, కళ్యాణీ చాళుక్యుల బొల్లేపల్లి శాసనంలో వలిగొండ పట్టణ ప్రాంత చారిత్రక ప్రస్తావనలు ఉన్నాయి. విష్ణుకుండినిల పిదప బాదమీ చాళుక్యులు, రాష్ట్ర కూటులు, కళ్యాణీ చాళుక్యులు, కందూరి చోడులు, కాకతీయులు, ముసునూరి, రేచర్ల పద్మనాయక వంశీయులు, బహమనీ, కుతబ్షాహీ, మొఘల్, ఆసఫ్‌జాహీ వంశీయుల ఏలుబడిలో వలిగొండ పరిసర ప్రాంతం విరాజిల్లినట్లుగా జిల్లా చారిత్రక ఆధారాలు వెల్లడిస్తున్నాయి. విష్ణుకుండినిల ఆరాధ్యదైవం శ్రీపర్వతస్వామి(శ్రీశైలం మల్లికార్జునస్వామి) కావడంతో వారికాలంలో గుట్టపైన శివాలయం నిర్మించినట్లు తెలుస్తుంది. తదనంతర కాలంలో వలిగొండ గుట్టపైన శివాలయం ధ్వంసమై అద్భుతమైన శైవక్షేత్రం కనుమరుగైనట్లు కనిపిస్తుంది. వలిగొండ గుట్టపైన ఉన్న వలిబాషను వివిధ పండగల సందర్భంగా అటు హిందువులు, ఇటు ముస్లీంలు పూజిస్తుండడంతో ఈ గుట్ట మతసామరస్యానికి చిహ్నంగా విలసిల్లుతుంది.

-వై.సత్యనారాయణరెడ్డి 98484 33565