మనసున మనసై..
Published Sunday, 10 February 2019ప్రేమ.. రెండు హృదయాల కలయిక..
ఇద్దరు మనుషులు ఏకం కావటం..
ఇద్దరి ఆలోచనలు ఒక్కటి కావటం..
ఒకరి ఆలోచనల్ని మరొకరు గౌరవించటం..
ఆదరించటం.. మన్నించటం..
*
ఇలా ప్రేమను వర్ణించటం తేలికే గానీ- దాన్ని నిలుపుకోవడం కష్టం.. ఒకరిపై ఒకరికి ప్రేమ ఎందుకు పుడుతుందో చెప్పటం కష్టం.. ‘ప్రేమ సహజమైందని, స్వార్థం లేనిదని, ప్రతిఫలాన్ని ఆశించదని, యాదృచ్ఛికమైంది’ అని చెప్పారు దేవులపల్లి కృష్ణశాస్ర్తీ. ప్రేమ అనే రెండక్షరాలకు సంతోషం, ఇష్టం, స్నేహం, చెలిమి అనే అర్థాలున్నాయి. ప్రేమ ప్రాథమికంగా ప్రకృతి, పురుషులకు సంబంధించినది. పురుషుడు ఒక స్ర్తిని ఇష్టపడతాడు. కానీ స్ర్తి.. పురుషునితో స్నేహం చేయాలనుకుంటుంది. కారణం మనసు.. మనసు దేన్ని కోరుకుంటుందో దానిపైనే ఇష్టం కలుగుతుంది. దాని సాన్నిహిత్యంలోనే సంతోషం కలుగుతుంది. దానికోసమే అర్రులు చాస్తుంది.
నేటి పాశ్చాత్య సంస్కృతిలో సాన్నిహిత్యం ఏర్పడటం, అంతర్జాతీయంగా సాంకేతిక సమాచార వ్యవస్థ అందుబాటులోకి రావడం, గ్లోబలైజేషన్ మొదలైన కారణాల వల్ల మనదేశంలో కూడా ఏటా ఫిబ్రవరి 14న ‘ప్రేమికుల దినోత్సవా’న్ని ఆర్భాటంగా జరుపుకుంటున్నారు. ప్రేమికులు ఒక్కరోజును ప్రేమకు గుర్తుగా జరుపుకుంటే సరిపోతుందా? ఆ రోజు మాత్రమే సంతోషంగా గడిపితే వాళ్లు ప్రేమమూర్తులై పోతారా? ఎక్కువ డబ్బులు ఖర్చుపెట్టి డైమండ్ ఉంగరాల్లాంటి కానుకలిస్తేనే ప్రేమ ఉన్నట్లా? ఇలాంటి ప్రశ్నలు ప్రతి ఒక్కరిలో.. ముఖ్యంగా ప్రేమను ప్రేమించేవాళ్లలో తలెత్తడం సహజం. ప్రేమను వెల్లడించడంలో తప్పులేదు. అయితే ప్రేమ కేవలం ఎదుటివారు ఇచ్చే కానుకల విలువను బట్టి ఉంటుందనుకోవడం మాత్రం భ్రమే.. ప్రేమ అంటే ఎలాంటి స్వార్థమూ లేకుండా ఎదుటివారిని ఇష్టపడటం.. అలాగే ఎదుటివారు ఇష్టపడేట్లు మనం ప్రవర్తించడం.. ప్రేమ స్వార్థాన్ని త్యజించాలి. సేవాభావాన్ని పెంపొందించుకోవాలి. త్యాగానికి సిద్ధపడాలి.
భౌతికంగా శివుడు, పార్వతీమాత అర్ధనారీశ్వరులు. ఆధ్యాత్మికంగా అసలైన అర్ధనారీశ్వరుడు శ్రీకృష్ణుడు. రాధాకృష్ణులు అనే పదం అవిభాజ్య పదం.. జంట.. రాధ అనే పదం ఉంటే కృష్ణుడు ఉన్నట్లే.. కృష్ణునికి అష్ట్భార్యలు, 16 వేల మంది గోపికలున్నా రాధ మాత్రమే ప్రేమ సామ్రాజ్ఞి.. ఫిబ్రవరి 14న ప్రపంచమంతా ప్రేమికుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నది. ఇది ఎప్పటినుంచి మొదలైందో తెలీదుకానీ కృష్ణ ప్రేమతత్త్వం మాత్రం ద్వాపరయుగం నాటిది. ప్రేమికులు శాశ్వతంగా అలాగే మిగిలిపోతారో, ఐక్యమవుతారో తెలీదు. ప్రేమించి కలిసిపోవడం ఒక అంశం. పెళ్లి చేసుకొని ప్రేమను అజరామరంగా సాగించడం అదృష్టం. రాధాకృష్ణుల ప్రేమ అజరామరం.. అమలినం.. వారిరువురి బంధం మనసుకే పరిమితం.. కృష్ణుడు రాధ ప్రేమతత్త్వం అయితే.. కృష్ణుని యొక్క సర్వగతచైతన్యం రాధ.. రాధాకృష్ణుల రాసలీలలు మోక్షానికి ఉద్దేశించినవే.. ఆమె హృదయ స్పందనలోనూ నందబాలుడే గోచరమవుతాడు.. విరహం వేధిస్తున్నా రాధమ్మ కృష్ణుడ్ని బాధించదు.. ఆమెకు తెలుసు, కన్నయ్య తనకే కాక, ఈ సర్వ జగత్తుకూ నాథుడని, జగన్నాథుడని.. ఒకరిలో ఒకరు లీనమైన ఆ జంటకు విరహమనేదే లేదు.. ఎందుకంటే.. వారిరువురిదీ ఒకటే తత్త్వం.. ఏకత్వం.. కృష్ణుని స్మృతుల్లో రాధకు మనసు పులకాంకితమైతే, రాధను తలచుకున్న వెన్నదొంగకు మేను రోమాంచితమవుతుంది.. పొన్నలు నిండిన బృందావనం, వెనె్నల రాత్రులు, మురళీనాదం, యమునాతీరం.. వారి నిర్మలమైన ప్రేమకు సాక్ష్యాలు.. కృష్ణుడిని యశోదా తనయునిగా, రేపల్లె ముద్దుబిడ్డగా, పాండవోద్ధారకునిగా, రాయబారిగా, అర్జునుడి మార్గదర్శకునిగా, రథసారథిగా, మహామహిమాన్వితమైన గీతోపదేశకునిగా.. ఎన్ని తీరుల్లో మనం ఆరాధించినా కృష్ణప్రేమ అనగానే మనకు గుర్తొచ్చే ప్రేమిక ‘రాధ’. వారి ప్రేమతత్త్వం జగతికి ఆదర్శం.. తరతరాలకు మరువలేని కావ్యం..
‘ప్రేమ’ అంటే రాధ..
ప్రేమ అన్న పదాన్ని నిర్వచించమని ఎవరైనా అడిగితే జవాబుగా ‘రాధ’ అన్న ఒకే ఒక్క పదాన్ని మాత్రమే చెబుతారు. ప్రేమకు దీనిని మించిన నిర్వచనం ప్రపంచంలోనే మరోటి లేదు. ప్రేమంటేనే రాధ. రాధంటేనే ప్రేమ. అప్పటికీ ఇప్పటికీ ఈ విశ్వంలో ప్రేమ అంటే తెలిసిన ఒకే ఒక్క స్ర్తిమూర్తి రాధ. ఇంకెవ్వరికీ ప్రేమంటే తెలియదు. తెలుసని భ్రమిస్తారు అంతే.. లోకంలో ఉన్నవి కామమూ, స్వార్థమూ మాత్రమే.. ప్రేమనేది ఈ లోకంలో లేనేలేదు. లోకులెవ్వరికీ ప్రేమ అనేది తెలియనే తెలియదు. తెలుసనుకుంటే అది పిచ్చి భ్రమ మాత్రమే.. కొంతమంది స్నేహాన్ని ప్రేమనుకుంటారు. కొందరు కోరికను ప్రేమనుకుంటారు. మరికొందరు అభిమానాన్ని ప్రేమనుకుంటారు. ఇంకొందరు మోహాన్ని ప్రేమగా భ్రమిస్తారు. అవసరాన్ని ప్రేమనుకునేవారు ఎందరో ఉంటారు. ఎక్కువమంది మాత్రం కామాన్ని ప్రేమగా భావించి మోసపోతారు. నిజానికి వీటన్నింటి వెనుకా ఉండేది మాత్రం స్వార్థమే.. లోకంలో ఉన్న ఈ ప్రేమలన్నీ స్వార్థంతో నిండినవే. ‘బృహదారణ్యక ఉపనిషత్తు’లో యాజ్ఞవల్క్య మహర్షి ఇదే మాటలను తన భార్య అయిన మైత్రేయితో చెబుతాడు. మైత్రేయి సామాన్య వనిత కాదు. మహా పండితురాలు. బ్రహ్మవాదిని. ఆమెతో యాజ్ఞవల్క్యుడు ఈ సత్యాన్ని చెబుతాడు.
‘లోకంలో భర్తను ప్రేమించేది.. భర్తకోసం కాదు.. ఆత్మ కోసమే.. భార్యని ప్రేమించేది భార్య కోసం కాదు.. ఆత్మ కోసమే.. సంతానాన్ని ప్రేమించేది కూడా ఆత్మ కోసమే..’ అని ఆయన తన భార్యకు ఆత్మ తత్త్వాన్ని ఉపదేశిస్తాడు. ఈ సంభాషణకు లోతైన వేదాంతార్థాలున్నాయి. దీన్ని అలా ఉంచితే సామాన్యార్థంలో చూసినా కూడా ‘ఎవరు దేన్ని ప్రేమించినా తన సుఖం కోసమే ఆ పనిచేస్తారు కానీ ఎదుటివారి సుఖం కోసం కాదు. వ్యకె్తైనా, వస్తువైనా తనకు ఇచ్చే సుఖాన్ని బట్టి ఆ వ్యక్తి అన్నా, వస్తువన్నా తాత్కాలికంగా ఇష్టం కలుగుతుంది. కనుక ప్రతి మనిషీ నిజానికి తన సుఖానే్న తాను ప్రేమిస్తున్నాడు కానీ ఇతరులను కాదు. మనకు నచ్చని చేదు నిజాల్లో ఇదో చేదు నిజం. అందుకే అవసరం ఉన్నంత వరకే
మనుషుల మధ్య సోకాల్డ్ ‘ప్రేమ’ అనేది ఉంటుంది. అవసరం తీరిన తర్వాత ఉన్నట్టుండి మాయం అవుతుంది. ఇది నిజమైన ప్రేమ కాదు. అసలు ఇది ప్రేమే కాదు. ఇది అవసరార్థ ఏర్పాటు మాత్రమే. దీన్ని మానవులు ప్రేమగా భ్రమిస్తారు.
ప్రపంచంలో నడుస్తున్న సంసారాలు, కాపురాలు అన్నీ ‘అవసరం’ అన్నదానిపైనే నడుస్తున్నాయి కానీ ‘ప్రేమ’ అనే దానిపై ఆధారపడి కాదు. కానీ మీరు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా సత్యం మారదు. రాధ ప్రేమ మాత్రం ఇలాంటిది కాదు. స్వార్థాన్ని దాటిన ప్రేమ ఆమె సొంతం. నిజానికి స్వార్థాన్ని దాటినదే నిజమైన ప్రేమ అవుతుంది. ఆనందాన్ని ఆశించే ప్రేమ ఆమెది కాదు. ప్రియతముని ఆనందాన్ని మాత్రమే ఆశించిన ప్రేమ ఆమె సొంతం. తన ఆత్మనే అర్పించగలిగిన ప్రేమ ఆమెది. రాధ ప్రేమస్థాయిని మానవ మాత్రులు ఎన్నటికీ అర్థం చేసుకోలేరు. సంపూర్ణ స్వార్థరహిత స్థితిని అందుకున్నవారే ఆ ప్రేమను అర్థం చేసుకోగలరు. తనను తాను సంపూర్ణంగా అర్పించి తానే పూర్తిగా అదృశ్యం కాగలిగిన వారికే ఆ ప్రేమ అందుతుంది. దేవతలకి కూడా అందని ఈ స్థితి ఆమె సొంతం. ఎందుకంటే దేవతలు కూడా ఆత్మార్పణ చేసి శూన్యులుగా మారడానికి భయపడతారు. కానీ రాధ ఆ భయాన్ని కూడా అధిగమించింది. అంతటి పరమోత్కృష్ట ప్రేమోన్మత్త స్థితి ఆమెది. అందుకే ఆ ప్రేమ ఆమెను రసరాణిని చేసింది. సర్వదేవతా శిరోమణిని చేసింది. సకలలోక సామ్రాజ్ఞిని చేసింది. మహత్తర ప్రేమస్వరూపిణిగా భక్తబృంద పెన్నిధిగా ఆమె ప్రతినిత్యం విరాజిల్లుతోంది. తన స్థితిని చూసి లోకులు ఏమనుకుంటారో అన్న భయం ఆమె నుంచి దూరమైంది. ఈ బంధాన్ని సమాజం హర్షించదేమో అన్న శంక ఆమె మదిలో లేశమాత్రం కూడా తలెత్తలేదు. తన ప్రియతముని ముందు సమస్త ప్రపంచమూ ఆమెకు తృణప్రాయంగా కనిపించింది. రాధ మనస్సులో కృష్ణుడు తప్ప ఇతర చింత లేనేలేదు. పగలూ రాత్రీ తన ప్రియతముని ధాన్యంలో ఆమె మునిగి ఉండేది. తన వ్యక్తిత్వం ఆ క్రమంలో ఎలా అదృశ్యం అయిందో ఆమెకే తెలీదు. లోకులకు అత్యంత ప్రియమైన దేహం కూడా ఆమె స్మృతిలోంచి తప్పుకుంది. ఎల్లప్పుడూ కృష్ణుని ధ్యాసలో ఆమె పరవశించేది. ‘తాను రాధను’ అన్న స్పృహ కూడా ఆమెను వదిలి వెళ్లిపోయింది. ఈ ప్రేమధ్యానంలో పడి సమస్త లోకబంధాలకూ ఆమె అతి సులువుగా అతీతురాలైంది. తన ఆత్మనే కృష్ణునికి నైవేద్యం పెట్టింది. తను వేరు, కృష్ణుడు వేరు అన్న భావనకు అతీతురాలైంది. అంతగా తన వ్యక్తిత్వాన్ని ఆమె కృష్ణునిలో లయం చెయ్యగలిగింది. అలా ఆమె తన ప్రేమతో దేవాధిదేవుడైన కృష్ణుని బందీని చేసింది. కృష్ణుడు నిరంతరమూ రాధానామాన్ని జపిస్తూ ఉంటాడని, రాధనే నిరంతరమూ ధ్యానిస్తూ ఉంటాడని పురాణాలు చెబుతాయి. అంతగా అతడు రాధకు దాసుడయ్యాడు. యోగేశ్వరుడైన కృష్ణుడు రాధాదాసుడా? కృష్ణుడు నిరంతరమూ రాధికను ధ్యానిస్తాడా? ఇదెలా సంభవం? ప్రేమతో సమస్తమూ సాధ్యమే.. సమస్తమూ సంభవమే.. ప్రేమకు కట్టుబడినట్లు భగవానుడూ దేనికీ కట్టుబడడు. శ్రీకృష్ణుడి ప్రేమ గురించి జయదేవుడు ఇలా రాశాడు..
‘ప్రియే చారుశీలే-స్మర గరళ ఖండనం మమ
శిరసి మండనం దేహి పద పల్లవ ముదారం’
తన తలపై రాధ చిగురుటాకుల వంటి మెత్తనైన పాదాలను ఉంచమని శ్రీకృష్ణుడు ప్రాధేయపడినట్లు రాశాడు జయదేవుడు. తరువాత అతను ఇదేమిటి ఇలా రాశానని బాధపడుతూ రాసినదాన్ని తీసేశాడు. పాపపరిహారం కోసం జయదేవుడు అభ్యంగన స్నానం చేసి వచ్చేటప్పటికి, తాను ఇంతకు ముందు రాసిన పదాలే తిరిగి రాసి ఉండటం, జయదేవుని రూపంలో శ్రీకృష్ణుడు వచ్చి ఆ పదాలే రాసి భోజనం కూడా చేసి వెళ్ళటం, భార్య ద్వారా తెలుసుకున్న జయదేవుడు ఆనందభరితుడై శ్రీకృష్ణుడే స్వయంగా రాసిన పాదాలు కనుక వాటిని అలాగే ఉంచాడు. శ్రీకృష్ణుడు వశం అయ్యేది భక్తికే.. ఈ విషయం శ్రీ నారద మహర్షి తన భక్తి సూత్రాల్లో చాలా విపులంగా చెప్పాడు. భక్తుల పాదధూళి కూడా శిరసున ఉంచుకుని ఆనందించే ప్రేమస్వరూపుడు శ్రీకృష్ణుడు. ఈ సందర్భానికి సంబంధించిన చిన్న కథ..
ఒకసారి శ్రీకృష్ణుడు తీవ్రమైన శిరోభారంతో బాధపడుతున్నాడట. ఆ సమయానికి నారద మహర్షి వచ్చాడట. శ్రీకృష్ణుని శిరోభారం గురించి తెలుసుకుని వైద్యులను పిలిపిద్దామన్నాడట. అప్పుడు శ్రీకృష్ణుడు ఈ శిరోభారం వైద్యం వల్ల తగ్గదు. భక్తుల పాదధూళిని తలకు రాస్తే కానీ తగ్గదని అన్నాడట. నారదుడు వెళ్లి శ్రీకృష్ణుని భార్యలైన రుక్మిణి, సత్యభామలను అడుగుతాడు. కానీ మా భర్తకు పాదధూళా? అంటూ ఇవ్వరు. గోపికలను అడుగుతాడు. వారు వెనుకంజ వేస్తారు. తరువాత విషయం తెలుసుకున్న వారు కొద్దిగా పాదధూళిని ఉద్ధవుడికి ఇస్తారు. ఉద్ధవుడు ఆ ధూళిని శ్రీకృష్ణునికి ఇస్తాడు. ఆ ధూళిని శిరసున రాసుకున్న శ్రీకృష్ణుడికి వెంటనే శిరోభారం మటుమాయమయ్యిందట. ఈ భక్తినే ‘పరమ ప్రేమ’ అంటారని నారదుడు తన భక్తిసూత్రాల్లో వెల్లడించాడు.
యస్యా రేణుం పాదమోర్విశ్వ భర్తా,
ధరతిమూర్ధ్ని సరసిప్రేమ యుక్తః
రాసక్రీడ సమయంలో శ్రీకృష్ణుడు రాధాదేవి పాదధూళిని శిరసున ధరించి తనను తాను మరిచి ఆనందంగా ఉండేవాడు. శ్రీకృష్ణుడు ధ్యానించేది రాధనే! అలా శ్రీకృషుని అవతల రాధ ఉన్నది. రాధకు అవతల మాత్రం మరెవ్వరూ లేదు. ఇదీ రాధ ప్రేమ గాధ!
సీతయాశ్చరితం
చంద్రుడు లేనిదే ‘చంద్రిక’ అంటే వెనె్నల లేదు. వాక్కు లేనిదే అర్థము లేదు. రాముడు లేనిదే సీత లేదు. రాముడు సీతతో కలిసి నడిచినదే రామాయణం. రామునితో కలిసి తిరిగిన సీతాగమనమే సీతయాః చరితం అవుతుంది. స్ర్తి పురుష యోగమే శక్తి. స్ర్తి శక్తి విరహిత పురుషుడు పరిపూర్ణుడు కాలేడు. నిస్తేజుడవుతాడు, నిర్వీర్యుడవుతాడు. పురుష యోగము లేని స్ర్తిమూర్తి పరిపూర్ణత పొందలేదు. విరాగినిగా ఉండిపోతుంది లేదా క్షుద్రరూపిణిగా మారుతుంది. అందుకే మాతృత్వం పరిపూర్ణతకు ప్రతీక. అంబ, అమ్మ, తల్లి, జనని, మాత .. ఇవన్నీ పరదేవతను మనం ఆర్తిగా ఆరాధించే పేర్లు. ప్రేమగా పిలుచుకునే పేర్లు.. అందుకే మహాకవి కాళిదాసు..
‘వాగర్థా వివ సంపృక్తౌ వాగర్థః ప్రతిపత్తయే
జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ॥
వాక్కు, అర్థముల వలె కలిసిన ఆది దంపతులు ఈ లోకానికే తల్లిదండ్రులు. దంపతులకున్న గౌరవం మన సంస్కృతిలో ఒంటరి జీవికి లేదు. మన భారతీయసంస్కృతి దంపతుల పూజకు ఉన్నత స్థానాన్ని కల్పించింది. భర్త చాటు భార్య అనడం తప్పు. భర్తకు తగ్గ భార్యగా ఉండాలి. ప్రకృతి పురుషుల కలయికే శక్తి. అష్టాదశ పురాణాల్లోనూ వ్యాసభగవానుడు స్థాపించింది.. అదే వాల్మీకి చెప్పింది. భార్యలేని భర్తకు పరిపూర్ణత లేదు. భర్త లేని భార్యకు చరిత లేదు. గౌరీశంకరులు, సీతారాములు, లక్ష్మీనారాయణులు అన్యోన్య దాంపత్యానికి ప్రతీకలు. స్ర్తి, పురుషుల్లో ఎక్కువ, తక్కువల ప్రసక్తే లేదు. వీరిరువురి కలయికే జీవితం. కలిసి జీవించడమే మన కావ్యాలు మనకిచ్చే సందేశం. అందుకే సీతాయనం కాదు సీతాయాశ్చరితం మహత్..
ఎన్ని ఇడుముల నెదుర్కొన్నా ‘్భర్తా హి మమదైవతం’ అని ప్రకటించిన నిశ్చల నిర్మల హృదయ సీత. లోకం కోసం అగ్నిప్రవేశం చేయించినా, అరణ్యంలో వదిలేసినా, ఓర్పుతో సహనంతో భర్త గౌరవాన్ని కాపాడి రామచంద్రుని లోకారాధ్యునిగా నిలిపిన ఉత్తమ ఇల్లాలు. రాముడు లోకం కోసం ప్రవర్తించినా ‘నేదానీం త్వదృతే సీతే స్వర్గోపి మమరోచతే’.. నీవు లేక స్వర్గమును కూడా అంగీకరించనన్న మధురభావన భర్తలో కల్పించిన మహాసాథ్వి. ‘త్వద్వియోగేన మేరామత్యక్తవ్యమిహ జీవితమ్’ అన్న పలుకులు రామవియోగాన్ని సహింపలేక మరణిస్తాననంటున్న సీతవి. వారి వైవాహిక ప్రణయం జగదారాధ్యం కావడానికి ప్రధాన కారణం వారిలోని ఆరాధనా భావం, ప్రేమతత్త్వమే.. అది వాల్మీకి అపూర్వ పాత్ర చిత్ర కల్పనా చాతుర్యం.
ధర్మప్రేమకు పరాకాష్ట యెంకి
పూలతో యెంకినే
పూజింప బోతి
యెంకి నిలువున మెరిసె
యెవ్వరో రాణి
పూలు, పూజ, మెరుపు అన్నీ నాయుడుబావకు యెంకి ద్వారానే.. ఈ నాలుగు పాదాల్లో ప్రేమ పరంగా లేనిదేమన్నా వున్నదా? ఇదే ప్రేమతత్త్వం. ఆధ్యాత్మికంగా స్థారుూ భావం చేరుకొన్నప్పుడు యివన్నీ ఒకటైనప్పుడు వేరే జ్ఞానమున్నదా? ‘నేను-తాను’ ప్రకృతీ పురుషుల అంతర్ ప్రవాహము. తనువు తపసుగా, మనసు మంతనముగా, బతుకు పాటగా, పాట యెంకి పల్లదనముగా, నిద్ర అంతా ‘నారాజు’ నీడగా, కలలో కూడా యెంకి కిలకిలలుగా, జగమంత నాయుడుబావ సొగసుగా, అద్దంలో కూడా యెంకితో ‘విద్దెములు’గా పాట పాడుకుంటారు. ‘సరాగాలు’లోని రాగాలు ప్రేమ జగత్తుని అనేక రూపాలుగా, అనేక భావనలుగా గానం చేస్తాయి. అద్వైతం, విశిష్టాద్వైతం, ద్వైతం శృంగార-ప్రణయక్షేత్రంలో పరస్పరం దోబూచులాడుకుంటాయి. ‘రాకపోకలు’లో తమ అరమరికలు లేని జీవితాన్ని, అన్యోన్యతను ఎంకి, నాయుడు బావలు సహజంగా, శ్రావ్యంగా నేల నుంచి నింగి వరకు ఆలపిస్తారు. స్వప్నం-స్వర్గం అన్నింట్లోనూ వాళ్లు ఇద్దరు కాదు. ఒక్కరే.. ఇక్కడ శృంగారరసం, ప్రేమతత్త్వం అద్వైత స్థాయికి చేరుకుంటాయి.
గోదాదేవి ప్రేమ
విష్ణు అవతారానికి చెందిన రంగనాథుణ్ణి రాధలా ప్రేమించి, స్వామి ప్రేమను గెలిచి ఎట్టకేలకు ఆయనలో విలీనమైన గోదాదేవి వృత్తాంతం కూడా తక్కువైనదేమీ కాదు. ఆమె అలౌకిక ప్రేమలోని స్వచ్ఛత, నిజాయితీ, మాధుర్యం అంత క్రితం ద్వాపర యుగానికి చెందిన శ్రీకృష్ణుని పట్ల రాధ ప్రదర్శించిన ప్రేమను తలపించేవే తప్ప మరోటి కాదు. మానవ స్ర్తిలు దేవుళ్లనే భర్తలుగా భావించి కొలవడం ఒకింత సంక్లిష్టంగా కనిపించినా అవి వారి అమలిన హృదయానికి నిదర్శనమనే చెప్పాలి. రంగనాథునికే గోదాదేవి తనను తాను సమర్పించుకోవడమూ ఇలాంటిదే.. రంగనాథుడంటే ఎవరో కాదు, గత జన్మలో శ్రీకృష్ణుడు. గోదాదేవి ఎవరో కాదు.. పూర్వజన్మలో సత్యభామ. గోదాదేవి, రంగనాథుని పట్ల తాను ప్రదర్శించిన ప్రేమ పారవశ్యం, ఇరువురి నడుమ నడిచిన దివ్యప్రేమ బంధం, చివరికి ఆమె స్వామిలో విలీనం కావడం వంటివన్నీ ఆమెలోని ప్రేమతత్త్వాన్ని తెలియజేస్తాయి.
లోక కల్యాణం కోసమైతేనేం, మనకు స్ఫూర్తినివ్వడానికి అయితేనేం.. ఏటా మనం దేవతల పెళ్లిళ్లు జరుపుకోవడం ఆనవాయితీ.. లౌకికమైనా, అలౌకికమైనా ప్రేమ ప్రేమే.. అది ఎంత అజరామరమో అంత అద్భుతం.. మనుషులకైనా, దేవుళ్లకైనా పెళ్లికి కల్మషం లేని ప్రేమ తప్పనిసరి. ప్రేమికులు పెళ్లితో కలవడమన్నది వారి పూర్వజన్మ సుకృతమేనన్న ప్రగాఢ భావనలో నిజం లేకపోలేదు. దీన్ని నిరూపించే ప్రేమకథలూ అనేకం. గత జన్మలో ప్రేమించుకుని ఒక్కటి కాలేకపోయిన వారే ఈ జన్మలో పరస్పరం ఇష్టపడి ఒక్కటవుతారన్న దానిని నిరూపించే సంఘటనలు పౌరాణికంగానూ అనేకం కనిపిస్తాయి. ఈ లెక్కన ప్రేమ పెళ్లిళ్లు నిన్న మొన్నటివి కాదు.. యుగయుగాల నాడే ఆవిర్భవించాయన్నది స్పష్టం. ప్రేమ మనిషిని మంచి మార్గంలో నడిపించే సాధనం కావాలి. కష్టాల కడలిలో చిక్కుకొన్న సముద్ర ప్రయాణికునికి ప్రేమ దిక్సూచి కావాలి. మనిషి తన సగటు జీవితంలో గొప్ప గొప్ప పనులేమీ చెయ్యలేడు.. కానీ చిన్న చిన్న పనులే గొప్ప ప్రేమతో చెయ్యవచ్చు. ప్రేమించడం తెలిస్తే బతకటమూ తెలుస్తుంది. ప్రేమించి విఫలమవ్వటమూ మంచిదేనంటూ బసవరాజు అప్పారావు- ‘వలపెరుంగక బ్రతికి, కులికి మురిసేకంటే.. వలచి విఫలమ్మొంది విలపింపమేలురా’ అని చెప్పాడు. వలపులేని బ్రతుకు పనికిరాదంటూ బసవరాజు భావం. ప్రేమ వైఫల్యమూ ఒక మధుర అనుభవాన్ని ప్రసాదిస్తుందని కవిభావం.
ప్రేమించమని అర్థించటం, వేధించటం కంటే ఆత్మగౌరవ హీనత మరొకటి లేదు. ఎదుటివారు మనల్ని ఇష్టపడేట్లు మనం ప్రవర్తించాలి. మన ప్రవర్తన ఇతరులకు కష్టాన్ని కలిగించకూడదు. ఆదర్శంగా వుండాలి. మార్గదర్శకంగా ఉండాలి. ప్రేమికులు ఎప్పడూ పరస్పరం పోట్లాడుకోకూడదనే అనుకొంటారు. కానీ ఒక పోరాటం.. నిజమైన ప్రేమ ఎప్పుడూ ప్రశాంతంగా, సజావుగా కొనసాగదు.. నిజమైన ప్రేమలో తాత్కాలిక కలహాలు సహజం. ఇతరుల్ని ప్రేమించడం వల్ల మానవునికి నిరవధికానందం సిద్ధిస్తున్నది. మనం ఒకరికిచ్చే ప్రేమ మళ్లీ మనకు ప్రేమను ఇస్తుంది. ఒకరినొకరు ప్రేమించుకోవడం ఎంతో మహత్తరమైన కార్యం. ఈ భూమిపైకి స్వర్గం దిగివచ్చినంత పవిత్రమైన కార్యం. ప్రేమను తొలగిస్తే ఈ భూగోళం ఒక సమాధి అన్న ఓ మహానుభావుని సూక్తిని గుర్తుంచుకుని మనిషి ప్రతి ప్రాణిని ప్రేమించడం అలవాటు చేసుకోవాలి.
నిషేధం
ప్రేమికుల దినోత్సవం నాడు ప్రపంచం మొత్తం సంబరాల్లో మునిగిపోతూ ఆనందిస్తున్న విషయం తెలిసిందే.. అయితే, కొన్ని చోట్ల మాత్రం వేలంటైన్ డే వేడుకలపై నిషేధం విధించడం గమనార్హం. ఇరాన్, పాకిస్తాన్ తదితర దేశాల్లో ప్రేమికుల దినోత్సవం వేడుకలను నిషేధించారు. ఇరాన్‌లో ఎక్కడైనా వేలంటైన్ డే వేడుకలను జరిపితే నేరంగా పరిగణిస్తామని పేర్కొంటూ పోలీసులు.. రాజధాని టెహ్రాన్ నగరంలోని కాఫీ, ఐస్‌క్రీమ్ ట్రేడ్ యూనియన్‌కు నోటీసులు జారీ చేశారట. ఆయా షాపుల్లో చేరి వేలంటైన్స్ డే గిఫ్టులు ఇచ్చిపుచ్చుకోకుండా చూడాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారని తెలుస్తోంది. పాకిస్తాన్‌లో ఎవరూ వేలంటైన్స్ డే వేడుకలు జరుపుకోవద్దని, అది పాశ్చాత్య సంస్కృతి అనీ, ఇస్లాం మతానికి విరుద్ధమని అక్కడివారి అభిప్రాయం. పాశ్చాత్య సంస్కృతులను గుడ్డిగా అనుసరించడం వల్ల ఇస్లాం సంప్రదాయాలు పతనమైపోతాయని, మహిళలపై దాడులు సహా పలు సమస్యలకు విదేశీ సంస్కృతి కారణం అవుతోందని ఆయా దేశాల అధినేతలు అభిప్రాయపడుతున్నారు.
*
ఆసక్తికర అంశాలు
‘ప్రేమికుల దినోత్సవం’ అంటే యువ ప్రపంచానికి సంబరమే.. ఈ సందర్భంగా ప్రేమ గురించి కొన్ని ఆసక్తికర సంగతులు..
* రోమన్ ప్రేమదేవత వీనస్‌కు ఎర్రగులాబీలంటే ఎంతో ఇష్టం. ఆమె గుర్తుగా ఇచ్చే రోజాలు ప్రేమికుల ప్రధాన బహుమతిగా స్థిరపడిపోయాయి.
* క్రీ.పూ. 3500 సంవత్సరాల కిందట సుమేరియన్ల కాలంలో మట్టిపలకపై రాసిన ప్రేమ కవిత ఇప్పటివరకూ లభించిన వాటిలో అతి పురాతనమైనది.
* ఒక వ్యక్తిపై ప్రేమ పుట్టడానికి సెకనులో ఐదోవంతు మాత్రమే సమయం పడుతుందని సిరాకస్ విశ్వవిద్యాలయ పరిశోధన.
* ప్రేమికుల దినోత్సవం కోసం ప్రపంచ వ్యాప్తంగా సుమారు 20 కోట్ల గులాబీల అమ్మకాలు జరుగుతాయి. అందులో 73 శాతం అబ్బాయిలే కొంటున్నారు. ఆ సమయంలో అమ్ముడయ్యే బహుమతుల్లో 85 శాతం కొనేది అమ్మాయిలే..
* ఒక్క ‘వేలంటైన్స్ డే’ నాడే ప్రపంచం మొత్తంలో 20 కోట్ల గ్రీటింగుల దాకా ఇచ్చిపుచ్చుకుంటున్నారు. నూతన సంవత్సర వేడుక తర్వాత విశ్వవ్యాప్తంగా ఇలా శుభాకాంక్షలు తెలుపుకునే రెండో పండుగ ఇదే..
* ఏటా ఫిబ్రవరి 14న ప్రపంచవ్యాప్తంగా దాదాపు మూడున్నర కోట్ల ‘హృదయాకారపు’ చాక్లెట్ల డబ్బాలు అమ్ముడవుతాయి.
* మొట్టమొదటి ‘హృదయాకారపు’ వేలంటైన్స్ డే క్యాండీ బాక్స్‌ను రిచర్డ్ క్యాడ్బరీ 1868లో తయారుచేశారు.
* ఒక అధ్యయనం ప్రకారం పురుషులు ప్రేమలో పడేలోపు కనీసం ఏడుగురు మహిళల పట్ల బలంగా ఆకర్షితులవుతారట.
* ప్రతి నెలా 14వ తేదీన దక్షిణ కొరియాలో రొమాంటిక్ డేగా జరుపుకుంటారు. క్యాండిల్ డే, వేలంటైన్స్ డే, వైట్ డే, బ్లాక్ డే, రోజ్ డే, కిస్ డే.. ఇలా ఒక్కో నెలకీ ఒక్కో ప్రత్యేక నేపథ్యం ఉంటుంది.
* ప్రేమలో పడినప్పుడు పురుషులు మెదడులో చూపును నియంత్రించే భాగాల పనితీరు అసాధారణంగా పెరుగుతుంది. అమ్మాయిల్లో జ్ఞాపకశక్తికి సంబంధించిన భాగాల్లో స్పందనలు మెరుగవుతాయి.
* ప్రేమికులు ఒకరి కళ్లలోకి ఒకరు చూసుకుంటున్నప్పుడు వారిద్దరి హృదయ స్పందనలు ఒకేలా ఉంటాయి.
* ప్రేమికుల దినోత్సవం రోజు పెళ్లి ప్రతిపాదన చేసే లేదా వివాహాన్ని ఆశించే వ్యక్తుల సంఖ్య 60 లక్షలకు పైనేనట.