S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

19న మంత్రివర్గ విస్తరణ

హైదరాబాద్, ఫిబ్రవరి 15: ఎట్టకేలకు రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు ఈ నెల 19న ఉ. 11.30 గంటలకు ముహూర్తం ఖరారైంది. రాష్ట్ర ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు శుక్రవారం రాజ్‌భవన్‌లో గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్‌తో సమావేశమై మంత్రివర్గ విస్తరణ నిర్ణయాన్ని తెలిపారు. 19న మాఘ శుద్ధ పౌర్ణమి, ఉదయం 11.30 గంటలకు ప్రమాణ స్వీకారం చేయించాలని ఆయన గవర్నర్‌ను కోరారు. గవర్నర్ నరసింహన్‌తో ముఖ్యమంత్రి సమావేశం ముగిసిన అనంతరం ముఖ్యమంత్రి కార్యాలయం మంత్రివర్గ విస్తరణకు సంబంధించిన ప్రకటనను విడుదల చేసింది. మంత్రివర్గ విస్తరణకు అధికారులు చకచకా ఏర్పాట్లు చేస్తున్నారు. రాజ్యాంగ నియమం ప్రకారం మంత్రివర్గంలో 18 మందికి మించరాదు. ఇదివరకే ముఖ్యమంత్రి కేసీఆర్, హోంమంత్రి మహమూద్ అలీ ఉన్నందున, ఇంకా 16 మందికి మాత్రమే స్థానం కల్పించేందుకు అవకాశం ఉంది. ప్రస్తుతానికి 10 మందికి ఛాన్స్ దక్కే అవకాశం ఉందని తెలుస్తోంది. మిగతా ఆరుగురిని లోక్‌సభ ఎన్నికల తర్వాత తీసుకుంటారని పార్టీ వర్గాల అంచనా.
గత మంత్రివర్గంలో ఉన్న వారిలో ఈ దఫా నలుగురికే ఛాన్స్ లభించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. పాతవారిలో ఈటల రాజేందర్, టీ. హరీష్‌రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, జగదీశ్‌రెడ్డికి స్థానం దక్కనున్నది. హరీష్‌ను లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయిస్తారన్న ప్రచారం ఒకవైపు, అసలు మంత్రివర్గంలో స్థానం కల్పించకుండా పక్కన పెడతారన్న ప్రచారం మరోవైపు జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రచారానికి తెర దించేందుకు మంత్రివర్గంలో హరీష్‌కు స్థానం కల్పించాలని ముఖ్యమంత్రి భావిస్తున్నట్లు సమాచారం.
తన కుమారుడు కే. తారక రామారావును వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించినందున ఈ విస్తరణలో చోటు ఉండకపోవచ్చు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో కేటీఆర్ చురుగ్గా పాల్గొనేలా పూర్తిగా బాధ్యతలు అప్పగించాలని ముఖ్యమంత్రి భావిస్తున్నట్లు తెలిసింది. తనకు పూర్తిగా నమ్మకస్తులైన జగదీశ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు స్థానం కల్పించనున్నారు. అయితే నల్లగొండ నుంచి జగదీశ్ రెడ్డిని మంత్రివర్గంలో తీసుకోవాలా లేక ఆ జిల్లాకు చెందిన గుత్తా సుఖేందర్ రెడ్డిని తీసుకోవాలా? అనే విషయంలో ముఖ్యమంత్రి ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఇక గత మంత్రివర్గంలో ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించిన కడియం శ్రీహరికి స్థానం కల్పించే విషయంలో ఇంకా ఆయన నిర్ణయం తీసుకోలేదని సమాచారం. కడియం స్థానంలో అదే సామాజిక వర్గం నుంచి కొత్తగా కొప్పుల ఈశ్వర్‌కు స్థానం కల్పించాలనుకుంటున్నట్లు తెలిసింది.
సండ్ర సంగతేమిటీ?
ఎస్‌సీ నుంచి కడియం లేదా కొప్పులకు స్థానం కల్పించి, ఎస్‌టీ నుంచి కొత్తగా రెడ్యానాయక్‌కు స్థానం కల్పించనున్నారు. గత మంత్రివర్గంలో మహిళలకు స్థానం కల్పించలేదన్న విమర్శలు ఎదుర్కొన్నందున, ఈ దఫా రేఖా నాయక్‌ను నియమించే విషయాన్ని ఆయన పరిశీలిస్తున్నారు. సత్తుపల్లి నియోజకవర్గంలో టీడీపీ నుంచి గెలుపొందిన ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య టీఆర్‌ఎస్‌లో చేరనున్నారని చాలా రోజులుగా ప్రచారం జరుగుతున్నది. అయితే తనకు మంత్రివర్గంలో స్థానం కల్పిస్తేనే చేరుతానని సండ్ర అన్నట్లు సమాచారం. ఖమ్మంలో టీఆర్‌ఎస్ ఆశించిన మేరకు బలంగా లేనందున, సండ్రను టీఆర్‌ఎస్‌లో చేర్చుకోవడంతో పాటు మంత్రివర్గంలో తీసుకుంటే బాగుంటుందన్న ఆలోచన ముఖ్యమంత్రి చేసి ఉంటారని భావిస్తున్నారు. కడియం లేదా కొప్పులకు మంత్రివర్గంలో స్థానం కల్పించినప్పటికీ మరో ఎస్‌సీకి స్థానం కల్పిస్తే తప్పేమి లేదని ముఖ్యమంత్రి ఆలోచన. మెదక్ జిల్లాకు చెందిన పద్మా దేవేందర్‌రెడ్డి గతంలో ఉప సభాపతిగా బాధ్యతలు నిర్వహించారు. ఇప్పుడు మంత్రివర్గంలో చోటు దక్కుతుందన్న ఆశాభావంతో ఉన్నారు. అయితే ముఖ్యమంత్రి సొంత జిల్లా (ఉమ్మడి మెదక్) నుంచే హరీష్‌రావుకు, పద్మా దేవేందర్‌రెడ్డికి ఇస్తారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొత్తగా వేముల ప్రశాంత్‌రెడ్డి, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, గుత్తా సుఖేందర్‌రెడ్డి పేర్లను ముఖ్యమంత్రి పరిశీలిస్తున్నారు.