S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

మొదటికే మోసం( కథ)

గంగయ్య, రంగమ్మ భార్యాభర్తలు. గంగయ్య కాయకష్టం చేసుకుని కుటుంబాన్ని పోషించేవాడు. రంగమ్మ మాత్రం ఇంటి పనులు చేసేది. ఇతరుల ఇంటి విషయాలు తెలుసుకోవాలంటే ఆమెకు ఆసక్తి ఎక్కువ. ఇరుగు పొరుగున ఉన్న దంపతులు తగాదా పడినా, మాట్లాడుకుంటున్నా కిటికీ మాటున నక్కి వారి మాటలను రహస్యంగా వినేది. అలా వినే సమయంలో భర్తను కూడా పట్టించుకునేది కాదు. తాను పొరుగువారి ఇంటి విషయాలు విని పూర్తిగా తెలుసుకున్న తరువాతే భర్తను పట్టించుకునేది.
‘రంగమ్మా! ఇలా కిటికీల పక్కన నక్కి ప్రక్కవారి ఇంటి విషయాలు రహస్యంగా తెలుసుకోవాలనుకోవడం మంచి లక్షణం కాదు. ఈ పని మానుకో’ అని గంగయ్య ఎంత వారించినా రంగమ్మ పట్టించుకునేది కాదు.
‘నా ఇష్టం. నీకొచ్చిన నష్టం ఏమిటంట?’ అని ఎదురుప్రశ్న వేసేది.
విసిగి వేసారిన గంగయ్య భార్యతో వితండ వాదం చేయడం ఇష్టంలేక ఇరుగు పొరుగు వారి విషయాలు పట్టించుకోకు అని చెప్పడం కూడా మానేశాడు. దీంతో రంగమ్మ తెగ రెచ్చిపోయి ప్రతి ఇంటి విషయాలు తెలుసుకుని ఈ ఇంటి విషయాలు ఆ ఇంటి వారికి, ఆ ఇంటి విషయాలు ఈ ఇంటి వారికి చేరవేసి తాంబూలాలు ఇచ్చాను తన్నుకు చావండి అన్న చందాన తగాదాలు పెట్టి ఆనందించేది.
ఒకరోజు రంగమ్మ ఒక ఇంటి కిటికీ చాటున నక్కి ఆ దంపతుల మాటలు వినసాగింది. ఆ ఇంటి పక్కనే ఒక చెట్టుకు అతి పెద్ద తేనె తుట్టె ఉంది. పక్కనే ఉన్న మైదానంలో పిల్లలు క్రికెట్ ఆడుతున్నారు. కాకతాళీయంగా ఆ బంతి వచ్చి తేనె పట్టుకు తగలడంతో తేనెటీగలన్నీ ఝుమ్మని విజృంభించి సమీపాన ఉన్న రంగమ్మను చుట్టుముట్టాయి. కొన్ని తేనెటీగలు రంగమ్మ చెవిలోకి వెల్లి కర్ణ్భేరిని కుట్టేశాయి అప్పుడే భోజనానికి వచ్చిన గంగయ్యకు ఈ విషయం తెలిసి వైద్యుడి వద్దకు తీసుకుని వెళ్లాడు. డాక్టర్ వైద్యం చేసినప్పటికీ ఉపశమనమైతే కలిగింది కానీ రంగమ్మకు వినికిడి లోపం ఏర్పడింది. ఆ రోజు నుండి రంగమ్మకు చాటుమాటు మాటలే కాదు నేరుగా మాట్లాడిన మాటలు సైతం వినిపించడంలేదు. భర్త ఎంత వారించినా అతని మాటలు పెడచెవిన పెట్టినందుకు మొదటికే మోసం వచ్చి వినికిడి లోపంతో శిక్ష అనుభవించవలసి వచ్చిందని రంగమ్మ కుమిలిపోయింది. నాటి నుండి తాను చేసిన తప్పును సరిదిద్దుకోవాలని చేతనైతే ఇరుగు పొరుగు వారికి తనకు చేతనైన మేలు చేయసాగింది. భార్యలో వచ్చిన ఈ మార్పునకు గంగయ్య సంతోషించాడు. కొంతకాలానికి విదేశాల నుండి ఒక వైద్యుడు వచ్చాడని తెలిసి, రంగమ్మను అతడి వద్దకు తీసుకుని వెళ్లాడు గంగయ్య. వైద్యుడి ప్రయత్నాలు సఫలం కావడంతో ఒక చిన్న పరికరం ద్వారా రంగమ్మ వినగలిగేలా చేశాడు. ఆ పరికరం సాయంతో రంగమ్మకు ఇప్పుడు అందరి మాటలూ వినిపిస్తున్నాయి. పరికరం సాయంతో వినికిడి లోపం దూరమైనప్పటికీ రంగమ్మ ప్రవర్తనలో మార్పు రావడంతో ఆ రోజు నుండి ఇరుగు పొరుగు వారి మాటలు రహస్యంగా వినడం మానేసింది. తన కుటుంబ విషయాలు చూసుకుంటూ ఇతరులకు చేతనైన సాయం చేస్తూ హాయిగా జీవించింది.

-షేక్ అబ్దుల్ హకీం జాని 99494 29827