S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

పరీక్షల ఫలితాలే కీలకమా?

ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు, విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు కూడా పదవతరగతి పరీక్షల ఫలితాలు ప్రస్తుత కాలంలో కీలకంగా మారుతున్నాయి. ఈ పరీక్షల్లో తమ పిల్లలు వందశాతం ఉత్తీర్ణత, అందులో అత్యధిక మంది 10కి10 జీపీఏ తో ఉత్తీర్ణత సాధిస్తే తమ పాఠశాలలకు పేరుప్రఖ్యాతులు వస్తాయని నానా తంటాలు పడటం గమనించదగ్గ విషయం. బడికెళ్తే పాఠాలు చెప్తున్నారా లేదా.. తమ పిల్లలు సరిగా చదువుకుంటున్నారా లేదా అనే విషయాలకంటే అత్యధికంగా విద్యార్థుల తల్లిదండ్రులు కూడా వారి పిల్లలు పదవతరగతి పాస్ అయ్యారా లేదా అనే విషయం పైనే ఎక్కువ దృష్టి పెడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. పదవతరగతిలో విద్యార్థులు పాస్ అయ్యేందుకు పాఠశాలల ఉపాధ్యాయులు, ప్రేవేటు పాఠశాలల యాజమాన్యాలు, విద్యాశాఖ అధికారులు కూడా అవలంభిస్తున్న చాలా అంశాలు విద్యా ప్రమాణాలు మెరుగుపడకపోగా దిగజారుతున్నాయని విమర్శలూ లేకపోలేదు.
విద్యావ్యవస్థలో పెను మార్పులకు నాంది
స్వాతంత్య్రం వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా మొత్తం విద్యావ్యవస్థను మార్గనిర్దేశం చేసేందుకు డాక్టర్ దౌలత్‌సింగ్ కొఠారి ఆధ్యక్షతన 1964-66 మధ్య కొఠారి కమీషన్ అనేది ఏర్పాటయ్యింది. ‘దేశభవిష్యత్తు తరగతి గదిలో నిర్మించబడుతుంది’ అనే వాస్తవ ఆలోచనతో జాతీయ నూతన విద్యావిధానం రూపొందించబడింది. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో అమలవుతున్న విధానాలన్నీ అప్పట్లో రూపొందించబడినవే. కొఠారి కమీషన్‌ను అనుసరిస్తూ మన దేశంలో మొట్టమొదటిసారిగా 1986లో జాతీయ విద్యావిధానం రూపొందించబడింది. ఈ కమీషన్ సూచనలు ఇప్పటికీ అమలులో వున్నాయి. నూతన విద్యావిధానం కోసం అప్పటి ప్రధాని రాజీవ్‌గాంధీ పార్లమెంటులో మాట్లాడుతూ 21వ శతాబ్దపు నూతన సవాళ్ళను ఎదుర్కొనే విధంగా వుండాలని పేర్కొంటూ విద్యారంగంలో మార్పులు సాధించడానికి ‘విద్యాసవాళ్ళు-విద్యా వికాస దృక్పధం’ అనే పేరుతో ఒక జాతీయ విద్యావిధానాన్ని రూపొందించి దానిని జాతీయవిద్యావిధానం - 1986గా అమలుపరిచారు. అప్పట్లోనే ప్రాథమిక పాఠశాలలు గ్రామాలకు ఒక కిలోమీటరు లోపు వుండాలి. మధ్యాహ్న భోజన వసతి, ఉచితంగా పాఠ్యపుస్తకాలను అందజేయడం. 10+2+3 (పదవతరగతి, ఇంటర్, డిగ్రీ) పద్దతిని అన్ని రాష్ట్రాల్లో అమలు చేయడం. కుల,మత,వర్గ, విచక్షణ లేకుండా అందరికీ సమానంగా గుణాత్మక విద్యను అందజేయడం. విద్యావ్యాప్తిలో రాజకీయ నాయకులు, సమాజం, విద్యార్థుల తల్లిదండ్రుల పాత్రను గుర్తించడం. ప్రాథమిక స్థాయిలో మాతృభాషలో బోధించడం. త్రిభాషా సూత్రాన్ని (మాతృభాష, జాతీయభాష, అంతర్జాతీయభాష) అమలు చేయడం. ఉన్నత విద్య అభివృద్ధి కొరకు సార్వత్రిక విశ్వవిద్యాలయాల ఏర్పాటు, దూరవిద్య అందుబాటులోకి తీసుకురావడం. వ్యవసాయ సాంకేతిక విశ్వవిద్యాలయాల సంఖ్యను పెంచడం, ప్రతి జిల్లాకు ఒక ఉపాధ్యాయ శిక్షణా (డైట్) కళాశాల ఏర్పాటు, నవోదయ విద్యాలయాల ఏర్పాటకు సిఫార్సు ఇలా అనేక అంశాలతో జాతీయ విద్యావిధానం రూపొందించబడింది. దాంతోపాటు పాఠ్యాంశాల బోధన విషయంలో ఉపాధ్యాయులు జవాబుదారీ తనంగా వ్యవహరించి విద్యాప్రమాణాలను పెంపొందించడానికి శ్రమించినప్పుడే ‘దేశభవిశ్యత్తు తరగతి గదుల్లో నిర్మింపబడతుందని’ అందులో ఉపాధ్యాయుడి పాత్ర కీలకమైనదిగా జాతీయ విద్యావిధానంలో సూచించింది.
ప్రభుత్వ పాఠశాలలు-విద్యావిధానం
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు అధ్వాన్నంగా వున్నాయనీ ప్రభుత్వ స్కూళ్ళల్లో విద్యనభ్యసిస్తున్న వారిలో సుమారు 50శాతానికి పైగా విద్యార్థులకు కనీసం రాయడం చదవడం కూడా రాదని అనేక జాతీయ సంస్థలు వారి సర్వేల ద్వారా వెల్లడిస్తున్నాయి. ముఖ్యంగా ప్రాథమిక విద్యాస్థాయి నుంచే సరైన విద్యాబోధన జరగకపోవడమే ప్రధాన కారణంగా విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. 1986లో అందరికీ అందుబాటులో వుండే విధంగా అనేక మార్పులు చేర్పులతో అమలు చేసిన జాతీయ విద్యావిధానాన్ని అనుసరించి ప్రస్తుత పోటీప్రపంచానికి అనుగుణంగా మార్పులు చేసుకుంటే సులువైన పద్దతుల్లో విద్యార్థుల్లో గ్రహణశక్తి పెరిగి వారిలో సామర్థ్యం పెంచే విధంగా విద్యాబోధన జరుగుతోందని ప్రస్తుత విద్యాశాఖ అధికారులు, ప్రభుత్వ పాలకులు చెప్తున్నారు. అయితే అది ఎంత వరకు పూర్తీ స్థాయిలో అమలవుతోంది, దానివల్ల విద్యార్థుల్లో సామర్థ్యం పెరుగుతోందా అనే అంశాలపై ఎటువంటి పర్యవేక్షణ లేకుండానే బృహత్తరమైన ఫలితాలను సాధిస్తున్నామని చెప్పుకుంటున్నారు. ఇదే నిజమైతే జాతీయ స్థాయి సంస్థలు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాప్రమాణాల అడుగంటుతున్నాయని ఎందుకు పేర్కొంటున్నాయి? ప్రాథమిక పాఠశాలల నుంచి ఉన్నత పాఠశాలలకు చేరాక విద్యా బోధనా విధానంలో నిర్లక్ష్యం కనిపిస్తోందన్న ఆరోపణలూ విద్యావ్యవస్థపై లేకపోలేదు. పదవతరగతిలో ఫలితాల సాధన కీలకం కావడంతో ఆరవతరగతి నుంచి ఉపాధ్యాయుల బోధనా విధానంలో, విద్యార్థులు చదువుకోవడంలో నాలుగు సంవత్సరాల పాటు నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శించి కేవలం పదవ తరగతిలోనే ఒత్తిడితో కూడిన విద్య ద్వారా ఎంతవరకు నిజాయితీతో కూడిన ఉత్తమ ఫలితాలు సాధ్యమవుతాయో ప్రశ్నార్థకం. ఈనేపధ్యంలో విద్యాశాఖ అధికారుల ఒత్తిళ్ళకు ఎలాగైనా తమ పాఠశాలలో వందశాతం ఉత్తీర్ణతను సాధించాలన్న కేవలం ఫలితాల కోసమే పరీక్షా కేంద్రాల్లో అడ్డదారులు తొక్కే ప్రక్రియ ప్రారంభమైందని చెప్పుకోవచ్చు.
ప్రైవేటు పాఠశాలల భవిష్యత్తు...
తమ పాఠశాలల్లో చదివే కేవలం పదవతరగతి పరీక్షల విద్యార్థుల ఉత్తీర్ణత ఫలితాలు మాత్రమే అత్యధిక ప్రైవేటు పాఠశాలల భవిశ్యత్తును నిర్దేశిస్తున్నాయి. పాఠశాలలకు మంచి పేరు రావాలన్నా, పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచుకోవాలన్నా పదవతరగతి పరీక్షల ఫలితాలపై తమదైన శైలిలో ప్రదర్శించే పబ్లిసిటీనే ప్రధానాంశంగా మారుతోంది. పదవతరగతి పరీక్షల్లో తమ పాఠశాలకు చెందిన విద్యార్థులే అత్యధిక జీపీఏతో ఎక్కువ మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించే విధంగా ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు విద్యాశాఖనే తమ గుప్పిట్లో పెట్టుకుంటున్నాయన్న ఆరోపణలున్నాయి. ఫిబ్రవరి వరకు పాఠ్యాంశాలు బోధించి సిలబస్ పూర్తి చేయాలన్నది ప్రభుత్వ నిబంధన ఉన్నప్పటికీ సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లోనే సిలబస్ పూర్తి చేసి ఒత్తిడితో విద్యార్థులను విద్యాభ్యాసం చేయించడం ఓ ప్రక్రియగా మారిపోయింది. పదవతరగతిలో అత్యుత్తమ ఫలితాలను సాధించి తమ పాఠశాలకు మంచి పేరుప్రఖ్యాతలు తెచ్చుకోవాలని 9వతరగతి చదివే విద్యార్థులకు ముందస్తుగా పదవతరగతి పాఠ్యాంశాల బోధన చేస్తున్న ప్రైవేటు పాఠశాలలూ లేకపోలేదు. విద్యార్థులను తీవ్ర ఒత్తిడికి గురిచేసి తర్ఫీదు చేస్తున్న ప్రైవేటు పాఠశాలలు కూడా పరీక్షల సమయంలో పరీక్షా కేంద్రాలనే తమ గుప్పిట్లో పెట్టుకుని తమ కనుసన్నల్లో పరీక్షలు నిర్వహించుకుంటున్న వైఖరి షరా మామూలుగా మారింది.
గుణాత్మక విద్యకంటే ఫలితాలకే ప్రాధాన్యత
వ్యాపార సంస్థల నిర్వహణలా కొనసాగుతున్న ప్రైవేటు పాఠశాలలను పక్కనపెడితే పేదలు విద్యనభ్యసించే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు గుణాత్మక విద్యనందజేయడం ఎలాగున్నా కేవలం ఫలితాలపైనే దృష్టి కేంద్రీకరించి చివర్లో వచ్చే ఫలితాలను చూసే పనితీరు చాలా బాగుందని కితాబునిస్తుండటం శోచనీయం. ఒక విధంగా ప్రస్తుతం అమలవుతున్న విద్యా హక్కు చట్టాలే చాలా వరకు ఉపాధ్యాయుల్లో కూడా తమకెందుకులే పాఠశాలకు వచ్చామా... పాఠాలు బోధించామా అనే ధోరణిని తీసుకువచ్చినట్టు స్పష్టమవుతోంది. గతంలో ఓ ఉపాధ్యాయుడు తప్పుచేసిన తన విద్యార్థిని దండిస్తే ఆ విద్యార్థి తల్లిదండ్రులు కూడా ఉపాధ్యాయుడిని సమర్థించేవారు. అయితే ప్రస్తుతం ఆ వాతావరణం కనిపించకపోగా విద్యార్థిని దండిస్తే ఉపాధ్యాయులపై దాడులు నిర్వహించడంతోపాటు కేసులు కూడా నమోదు చేస్తున్న పరిస్థితి కొనసాగుతోంది. ఈ నేపధ్యంలో ఉపాధ్యాయులు కూడా కేవలం విద్యాబోధన మాత్రమే కాకుండా విద్యార్థులకు క్రమశిక్షణకూడా అలవరిచి వారి భవిష్యత్తుకు బంగారు బాట వేయాలన్న గురుతర భాద్యత నుంచి తప్పుకుంటూ కేవలం ఉద్యోగం మాత్రమే చేసుకుంటూ పోతున్నారు.
గుణాత్మక విద్యాబోధన ఎలాగున్నా కేవలం పదవతరగతి ఫలితాలకే ప్రభుత్వాలు, విద్యాశాఖ అధికారులు ప్రాధాన్యతనిస్తూ మెరుగు పరచాల్సిన విద్యాప్రమాణాలను విస్మరిస్తున్నారన్న ఆరోపణలను చూస్తే ‘తరగతి గదిలో దేశభవిష్యత్తు నిర్మించబడతుంది’ అని చెప్పిన మన దేశ మేధావుల మాటలు భవిశ్యత్తులో కనుమరుగయ్యే ప్రమాదం లేకపోలేదు.

-నల్లమాడ బాబ్‌జాన్ 85000 83799