S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

‘ఎచ్చింగ్’లో మేటి..

(అనంతయ్య - 98661 97946)

చిత్రకళ ఉపాంగం ‘ఎచ్చింగ్’. ఆ కళ తెలియకపోతే ఎచ్చింగ్ లేదు. ఎచ్చింగ్ తెలియకపోయినా బ్రష్‌తో చిత్రాలు గీయవచ్చు. దేని సౌందర్యం దానిదే. దేని అందం దానిదే అని గ్రహించి మూడు దశాబ్దాలకు పైగా ఎచ్చింగ్‌లో తలమానికమైన కళాకృతులను రూపొందించి ఎందరినో అబ్బురపరిచారు దుద్యా అనంతయ్య. ప్రకృతిని, పశుపక్ష్యాదులను ప్రాణప్రదంగా భావించి తాదాత్మ్యం చెంది వాటినే తన కళాత్మక దృష్టి కోణంతో వీక్షకుల ముందు పెట్టి ‘శభాష్’ అనిపించుకున్న అనంత ప్రతిభా వ్యుత్పత్తులుగల డ్రాయింగ్ ‘టీచర్’ ఆయన.
జింక్ ప్లేట్‌పై ‘నీడిల్’తో లైన్ గీసి, ఆ లైన్ ద్వారా చిత్రంలో వెలుగు - నీడలు వచ్చేలా నైపుణ్యం ప్రదర్శించి వివిధ రసాయనాల ఆధారంగా అందమైన చిత్రాన్ని కాగితంపై ముద్రించే ప్రక్రియనే ఎచ్చింగ్. ఇదొక మాధ్యమంగా చాలాకాలం నుంచి వెలుగొందుతోంది. తాజాగా అనేక టెక్నిక్స్ పుట్టుకొచ్చాయి, అందులో విస్కాస్‌టీ అనే విధానం ఒకటి. ఈ విధానంతో అనంతయ్య గీసిన ‘నెమలి’ చిత్రం నిజంగానే అద్భుతం. ఆ రేఖలు.. డెప్త్, రంగుల మెరుపు బ్రష్‌తోగాని, పెన్నుతోగాని తీసుకురావడం అసాధ్యమని అనంతయ్య అంటారు. అందుకే ఎచ్చింగ్ అంటే తనకెంతో ఇష్టమైన ప్రక్రియ అని చెప్పారు. ఒక ప్లేట్‌పై గీసింది ఓకే అనుకుంటే దాన్నుంచి పది పనె్నండు చిత్రాల నకళ్లు (ఎడిషన్స్) తీయవచ్చు. ఈ సౌలభ్యం బ్రష్‌తో వేసే చిత్రాలకుండదు. దాదాపు ఒకే సాంద్రతతో, గాఢతతో పది పనె్నండు చిత్రాలను ‘ప్రింట్’ చేయడం వల్ల పెయింటింగ్‌కున్న పరిశుద్ధత - ఒరిజినాల్టీ, వైవిధ్యం కనిపించక పోవడం ఓ రకంగా చిన్నచూపుతో లోపంగానే చాలామంది పరిగణిస్తారు. బహుశ ఈ ఒక్క కారణం చేతనే ‘ఆర్ట్ లవర్స్’ ఎక్కువ ఎచ్చింగ్‌లను కొనుగోలు చేయరు. అలాగని అసలు అమ్ముడుపోవా? అంటే అదేం కాదు. అమ్ముడుపోతాయి కాని తైలవర్ణ చిత్రాలంత జోరుగా అమ్మకాలు ఉండవు. అనంతయ్య ఆ దృష్టి కోణంతో చూసేందుకు ఎప్పుడూ ఇష్టపడలేదు. అమ్మాలనే ‘్ధ్యస’ సైతం ఆయనలో కనిపించదు. నిరంతరం గాఢమైన తపనతో ప్రకృతి చిత్రాలను ఎచ్చింగ్ చేయడమే తన ధ్యేయం.. లక్ష్యంగా పెట్టుకుని దశాబ్దాలుగా పని చేస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ‘ఎచ్చింగ్ కళ’లో అనంతయ్యను మించిన చిత్రకారుడు లేడు.. అని ఆర్ట్ కలెక్టర్స్, చిత్రకళా విమర్శకులు.. అభిమానులు గుర్తించి చెప్పినప్పుడు కలిగే ఆ ఆనందం అపురూపమైనదని ఆయన భావిస్తారు.
ఎచ్చింగ్‌లో అత్యున్నత శిఖరాలను అధిరోహించిన అనంతయ్య వికారాబాద్‌కు సమీపంలోని అనంతగిరులను, అడవిని ఆనుకుని ఉన్న పల్లెలో పుట్టి పెరిగారు. దాంతో అందమైన ఆ గిరుల, అడవి ప్రభావం, అక్కడి జీవనం, వాతావరణం అన్నీ ఆయనను ఆవహించాయి. చివరకు అవే ఆయన ఎచ్చింగ్‌లో దర్శనమిస్తున్నాయి. ఇది వైవిధ్యమైన వస్తువు. ఇంత గాఢమైన వస్తు సామగ్రితో వర్ణ చిత్రాలను గీసినవారు అరుదు. అపూర్వమైన, తనదైన సంతకం గల శిల్ప నైపుణ్యంతో, విమర్శకులు సైతం ‘్ఫదా’ అయ్యేలా రూపొందించడం అరుదుగా జరిగే పరిణామం. ఆ పరిణామ కర్తగా అనంతయ్య నిలిచిపోతారు.
తెలంగాణ పల్లె జీవితాన్ని మరో పార్శ్వంలో, ప్రకృతి, పశు పక్ష్యాదులు ప్రాథమిక సబ్జెక్టుగా చిత్రకళ ప్రపంచంలో నిలిపిన అనితర సాధ్యమైన చిత్రకారుడు అనంతయ్య. కుంచె... పెన్నుతో రాబట్టలేని అనేక వెలుగు నీడల్ని, రేఖల్ని, ఒంపుసొంపుల్ని, అపూర్వ సౌందర్యాన్ని ఆయన తన ‘నీడిల్’తో జింక్ ప్లేట్‌పై చెక్కి వీక్షకుల ముందు పెడుతున్నారు. బ్రష్‌తో చేసే పనికన్నా నీడిల్‌తో చేసే పని కష్టమైనది.. క్లిష్టమైనది, సాహసవంతమైనది.. మేథోపరంగా అధిక శ్రమతో కూడుకున్నదైనప్పటికీ తనకు ఈ మాధ్యమంలోనే ‘తృప్తి’ ఉందని హృదయం లోతుల్లోంచి ఆయన చెబుతారు. ఎచ్చింగ్ కోసమే అనంతయ్య పుట్టారా అన్నంత అవినాభావ సంబంధం ఆ కళతో ఏర్పడింది. ఈ రంగంలో ఎందరో కృషి చేసినా వారందరిలో అనంతయ్య మేటి... ఆయనకు ఆయనే సాటి.
చెట్టు - చేమ, చీమ, రాయి - రప్ప, పుట్ట - గట్టు, పురుగు - పక్షి... ఇలా అల్పమైన ప్రాణులెన్నో ఆయన ఎచ్చింగ్‌లో ప్రాణం పోసుకుంటాయి. అనంత గిరులు ఆయన ‘నీడిల్’ ముందు తలవంచుతాయి. తాదాత్మ్యం చెందుతాయి. చూసినవారు ఆ కౌశలానికి, చాతుర్యానికి ప్రణమిల్లుతారు.
శిల్పికి అవసరమైన పరికరాలు ఓ రకంగా ఉంటాయి. చిత్రకారుడికి అవసరమైన పాలెట్.. రంగులు... పరికరాలు మరో రకంగా కనిపిస్తాయి. ఎచ్చింగ్ చిత్రకారుడికి దీనికి భిన్నమైన పరికరాలు, రసాయనాలు అవసరమవుతాయి. తాను బిఎస్సీ డిగ్రీ పుచ్చుకోవడంతో ఎచ్చింగ్‌కు అవసరమైన రసాయనాల రహస్యాలను ఆయన సులువుగా పట్టుకోగలిగారు. తన చదువు తన ‘క్రాఫ్ట్’కు, సృజనాత్మకతకు ఎంతో ఉపకరించిందని ఆయన అంటున్నారు.
బాల్యంలో చిత్రకళపై కొంత ఆసక్తి - అనురక్తి ఉన్నా ఎచ్చింగ్ మాధ్యమంలోకి అడుగిడటం కాకతాళీయంగా జరిగిందని ఆయన అంటారు. సైఫాబాద్‌లో తాను డిగ్రీ చదువుతున్న రోజుల్లో ఒకనాడు కళాభవన్‌లో జరుగుతున్న చిత్రకళా ప్రదర్శన చూసేందుకు వెళ్లినప్పుడు అక్కడ మొదటి అంతస్తులో డోంగ్రే అనే చిత్రకారుడు - ఎచ్చింగ్ నిపుణుడు ఎచ్చింగ్ సరంజామా సామాగ్రి ముందు కనిపించడం.. కుతూహలం కొద్దీ ఆ సరకు - సరంజామాతో చేసే చిత్రాల తీరును తెలుసుకోవడంతో అది ‘తొలిప్రేమ’గా మారింది. అది లగాయతు అనంతయ్య ఎచ్చింగ్ అంతు చూడాలని పట్టుబట్టి సముద్ర గర్భమంతటి లోతు గల ఆ మాధ్యమాన్ని ఔపోసన పట్టారు. ఈలోగా కోఠి జాంబాగ్‌లోని వివి కాలేజీలో సాయంత్రం వేళల్లో డ్రాయింగ్ తరగతులకు డోంగ్రే మాస్టారు దగ్గర హాజరవుతూ, శాస్ర్తియ పద్ధతులను తెలుసుకుని గుల్బర్గాలోని ఇండియన్ కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ నుంచి డిప్లొమా పూర్తి చేశారు. అనంతరం హైదరాబాద్ శివారులోని ఇబ్రహీంపట్నం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో డ్రాయింగ్ టీచర్‌గా నియమితులయ్యారు. అలా మూడు దశాబ్దాలపాటు వివిధ పాఠశాలల్లో విద్యార్థులకు డ్రాయింగ్ పాఠాలు బోధిస్తూనే తాను గీసిన చిత్రాలు, ఎచ్చింగ్ చిత్రాలను 1989లో మాక్స్‌ముల్లర్ భవన్‌లో వన్‌మ్యాన్ షో నిర్వహించారు. అనంతరం హైదరాబాద్, బెంగుళూరు, కోల్‌కతా, చెన్నై, ముంబై, కొచ్చిన్ లాంటి అనేక నగరాల్లో గ్రూప్ షోలలో పాల్గొన్నారు.
ఎల్.వి.ప్రసాద్ కంటి ఆసుపత్రి, పోలీసు అకాడెమీ, కొత్త ఢిల్లీలోని లలిత కళా అకాడెమీ ఇట్లా అనేక ప్రతిష్ఠాత్మక ప్రదేశాల్లోని కలెక్షన్స్‌లో ఆయన చిత్రాలు ప్రదర్శితమవుతున్నాయి.
పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, బొంబై సొసైటీ, హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ తదితర సంస్థల నుంచి ఆయన అవార్డులు రివార్డులు అందుకున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే ఎచ్చింగ్‌లో ఆయన చరిత్ర సృష్టించారు.

-వుప్పల నరసింహం 99857 81799