S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

లక్ష్యానికి చేరువ కావాలంటే...

పరీక్షలో తక్కువ మార్కులు వచ్చాయనో, అనుత్తీర్ణులయ్యామనో బాధపడొద్దు. మార్కులు ర్యాంకులే ప్రధానం కాదు. ఓటమిని నేర్చితేనే విజయం సులువవుతుంది. ప్రపంచంలో లక్ష్యాలెన్నో ఉన్నాయి. అందులో మనమూ ఒకటి సాధిద్దాం. ఒక సమిధలా వెలుగుదాం. ప్రపంచానికి ఒక వెలుగును ప్రసాదిద్దాం. గెలుపునకు తుదిమెట్టు అంటూ ఏదీ ఉండదు. ఓటమి అన్నది ఎప్పుడూ అపాయకారి కాదు. మనకు ఈ రెంటిని సాధించాల్సిన దానికి కావాల్సింది మనోధైర్యం, ఆత్మవిశ్వాసం, పట్టుదల.
విద్యార్థులు నిరాశకు లోనుకాకండి. మానసిక దృఢత్వంతో సాధించాలనే కసిని పెంచుకోవాలి. పరీక్షలలోని మార్కులే జీవితానికి ప్రామాణికం కాదని, మానసిక ధైర్యాన్ని కోల్పోకుండా సమస్యకు ఎదురొడ్డి నిలిచినపుడే జీవితం పరమార్థకం అవుతుందని, ఉన్నత శిఖరాలకు చేరుకోగలుగుతారు.
బాధ్యత
పిల్లల్లో తక్కువ మార్కులు వచ్చాయని తల్లిదండ్రులు ‘ఫ్రస్ట్రేషన్’కు లోనవుతారు. తోటి విద్యార్థులతో పోల్చకుండా జాగ్రత్త పడాలి. పిల్లలకు జీవిత విలువను గుర్తించేలా ప్రోత్సహించాలి. కళ్ల ముందు లక్ష్యాలెన్నో ఉన్నాయి. ఒక్కసారి ఓడినంత మాత్రాన కుంగిపోవాల్సిన పనిలేదు. నిరంతరం సమస్యలతో పోరాటం చేస్తూనే జీవితంలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించేలా కృషి చేయాల్సిన బాధ్యత తల్లిదండ్రులు, స్నేహితులపై ఉంది.
లక్ష్యానికి చేరువ
‘జీవన పోరాటంలో విజయాలు, వైఫల్యాలు సహజం.’ నేటి పోటీ ప్రపంచంలో తాము అనుకున్నది సాధించాలనే కాంక్ష మరియు ప్రస్తుతమున్న స్థితి నుంచి మరింత ఉన్నత స్థితికి ఎదగాలనుకునే క్రమంలో ఎదురయ్యే సమస్యలు, అడ్డంకులు, వైఫల్యాల మూలంగానే భావోద్వేగాలకు లోనై వాటిని పరిష్కరించుకునే క్రమంలో తీవ్ర ఒత్తిడికి, ఆందోళనలకు లోనవుతూ నిరాశా నిస్పృహలకు లోనయ్యే వారెందరో ఉన్నారు. ఫలితంగా వారి జీవన విధానంలో అపసవ్యత నెలకొంటుంది. ఆశించిన జీవితానికి, అనుభవిస్తున్న జీవితానికి మధ్య వ్యత్యాసం ఎక్కువైనపుడు కలిగే ఆందోళన, ఒత్తిడి మూలంగా మానసిక, శారీరక అనారోగ్యాలకు లోనవుతున్న వారు సమాజంలో ఎందరో ఉన్నారు. తల్లిదండ్రులు, స్నేహితులు, బంధువులు విద్యార్థులలో తక్కువ మార్కులు వచ్చాయనే ఆందోళనను దూరం చేయాలి. సాధించాలనే కాంక్షతో లక్ష్యానికి చేరువవుతారు.
భరోసా
విద్యార్థులలో పరీక్షలలో తక్కువ మార్కులు వచ్చినా జీవితంలో సాధించడానికి, ఉన్నత శిఖరాలను అధిరోహించగలరని మానసికంగా నిరంతరం మెదడుకు కావల్సిన శక్తిని అందించుకోవాలి. తల్లిదండ్రులు, మిత్రులు మేమున్నామనే నిరంతర ప్రోత్సాహంతో భరోసాను కల్పించాలి. ఈ భరోసాతో జీవితంలో ఏదైనా సాధించవచ్చు.
శ్రమే ఆయుధం
మానసిక ఆందోళలను తగ్గించుకోవాలి. మిమ్మల్ని, మీ శ్రమని నమ్మండి. సానుకూల ఫలితం వస్తుందనే భావంతో ఆత్మవిశ్వాసం పెంచుకోండి. మంచి మార్గదర్శకత్వం ఇచ్చే వ్యక్తిని మెంటారుగా స్వీకరించడం, అంచెలంచెలుగా ఎదగడానికి కృషి చేయాలి. లక్ష్యసాధనలో ఎన్నో రకాల అడ్డంకులు వస్తూ ఉంటాయి. వాటికి ఎదురీదుతూ వాటిని పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్లినవారే ప్రపంచ విజేతలు అవుతారు. ఒక అంశం నేర్చుకోవాలనుకున్నప్పుడు అది ఎంత కఠినమైనా కానీ ఆ అంశం సాధనలో మిత్రులతో చర్చించడం, మేధావులు, విజేతల సహకారం తీసుకోవడం, సీనియర్స్ సలహాలను తీసుకొని ముందుకు వెళ్తే మీ లక్ష్యం మీకు దాసోహం అవుతుంది. నీ వెనక ఏముంది? ముందేముంది? అనేది నీ కనవసరం. నీలో ఏముంది అనేది ముఖ్యం. నీ శక్తిసామర్థ్యాలతో లక్ష్యాన్ని సాధించాలి. ఇలా ఎందరో సాధించారు. మనమూ సాధిద్దాం. ఇతరులకూ స్ఫూర్తినిద్దాం.

-డా. అట్ల శ్రీనివాస్‌రెడ్డి 97039 35321