S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

శివోహం.. నీలాద్రీశ్వరాలయం!

ప్రశాంత వాతావరణం.. కాలుష్యానికి, జనవాసాలకు దూరంగా అభయారణ్యం. పక్షుల కిలకిలారావాలు.. పురివిప్పి ఆడే నెమళ్ల కేరింతలు. చుట్టూ కొండల మధ్య నుండి జాలువారే సెలయేరు.. ఆధ్యాత్మికత ప్రతిఒక్కరిలో ఉట్టిపడి భక్త్భివం ఉప్పొంగే ప్రాంతం. ఎతె్తైన గుట్టల నడుమ భారీ వృక్షాలు. ఆహ్లాదం, భక్తుల పారవశ్యం మధ్య విశిష్టత కలిగిన శివాలయం. భక్తుల కోర్కెలు తీర్చే శివుడు కొలువుదీరిన కొండలన్నీ నీలిరంగులో ఉండటంతో స్వామివారు నీలికంఠుడని, ఆలయం నీలాద్రీశ్వరాలయమని పేరుగాంచింది. దేశంలో ప్రసిద్ధ శివాలయాలు ఎన్నో ఉన్నా ఒక్కో ఆలయానిది ఒక్కో చరిత్ర. అలాంటి ఆలయాల్లో ఒకటైన నీలాద్రీశ్వరాలయానికీ వేల సంవత్సరాల చరిత్ర ఉంది.
కాకతీయ రాజులపై శత్రురాజ్యం వారు దండెత్తిన సమయంలో కాకతీయులు ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలోని దట్టమైన అటవీ ప్రాంతంలో కొనే్నళ్లు విడిది చేశారు. శివభక్తులైన కాకతీయులు నిత్యం శివారాధన చేసేవారు. వీరు నిత్య పూజలు చేసేందుకు కొండల మధ్య ఓ శివలింగాన్ని ప్రతిష్ఠించారు. ఆలయం పక్కనే కొండల మధ్య నుండి ఎవ్వరికీ కన్పించకుండా ఓ జలధార నిత్యం ప్రవహిస్తూనే ఉంటుంది. జలధార ఎక్కడి నుండి వచ్చేది ఇప్పటికీ తెలియకపోవటంతో ఇదంతా శివమహిమేనని భక్తులు విశ్వసిస్తారు. మరో విశేషమేటంటే ఆలయం చుట్టూ ఉన్న కొండలపై కొంతదూరంలో మరో పెద్ద కొండ ఉంది. ఈ కొండ అచ్చం నాగేంద్రుని పడగ రూపంలో కనిపిస్తుంటుంది. ఇక్కడ పూజలు నిర్వహించిన తరువాత కాకతీయులు శత్రువులపై విజయం సాధించారు. అనంతరం వారు ఈప్రాంతాన్ని వీడి వెళ్లారు. అప్పటి నుండి శివాలయంలో పూజలు లేక శిథిలావస్థకు చేరింది. అలా కొన్ని వందల సంవత్సరాలు గడిచాక ఈ ప్రాంతానికి సమీపంలోని భవన్నపాలెం గ్రామ జమీందారు ఇనుగంటి పట్ట్భారామయ్యకు ఓరోజు రాత్రి శివుడు కలలో దర్శనమిచ్చి గుడి ఆనవాళ్లు స్ఫురింపజేశాడు. తెల్లవారాక ఆయన గుర్రంపై అడవిలో అనేక రోజులు గాలించగా ఒకరోజు సమీప ప్రాంతం నుండి ఓంకార నాదం వినిపిస్తుండటంతో ఆ దిశగా వెళ్లారు. అక్కడ శిథిలావస్థలోని గుడి కనిపించింది. గుడిలోకి వెళ్లి చూస్తే అక్కడ శివలింగానికి ఓ నాగుపాము పెనవేసుకొని పడగవిప్పి దర్శనమిచ్చింది. జమీందారు తన అనుచరులతో పాటు కొన్ని రోజులు అక్కడే ఉండి ఆలయాన్ని శుభ్రపరిచి అడవిపూలు, మారేడు దళాలతో పూజలు చేశారు. అడవిలో చెట్లకున్న ఫలాలను కోసి స్వామివారికి నైవేద్యంగా సమర్పించారు. ఇలా ఆ ప్రాంతవాసులు నెలరోజులకోసారి వచ్చి శివుడికి పూజలు చేయటం ప్రారంభించటంతో అప్పటి వరకున్న కరవు కాటకాలు తొలగిపోయి సుభిక్షంగా జీవించసాగారు. వారి సమస్యలన్నీ ఇక్కడి శివారాధనతో ఒక్కొక్కటిగా తొలగిపోయాయి. అప్పటి నుండి ఇదంతా ఆ పరమేశ్వరుడి మహత్యమేనని భక్తులు అడవిలో బాటవేసి రోజూ పూజలు చేయటం ప్రారంభించారు. ఆలయానికి వెనుక వైపు ఉన్న పెద్దపుట్టలోని ఓ నాగుపాము కూడా రోజూ శివుడికి పూజలు చేసేదని కథనం. ఇలా వందల సంవత్సరాలు పైగానే జరిగింది. ఆలయం చాలా పురాతనమైనది కావటంతో ఇక్కడి రాజులు గుప్త నిధులు దాచి ఉంటారనే భావనతో కొందరు దుండగులు ఆలయ పరిసరాలతో పాటు గర్భగుడిని కూడా తవ్వారు. ఈ క్రమంలో అక్కడున్న నాగుపాము అడ్డుపడగా దాన్ని చంపేసి అక్కడే పడేసి వెళ్లిపోయారు. తెల్లారి భక్తులు పూజలు చేసేందుకు వెళ్లినపుడు ఆలయంలో తవ్వి శివలింగాన్ని పక్కన పెట్టి ఉంచటం, అక్కడే నాగుపాము చనిపోయి ఉండటాన్ని చూశారు. ఈ ఘటనపై వీఎం బంజర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు కూడా నమోదు చేశారు. దీంతో భక్తులు విరాళాలు పోగుచేసి ఆలయ అభివృద్ధికి నడుం బిగించారు. ప్రభుత్వం కూడా ఆలయ విశిష్టతను గుర్తించి తమ ఆధీనంలోకి తీసుకుంది. కోట్ల రూపాయల నిధులు వెచ్చించి మరింత అభివృద్ధి చేసింది. అప్పటి నుండి నిత్యం ఎందరో భక్తులు ఇక్కడికి వచ్చి భక్తిపారవశ్యంలో మునిగితేలుతుంటారు. కార్తీక మాసంలో వేలాది మంది మహిళా భక్తులు దీక్షలు చేస్తూ కార్తీక దీపాలను వెలిగించి తరిస్తుంటారు. మహాశివరాత్రి రోజు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుండి లక్షలాదిగా భక్తులు వచ్చి కోనేరులో పుణ్యస్నానాలు ఆచరించి, మొక్కులు చెల్లించుకుంటారు. ఖమ్మం జిల్లా పెనుబల్లికి సుమారు 20కిలోమీటర్ల దూరంలోని భవన్నపాలెం సమీపంలో ఈ మహిమాన్విత ఆలయంలో నీలకంఠుడు భక్తుల పాలిట కొంగుబంగారమై నీలికొండల మాటున విలసిల్లుతున్నాడు.
బ్రహ్మ-విష్ణువుల తగవు తీర్చిన వైనం!
ఒకనాడు బ్రహ్మ, విష్ణువు మధ్య ఎవరు గొప్ప అనే విషయమై కలహం మొదలైంది. నేను గొప్పంటే.. నేను గొప్పంటూ ఇద్దరూ గొడవపడి పరమేశ్వరుడి వద్దకు వెళ్లి విషయాన్ని చెప్పారు. వీరి వాదన విన్న శివుడు చిరునవ్వు చిందిస్తూ ఇద్దరూ సమానమేనని, ఎవ్వరూ ఒకరి కంటే ఒకరు ఎక్కువా కాదు, తక్కువా కాదని సర్దిచెప్పాడు. అయినప్పటికీ ఇద్దరూ సంతృప్తి చెందకపోవటంతో వారికి ఓ పరీక్ష పెట్టాడు. ‘విశ్వం ఆదీ, అంతాన్ని మీలో ఎవ్వరు కనుక్కుంటే వారే గొప్ప’.. అని శివుడు వివరిస్తాడు. దీంతో బ్రహ్మ, విష్ణువులిద్దరూ విశ్వమంతా తిరగటం మొదలెడతారు. ఎంత తిరిగినా ఆదీ, అంతం దొరక్కపోవటంతో విష్ణువు తిరిగివెళ్లి శివుడి వద్ద తన ఓటమిని అంగీకరిస్తాడు. కానీ బ్రహ్మ మాత్రం తాను గెలవాలనే అత్యాశతో విశ్వం ఆదీ, అంతాలను తాను చూశానని, ఇందుకు మొగిలి పూవు, కామధేనువు సాక్ష్యం చెప్పాలని వాటిని బలవంతంగా ఒప్పిస్తాడు. వీరిద్దరినీ వెంటబెట్టుకొని శివుడి వద్దకు వెళ్లిన బ్రహ్మ తాను పోటీలో గెలిచానని, ఇందుకు సాక్ష్యం మొగిలి పూవు, కామధేనువులేనని చెప్తాడు. శివుడు ముందుగా ‘ఇది వాస్తవమేనా?’ అని మొగిలి పూవును అడిగితే, ‘అవును! బ్రహ్మ విశ్వం ఆదిని, అంతాన్నీ చూశాడు’ అని అబద్ధం చెపుతుంది. కామధేనువును ఇదే ప్రశ్న అడిగితే ఓపక్క తలతో అవునని చెప్తూనే, తోకతో కాదని చెపుతుంది. దీంతో విషయాన్ని గ్రహించిన శివుడు బ్రహ్మతో ‘నీవు అబద్ధం చెప్తున్నావు. వాస్తవానికి విశ్వానికి ఆదీ, అంతం లేవు’ అని వివరిస్తాడు. దైవస్వరూపంగా ఉండి అబద్ధం ఆడినందుకు నువ్వు పూజలు అందుకునే అర్హత కోల్పోయావని బ్రహ్మను శపిస్తాడు శివుడు. అబద్ధపు సాక్ష్యం చెప్పిన మొగిలి పూవుకు ఎంత సువాసన ఉన్నప్పటికీ నీవెప్పటికీ పూజకు పనికిరావంటూ శపిస్తాడు. వాస్తవాన్ని తెలియజేసిన కామధేనువు తోకను ఎవ్వరు తలపై పెట్టుకుంటే వారి పాపాలు తొలగిపోతాయంటూ కామధేనువుకి శివుడు వరమిస్తాడు.
విశ్వబ్రాహ్మణుడు, అగస్త్య మహాముని శాపాలు!
అనగనగా ఒక ఊరు. ఆ ఊరిలో ఆగస్త్య మహాముని అనే బ్రాహ్మణోత్తముడు ఉండేవాడు. నిత్యం శివారాధనతో జీవించేవాడు. ఈయన పరమ శివభక్తుడు. ఏడాదంతా కటిక ఉపవాసంతో ఉంటూ కఠోర నియమ నిబంధనలతో శివన్నామ స్మరణే ఊపిరిగా కాలం వెళ్లదీస్తున్నాడు. ఈ మహాముని ఏడాదిలో ఒక్కరోజు మాత్రమే భోజనం చేసేవాడు. ఆ ఊరికి ఎంతోదూరంగా ఓ శివాలయం ఉంది. ఆ ఆలయంలో మహా శివరాత్రి రోజు మాత్రమే పూజలు, శివపార్వతుల కళ్యాణం జరుగుతుంటాయి. అనంతరం అక్కడికి వచ్చే భక్తులకు అన్నదానం కూడా చేస్తుండేవారు. అగస్త్య మహాముని నియమనిష్టలతో రోజూ అడవికి వెళ్లి జమ్మిచెట్టుకున్న ఆకులు కోసుకొచ్చి ఏడాదంతా తాను భుజించేందుకు విస్తరిని జమ్మి ఆకులతో తానే స్వయంగా కుట్టుకునేవాడు. ఇలా శివరాత్రి రోజు నాటికి ఓ పెద్ద విస్తరిని తయారు చేసుకొని ఎడ్లబండెక్కి గుడికి ఏటేటా వెళ్లేవాడు. ఆలయంలో నిర్వాహకులు మాత్రం అన్నదానానికి వండిన పదార్థాలన్నీ అగస్త్య మహామునికే సరిపోతాయని, భక్తులకు సరిపోవని ఆందోళన చెందేవారు. ఈ సమయంలో విశ్వకర్మ అక్కడికి వెళ్లి అగస్త్య మహామునిని కల్యాణం, అన్నదానానికి రాకుండా తాను ఆపుతానని, ఇందుకు తనకు ఓ సోలెడు గిద్దెడు బియ్యం, ఓ రూపాయి పావలా, పిడికెడు పప్పు ఇవ్వాల్సిందిగా కోరతాడు. ఇందుకు నిర్వాహకులు విశ్వకర్మకు ఆయనడిగినవన్నీ ఇచ్చి పంపుతారు. ఆ శివరాత్రి రోజు ప్రతి ఏటా మాదిరిగానే అగస్త్య మహాముని ఎడ్లబండిపై తాను కుట్టుకున్న జమ్మి ఆకుల విస్తరిని తీసుకొని గుడికి బయలుదేరతాడు. కొంతదూరం వెళ్లాక విశ్వకర్మ ఎదురుగా వస్తుండటం చూసి బండిని ఆపి ‘ఏమిటి విశ్వకర్మా? కల్యాణమవ్వకుండానే తిరిగి వస్తున్నావే?’ అంటూ ప్రశ్నిస్తాడు. ఇందుకు విశ్వకర్మ ‘ఇంకేమి కల్యాణం మహామునీ.. కల్యాణం, అన్నదానం కూడా ఎప్పుడో అయిపోయాయిగా! ఈ ఏడాది శివపార్వతుల కల్యాణం కన్నులపండువగా, అన్నదానం మహా కమ్మదనంగా జరిగాయి’ అని చెపుతాడు. ఇందుకు మహాముని ‘ఇంకా సమయమున్నది కదా! ఇప్పుడే అయిపోవడమేమిటి?’ అని అంటాడు. ‘మీరే ఆలస్యంగా వెళుతున్నారు. నేను కల్యాణాన్ని కళ్లారా తిలకించి, కడుపునిండా సుష్టుగా భోజనం కూడా చేశాను’ అని విశ్వకర్మ అబద్ధం చెపుతాడు. తనకు నిర్వాహకులు స్వయంపాకం కూడా ఇచ్చారని, తనదగ్గరున్న సోలెడు గిద్దెడు బియ్యం, రూపాయి పావలా, పిడికెడు పప్పును చూపిస్తాడు. ఇది నమ్మిన మహాముని తనపై తనకే కోపమొచ్చి తాను తినేందుకు తెచ్చుకున్న విస్తరిని ముక్కలు ముక్కలుగా చించిపారేస్తాడు. కొద్దిసేపటి తరువాత తానెప్పుడూ ఆలస్యంగా వెళ్లేవాడిని కాదనుకుంటూ అనుమానం వచ్చి తిరిగి గుడికి బయలుదేరతాడు. మహాముని వెళ్లే సమయానికి అప్పుడే కల్యాణం పూర్తయి, అన్నదానం తుది ఘట్టానికి చేరుకుంటుంది. అంటే, విశ్వకర్మ తనను మోసం చేశాడని మహాముని గ్రహిస్తాడు. ఆగ్రహించిన ఆయన విశ్వకర్మ వద్దకు వెళ్లి.. ‘శివుడ్ని ఆరాధించే నాకు శివపార్వతుల కళ్యాణాన్ని చూసే భాగ్యాన్ని దూరం చేసి, ఆకలితో ఉన్న నన్ను పస్తులతో ఉండేట్లుగా చేస్తావా? ఏ సోలెడు గిద్దెడు బియ్యానికి, రూపాయి పావలాకు, పిడికెడు పప్పు కోసం నీవిలా చేశావో... నీవెంత కష్టపడ్డా ఆ సోలెడు గిద్దెడు బియ్యం, రూపాయి పావలానే నీకు దక్కుతాయి’ అంటూ శపిస్తాడు. ఇందుకు విశ్వకర్మ కూడా ‘నీకంటే నేనేమీ తక్కువకాదు. నన్ను శపించిన నీకు అన్నం దొరకదు. నువ్వు గొయ్యి తవ్వి తీసిన మట్టే భుజించి కడుపునింపుకోవాలి’ అంటూ అగస్త్య మహామునిని శపిస్తాడు. ఆ శాప ప్రభావమే ఎక్కడ గొయ్యితీసి పూడ్చినా కొంచెం మట్టైన తగ్గుతుందని, ఆ తగ్గిన మట్టే ఆ మహాముని భుజించేవాడని ఇప్పటికీ నానుడి!

పి నాగప్రసాద్, పెనుబల్లి