S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

మహాత్ముడు - మధుర సంగీతం

సమాజ స్థాయి పెంచగోరినప్పుడల్లా దేవదేవుడు మహనీయుల రూపంలో వ్యక్తమై ప్రముఖులని, పెద్దలను ముందుకు సాగమని వెన్నుతట్టుతుంటాడు.
మహాత్మాగాంధీ దీనికి మంచి ఉదాహరణ. ఆదర్శప్రాయమైన జీవితాన్ని గడుపుతూ సమాజాన్ని ముందుకు నడిపించాడు - లోకం అటువంటి వాళ్లను ఆదర్శంగా తీసుకోవటంలో ఆశ్చర్యంలేదు.
స్వలాభాపేక్షతో స్వార్థబుద్ధితో దేశసేవ చేస్తామని నీతులు చెప్పే వాళ్లను నమ్మటమే ఆశ్చర్యం కలిగించే విషయం.
ఈ జాతికి జవసత్త్వాలందించిన మహాత్ముణ్ణి తీర్చిదిద్దిన అంశాలేమిటి? ఏయే విషయాలు ఆయన్ని ప్రభావితం చేశాయి? అని మేధావులెందరో, ఆలోచించి శోధించి, ‘పదిమందికీ ప్రయోజనం చేకూర్చాలనే లక్ష్యం ఒక్కటైతే, ఆయన జీవితాన్ని నిర్దేశించిందనే సత్యాన్ని ఆవిష్కరించారు. మనిషి ప్రయోజకుడై సమాజ శ్రేయస్సును కోరేవాడైతే నలుగురిచేత కీర్తించబడతాడు.’ అనేదొక్కటే నీతి, అని తేల్చారు.
మహాత్ముణ్ణి మహనీయుడిగా తీర్చిదిద్దిన అంశాల్లో ఆయనకుగల సంగీతాసక్తి ఒకటి. ఆయన నిత్య జీవితంలో ‘ప్రార్థన’ లేని రోజంటూ లేదు. చూడండి. అందర్నీ ఏకం చేసేది సమిష్టిగానమే అనేవాడాయన.
మనసులోని మాలిన్యాన్ని కడిగి పారేసి ప్రక్షాళన గావించేది దైవ ప్రార్థన.
ఆయన కళ్లు మూసుకుంటే పరమేశ్వర ధ్యానం. తెరిస్తే, సమాజ సేవాసక్తి - రెండే విషయాలు.
1946లో జరిగిన ఘటన. ఓ సాయంత్రం మద్రాసు టీ నగర్‌లోని హిందీ ప్రచార సభలో ప్రార్థన ముగిసిన తర్వాత ఒక యువతి తంబురా తీసుకుని ముత్తుస్వామి దీక్షితుల వారి ‘మామవ పట్ట్భారామ’ అనే మణిరంగు రాగ కృతి గానం చేస్తోంది. ఆమె పేరు లీలాశేఖర్. తదేక ధ్యానంతో మహాత్మాగాంధీ వింటూ ఆనందిస్తున్నారు. ఆ రాగ సౌందర్యం, ఆయన్ని కట్టిపారేసింది. ఆయనకున్న సంగీతాభిరుచికి అందరూ ఆశ్చర్యపడేవారు. గాంధీ వార్ధాలోని సేవాగ్రాంలో వున్న రోజుల్లో తిరిగి లీలాశేఖర్‌ను, రమ్మని ఆ కృతి మళ్లీ విన్నారు. విలంబ కాలంలో సాగే ఆ కృతిలోని భావం మనసుకు పట్టేలా హృద్యంగా ఉందన్నారు గాంధీ. మహాత్మాగాంధీలో సహజంగా ఏర్పడిన సంగీతాభిరుచిని తెలియజేసే మరో సంఘటన. మన దేశానికి స్వతంత్రం సిద్ధించిన కొన్ని మాసాలకు, భారతరత్న మధుర గాయని శ్రీమతి ఎం.ఎస్. సుబ్బులక్ష్మికి గాంధీ సేవాగ్రామ్ నుంచి ఒక సందేశం వెళ్లింది.
బాపూ ఎంతో మక్కువగా వినే ‘హరి తుమ్హరో’ భజన్ పాడి రికార్డు చేసి తనకు పంపమని కోరారు. వెంటనే సుబ్బులక్ష్మి భర్త ‘సదాశివం’ సమాధానం రాస్తూ ‘ఆ భజన్ సుబ్బులక్ష్మికి తెలియదని, మరో గాయని చేత పాడించి పంపగలనని రాశారు. దానికి బాపూ ‘ససేమిరా వద్దనీ, సుబ్బులక్ష్మి కంఠంలోనే ఆ భజన్ వినాలని ఉందనటంతో, చేసేది లేక దిలీప్‌కుమార్ రాయ్ ద్వారా ఆ భజన్ నేర్చుకుని, రేడియోలో రాత్రికి రాత్రే రికార్డ్ చేసి, పంపారు. బాపూ ఆనందానికి అవధి లేదు. ఆ తర్వాత కొన్ని మాసాలకు సుబ్బులక్ష్మి రేడియోలో మహాత్ముని హత్యా వార్త విని నిశే్చష్టురాలైంది.
ప్రార్థనా సమావేశాల్లో మహాత్ముని చిద్విలాసాన్ని గమనించిన సేవాదళ్ వాలంటీర్ ఒకాయన బాపూను ప్రశ్నించాడు. ‘బాపూ! మీ చుట్టూ ఎన్ని సమస్యలున్నా, ఇంత ప్రశాంతంగా ఎలా వుండగలుగుతున్నారు? ఆ నిశ్చలత ఎక్కడి నుంచి తెచ్చుకో గలుగుతున్నారు?’
ముఖ్యంగా సంగీతాభిరుచి, ప్రార్థనాసక్తి ఎలా ఏర్పడుతోందన్నాడు. సంగీతాభిలాష, మనస్ఫూర్తిగా ఆనందంగా నవ్వుకోవటమంటూ లేకపోతే ఈ సమస్యల వలయంలో ఊపిరాడక ఏనాడో గతించేవాణ్ణి. జటిలమైన సమస్యలతో సతమతవౌతున్నా నాకు ఏకాగ్రతను కలిగించేది వౌనం, ఆ వౌనంలోని సంగీతం. నాకు ప్రశాంతతనిచ్చేది పరమాత్ముడి వైభవాన్ని కొనియాడే స్తోత్రగానం. ఆ శక్తే నన్ను ముందుకు నడిపిస్తుంది. నాలో మంచి ఆలోచనలను నింపుతుంది. సహనశక్తిని నేర్పుతుంది. అదే నా బలం’ అన్నాడు.
విశ్వకవి రవీంద్రనాథ్ టాగూర్‌కు ఉత్తరం రాస్తూ ‘మీ శాంతినికేతన్‌లో మీ బెంగాలీ సంగీతంతోబాటు హిందుస్థానీ, పాశ్చాత్య శాస్ర్తియ సంగీతానికి కూడా చోటు కల్పించండి’ అన్నాడు.
మహాత్ముడిపై సంగీత ప్రభావం ఎంతగా ఉందో తెలియజేసే మరో సందర్భం. 1917 అక్టోబర్ 20వ తేదీ. గుజరాత్‌లోని బ్రోచ్ పట్టణంలో గుజరాత్ విద్యా సదస్సులో ఆయన మాట్లాడుతూ, ‘నిత్యం మానవ జీవితం ఎన్నో ఒడిదుడుకులు, విషమ స్థితిలో వుండే సమస్యలతో నిండి ఉంటుంది. అందులో నుంచి బయటపడే మార్గాన్ని చూపించగలిగేది దివ్యమైన సంగీతం.
పొలం పనులు చేసుకుంటూ ఒళ్లు వంచి కాయకష్టం చేసుకునే కూలీలకు విశ్రాంతినిస్తూ, శ్రమను మరిపించేది అందరూ కలిసి లయబద్ధంగా ఆలపించే పాటలే.
దురదృష్టమేమంటే ఈ సంగీతానికి మనం తగినంత ప్రోత్సాహాన్ని ఇవ్వలేక పోతున్నాం. సేవాదళ్ కార్యకర్తలకు సంగీత జ్ఞానం తప్పనిసరిగా వుండాలి’ అన్నాడు. సబర్మతిలోని సత్యాగ్రహ ఆశ్రమంలో పనిచేసే సంగీత ఉపాధ్యాయునికి 1924, అక్టోబర్‌లో ఉత్తరం రాస్తూ, సంగీత ప్రసక్తిని, అందులో నిక్షిప్తమైన శక్తినీ ఉదహరిస్తూ, ప్రతి సేవాదళ్ కార్యకర్తలోనూ ఆధ్యాత్మిక చైతన్యాన్ని కలిగిస్తూ సద్భావనా మార్గంలో నడిపించే సంగీతం నేర్పించమనేవాడు. కుల మత వర్గ భేదాలేమీ లేకుండా మనుషుల మధ్య మమతానురాగాలను పంచిపెట్టేది సంగీతమనీ సంగీత హృదయం లేని వ్యక్తికి సమాజంలో నలుగురితోనూ కలసిమెలసి ఉండే అర్హత వుండదనీ, అందర్నీ కలుపుకుని పోయేది సంగీతమే అనేవారు బాపు. నలుగురూ కలిసి ఆలపించే దేశభక్తిపూరిత గీతాలు చాలు జాతీయ సమగ్రతా భావాలు సహజంగానే ఏర్పడుతాయి. దాని కోసం ప్రత్యేక ప్రయత్నం ఏమీ అవసరం లేదు అనేవారు. మహాత్ముల దివ్యవాక్కులెప్పుడూ భావితరాలకు మార్గదర్శకాలే. అగరువత్తిని వెలిగిస్తే చుట్టుపక్కల వాతావరణం ఎలా పరిమళిస్తుందో మనకు తెలుసు. మంచి పూవు వికసిస్తే ఎంత ఆహ్లాదంగా ఉంటుందో మనకు తెలుసు. పరిసరాలను వెలుగులతో నింపతగిన వారినీ, తెలియని హాయిని ఆ ప్రాంతానికి చేకూర్చగలిగిన వారిని దూరం చేసుకుంటున్నాం.
శాంతి సౌభాగ్యాలను గురించి, కేవలం ఉపన్యాసాలు దంచేసేవాళ్లను చూస్తున్నాం. వారినే నమ్ముతున్నాం. భావశుద్ధి లేని వాళ్లను నెత్తికెక్కించుకుని పరమార్థాన్ని దూరం చేసుకుంటున్నాం. మహనీయుల దివ్యవాక్కులలోని అంతరార్థాన్ని అర్థం చేసుకోనంత కాలం మానవాళికి సుఖం లేదన్న సంగతి విస్మరిస్తున్నాం.

- మల్లాది సూరిబాబు 90527 65490