S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

నీ నామ స్మరణం.. మంగళప్రదం (రాస క్రీడాతత్త్వము-17)

7
(తా॥ నీ పాదపద్మం తనను శరణు కోరినవారి పాపాలను పోగొడుతుంది. కానీ, గడ్డి తినే పశువుల వెంటబడి తిరుగుతుంది. అయినా అది లక్ష్మీదేవికి నివాసమే. అంతే కాదు, అది కాళీయసర్పపు పడగల మీద గంతులు వేసింది. అటువంటి ఆ పాదపద్మాన్ని మా స్తనాల మీద (హృదయం మీద) వుంచు. ఆ హృదయంలో వున్న తాపాగ్నిని (పైకి మన్మదతాపం లాగా కనిపిస్తున్న సంసార తాపాన్ని) తొలగించు. (హృదయం మీద గురుపాదాన్ని వుంచడం కూడా ఒక శక్తిపాత విధానమే.)
మధురయా గిరా వల్గువాక్యయా
బుధమనోజ్ఞయా పుష్కరేక్షణ
విధికరీరిమా వీర! ముహ్యతీ
రధరసీధునా-ప్యాయయస్వ నః ॥
8
(తా॥ పద్మముల వంటి కన్నులు కలవాడా! ఓ వీరా! నీ వాక్కు మధురం మాత్రమే కాదు, అది దివ్యజ్ఞానుల మనస్సులను కూడా దోచివేస్తుంది. అటువంటి నీ మాటలకు మేము మోహంలో పడిపోయాం. నీకు దాసీలమయి పోయాం. అటువంటి మమ్మల్ని నీ అధరామృతంతో (వేణుగానంతో) బ్రతికించు, మాకు ఆనందం కలిగించు.)
తవ కథామృతం తప్తజీవనం
కవిభిరీడితం కల్మషాపహమ్
శ్రవణమంగలం శ్రీమదాతతం
భువి గృణంతి యే భూరిదా జనాః ॥
9
(తా॥ తాపత్రయ్ఱాలో తప్తులయినవారికి (మాడిపోయే వారికి) నీ చరిత్రామృతం కొత్త జీవనాన్ని ఇస్తుంది. ఎందుకంటే, నీ చరిత్రను జ్ఞానులే పాప సంహారకమని కీర్తిస్తున్నారు. అంతే కాదు, ఆ నీ జీవితకథ చెవులకు మంగళప్రదం. ఎంతో సుందరం. ఎంతో విస్తృతం. అటువంటి నీ కథను ఎవరైతే ఇతరులకు వివరించి, వర్ణించి, చెపుతున్నారో వారే నిజమైన మహా జ్ఞానదాతలు.)
ప్రహసితం ప్రియ! ప్రేమవీక్షణం
విహరణం చ తే ధ్యానమంగలమ్
రహసి సంవిదో యా హృదిస్పృశః
కుహక! నో మనః క్షోభయంతి హి ॥
10
(తా॥ హే ప్రియా! నీ మందహాసం, నీ వలపు చూపు, నీ విహారం, ఇవన్నీ కూడా ధ్యానానికి ఎంతో మంగళ ప్రదమైనవి. కానీ, ఓ మోసగాడా! మా హృదయాలకు తాకేటట్లుగా ఏ రహస్య సంకేతాలను మాకు అందించావో, అవన్నీ ఇప్పుడు మా మనస్సులను క్షోభింప చేస్తున్నాయి సుమా!)
చలసి యద్వ్రజాత్ చారయన్ పశూన్
నలినసుందరం నాద! తే పదమ్
శిలతృణాంకురైస్సీదతీతి నః
కలిలతాం మనః కాంత! గచ్ఛతి ॥
11
(తా॥ హే నాథా! హే మనోహరా! నువ్వు ఆవులను మేపుకుంటూ అడవిలోకి వెళ్ళిపోతూ వుంటే, తామర పువ్వుల లాగా కోమలమైన నీ పాదాలలో గులకరాళ్ళు, కోసిన దర్భల మోళ్ళు, గుచ్చుకుని నొచ్చుకుంటున్నాయని గమనించే సరికి, మా మనస్సు విలవిలలాడిపోతోంది.)
దినపరిక్షయే నీలకుంతలై
ర్వనరుహాననం బిభ్రదావృతమ్
ఘనరజస్వలం దర్శయన్ముహు
ర్మనసి నస్స్మరం వీర! యచ్ఛసి ॥
12
(తా॥ ఓ వీరుడా! ప్రతిరోజూ సాయంకాలం అయ్యే సరికి, నువ్వు అడవినుంచి ఆవులను తోలుకుంటూ, ముఖం మీద ముసురుకున్న జులపాల జుట్టుతో, అడవి దుమ్ముతో, మరింత అందంగా వున్న నీ ముఖపద్మాన్ని మాకు చూపించుకుంటూ ఊరిలోకి వస్తూ, నీ దర్శనంతోనే మా హృదయాలలో అనురాగాన్ని పొంగింప చేస్తున్నావు.)
ప్రణతకామదం పద్మజార్చితం
ధరణిమండనం ధ్యేయమాపది
చరణపంకజం శంతమం చ తే
రమణ! నః స్తనేష్వర్పయాధిహన్ ॥

13
(తా॥ మమ్మల్ని ఆనందింపజేసే ఓ ప్రియా! నీ పాదపద్మం సామాన్యమైనది కాదు. అది కొలిచేవారి కోరికలన్నీ తీరుస్తుంది. దానిని బ్రహ్మదేవుడే పూజించాడు. అది ఇప్పుడు భూమికే అలంకారంగా వుంది. ఆపదలు వచ్చినప్పుడు దానినే స్మరించాలి. ఎందుకంటే- అది శుభప్రదమైనది, ఆనందదాయకమైనది. ఓ హృదయవ్యాధి నివారకా! అటువంటి నీ పాదపద్మాన్ని మా స్తనాల మీద నిలిపి వుంచు. అంటే, శక్తిపాతం చేయి.)
సురతవర్ధనం శోకనాశనం
స్వరితవేణునా సుష్ఠు చుంబితమ్
ఇతరరాగవిస్మారణం నృణాం
వితర వీర! నస్తే-దరామృతమ్ ॥
14
(తా॥ ఓ వీరా! నీ అధరామృతం అద్భుతమైనది. అది ప్రేమను పెంచుతుంది. దుఃఖాలను నశింప చేస్తుంది. రాగాలను మ్రోగించే వేణువాద్యపు ముద్దులకు మరగింది. మానవుల ఇతర రాగాలను (కోరికలను) అన్నిటినీ మరపింప చేస్తుంది. అటువంటి నీ అధరామృతాన్ని (అంటే వేణుగానాన్ని) మాకు విరివిగా దానం చేయి.)

- కుప్పా వేంకట కృష్ణమూర్తి.. 9866330060