S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

‘చే’జారిన పొత్తులు

న్యూఢిల్లీ, మార్చి 21: లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాన మంత్రి నరేంద్రమోదీని ఓడించి కేంద్రంలో అధికారంలోకి రావాలని కలలు కంటున్న కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మిత్రపక్షాలతో సీట్ల సర్దుబాటు చేసుకోలేకపోతున్నారు. కాంగ్రెస్ అధినాయకత్వం ఒక్క మహారాష్టల్రో మాత్రమే మిత్రపక్షమైన ఎన్‌సీపీతో సీట్ల సర్దుబాటు చేసుకోలిగింది. బిహార్‌లో ఆర్జేడీ, ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీతో ఎన్నికల పొత్తు కాంగ్రెస్ అధినాయకత్వానికి తలనొప్పిగా మారింది. ఉత్తరప్రదేశ్‌లో మిత్రపక్షాలైన బహుజన్ సమాజ్, సమాజ్‌వాదీ పార్టీలతో సీట్ల సర్దుబాటు చేసుకోవటంలో విఫలమైన రాహుల్ ఆ రాష్ట్రంలో రెండు మూడు చిన్నాచితకా పార్టీలతో కలిసి లోక్‌సభ ఎన్నికలకు సిద్ధమయ్యారు. ఢిల్లీలోని ఏడు లోక్‌సభ స్థానాల్లో ఆమ్‌ఆద్మీ పార్టీతో సీట్ల సర్దుబాటు కాంగ్రెస్‌కు సమస్యగా మారింది. దేశ రాజధాని ఢిల్లీలో బతికి బట్టకట్టాలంటే ఆప్‌తో చేతులు కలపకూడదని రాహుల్ గాంధీ భావించారు. అందుకే ఢిల్లీలోని ఏడు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులను రంగంలోకి దించాలని నిర్ణయించారు. కాంగ్రెస్ రంగంలో ఉంటే ఏడు సీట్లను బీజేపీ తన్నుకుపోతుందని ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ హెచ్చరించటంతో ఎన్‌సీపీ అధినేత శరద్ పవార్ రంగ ప్రవేశం చేశారు. రెండు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటుకు మధ్యవర్తిత్వం చేశారు. కాంగ్రెస్, ఆప్ ఎనె్నన్ని సీట్లలో పోటీ చేయాలనే అంశంపై అంగీకారం కుదరకపోడంతో బుధవారం శరద్ పవార్ మధ్యవర్తిత్వం విఫలమైంది. బిహార్‌లో 40 స్థానాల్లో ఎవరెన్ని సీట్లలో పోటీ చేయాలనే అంశంపై కాంగ్రెస్, ఆర్జేడీ మధ్య ఇంతవరకు ఒక అవగాహన కుదరలేదు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ రెండు సీట్లు గెలుచుకుంటే ఆర్జేడీ నాలుగు సీట్లలో విజయం సాధించింది. ఆర్జేడీ ఇప్పుడు 20 సీట్లను డిమాండ్ చేస్తోంది. మిగతా ఇరవై సీట్లలో కాంగ్రెస్‌కు తొమ్మిది, ఆర్‌ఎస్‌ఎల్‌పీ నాలుగు సీట్లు, హెచ్‌ఏఎంకు మూడు సీట్లు శరద్ యాదవ్ నాయకత్వంలోని లోక్‌తాంత్రిక్ జనతాదళ్ రెండు, వికాస్‌షీల్ ఇన్సాఫ్ పార్టీ రెండు సీట్లలో పోటీ చేయాలనే దిశగా చర్చలు జరుగుతున్నాయి. తమకు 11 సీట్లు కేటాయించాలని కాంగ్రెస్ డిమాండ్ చేయటంతో సర్దుబాటు చర్చలు స్తంభించిపోయాయి. అలాగే జమ్మూకాశ్మీర్‌లో కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ మధ్య విచిత్రమైన పరిస్థితి నెలకొంది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని ఆరు స్థానాల్లో బీజేపీ మూడు, పీడీపీ మూడు సీట్లు గెలుచుకుంది. కలిసి పోటీ చేసినా కాంగ్రెస్, ఎన్‌సీ ఒక్కచోటా గెలవలేదు. ఇప్పుడు కుదిరిన ఒప్పందం మేరకు కాంగ్రెస్ జమ్మూ, ఉద్దంపూర్‌లో పోటీ చేస్తే నేషనల్ కాన్ఫరెన్స్ శ్రీనగర్‌లో పోటీ చేస్తుంది. అనంతనాగ్, బారాముల్లా లోక్‌సభ నియోజకవర్గాల్లో కాంగ్రెస్, ఎన్‌సి స్నేహ పూర్వకంగా పోటీ పడతాయని ఆ పార్టీ అధినేత ఫరూక్ అబ్దుల్లా, రాజ్యసభలో కాంగ్రెస్ పక్షం నాయకుడు గులాం నబీ ఆజాద్ బుధవారం తెలిపారు. లద్దాక్ సీటు విషయంలో ఇంకా చర్చలు జరుగుతున్నాయని ఇరువురు నాయకులు చెప్పటం గమనార్హం. ఇక మహాకూటమిని ఏర్పాటు చేసి నరేంద్ర మోదీని ఓడిస్తామంటూ పెద్ద పెద్ద ప్రకటనలు చేసిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత రాష్ట్రం విషయానికి వస్తే కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకునేందుకు నిరాకరించారు. దీంతో కాంగ్రెస్ ఏపీలో ఒంటరి పోరుకే సిద్ధపడింది. మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లో కాంగ్రెస్‌కు మాయావతి నాయకత్వంలోని బహుజన సమాజ్ పార్టీ నుంచి తలనొప్పులు తప్పటం లేదు. రాహుల్ గాంధీ కర్నాటక, తమిళనాడులో మిత్రపక్షాలైన జేడీఎస్, డీఎంకేతో సీట్ల సర్దుబాటును విజయవంతంగా ముగించారు. అయితే కేంద్రంలో అధికారంలోకి వచ్చేందుకు అత్యంత ముఖ్యమైన ఉత్తరాది రాష్ట్రాల్లో మాత్రం ఎన్నికల పొత్తుల విషయంలో రాహుల్ విజయం సాధించలేకపోతున్నారు. లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తరువాత కూడా మిత్రపక్షాలతో కాంగ్రెస్ సీట్ల సర్దుబాటు చేసుకోలేకపోవటం పార్టీ నాయకులను ఆందోళనకు గురి చేస్తోంది.