S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

నీతోనే ఆగేనా.. సంగీతం?

మనసులో సంగీత ప్రసక్తి రాగానే కొన్ని పట్టణాలు, అక్కడ పుట్టి పెరిగిన మహా విద్వాంసులు గుర్తుకు రావటం సహజం.
తంజావూర్ జిల్లా పేరు చెబితే మూర్తి త్రయం గుర్తుకొస్తుంది. సంగీత ప్రియులకు ఆ మహనీయులు తిరిగిన ప్రాంతాలు చూడాలనుకోవటం సర్వసాధారణ విషయం. ఎక్కడెక్కడో పుట్టి మొత్తం దేశంలోని సంగీత రసజ్ఞులందరినీ ప్రభావితం చేసి, కీర్తినీ, అఖండ ఖ్యాతినీ పొందటం కన్నా విశేషమేముంటుంది.
దక్షిణాదిలో చెన్నై నగరం కర్ణాటక సంగీతానికి పుట్టిల్లు. సంప్రదాయ సంగీత ప్రసక్తి వచ్చిందంటే మనసులో మెదిలేది మద్రాసే.
విత్తు ఒకటైతే వేరు మరొకటవుతుందా? సంగీతం పెరిగి పెరిగి మహా వటవృక్షంలా అవటానికి కారణం అక్కడ పుట్టిన మహా విద్వాంసులే. అందుకే దక్షిణాది విద్వాంసులు, వారు పుట్టిన ఊరునే ఇంటి పేరుగా పిలుచుకుని సంబరపడతారు. గర్వంగా భావిస్తారు. మన తెలుగు వారికి ఈ స్వాభిమానం దాదాపు మృగ్యం. బొంబాయి పేరు చెబితే ఎందరెందరు గాయనీ గాయకులు గుర్తుకొస్తారో? మరెందరు హిందూస్థానీ విద్వాంసులు మనసులో మెదులుతారో? ఆ మధ్య కలకత్తాలో నాలుగు రోజులుండే అవకాశం లభించింది. ‘యమహా నగరి కలకత్తాపురీ, నమహో హుగిలీ హౌరా వారధి’ అంటూ ప్రాస కోసం పాట రాసిన వేటూరి గుర్తుకొచ్చాడు. కలకత్తా నగరం అనగానే స్ఫురించేవి హౌరా బ్రిడ్జి ఒకటే గాదు. పులకరింప చేసే చాలా సంఘటనలున్నాయి.
పశ్చిమ బెంగాల్ ఒకప్పుడు స్వాతంత్య్ర సమరంలో ప్రధాన భూమిక వహించిన ప్రాంతం. అంతకంటే అదో సాంస్కృతిక కేంద్రం.
ఎందరో కవులకు, కళాకారులకు, గాయకులకు, సంగీత దర్శకులకు జన్మనిచ్చిన స్థానం.
‘న్యూ థియేటర్స్’ ఒక్కటి చాలు. దాని చుట్టూ ఎంత చరిత్ర అల్లుకుపోయిందో తెలిస్తే ఈ తరం వారికి కొత్తగా ఉంటుంది. సినిమా రంగానికి దిక్సూచి లాంటి స్థానం కోల్‌కతా. సీత, అనసూయ అనే జానపద గాయనీమణులలో అనసూయ, మన సినీ సంగీత దర్శకుడు సాలూరి రాజేశ్వర్రావు వెర్రిగా అభిమానించి ఆరాధించిన కె.ఎల్.సైగల్ అదుగో, అక్కడివాడే. సైగల్ లాంటి గాయకుడు మరొకడు పుట్టడు అనుకునేంతటి గొప్పవాడు. చాలామంది నేపథ్య గాయకులకు స్ఫూర్తినిచ్చిన నటుడు, గాయకుడు. ఒకప్పడు ఒళ్లు తెలియని దశలో కూడా నౌషద్ అర్ధరాత్రి అపరాత్రి అనుకోకుండా సైగల్‌తో పాటలు పాడించిన సంఘటనలన్నీ కలకత్తా నగరంలో వున్నన్నాళ్లూ బుర్రలో తిరుగుతూనే వున్నాయి. శరత్‌చంద్ర రాసిన ‘దేవదాసు’ చిత్రాన్ని 1935లో పి.సి.బారువా దర్శకత్వం వహించి సైగల్‌తో తీశారు. ఆ తర్వాత ఈ దేవదాసు ఎన్ని కోట్ల మందిని ప్రభావితం చేశాడో ఎన్ని భాషల వారిని పలుకరించాడో మీకు తెలుసు.
కె.సి.డే, కానన్‌దేవి, ఆర్.సి.బొరాల్, పంకజ్ మల్లిక్, సిహెచ్.ఆత్మా, తిమిర్‌బరన్ లాంటి వారు తిరుగాడిన గడ్డ. ప్రాణం పెట్టి పాటలు చేసిన సంగీత దర్శకులుండేవారు. జ్ఞాన సంపన్నులు. దిశా నిర్దేశకులు. ఈ తరం వారికి తెలియదు. గతంలో వీరందరి పాట విన్నాను. రేడియోలో పనిచేసిన రోజుల్లో నాకదే ప్రవృత్తి. ఓ రోజు సాయంత్రం లిఫ్టు దిగి వస్తూండగా స్పీకర్‌లో ఒక బెంగాలీ ట్యూన్ చెవిన పడింది. హేమంతకుమార్ అనే బెంగాలీ గాయకుడు పాడాడు. ఈ ట్యూన్ ఎక్కడో విన్నట్లుగా ఉందే? అనుకునేలోగా వెంటనే గుర్తుకొచ్చేసింది. ‘ఆరాధన’ చిత్రానికి రాజేశ్వర్రావు చేసిన ‘నా హృదయంలో నిదురించే చెలీ’ అక్కినేని నాగేశ్వర్రావు పియానో వాయిస్తూ పాడే పాట. నేపథ్య గానం ఇంకెవరు? ఘంటసాలే. ఆ పాటకు మాతృక ఈ హేమంత్‌కుమార్ పాడిన బెంగాలీ ట్యూనే. అక్కడి ట్యూను వచ్చి మద్రాసు చేరింది. రెండింటికీ ఒక్కటే తేడా. ఆ బెంగాలీ ట్యూన్ చాలా సీదాసాదాగా ఆ భాషకు తగినట్లుగానే అందులో వొదిగిపోతే అదే ట్యూను ఘంటసాల కంఠంలో పలకగల పలికించగల గమకాలతో సర్వాంగ సుందర శోభితంగా తయారై నిలిచిపోయింది. ఇద్దరికీ అసలు పోలికే లేదు. ఘంటసాల గమకాల ముందు ఆ బెంగాలీ ట్యూన్ నిలబడదు. సంగీతంలో గమకానికి చాలా ప్రాధాన్యత ఉంటుందని తెలుసు కానీ మరీ గమకాలు బొత్తిగా కంఠంలో పలికించలేని, గాయకులు ఎలా పాపులరై ప్రసిద్ధులుగా చెలామణి అవుతున్నారు? ఏమిటి కారణం అని ఆలోచించాను. మాధుర్యం నిండిన కంఠాలు, మాటలు ఉచ్ఛరిస్తూంటేనే భావం బయటపడటం, నాదం నాభిలో నుండి రావటం, ప్రధాన కారణాలైతే, అటువంటి కంఠాల్లో గమకాలు లేని లోటు తెలియదు. పొడిపొడిగా వినబడే స్వరాల్లో జీవం కనిపించాలి. నిర్జీవంగా వుండకూడదు. అందుకే వారికీ ఆ కీర్తి లభించి, సినిమా రంగంలో నిలదొక్కుకునేలా చేసిందన్న మాట.’ అనే నిర్ధారణకొచ్చాను. హిందీ సినిమా రంగంలో తలత్ మెహమ్మద్ అనే నేపథ్య గాయకుని కంఠం ఒదుగులతో నిండే ఉంటుంది. అదో రకమైన కంపిత స్వరంతో భావ గర్భితంగా పాడుతోంటే మనసులు కరిగిపోతాయి. హృదయాలు ద్రవించి పోవలసిందే. రోషన్, మధుమోహన్ లాంటి సంగీత దర్శకులు చేసిన పాటలన్నీ హిట్లే.
బెంగాలీ మాతృభాషగా గీతాదత్ అనే గాయని ఒకామె వుండేది. మహా సంగీత జ్ఞానం లేకపోయినా మృదువైన తేనెలూరే కంఠస్వరమే ఆమె ఆస్తి. నౌషద్, ఓపి.నయ్యర్, ఎస్.డి.బర్మన్ లాంటి సంగీత దర్శకులు చేసిన గీతాదత్ పాటలు ఎప్పుడు విన్నా నిత్యనూతనమే.
అల్లరి చిల్లరిగా గెంతులేస్తూ తమాషాగా యూడివింగ్ యాసతో పాడే కిషోర్‌కుమార్ గురించి తెలియని వారెవరూ ఉండరు.
కిషోర్ చేత రాగరసభరిత భావ గర్భితమైన విషాద వైరాగ్య గీతాలు పాడించిన సంగీత దర్శకుడు ఎస్.డి.బర్మన్, ‘ముఖేష్’గా ప్రసిద్ధుడైన ముకేష్‌చంద్ మాధుర్ (1923-1976) పాత వింటే ఎదురుగా రాజ్‌కపూర్, మనోజ్‌కుమార్, సునీల్‌దత్, దిలీప్‌కుమార్ లాంటి నటులు కళ్లల్లో కనిపిస్తారు. వారికి అంత కీర్తి లభించడానికి కారణం ముఖేష్. తన చెల్లెలు సంగీతం నేర్చుకునే రోజుల్లో పక్కగదిలోనే ఉండి ఆ పాఠాలు విని సంగీతం పట్ల ఆసక్తిని పెంచుకున్న ముఖేష్ కంఠంలో గమకాలు బొత్తిగా వినబడక పోయినా, పేరు లభించడానికి కారణం, నాభి హృత్కంఠ రసన నాసాదుల ద్వారా వినబడే భావస్ఫోరకమైన నాదంతో కూడిన పాటే. నేపథ్య గానానికి కావలసినదదే. నిజానికి మహ్మద్ రఫీ, కిషోర్‌కుమార్, ముఖేష్ లాంటి వారందరికీ కె.ఎల్.సైగలే స్ఫూర్తి.
కేవలం శ్రుతిపక్వమైన కంఠముండి పాడే విధానం తెలియకపోతే ఏం ప్రయోజనం?
అందుకే సంగీత శాస్తజ్ఞ్రానం వినా మరో దగ్గర దారులంటూ వుండవు.
ప్రతి సంగీతానికీ కొన్ని పరిమితులుంటాయి. ఎంతవరకూ అవసరమో అంతవరకే తెలుసుకుని, పాడగలిగే నేర్పును సాధించాలి. సినిమా వాళ్లకు కావలసిన అర్హత అదే. ‘జీనా యహాఁ! మర్‌నా యహాఁ! ఇస్‌కే శివా జానా కహాఁ?’ ముఖేష్ పాడిన పల్లవి మీరు వినే ఉంటారు. అక్షరాలను ఉచ్చరించడానికి ఏర్పడ్డ పొడిపొడి స్వరాలు తప్ప సంగీతం ఎక్కడా బరువుగా వుండదు. కానీ ఆ నాలుగు మాటలను శ్రుతిపక్వంగా, నిర్వేదంతో, మనసుకు చేరి హత్తుకుపోయేలా ఒక్కసారిగా వైరాగ్య భావం పుట్టుకొచ్చేలా పాడేశాడు. చాలు. మళ్లీ మళ్లీ వినాలనిపించేలా వుండే ఆ కంఠధ్వని కోసం శ్రోతలు ఎదురుచూడటంలో ఆశ్చర్యమేముంది? ఓసారి హైదరాబాద్ హరిహర కళాభవన్‌లో జరిగిన ఓ సంగీత కచేరీకి మహామహోపాధ్యాయ డా.నూకల చినసత్యనారాయణ హాజరై వచ్చి నా పక్కనే కూర్చున్నారు. ‘పది పదిహేను సంవత్సరాలు నిండకుండానే రియాలిటీ షోల్లో, పాడే అద్భుతమైన గానం వింటూంటే నాకెంతో ఆశ్చర్యంగా ఉంటుందండీ! అసాధారణమైన ప్రజ్ఞతో సహజమైన ఆ మనోధర్మంతో పాడే వారి గానాన్ని పొగిడేందుకు మాటల సరిపోవు సుమా! ఆ వయస్సులో నేనలా పాడి వుండను. కొనే్నళ్లపాటు శ్రద్ధగా గురుముఖంగా కూర్చుని సాధన చేస్తే గాని లభించనిది అంత చిన్న వయస్సులో అంత పరిపక్వంగా ఎలా పాడగల్గుతున్నారో? ఆశ్చర్యమే.’ అంటూ హిందీ టీవీ ఛానళ్లలో పోటీగా పాడే బాల కళాకారులను ప్రశంసించిన పలికిన మాటలు నాకింకా గుర్తే. మనకు తెలియదు గానీ, మన చుట్టూ సంగీతం పెరుగుతూనే ఉంటుంది. ఒక్కొక్కరిలో ఒక్కొక్క రూపంలో వ్యక్తవౌతూంటుంది. అందుకే ముఖేముఖే సరస్వతి - అనే మాట తరచుగా అంటూంటారు. మన సంప్రదాయ సంగీతం నేర్చుకున్న వారిలో రాగాలాపన, గమక శుద్ధంగా పాడటం, అప్పటికప్పుడు స్వయంగా కీర్తనలకు స్వరకల్పనతో సంభ్రమంగా పాడటం ప్రధానంగా కనిపించే లక్షణాలు. హిందూస్థానీ సంగీతాభ్యాసమంతా ‘రాగం’ మీదే కేంద్రీకృతమై ఉంటుంది. సాహిత్యం కంటే వారికి మనోధర్మంతో కూడిన రాగమే ముఖ్యంగా లయ ప్రాధాన్యంగా సాగుతుంది. విలంబిత్ ఏక్‌తాళ్, ధృత్ తీన్ తాళ్ లాంటి సాంకేతిక పదాలు మీరు రేడియోల్లో వినే వుంటారు. ఎంతో తాపీగా రాగాన్ని ప్రారంభించి ఉధృతంగా పాడి ముగిస్తారు. అవసరం కొద్దీ పాడే సంగీతానికి బ్రహ్మానంద ప్రాప్తి కోసం పాడుకునే సంగీతానికీ తేడా ఉంది.
సరళీ స్వరాలు, వాటి స్వరస్థానాలు, జంట వరుసలు, దాటు వరసలు, అలంకారాల్లాంటివన్నీ నేర్చుకునే దశలో కాస్త గందరగోళంగా కనిపిస్తాయి. తట్టుకుని సాధన చేయగా చేయగా, పాట పాడగలిగే స్థాయిని నిర్ధారించి, పాడే పాటకు రూపాన్ని, రక్తినీ ఇవ్వగలిగేది మాత్రం ఈ స్వరజ్ఞానమే. ఈ సూక్ష్మం తెలుసుకునే లోగానే, సంగీతానికి స్వస్తి చెప్పేసే కొందరు గాయకులవ్వడానికి దగ్గర దారులను అనే్వషిస్తారు. కొందరే కృతకృత్యులౌతారు. మరి కొందరు నిరాశా నిస్పృహలకు లోనవుతారు. అందుకే రజత గిరీశుడు నగజకు తెల్పిన స్వరార్ణవ మర్మములు తెలిసిన త్యాగరాజు ‘పరమానందమనే కమలముపై ఒక ఖేకములు చెలగే మనసా’ అని హెచ్చరించాడు. ఈ సూత్రం సంగీతానికే పరిమితం కాదు. జీవన గమనంలో ప్రతి విషయానికీ వర్తిస్తుంది.

- మల్లాది సూరిబాబు 90527 65490