S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

నీ రూపం.. మానవాళికి మంగళప్రదం (రాస క్రీడాతత్త్వము-18)

అటతి యద్భవానహ్ని కాననం
త్రుటిర్యుగాయతే త్వామపశ్యతామ్
కుటిల కుంతలం శ్రీముఖం చ తే
జడ ఉదీక్షతాం పక్ష్మకృద్దృశామ్ ॥
15
(తా॥ కృష్ణా! నువ్వు పగలల్లా ఆవుల్ని మేపుకుంటూ అడవులలో తిరుగుతుంటే, నువ్వు కనిపించక పోవడంవల్ల మాకు క్షణం యుగంగా గడుస్తోంది. ఇంతలో, సా యంకాలమై, ఉంగరాల ముంగురులు గల ముఖపద్మం తో ఊళ్ళోకి వస్తున్న నిన్ను చూస్తుంటే, ఈ రెప్పపాటులు మాకు అడ్డం వస్తున్నాయి. మా కళ్ళకు ఈ రెప్పపాట్లను పెట్టిన ఆ బ్రహ్మదేవుడు నిజంగా బుద్ధి తక్కువవాడు సుమా!) (అంటే, నిజానికి మేము దేవజాతివారమయ్యా, మానవులుగా పుట్టే సరికి, ఈ రెప్పపాటు అనేది వచ్చి, మమ్మల్ని ఇబ్బంది పెడుతోంది- అని భావం.)
పతిసుతాన్వయభ్రాతృబాంధవా
నతివిలంఘ్య తే-ంత్యచ్యుతాగతాః
గతివిదస్తవోద్గీత మోహితాః
కితవ! యోషితః కస్త్యజేన్నిశి ॥
16
(తా॥ హే అచ్యుతా! (వినాశం లేని పరమాత్మా!) నీ వేణుగాన నాదాలకు మోహపడి (ఇక్కడ వేణునాదం అనటానికి ‘‘ఉద్గీతము’’ అనే పదం వేశారు. ఈ పదానికి ‘‘ఓంకారం’’ అని కూడా అర్థం.) మేము భర్తలను, పుత్రులను, వంశమర్యాదలను, అన్నదమ్ములను, ఇతర బంధువులను, అందరినీ తిరస్కరించేసి, నీ దగ్గరకు వచ్చాం. (మాకు ఇప్పుడు ఏ సంసార బంధాలూ లేవు. మేము వట్టి సంన్యాసులం.) మా గతి ఏమిటో నీకు తెలుసు. మేము వచ్చామనీ నీకు తెలుసు. అయినా మమ్మల్ని వదిలి మాయం అయిపోయావు. ఓ మోసగాడా! నీ లాంటి కఠినుడు తప్పితే మరొకడు ఎవడైనా అర్ధరాత్రి పూట ఆడవారిని ఒంటరిగా వదిలిపెట్టి వెళ్ళిపోతాడా?)
రహసి సంవిదం హృచ్ఛయోదయం
ప్రహసితాననం ప్రేమవీక్షణమ్
బృహదురశ్రీ్శయో వీక్ష్య ధామ తే
ముహురతిస్పృహా ముహ్యతే మనః ॥
17
(తా॥ కృష్ణా! నీ రహస్య సంకేతాలు, హృదయంలో మన్మథుడ్ణి రేకెత్తించే చిరునవ్వులు, ప్రేమను కురిపించే చూపులు, లక్ష్మీనివాసమైన నీ విశాల వక్షస్థలము, ఇవన్నీ చూసి, అతిస్పృహ (అత్యధికమైన ప్రేమ, లౌకికస్థితిని దాటిపోయిన ప్రేమ, లేక అలౌకిక జ్ఞానం) మమ్మల్ని కమ్మివేస్తోంది. దానివల్ల మా మనస్సు మాటి మాటికీ మోహంలో పడిపోతోంది.)
వ్రజవనౌకసాం వ్యక్తిరంగ! తే
వృజినహంత్య్రలం విశ్వమంగలమ్
త్యజ మనాక్ చ నః త్వత్‌స్పృహా-త్మనాం
స్వజనహృద్రుజాం యన్నిషూదనమ్ ॥
18
(తా॥ నీ సాక్షాత్కారం గోకులవాసులకు మాత్రమే కాక, వన నివాసులైన మహర్షులకు కూడా పాపాలను, తాపాలను, పోగొట్టే మహిమ కలది. అది సమస్త ప్రపంచానికీ మంగళప్రదమైనది. అది నీ సొంత మనుషుల హృద యాలలోని దుఃఖాలను పోగొడుతుంది. ఓ కృష్ణా! మాకు నీ మీద వల్లమాలిన ప్రేమయ్యా! మేము నీవారమయ్యా! మా కోసం నీ సాక్షాత్కారాన్ని కొంచెమైనా త్యాగం చే యవయ్యా!)
యత్తే సుజాత! చరణాంబురుహం స్తనేషు
భీతాశ్శనైః ప్రియ! దధీమహి కర్కశేషు
తేనాటవీమటసి తద్వ్యదతే న కింస్వి
త్కూర్పాదిభిర్భ్రమతి ధీర్భవదాయుషాం నః ॥
19
(తా॥ ఓ ప్రియా! ఓ అందమైన అవతారం కలవాడా! మా స్తనాలే కర్కశంగా వున్నాయని భయపడుతూ, మెల్లి మెల్లిగా వాటిపై నీ పాదపద్మాలను మేము జాగ్రత్తగా ధరిస్తూ వుంటాము. ఇప్పుడు నువ్వు మమ్మల్ని తప్పించుకోవడం కోసం, అటువంటి మృదు పాదపద్మాలతో ఈ అడవిలో ఎక్కడెక్కడో తిరుగుతున్నావు. ఈ చీకట్లో ములుకురాళ్ళు గుచ్చుకొని నొప్పి కలగటం లేదా? మాకు మాత్రం నీ పాదాల నొప్పిని తలచుకుంటే బుర్ర తిరిగిపోతోంది. ఎందుకంటే, మాకు నువ్వే ప్రాణం కదా స్వామీ!)
శ్రీమద్భాగవతంలో పదవ స్కంధంలో
గోపికాగీతము అనబడే 31వ అధ్యాయం సమాప్తము.

- కుప్పా వేంకట కృష్ణమూర్తి.. 9866330060