S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

పరుగు

అప్పుడు నేను మేజిస్ట్రేట్‌గా పని చేస్తున్నాను. వేరే పని మీద పోలీస్ అకాడెమీ ఫ్యాకల్టీలో డిప్యుటేషన్ మీద పని చేస్తున్నాను. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ పోలీసులకు, మేజిస్ట్రేట్‌లకు బైబిల్ లాంటిది. ప్రతిరోజూ ఆ చట్టంతో పని లేకుండా ఉండదు.
నేరుగా నియామకం అయిన డిఎస్పీలకు క్లాస్ తీసుకున్నాను. వారం రోజుల తరువాత ఐఐటిలో చదివిన ఓ ట్రైనీ వచ్చి-
‘మీరు మేజిస్ట్రేట్‌గా చేరి ఉండాల్సింది కాదు. నేరుగా జిల్లా జడ్జిగానో, హైకోర్టు జడ్జిగానో నియమితులైతే బాగుండేది. ఇంత పరిజ్ఞానం ఉండి ఈ ఉద్యోగానికి రావడం బాధగా ఉంది’ అన్నాడు.
నాకు సంతోషం వేసింది. నవ్వొచ్చింది. ఆ తర్వాత ఇదే పరిస్థితి జ్యుడిషియల్ అకాడెమీ డైరెక్టర్‌గా పని చేస్తున్నప్పుడు కూడా వచ్చింది. నేరుగా జిల్లా జడ్జిగా నియమితులైన కొంతమంది కూడా ఇదే మాట నాతో అన్నారు.
అప్పుడు కూడా అదే సంతోషం. అదే నవ్వు. డిఎస్పీకి చెప్పిన విషయమే వీళ్లకీ చెప్పాను.
‘అప్పుడున్న పరిస్థితిలో మనం ఓ నిర్ణయం తీసుకుంటాం. అప్పుడు అది సరైందే. తరువాత మన పరిస్థితులు మారతాయి. మన ఆలోచనలు మారతాయి. నేను చిన్న పట్టణంలో న్యాయవాదిగా పని చేస్తున్నప్పుడు అక్కడున్న అనారోగ్యకరమైన వాతావరణం నన్ను మున్సిఫ్ మేజిస్ట్రేట్ ఉద్యోగం చేయడానికి ప్రోద్బలం ఉంది. ఆ చిన్న పట్టణంలో ప్రాక్టీస్ చేయడానికి కారణం ఉంది. మా తల్లిదండ్రుల మీద, అన్నల మీద ఆధారపడకుండా స్వతంత్రంగా జీవించాలన్న ఉద్దేశంతో ఆ పట్టణాన్ని ఎంపిక చేసుకోవడం జరిగింది. ప్రతి నిర్ణయానికి ఓ కారణం ఉంటుంది. ఓ నేపథ్యం ఉంటుంది.
మనకన్నా ఎవరో ఒకరు ముందుంటారు. పెద్ద ఉద్యోగంతో, పెద్ద కారుతో, ఎక్కువ డబ్బుతో, ఎక్కువ చదువుతో, అందమైన భార్యతో, చెప్పినట్టు వినే పిల్లలతో.
ఒకటి మాత్రం నిజం. మనకన్నా చాలా తెలివిగల వాళ్లు మనకన్నా తక్కువ స్థాయి ఉద్యోగాలు చేస్తున్నారు. మనకన్నా తెలివితేటల్లో తక్కువ స్థాయి వున్న వ్యక్తులు మనపైన వున్నారు.
జీవితం మనకు ఇచ్చిన దానితో సంతృప్తి చెందాలి. ఎదగడానికి ప్రయత్నం చేయాలి. మన అంతస్తు, మన అనాకారితనం, మన కులం, మన ప్రాంతం, మన భాష అన్నింటి పట్ల గౌరవం ఉండాలి. ఆరోగ్యకరమైన జీవితం గడపడానికి ప్రయత్నించాలి. మన పరుగు మనం పరుగెత్తాలి. అందరూ మంచిగా పరుగెత్తాలని కోరుకోవాలి’ ఇది నా జవాబు. అందరికీ.