S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

రణక్షేత్రం 25

అశోక్
పర్ఫెక్ట్ ప్లానింగ్ అంటే నా దగ్గర చూసి ఎవరైనా నేర్చుకోవాలి. అది రాజకీయాల్లో మెట్లు ఎక్కటానికి కావచ్చు లేదా ఆడపిల్లలను దిగజార్చటంలో కావచ్చు.
వసుంధర మీద నా కన్ను పడినపుడు ఆమెని లొంగదీయటానికి అన్ని రకాల ప్రయత్నాలు చేశాను. మాల్‌కి వెళ్లి మరీ ఆమెని పొగిడాను. బహుమతులిచ్చాను. లాభం లేకపోయింది. ప్లాను మార్చాను. సంతోష్ టీమ్‌లో ఆమెకు వేషం ఇప్పించాను. వసుంధరకి ఇరవై నాలుగు గంటల కాపలా పెట్టాను. మూడు రోజుల్లోనే అనుకోని అవకాశం వచ్చింది. అభిమన్యు ఫామ్‌హౌస్ నుండి వసుంధరని ఎవరికీ అనుమానం రాకుండా తెప్పించాను. అసలే డ్రగ్స్ మత్తులో ఉన్న ఆమెని మరో మూడు రోజులు అలాంటి మత్తులోనే ఉంచాను. ఈ మూడు రోజుల్లో ఆమె శరీరంతో ఆడుకోదగిన ఆటలన్నీ ఆడుకున్నాను. అయినా ఆమె మీద నా మోహం తీరలేదు.
చాలా చాకచక్యంగా అనుమానాన్ని చంద్రం, అతని స్నేహితులు మీదకి వచ్చేటట్లు చేశాను. నా మీద గౌరవం పెరిగేటట్లు చూసే భారాన్ని జానకి మోసింది. అనుకున్న దానికంటే తేలిగ్గా లొంగిపోయింది వసుంధర. ఎప్పటికీ నా ఉంపుడుగత్తెగా ఉండటానికి అంగీకరించింది. మధ్యమధ్యలో ఆ ముగ్గురి మీద ప్రతీకారం తీర్చుకోవటం అనే మాటలు మాట్లాడేది. ఇప్పుడు దానికి అనువయిన సమయం కాదని నేను చెప్పిన మాటలకు పడిపోయింది.
సంవత్సరాలు గడిచాయి. రాజకీయంగా ఎదిగాను. ఈసారి ఎన్నికల్లో గెలిస్తే మంత్రి పదవి గ్యారంటీ అన్నారు.
ఎంత ఇష్టమయిన వస్తువయినా మితిమీరి తింటే మొహం మొత్తక తప్పదు. వసుంధర కూడా నాకు మొహం మొత్తటం మొదలుపెట్టింది. ఆమెని వదిలించుకోవలసిన సమయం వచ్చిందని అర్థమైంది. ఏవో పనుల్లో పడి ఆ పని చేయటానికి కాస్త ఆలస్యం అయింది. ఆ ఆలస్యం కూడా నాకే లాభించింది.
నా నియోజకవర్గాన్ని రిజర్వ్‌డ్ చేయటం వలన నాకు పార్టీ సీటు ఇవ్వలేక పోయింది. అలా జరగటంలో ముఖ్యమంత్రి హస్తం గ్యారంటీగా ఉందని అందరూ అన్నారు. కానీ రుజువు లేదు. నన్ను రాజకీయంగా అణగదొక్కటానికి ముఖ్యమంత్రి వేసిన ఎత్తుగా అందరూ దాన్ని చూశారు. నా రాజకీయ భవిష్యత్తు అనుమానంలో పడింది. అప్పుడు... వసుంధర నాకు మరోసారి ఉపయోగపడింది. ఆమెది కూడా రిజర్వ్‌డ్ కులం కావటంతో నా నియోజకవర్గంలో ఆమెని పోటీ చేయడానికి ఒప్పించాను. నాకు రాజకీయ సమాధి కడదామనుకున్న ముఖ్యమంత్రి ఇది ఊహించలేదు.
నా సపోర్ట్ ఉండటంతో వసుంధర అతి తేలిగ్గా ఎన్నికల్లో గెలిచింది. నాకు కొద్దిగా కూడా ఈర్ష్యగా అనిపించలేదు. ఎందుకంటే ఆమెని నేను ఎపుడూ ఒక వ్యక్తిత్వం ఉన్న మనిషిగా చూడలేదు. నేను ఎలా ఆడిస్తే అలా ఆడే కీలుబొమ్మలా చూశాను.
అయితే నాకు తగిలిన మొదటి షాక్ ఆమె మంత్రి కావటం. ముఖ్యమంత్రి నన్ను అనుకోని కోణంలో దెబ్బతీస్తున్నాననుకున్నాడేమో ఆమెకి మంత్రి పదవి ఇచ్చాడు.
నా ఫ్యాక్టరీలు మునుపటి అంత లాభసాటిగా నడవటం లేదు. వాటి మీద ధ్యాస పెట్టవలసి వచ్చింది. ఎక్కువ మా ఊర్లో ఉండవలసి వస్తోంది. అందుకని వసుంధర దగ్గరకు రావటం బానే తగ్గిపోయింది. నా పరోక్షంలో ఆమె ఎంతగా ఎదుగుతుందో గమనించలేక పోయాను. ఆమెని పంజరంలో చిలుక అనుకున్నాను. ఈ తీరిక సమయంలో కంపెనీల్లో ఉన్న సమస్యలు తీర్చుకుంటే, తిరిగి ఎన్నికలు వచ్చేనాటికి నా నియోజకవర్గం జనరల్ కాటగిరీకి మారుతుంది కాబట్టి, అప్పుడు నాకు ఎదురు ఉండదనుకున్నాను.
నెమ్మది నెమ్మదిగా వసుంధర తీసుకుంటున్న స్వంత నిర్ణయాలు ఏనాటికైనా నాకు వ్యతిరేకమవుతాయని గుర్తించలేక పోయాను. నేను అగ్ర కులాలను బేస్‌గా తీసుకుని నిర్మించుకున్న కంచుకోట లాంటి నియోజకవర్గాన్ని నిమ్న కులాల దుర్గంగా మార్చుకోవటం చూసి కూడా మిన్నకుండిపోయాను. తరువాతి ఎన్నికల్లో నేను నిలబడినపుడు అది కూడా నాకే కదా లాభం అనుకున్నాను.
ఒకటి రెండుసార్లు జానకి అన్యాపదేశంగా హెచ్చరించింది కూడా - వసుంధర చెయ్యి దాటి పోతోందని. నేను నమ్మలేదు. అసలు పట్టించుకోలేదు.
ప్రభుత్వంలో కూడా కొంతమంది నమ్మకస్తులను ఏర్పాటు చేసుకుంది. అందులో ఒకడు శ్రీనివాస్. అతని సహాయంతో సినీ హీరో అభిమన్యుని కటకటాల వెనక్కి పంపింది.
అభిమన్యుని జైలుకు పంపే విషయంలో వసుంధర నా సలహా తీసుకోకపోగా, కనీసం నాకు చెప్పకపోవటం నాలో మొదటిసారి అనుమాన బీజాలు మొలకెత్తించింది.
అమెరికా నుండి వచ్చినపుడు ఇక్కడ కనిపించిన ఫ్యాక్షనిజం నాకు ప్రమాదకరంగా పరిణమించటంతో
దాన్ని తుదముట్టించాలనుకున్నాను. తరువాత్తరువాత తెలిసింది రాజకీయాల్లో కూడా దాని ప్రభావం ఎంత ఉంటుందో... అందుకే దాన్ని తుదముట్టించకుండా కొనసాగిస్తూ వస్తున్నాను. నేను బహిరంగంగా బయటపడకుండా ఆ బాధ్యతలు మా బాబాయికి అప్పజెప్పాను.
అతను నమ్మినబంటు స్వామి. వారిద్దరూ కలిసి నా నియోజకవర్గంలో పారలల్ ప్రభుత్వానే్న నడుపుతున్నారు. వందల కోట్లు సంపాదించారు. నాకు ఆ డబ్బు అవసరం లేదు. కానీ ఎన్నికలపుడు వారి పవర్‌తో పని ఉంటుంది. అందుకే వాళ్ల యాక్టివిటీలను పరోక్షంగా ప్రోత్సహిస్తున్నాను.
అనుకోకుండా స్వామికీ, బాబాయికీ ఏమి చెడిందో కానీ, బాబాయి హత్యకి గురయ్యాడు. అది చేసింది స్వామే అన్నది పుకారు. బాబాయికి చెందిన కోట్ల డబ్బు స్వామి దగ్గర ఇరుక్కుపోయింది. దాన్ని తిరిగి కుటుంబానికి అప్పజెప్పాల్సిన బాధ్యత నా మీద పడింది. ఆ ప్రయత్నాల్లో హడావిడిగా ఉన్నాను. అండర్‌గ్రౌండ్‌లో ఉన్న స్వామిని కలుసుకోవాలని ప్రయత్నిస్తున్న నాకు పిడుగు లాంటి వార్త ఒక తెల్లవారుజామున తెలిసింది. స్వామి పోలీసులకు పట్టుబడ్డాడు. అది కూడా ఆశ్చర్యం కలిగించలేదు. పోలీసుల చర్యలో భాగంగా సంతోష్ మరణించటం నా అనుమానాలను మళ్లీ వసుంధర వైపు మరలేటట్లు చేశాయి. యధాప్రకారం ఆమె ఏమీ చెప్పలేదు. శ్రీనివాస్ పూర్తిగా ఆమె మనిషిగా మారిపోయాడు. నాకు సహకరించడు. ఆమె సంతోష్‌ని ఏమి చేసుకుంటే నాకేమి సంబంధం? నా డబ్బు ఇక బయటపడే మార్గం మూసుకుపోవటం ఇరిటేషన్ కలిగించింది.
వసుంధర తన పదవికి సంబంధించి బిజీ అయ్యే కొద్దీ నాతో గడపటం తగ్గిపోతోంది. నేను కూడా వేరే పనులతో బిజీగా ఉండటంతో ఆమె దగ్గరకు వెళ్లటం తగ్గింది.
ఒక ముఖ్యమైన విషయం మాట్లాడటానికి ఆమెని కలిశాను. ఆ రోజు ఆమె ఎప్పటికంటే ఆనందంగా ఉంది. కారణం అర్థం కాలేదు. అదే అడిగాను.
‘రాత్రి చంద్రం సినిమా ప్రివ్యూకి వెళ్లాను..’ అంది.
చంద్రం అన్న పేరు వినగానే ఉలిక్కిపడ్డాను. వసుంధర ఆ ముగ్గురిలో ఎవరినీ కలుసుకోవటం నాకు ఇష్టం లేదు. ‘అందులో విశేషం ఏముంది?’ అన్నాను.
‘ఇవాళ పేపర్ చూడలేదా?’ పేపర్లో సినిమా పేజీ నా ముందుకు జరుపుతూ అంది. చంద్రం సినిమా పైరసీ బ్లాక్‌మెయిల్‌కి గురవటం గురించిన వార్త అది. అది నిజంగా జరిగితే అతను దివాళా తియ్యటం ఖాయమని ఉంది.
‘ఎవరు దీనికి కారణం?’ అని అడిగాను.
ఆమె తెలియదన్నట్లు పెదవి విరిచింది. ఆమె కళ్లల్లో మెరుపు చూస్తే అది అబద్ధం అని తెలుస్తోంది.
‘నువ్వే కాదు నేను కూడా ఈ రోజు ఆనందంగా ఉన్నాను’
‘మరి చెప్పరేం? మీ ఆనందానికి కారణం ఏంటో త్వరగా చెప్పండి. లెటజ్ సెలబ్రేట్...’
‘మన నియోజకవర్గం తిరిగి జనరల్ కేటగిరీకి మారుతోంది’ అని చెప్పి ఆమె స్పందన కోసం చూశాను.
ఆమె మొహం ఆనందంతో వెలిగిపోయింది. ‘అమ్మయ్య! పెద్ద బాధ్యత తీరిపోయింది. ఈ అయిదేళ్లూ మీ తరఫున ఈ బరువు మోయలేకా, మోయకుండా ఉండలేకా తెగ ఇబ్బంది పడ్డాను. ఇక నా బంధనాలు వదిలించుకునే రోజు త్వరలోనే ఉందన్నమాట..’
ఆమె రియాక్షన్ చూడగానే నా భయాలన్నీ తొలగిపోయాయి. మనసులో ఏదో ఒక మూల ఆమె ఎదురు తిరుగుతుందేమో అని ఉన్న అనుమానం గాలికి కొట్టుకుపోయిన ఉల్లిపొరలా కొట్టుకుపోయింది.
‘అదేమిటి? ఇంత హోదా, అధికారం పోతుందంటే నీకు బాధగా లేదా?’
‘అవన్నీ నావయితే కదా!... నేను వీటన్నిటినీ మీ తరఫున భరించాను. మీ కోసం వాటిని వదులుకోవటం త్యాగం కాదు, బాధ్యత’
నాకు వసుంధరని చూస్తే ముచ్చటేసింది. ‘నాకు తెలుసు. నువ్విలాగే అంటావని. ఆ మాటే పార్టీ ప్రెసిడెంట్‌కి చెప్పాను. నీకు తెలుసుగా! అయిదు సంవత్సరాలు గిర్రున తిరిగి వచ్చాయి. మళ్లీ ఎలక్షన్లు దగ్గరకు వస్తున్నాయి. ఈసారి నేను నిలబడటానికి ఏ అడ్డంకీ ఉండదు. అందుకే టిక్కెట్టు నాకే ఇమ్మని అడిగాను. నువు ఒప్పుకోవని అనుమానం ఉందేమో. నీతో మాట్లాడి చెప్తానన్నాడాయన...’
‘నాతో మాట్లాడేది ఏముంది? ఇప్పుడే ఫోన్ చేసి అతనితోనే చెప్తాను’ అని ఆమె పార్టీ ప్రెసిడెంట్‌కి ఫోన్ చేసింది. కుశల ప్రశ్నలు అయ్యాక విషయంలోకి వచ్చింది.
‘నా నియోజకవర్గం జనరల్ కేటగిరీకి మారింది కదండీ! ఆ విషయం మాట్లాడదామనే మీకు ఫోన్ చేశాను’
‘అవునమ్మా! ఈసారి ఎలక్షన్లలో అశోక్ ఆ సీటు అడుగుతున్నాడు’
‘అంతే కదా సార్! సీటు ఈసారి అతనికి ఇవ్వటమే న్యాయం’
అతను కాసేపు వౌనంగా ఉన్నాడు. ‘చూడమ్మా! మీ ఇద్దరికీ అంగీకారమయితే నేను చేయగలిగింది ఏముంది? కానీ ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ప్రజల తరఫున, పార్టీ తరఫున నేనీ మాట చెప్తున్నాను. ఈ పదవికి అశోక్ కంటే నువ్వే అర్హురాలివి. అందుకే మరొకసారి ఆలోచించుకో! ఏ సంగతీ నాకు తరువాత చెప్పు...’ అని సంభాషణ ముగించాడు.
వసుంధరకి ఆ విషయంలో ఆలోచించేది ఏమీ కనపడలేదు. నాతో కూడా అదే అంది.
‘సరే! ఒకరోజు ఇద్దరం కలిసి అతని దగ్గరకు వెళ్లి ఈ విషయం కన్ఫర్మ్ చేసుకు వద్దాం...’ అని బయలుదేరబోయాను.
‘అప్పుడే వెళ్లిపోతారా?’ నిరుత్సాహంగా అంది.
‘ఎక్కడ వసుంధరా? ఇంట్లో బాధ్యతలు, ఊళ్లో తగాదాలతో అసలు తీరిక దొరకటంలేదు. నేను మళ్లీ వస్తాను...’ అని చెప్పి బయలుదేరిన నాకు ఇంటి బయట ఒక కారు ఎదురయ్యింది. అందులో ఉన్న వ్యక్తి చంద్రంలా అనిపించాడు. తన సినిమా పైరసీ విషయం మాట్లాడటానికి వసుంధర దగ్గరకు వస్తున్నాడని ఊహించాను. అతని మీద కాస్త జాలి కూడా వేసింది. చేయని తప్పుకు ఇద్దరు శిక్ష అనుభవించారు. ఇక వీడు మిగిలాడు అనుకున్నాను.
అంతే తప్ప చంద్రం వసుంధరని కలవటం, నా జీవితాన్ని మలుపు తిప్పే రోజవుతుందని అప్పుడు నేను ఊహించలేదు.
ప్రస్తుతం
ఆఖరి రౌండ్ ఫలితం ఎంతకీ ప్రకటించలేదు.
అభ్యర్థులిద్దరినీ ఎన్నికల అధికారి వ్యక్తిగతంగా పిలిపించాడు.
‘ఎందుకు?’ అడిగాడు అశోక్.
వసుంధర కూడా అదే భావం వ్యక్తం చేస్తూ ఆ అధికారితో ఫోన్లో మాట్లాడింది.
‘ఒక విచిత్రం జరిగింది...’ చెప్పాడు అతను. ‘వ్యక్తిగతంగా తప్ప చెప్పలేను’
‘ఇంతకీ గెలిచింది ఎవరు? నేనేనా?’ అడిగాడు అశోక్.
‘ఆ విషయమే మాట్లాడవలసింది’ అన్నాడతను.

వసుంధర
చంద్రం చెప్పిన మాటలు విశ్వసించటానికి ఎంత ప్రయత్నించినా మనసు అంగీకరించటం లేదు.
ఆలోచించే కొద్దీ అతని మాటలు నమ్మేవిగానే ఉన్నాయి. ఒక్కసారి చంద్రం మాటలు పరిగణనలోకి తీసుకు చూస్తే, ఇదంతా చేసే అవకాశం ఉన్న వ్యక్తి ఒకరే మిగిలారు - జానకి.
వంచన, నమ్మకద్రోహం అనే రెండు మాటల నిజమయిన అర్థం నాకు ఇప్పుడే తెలుస్తోంది.
ఇలాంటి మనుషులు కూడా ఉంటారా? తమ స్వార్థం కోసం ఎదుటి మనిషిని నాశనం చెయ్యటానికి వెరవని మనుషుల ఉనికి నా ఎదుటే కనిపిస్తుంటే నేను కట్రాటై కూలబడిపోయాను.
ఈ పని చేసింది జానకి అయితే ఆమె ఎవరి కోసం ఇలా చేసిందో, నన్ను ఎవరికి అప్పజెప్పిందో కూడా తెలుసుకోవలసిన అవసరం ఉంది.
మనిషి మనసును మించిన రహస్యం మరొకటి
లేదు.
అందులో మంచీ, చెడూ రెండూ ఉంటాయి.
వెలుగు నీడల్లా,
నలుపు తెలుపుల్లా...
రెంటికీ మధ్య ఒక సన్నని విభజన రేఖ ఉంటుంది.
ఆ రేఖని తమ నుండి దూరం జరపటానికి రెండు పరస్పర విరుద్ధ భావాలూ కృషి చేస్తుంటాయి. ఆ రేఖని తమకి ఎంత దూరం జరిపితే వాటికి అంత ఎక్కువ స్థలం దొరుకుతుంది మరి.
అందుకే ఆ రేఖ లోలకంలా అటూ ఇటూ ఊగుతూనే ఉంటుంది.
ఆ రేఖ ఏ స్థారుూ భావం దగ్గర ఉందో ఆ ప్రభావం మనిషి ప్రవర్తనలో ప్రతిఫలిస్తుంది.
అయితే కొంతమంది మనుషులు ఉంటారు.
మనసులో పగ, ద్వేషం, కామం ఉన్నా.. పైకి జాలి, ప్రేమ, స్నేహం చూపగలరు.
జానకి అలాంటిదే!
వారినే గోముఖ వ్యాఘ్రాలనీ, మేకవనె్న పులులనీ అంటారు.
ఆమె నాకు చేసిన అన్యాయం తలచుకున్నపుడల్లా ఆమె మీద అసహ్యం రెట్టింపవుతోంది.
అసలు నా జీవితంలో ఎందుకు అందరూ ఇలాంటి మనుషులే తారసపడతారో నాకు అర్థం కాలేదు.
అంత బాధలోనూ నేను దిద్దుకోవలసిన తప్పు ఒకటి గుర్తుకు వచ్చింది. వెంటనే ఎస్.పి. శ్రీనివాస్‌కి ఫోన్ చేసి మాట్లాడాను. మరొక గంట తరువాత అతని నుండి కన్ఫర్మేషన్ వచ్చింది.
ఇక చంద్రం బాధలు తీరినట్లే!
జీవితంలో మొదటిసారి నేను తప్పు చేశాను. చంద్రాన్ని పతనం దిశగా నడిపించాలన్న ఆత్రుతలో నా పరపతిని తప్పుడు పనికి ఉపయోగించాను. సినిమా కాపీ ముందే సంపాదించి చంద్రానికి బ్లాక్‌మెయిల్ సందేశం పెట్టించింది నేనే!
ప్రివ్యూ చూడటానికి వెళ్లి అనుకోకుండా నోరు జారినట్లు విలేకరులకు పైరసీ గురించి లీక్ చేసింది నేనే! చంద్రానికి పోలీసుల సహకారం లభించకుండా చేసిందీ ననే!
ఇంకా నయం! చంద్రం సరాసరి వచ్చి తనని కలవబట్టి తప్పు సరిదిద్దుకునే అవకాశం వచ్చింది. లేకపోతే అన్యాయంగా తన వలన ఒక పెద్ద ఘోరం జరిగి ఉండేది.
తప్పు సరిదిద్దుకున్న తరువాత చంద్రానికి ఫోన్ చేసింది. ‘చంద్రం! నీ సమస్య తీరిపోయింది. మిమ్మల్ని బ్లాక్‌మెయిల్ చేయబోయిన వ్యక్తి తృటిలో తప్పించుకున్నాడు కానీ, మీ సినిమా దొంగ కాపీ పోలీసులకు చిక్కింది. ఇక అతని నుండి మీకు ఎలాంటి ప్రమాదమూ లేదు. సినిమా రిలీజు ఏర్పాట్లు చూసుకోండి...’ అని చెప్పాను.
‘్థంక్స్ మేడమ్!’ గొంతులో విపరీతమయిన ఆనందం ప్రతిఫలిస్తుంటే అరచినట్లు అన్నాడు చంద్రం. ‘మీలాంటి స్నేహితులు ఒక్కరుంటే చాలు. మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పుకోవాలో తెలియటం లేదు’
‘నాదేమీ లేదు చంద్రం. నీ అదృష్టం బాగుంది’
‘మరొకసారి థాంక్స్ మేడమ్!’
‘ఉంటాను చంద్రం. కొన్ని అర్జంటు పనులున్నాయి. నీ సినిమా సూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నాను’ అని ఫోన్ పెట్టేశాను.
నిజంగానే నాకు చాలా పనులున్నాయి.
పద్దెనిమిది రోజుల యుద్ధం ముగిసినా దుర్యోధనుడు దొరికేవరకూ పాండవులను విశ్రాంతి తీసుకోనివ్వలేదు కృష్ణుడు.
నాకు జరిగిన ద్రోహం చేసింది జానకి అని అర్థమవుతున్నా, ఈ దారుణం ఆమె ఎవరి కోసం చేసిందో కచ్చితంగా తెలుసుకోవటం కూడా అవసరం. సందేహం తీర్చుకోవాలంటే ముఖాముఖీ ఎదుర్కోవటమే మార్గం.
వెంటనే కారు బయటకు తీయించి వెళ్లి కూర్చున్నాను. వెంట రాబోయిన రేఖను కూడా వారించి నేను వెళ్లదలచుకున్న అడ్రస్ డ్రైవర్‌కి చెప్పాను.
అతను ఒక్క క్షణం సందేహించినా మారు మాట్లాడకుండా కారు ముందుకు పోనిచ్చాడు. అరగంటలో కారు అక్కడకు చేరింది.
పాత జ్ఞాపకాలు వెల్లువలా ముంచుకు వస్తుంటే మొదటిసారి ఈ నగరంలో నన్ను అక్కున చేర్చుకున్న హాస్టల్‌ని కుతూహలంగా చూశాను. అది అప్పుడు ఎలా ఉందో ఇప్పుడూ అలానే ఉంది. ఏమీ మార్పులేదు.
జానకిని పిలుచుకు రమ్మని డ్రైవర్ని లోపలకు పంపాను. జానకి రాలేదు కానీ, డ్రైవర్‌తోపాటు యాదమ్మ బయటకు వచ్చింది. ఆమె నన్ను గుర్తు పట్టలేదు. అవును మరి ఆ హాస్టల్ ఒక రైల్వే ప్లాట్‌ఫారం లాంటిది. వచ్చేవాళ్లు వస్తుంటారు. వెళ్లే వాళ్లు వెళ్తుంటారు. ఆమె మాత్రం ఎంతమందిని గుర్తు పెట్టుకుంటుంది?
‘అమ్మా! జానకమ్మ ఇప్పుడు ఇక్కడ ఉండటం లేదమ్మా...’ అంత పెద్ద కారులో వచ్చిన నన్ను చూసి ముడుచుకు పోతూ చెప్పింది యాదమ్మ.
ఆశ్చర్యపోయాను. నన్ను రెగ్యులర్‌గా కలిసే మనిషి ఎవరైనా ఉన్నారంటే అది జానకి ఒక్కతే! ఇప్పటివరకు తను ఇక్కడే ఉంటుంది అనుకున్నాను. ప్రత్యేకంగా అడగలేదు. కానీ, ఆ సంభాషణ ఎప్పుడు వచ్చినా తను ఇక్కడే ఉంటుంది అన్న అర్థం వచ్చేటట్లు మాట్లాడేది జానకి కూడా.
‘జానకి ఇప్పుడు ఎక్కడ ఉంటుందో తెలుసా?’
తటపటాయించింది యాదమ్మ.
నవ్వాను. ‘ఆమె నా స్నేహితురాలు. కలుసుకోవటానికి వచ్చాను. అంతకు మించి ఏమీ లేదు. ఆమె అడ్రస్ ఉంటే ఇవ్వండి...’
‘ఎవరైనా బాగా తెలిసిన వాళ్లు వస్తే తప్ప చెప్పొద్దంది. అందుకనీ...’ అంటూ లోపల నుండి యాదమ్మ తెచ్చిన కాగితం అందుకుని థాంక్స్ చెప్పాను.
బయలుదేరుతుంటే, ‘అమ్మా!...’ అంది యాదమ్మ. ‘ఏమిటి?’ అన్నట్లు చూశాను. ‘మిమ్మల్ని ఎక్కడో చూసినట్లు ఉందమ్మా...’ అంది.

మిగతా వచ్చేవారం

-పుట్టగంటి గోపీకృష్ణ 94901 58002