S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

త్యాగరాజ రామాయణం

నన్నయకు ముందు ఆంధ్ర సారస్వతం, వాల్మీకికి ముందు సంస్కృత సాహిత్యం ఎలా వుండి వుండేదో? పండితులు ఊహించి కొంత వరకూ చెప్పగలరు. త్యాగబ్రహ్మ నాదస్వరూపుడై ఆవిర్భవించక ముందు సంగీతం ఉంది. కానీ ఆ సంగీతానికి పూర్తి వికాసం లేదనే అంటారు. సంగీత సామ్రాజ్యంలో శిఖర సమాజనుడు త్యాగయ్య. మనం పాడవలసిన సంగీతానికి సంప్రదాయాన్ని చూపించాడు. సరళమైన సాహిత్యాన్ని ఉన్నతమైన సంగీత స్థాయికి తీసుకుపోయాడు.
సాహితీ చరిత్రలో నన్నయ, తిక్కన, శ్రీనాథుడు, పోతనల వల్ల ఆంధ్ర సారస్వతానికి ఒక పెద్ద జ్యోతి లభించింది. అంతవరకూ సంగీతంలో త్యాగయ్య లాంటి ఉన్నత వ్యక్తి ఎవరూ పుట్టలేదు. అందుకే సారస్వతానికి కూడా సంగీతంతోబాటు ప్రాముఖ్యత ఏర్పడింది.
శతాబ్దాలుగా శ్రీరామచంద్రుడు మనకు ఆరాధ్య దైవం. రామకథ తెలియని వారుండరు. రామావతారానికున్న ప్రత్యేకత ఒక్కటే. ఆయన ధర్మమూర్తి. ఆదర్శమూర్తి. ఆ మూర్తిని మనసారా ధ్యానించిన రామభక్తుడు త్యాగరాజు. ఆయన నరనరాల్లో రాముని గుణగణాలు ఆయన జీవితం మొత్తం ఇంకిపోయింది. మెళకువలోనైనా కలలోనైనా రాముణ్ణి వదలలేదు. రాముడే ఊపిరిగా బ్రతికాడు. పైగా నాదసుధారసాన్ని ఆయనతో పోల్చాడు. అందుకే రామభక్తి సామ్రాజ్యానికి రాజులు ముగ్గుర్ని చెప్తారు.
ఒకరు బమ్మెర పోతరాజు (పోతన) మరొకరు కంచెర్ల గోపరాజు (్భద్రాచల రామదాసు), మూడవ వారు కాకర్ల త్యాగరాజు.
భద్రాచల రామదాసుగా ప్రసిద్ధి గాంచిన గోపరాజు కట్టించిన గుడులు, గోపురాల కంటే ఆయన పాడిన, రామదాసు కీర్తనలే విలువైనవి. వాటివల్లే భద్రాచలానికి కీర్తి లభించింది. పోతన రామాంకితంగా భాగవతం రాశాడు.
పలికెడిది భాగవతమట.. పలికించెడి వాడు రామభద్రుండటనే.. పలికిన భవ హరమగునట.. పలికెద వేఱొండుగాథ పలుకగనేల?
అంటూ భాగవత రచన చేశాడు. 96 కోట్ల రామనామం జపించిన త్యాగరాజు, రామకథామృతాన్ని రాగ తాళ సమన్వయంతో నాద సుధారస ప్రవాహంలో తనివితీరా పాడుకుని ధన్యుడైన మహానుభావుడు.
త్యాగయ్యకు భాగవతం నిత్య పారాయణ గ్రంథం - అంతేకాదు.. భాగవతాగ్రేసరుడైన భద్రాచల రామదాసు కీర్తనలే స్ఫూర్తి త్యాగయ్యకు. ఈ ఇద్దరినీ ఆదర్శంగా నిలుపుకుని బ్రతికిన ధన్యజీవి.
వాల్మీకి రామాయణం త్యాగయ్యకు వెన్నతో పెట్టిన విద్య. ఈయన తండ్రి రామబ్రహ్మం తంజావూరు ప్రభువుల ఆస్థాన పండితుడు, పౌరాణికుడు. నిత్యం చేసే రామాయణ ప్రవచనానికి మధ్యమధ్యలో త్యాగరాజే శ్లోకాలు పాడేవారట. తండ్రి వివరణ ఇచ్చేవాడట. ఆ రామాయణం ప్రవచనం ఎన్నిసార్లు జరిగిందో లెక్కలేదు.
రామాయణ కథామృతంతో త్యాగయ్య మనసు నిండిపోయింది. రామాయణంలోని వ్యక్తులందరూ ఆయనకు పరమ బంధువులు. ఒక్కో ఘట్టాన్ని తలుచుకుని ఉప్పొంగిపోయాడు. తనివితీరా మాటల్లో వర్ణించలేని దాన్ని పాడుకుని పరవశించాడు.
ఒక మాటంటాడు: ఏ పనిలో జన్మించితినని న/ నె్నంచవలదు శ్రీరామ!
శ్రీపతి! శ్రీరామచంద్ర! చిత్తమునకు/ తెలియదా!
వాల్మీకాది మునులు, నరులు/ నిన్ను వర్ణించిరి, నా ఆశ తీరునా
మేల్మియై యుండును సద్భక్తులు/ మెచ్చుదురే! త్యాగరాజనుత!
వాల్మీకాది మునులు రామాయణాన్ని రాశారు. అవి గొప్పవే. మరి నిను వర్ణించాలనే నా ఆశ ఎలా తీరుతుంది?
అందుకని, నా అంతరంగములో వున్న కోరిక సఫలీకృతమయ్యేలా చేస్తే నాకంతకన్నా ఏం కావాలి? అని ఏయే ఘట్టాలు ఆయన మనసును రంజింపచేసి పులకాంకితుణ్ణి చేశాయో అవన్నీ పాడుకున్నాడు.
కవి సామ్రాట్ విశ్వనాథ వారు కూడా సరిగ్గా ఇదే అభిప్రాయాన్ని తన కల్పవృక్షంలో వెలిబుచ్చారు. శ్రీరామాయణంలో మొదటి ఘట్టం: శ్రీరామ జననం. పరమాత్మ ఎవరి కోసమో అవతారం ఎత్తాడు. శ్రీరాముడి అవతార ప్రయోజనం ధర్మ సంస్థాపనే. దశరథుడు పిల్లలు కావాలనుకున్నాడు గానీ శ్రీమన్నారాయణుడే తనకు కావాలనుకోలేదు. చిత్తశుద్ధితో చేసిన యజ్ఞానికి అనుకున్న దానికంటే ఫలితం ఎక్కువగానే లభించింది. వేదస్వరూపులైన పిల్లలు పుట్టారు. ధర్మ రక్షకులు పుట్టారు. వేదవర్ణనీయవౌ నామముతో
విధి రుద్రాదులకు మేల్మి రాపముతో/ మోదసదనమగు పటు చరితముతో
మునిరాజ వేషి త్యాగరాజ నతనీ/ వెవరికై అవతారమెత్తితివో గదా?
అని శ్లాఘిస్తూ ‘దేవ మనోహరి’ రాగంలో పాడుకున్నాడు.
ఇంక రాముడి ప్రవృత్తి. శ్రీరామచంద్రుడు తనను కొలిచే పరిజనులతో మాట్లాడినా, రాజులతో మంతనాలు జరిపినా, శత్రువులనైనా ఆకర్షించి ఒప్పించి ముచ్చట గొలిపేలా వుండేవి గానీ, పరుషంగా వుండేవి కావు.. అని వర్ణిస్తూ సాగిన కీర్తన తోడి రాగంలో..
ఏమని మాట్లాడితివో రామ/ ఎవరి మనసు కావితమో తెలిసి’
మృదువుగా మాట్లాడటంలో అసలు రాముణ్ణి మించిన వారెవరు? అందుకే అయోధ్యాపురి ప్రజలకు రాముడంటే ప్రాణం. రాజరిక వ్యవస్థకే గౌరవం తెచ్చాడు. ఈవేళ అది మృగ్యం.
రాముడి అవతార ప్రయోజనం ఏమిటో ప్రపంచానికి తెలియాలిగా!
‘వెడలెను కోదండపాణి అనుజ సౌమిత్రి గూడి/ పుడమిలో జనులెల్ల పొగడ
పూజితుడగు మునితో గూడి ॥
దశరథుని కిష్టం లేకపోయినా వశిష్టుని జోక్యం వల్ల విశ్వామిత్రుడి వెంట రామలక్ష్మణులిద్దరూ బయలుదేరారు.
యాగ రక్షణ అనే నెపంతో రాక్షస వధే ప్రధాన కారణంగా జరిగిన సంఘటనది. యజ్ఞం నిర్విఘ్నంగా జరిగింది. విశ్వామిత్రుడు సంతోషించి రామలక్ష్మణులకు దివ్యాస్త్రాలను ప్రసాదించాడు.
మిథిలకు సమీపంలో గౌతముని ఆశ్రమం కళావిహీనమై నిస్తేజంగా పడి వున్న అహల్యకు శాపవిమోచనం జరిగింది.
‘అమృతవాహిని’ అనే చాలా చిన్న రాగంలో ఆయన పాడిన కీర్తిన ‘శ్రీరామ పాదమా నీ కృప చాలునే చిత్తానికి రావే’
సంగీతం నేర్చుకునే విద్యార్థులు తేలికగా పాడగలిగే కీర్తన. అయినా గంభీరమైన అర్థాన్నిచ్చే సాహిత్యం. అదీ త్యాగయ్య గొప్పదనం.
జనకుడింట్లో శివధనస్సుండటం ఆ ధనస్సును ఎక్కుపెట్టగలిగిన వారికి సీతనిచ్చి వివాహం చేస్తానని జనకుడు ప్రతిజ్ఞ చేయటం లాంటి విషయాలన్నీ విశ్వామిత్రుడు అంతకు ముందే రామలక్ష్మణులకు చెప్పి వుంచుతాడు. దర్జాగా మిథిలా నగరం చేరారు.
శివధనుర్భంగం: అలకలల్ల లాడగ గని ఆరాణ్ముని ఎటు పొంగెనో॥
ముని కనుసైగ తెలిసి శివధనువును విరిచే/ సమయమున త్యాగరాజ నుతుని
మోమును రంజిల్ల జేయు/ అలకలల్ల లాడగ గని ఆ రాణ్ముని ఎటు పొంగెనో॥
రామా! ఈ ధనస్సు చూడు - అని విశ్వామిత్రుడు కాస్త కనుసైగ చేశాడంతే. రాముడు దాన్ని రెండుగా విరిచాడు. అప్పుడు ముంగురులు కాస్త కదిలాయి. అంతే. సీతను రాముడికిచ్చి వివాహం చేసిన జనకుడు కనులపండువుగా ఆనందించాడు. జనకుడు ‘ఏం తపం చేశాడో’ అని ముచ్చటపడ్డాడు త్యాగయ్య.
రాక్షస బాధ తీరటమే కాదు. శివధనుర్భంగం వల్ల జనకుడి భారం కూడా తీరింది. జానకిని దాశరథి చేతిలో పెట్టాడు. దశరథ రాముడు సీతారాముడయ్యాడు.
‘సీతా కల్యాణ వైభోగమే’/ పవనజ స్తుతి పాత్ర పావన చరిత్ర
రవిసోమ వరనేత్ర రమణీయ గాత్ర ॥
సీతా కల్యాణం అంటే లోక కల్యాణం. రామాయణ కథ మనం విన్నంత కాలం, ఈ కల్యాణాన్ని ఇలా జరుపుకుంటూనే ఉంటాం. లోక కల్యాణం కోరేవాళ్ల ఆరోగ్యాలు ఎప్పుడూ బాగుంటాయి. పరపీడా పాలన నుంచి విముక్తి కలిగించి ఈ జాతికి జవసత్త్వాలిచ్చి తన జీవితానే్న అంకితం చేసిన మహాత్మాగాంధీ కలలు గన్నది రామరాజ్యం. రాముడేలిన రామరాజ్యం ఎలా వుండేదో ఆయనకు బాగా తెలుసు కాబట్టి ఆ మాటన్నాడు. అలా వుండాలనే వాంఛించాడు. అలాగే వుందా ఇప్పుడు? ఎప్పటికైనా ఆయన భావించినది జరుగుతుందా? ధైర్యంగా చెప్పలేం.
పండుగలు, పర్వదినాలూ, జయంతులు, వర్థంతులూ కాలప్రవాహంలో ఎన్నో వెళ్లిపోతూంటాయి. ఆ పరుగును ఎవరూ ఆపలేరు. కాలం పోకడ చాలా చిత్రం. ఎప్పటి మాదిరే ఏదో గడుస్తూన్నా మరోపక్క మార్పేమీ లేదు అనే భావన కలుగుతూనే ఉంటుంది. ఈ రోజులు వేరు. కాలం వేరు. రామాయణ కాలమంతా అదో కమనీయ కావ్యం.
అన్ని ధర్మాలు, జీవన విధానాలూ, ముందే నిర్దేశించబడి, మనుషుల బ్రతుకుల్ని రాచబాటలో నడిపించిన రోజులు. పరిపూర్ణ దురహంకార పూరిత దుష్ట ప్రవర్తకులైతే తప్ప -బతుకూ! బతకనీ! అనే సహజీవన సిద్ధాంతం ఆదర్శంగానే అనుసరించిన కాలమది. శ్రీరామచంద్రుడు కేవలం బోధన ద్వారాకాక ఆచరణ ద్వారా సుస్థిర సమాజ స్థాపన చేసిన మహానుభావుడు. దుర్బలులమై అల్పులమైన మనం, అవతార ప్రయోజనాలకు విపరీతార్థాలు తీసి, అంతా తెలిసినట్లు మాట్లాడతాం. కాచి వడబోసినట్లు అవన్నీ అవతార పురుషులకే తప్ప మనకు కాదనుకుని, దైవీగుణాలతో వాళ్లను చేర్చేసి, పూజలతో సరిపెట్టి తృప్తి పడుతున్నాం. అంతకంటే ఏ ఒక్కరికీ లోతుగా ఆలోచించే ఓపిక లేక అన్వయించుకుని బ్రతుకుదామనే ఆలోచన కూడా లేని వారికి శ్రీరామ నవమైనా ఒకటే. విజయదశమైనా ఒక్కటే.
రామరాజ్యానికెందుకంత పేరు?
రామరాజ్యంలో రోగ బాధల్లేవు. సకాలానికి ఠంచనుగా వర్షాలు పడి పంటలు పుష్కలంగా పండేవి. సునామీ, భూకంపం లాంటి ప్రకృతి వైపరీత్యాల్లేవు. చీకూ చింతా లేకుండా పరిపూర్ణాయుర్దాయంతో జనం జీవించారు. కుల ప్రసక్తి లేదు. నాలుగు వర్ణాల వారు ఐకమత్యంగా కలిసిమెలిసి జీవించారు. ఈర్ష్యాసూయలు, ద్వేష రోషాలూ లేకుండా బ్రతికారు. అంతేనా? దుఃఖం తెలియదు. కష్టాలంటే ఏమిటో ఎరుగరు. కొన్ని వేల సంవత్సరాలు ప్రజలు బ్రతికారు. రామరాజ్యం అంటే అది ఎక్కడ చూసినా సుభిక్షమే. ఇప్పటి పాలకుల మాటల తీరు, వ్యవహరించే విధానం, వాళ్ల నిర్వాకాలూ చూస్తూనే ఉన్నాం. అనుభవిస్తూనే ఉన్నాం. ఏమీ ఎరగనట్లు చాలా నీతిపరులైనట్లు చీటికీమాటికీ రోడ్డెక్కుతూ చివరికి నలుపురంగు గాంధీ విగ్రహం ముందు తెల్లని స్వచ్ఛమైన బట్టలతో దర్శనమిచ్చే ప్రజాసేవ పరమార్థంగా బతికే మన నాయకుల్ని చూడండి. గాంధీ కోరుకున్న రామరాజ్యాన్ని కనీసం ఊహించే అర్హత ఉందంటారా?
సర్వజనులూ ఆరోగ్య భాగ్యాలతో వుండాలనీ, దేశం సుభిక్షంగా ఉండాలని ఆ రాముణ్ణి కోరుకుందాం. చాలు.

- మల్లాది సూరిబాబు 90527 65490