S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఆ రోజులు మరిచిపోలేను

అమెరికాలో ఉన్న మా అబ్బాయి దగ్గరికి వెళ్లాను. నేను అక్కడ ఉండగా సంక్రాంతి పండుగ వచ్చింది. అక్కడేం సందడి ఉంటుంది, అక్కడ జనవరిలో విపరీతమైన చలి, అప్పుడప్పుడు మంచు కూడా పడుతూ ఉండేది. బయటకి వెళ్లి ముగ్గు పెడదామంటే ముగ్గు దొరకదు. దొరికినా ఆ మంచులో బయటికి వెళ్లి ఎలా వేస్తాం? పిండి వంటలు మాత్రం ఇంట్లో కూర్చుని చేసేది కాబట్టి చేసేదాన్ని. కోడలు, కొడుకూ ఆఫీస్‌కి వెళ్లిపోతారు. పిల్లలు స్కూల్‌కి వెడతారు. ఏం వండినా అందరూ రాత్రి పూట మాత్రమే తింటారు. కొన్ని పిండి వంటలు పిల్లలు తినేవారు కాదు. కొంచెం రుచి చూడండిరా అని బతిమాలితే ఏదో కొంచెం రుచి చూసేవారు. కొడుకూ, కోడలు మాత్రం ఇష్టంగానే తినేవారు. ఎందుకంటే వాళ్లు మన దేశంలో పుట్టి పెరిగారు కాబట్టి. పిండి వంటలు చేస్తే సరిపోతుందా, గినె్నలు మనమే తోముకోవాలి. కోడలు ఏమైనా అనుకుంటుందేమో ఈవిడ వచ్చి రోజూ ఇన్ని గినె్నలతో వంట చేస్తోంది అని అనుకుంటుందేమో అని సందేహించేదాన్ని. అయినా ఖాళీగా ఉండలేక చేసేదాన్ని. మన దేశంలో అయితే, ఎన్ని గినె్నలు వేసినా తోమి పెట్టి మనం పెట్టింది తిని పోతారు. అక్కడ పెడదామన్నా ఎవరూ తీసుకోరు. ఒకరోజు ఏదో ఆలోచిస్తూ అలా కూర్చుండిపోయాను.
ఆ రోజు స్కూల్ నుండి పిల్లలు వచ్చింది కూడా గమనించలేక పోయాను.
పిల్లలు వచ్చి కూచుని, నానమ్మా ఏమిటి ఆలోచిస్తున్నావ్ అని అడిగారు, వొళ్లో పడుకుంటూ.
‘కూచోండర్రా ఏమైనా తినడానికి పెడతాను రండి’ అన్నాను. ‘వద్దులే నానమ్మా (వాళ్లు గ్రాండ్ మా అంటారు) మేము స్కూల్లో బర్గర్ తిని వచ్చాము’ అన్నారు.
‘ఇదేమిటో, మా చిన్నతనంలో మాకు అసలు డబ్బులిచ్చేవారు కాదు. ఇంట్లోనే అమ్మా, నాయనమ్మా కలిసి జంతికలు, చేగోడీలు చేసి ఉంచేవారు. ఇంటికి వచ్చిన తరువాత తినేవాళ్లం. ఇప్పుడు మధ్యాహ్న భోజనం కూడా అక్కడే పెడతారట. నాకైతే నా చేత్తో వండి అందరికీ పెడితే తృప్తిగా ఉంటుంది.
‘ఏమిటి గ్రాండ్ మా ఆలోచిస్తున్నావు’ అని అడిగారు పిల్లలు.
‘ఏం లేదర్రా. మా చిన్నతనంలో సంక్రాంతికి ఎంత సందడిగా ఉండేది, ఇక్కడ ఆ హడావిడి ఏం లేకపోయేసరికి నాకేమీ తోచడం లేదు’ అన్నాను.
‘మీ చిన్నతనంలో సంక్రాంతి ఎలా చేసుకునేవారో చెప్పు’ అన్నారు.
‘నాకు ఇంగ్లీషులో చెప్పడం రాదురా’ అన్నాను.
‘్ఫరవాలేదు. తెలుగులో చెప్పు. మాకు అర్థమవుతుంది’ అన్నారు.
‘సరేరా అయితే వినండి’ అంటూ మొదలుపెట్టాను.
‘మా చిన్నతనంలో సంక్రాంతి చాలా సరదాగా గడిపేవాళ్లం. సంక్రాంతేమిటి? ఏ పండుగ అయినా సరే చాలా సరదాగా గడిపేవాళ్లం.
సరే ముందు సంక్రాంతి గురించి చెపుతాను.
సంక్రాంతి అంటే సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే రోజు అన్నమాట. సూర్యుడు లేకపోతే మనకి కష్టం కదా. చెట్లు బతకలేవు. చెట్లు లేకపోతే మనం కూడా బతకలేము. జంతువులు ఏమీ ఉండవు. అందువల్ల సూర్యుడిని ఆరాధించే రోజు అన్న మాట. ఒక చిన్న పని ఎవరైనా మనకి చేసి పెడితే మనం థాంక్స్ చెపుతాం కదా, మరి మనకి ఎన్నో ఉపయోగాలు సూర్యుడి వల్ల పొందుతున్నందుకు కృతజ్ఞతగా - ఈ సంక్రాంతి పండుగ జరుపుకుంటున్నాం.
సంక్రాంతికి ఒక నెల ముందు నుండే హడావిడి మొదలవుతుంది. రోజూ రాత్రి వేళలో ఆవు పేడ కలిపిన నీళ్లు ఇంటి ముందు చల్లి ముగ్గులు పెట్టేవాళ్లం. ప్రొద్దునే్న ఆవు పేడతో చేసిన గొబ్బెమ్మలు ఆ ముగ్గుల మీద ఉంచి బంతిపూలు చామంతి పూలతో పూజ చేసి, మా స్నేహితులను పిలిచి అందరం కలిసి తప్పట్లు కొడుతూ చుట్టూ తిరుగుతూ ఈ పాట పాడేవాళ్లం.
సుబ్బీ గొబ్బెమ్మా సుబ్బణ్ణియ్యావే/ చామంతి పువ్వంటి చెల్లెల్నియ్యావే
తమలపాకంటి తమ్ముణ్ణియ్యావే/ మొగలి పువ్వంటి మొగుణ్ణియ్యావే
అంటూ పాట పాడి గొబ్బెమ్మలకు హారతి ఇచ్చి, అటుకులు, బెల్లం, కొబ్బరి ముక్కలు కలిపిన ప్రసాదం నైవేద్యం పెట్టి అందరికీ పంచేవాళ్లం.
తరువాత ఆ గొబ్బెమ్మలతో పిడకలు చేసి, ఎండిన తరువాత వాటిని ఒక పురికొస తాడుకి దండలా కట్టి ఉంచేవాళ్లం.
బోగి పండుగ నాడు తెల్లవారుఝామునే అమ్మ లేపేసేది, పెద్ద రాగి బిందెతో, కట్టెల పొయ్యి మీద నీళ్లు కాచేవారు. వొంటికి నువ్వుల నూనె రాసుకుని, నలుగు పెట్టుకుని, కుంకుడు కాయల రసంతో తలంటి నీళ్లు పోసుకునేవాళ్లం.
తరువాత కొత్త బట్టలు కట్టుకుని స్నేహితుల ఇళ్ళకు వెళ్లి చూపించి వచ్చేవాళ్లం.
అమ్మ, బామ్మ కలిసి వంట చేసేవారు. బొబ్బట్లు పులిహోరతో భోజనం చేసి, అలసిపోయి పడుకుని నిద్రపోయేవాళ్లం. నిద్రలేచి బొమ్మల కొలువులు తీర్చి స్నేహితులని పిలిచి, హారతి ఇచ్చి, ప్రసాదాలు పంచేవాళ్లం. చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో బోగిపళ్లు పోసేవారు.’
‘బోగిపళ్లు అంటే ఏమిటి నానమ్మా’ అన్నారు పిల్లలు.
‘బోగిపళ్లు అంటే చిన్నచిన్న పిల్లలను కుర్చీలో కూచోపెట్టి శనగలు, బంతిపూల రేకలు, రేగిపళ్లు, చిల్లర డబ్బులు కలిపి, పెద్దవాళ్లు గుప్పెటతో అవి తీసి మూడుసార్లు తలచుట్టూ తిప్పి తల మీద పోస్తారు. అందరూ పోసిన తరువాత హారతి ఇచ్చి, వచ్చిన వారికి శనగలు, తమలపాకులు, అరటి పళ్లు ఇచ్చి పంపిస్తారు.
క్రింద పడిన డబ్బులు ఏరుకుందామని తాపత్రయపడే వాళ్లం, కాని అమ్మ కోప్పడేది. ఆ డబ్బులు మనం తీసుకోకూడదు, అవి పనివాళ్లే తీసుకోవాలి అని చెప్పేది.
మరునాడు సంక్రాంతి, పొద్దునే్న లేచి సూర్యబింబంలాగ ముగ్గు వేసేవాళ్లం. తరువాత, అమ్మ, బోగి పిడకలు అంటించి దానిపైన ఇత్తడి గినె్నలో ఆవుపాలు పోసి దాని మీద కాచి, దానిలో బియ్యం కొత్తవి పోసి ఉడికించి తరువాత బెల్లం పొడి వేసి పొంగలి చేసి సూర్యుడికి నైవేద్యం పెట్టేది. ఎందుకంటే ఆ రోజు నుండే సూర్యుడు మకరరాసిలో ప్రవేశిస్తాడు కనుక. ఆ రోజు నాన్న బ్రాహ్మణులను పిలిచి, గారెలు, పొంగలితో భోజనం పెట్టి కొత్త బట్టలు ఇచ్చి పంపేవారు.
మూడవ రోజు కనుమ పండుగ. ఆ రోజు పశువులను శుభ్రంగా కడిగి ముస్తాబు చేసి, రైతులు ఆ రోజు వాటికి పని చెప్పకుండా సెలవు ఇచ్చేవారు.
గంగిరెద్దుల వాళ్లు, ఎద్దులకు పూల దండలు కట్టి పైన మంచిమంచి బట్టలు కప్పి సన్నాయి ఊదుతూ, ప్రతీ ఇంటికీ వచ్చి ఆడించి డబ్బులు అడిగేవారు. మనం డబ్బులు ఇస్తే అది చక్కగా తల ఆడించి కాళ్లు పైకెత్తి నమస్కారం పెట్టేది.
అందరికీ సెలవులు వున్నా పాపం అమ్మకి మాత్రం సెలవు లేదు సరికదా, పని ఇంకా ఎక్కువయ్యేది. ఇప్పటిలా బజారు నుండి కొని తెచ్చిన పిండివంటలు తినేవారు కాదు. అన్నీ ఇంట్లోనే వండేవారు. మేము కూడా స్కూల్‌కి సెలవులు కాబట్టి అమ్మకి సహాయం చేసేవాళ్లం.
అప్పుడు సంక్రాంతే కాదు ఏ పండుగ వచ్చినా చాలా హడావిడిగా సరదాగా ఉండేది.
సంక్రాంతి తరువాత ఉగాది. ఉగాది నాడు, కొత్త బట్టలు, వేపపువ్వు, మామిడి కాయ, కొత్త చింతపండు, బెల్లంతో చేసిన పచ్చడి, పంచాంగ శ్రవణం, వచ్చీపోయే చుట్టాలు. ఉగాది తరువాత శ్రీరామ నవమి. శ్రీరాముని కల్యాణం ప్రతీ గుడిలోనూ చేసి, పానకం, వడపప్పు, కొన్ని దేవాలయాలలో భోజనాలు కూడా పెట్టేవారు. ఇది ఐదు రోజులు జరిగేది.
తరువాత గణేశ్ పూజ. అది కూడా తొమ్మిది రోజులు అట్టహాసంగా, ప్రతీ వీధి మొగలోనూ, ఒక వినాయకుడిని పెట్టి, భజనలు, పూజలతో, అట్టహాసంగా చేసి తొమ్మిదవ రోజున నిమజ్జనం చేసేవారు.
గణేశ్ పూజ తరువాత దసరా వచ్చేది. దసరా తొమ్మిది రోజుల పండుగ. ఈ తొమ్మిది రోజులూ దుర్గాదేవిని పూజించి రోజుకో రకమైన పిండి వంట చేసి నైవేద్యం పెట్టి, రోజుకొక అలంకారం చేస్తారు దేవాలయాల్లో.
ఇంట్లో కూడా బొమ్మల కొలువులు పెడతారు. మాకైతే స్కూల్‌కి మొదటి రోజు నుండే సెలవులు ఇచ్చేవారు.
అయినా కొంతసేపటి కోసం స్కూల్‌కి వెళ్లేవాళ్లం. ఎందుకంటే స్కూలు మాస్టారు, పిల్లలు కలిసి ఒకో క్లాసు పిల్లల ఇళ్ళకి వెళ్లి పాటలు పాడేవాళ్లం. అప్పుడు అమ్మా నాన్నలు, మాస్టారుకి నమస్కరించి, ఆయనకి బట్టలు, డబ్బులు ఇచ్చేవారు. మా చేత కూడా గురుపూజ చేయించి నమస్కారం చెయ్యమనేవారు. ఆ విధంగా గురువు అంటే మాస్టారు గారిని గౌరవించడం నేర్చుకుంటారని అలా చేయించేవారు.
దసరా పాట అంటే ఏమిటి నానమ్మా? అని అడిగారు పిల్లలు.
ఆ పాట మొదలుపెట్టాను.
ఏదయా మీదయా మా మీద లేదు/ ఇంతసేపుంచుట ఇది మీకు తగదు
దసరాకి వస్తిమని విసవిసలు పడక/ చేతిలో లేదనక అప్పివ్వరనక
ఇరుగు పొరుగుల వారు ఇస్తారు సొమ్ము/ పావలా బేడైతె పట్టేది లేదు
అర్ధరూపాయైతె అంటేది లేదు/ ముప్పావలా ఐతె ముట్టేది లేదు
హెచ్చు రూపాయైతె పుచ్చుకుంటాము.
పై పావలా మాకు పప్పు బెల్లాలు జయా విజరుూభవ దిగ్విజరుూ భవ అంటూ పాడి ప్రతి పిల్లల ఇంటికీ వెళ్లి అడిగేవాళ్లం. అప్పుడు మాస్టారుకి కొత్తబట్టలు, తాంబూలం ఇచ్చి నమస్కరించేవారు. పిల్లలకి అటుకులు, కొబ్బరిముక్కలు, బెల్లం కలిపిన ప్రసాదం పెట్టి పంపేవారు.
దసరా తరువాత వచ్చేది అట్ల తద్దె. ముందురోజే తలంటు పోసుకుని, గోరింటాకు అమ్మ రుబ్బేది, ఇప్పట్లా బజారులో దొరికేది కాదు. గోరింటాకు అమ్మేవారు కొద్దిగా బియ్యం ఇస్తే గోరింటాకు ఇచ్చేవారు. అమ్మ రుబ్బురోలులో వేసి రుబ్బేది. అది రుబ్బుతూ వుండగానే అమ్మ చెయ్యి ఎర్రగా అయిపోయేది. తరువాత మాకు చేతులకి పెట్టేది, పాపం తను మాత్రం పనంతా అయిపోయిన తరువాత రాత్రి పెట్టుకునేది.
రేపు ఉదయం తినడానికి, రాత్రే అన్నం వండి, గోంగూర పచ్చడి, ఉల్లిపాయ పులుసు, అరటికాయ వేపుడు చేసి ఉంచేది. మమ్మల్ని తెల్లవారుఝామునే లేపేసేది. మేము లేచి, కళ్లు నులుముకుంటూ పళ్లు తోముకుని అన్నం తినేవాళ్లం. అలా తెల్లవారుఝామున తినే అన్నాన్ని ఉట్టికింద ముద్ద అంటారు. ఇప్పటి వారికి ఈ పండుగ గురించి తెలియదు.
తరువాత, స్నేహితులతో కలిసి ఆడుకునేవాళ్లం. తరువాత అందరం కలిసి, కిరుకు (తొక్కుడుబిళ్ళ) దొంగ పోలీస్ ఆటలు ఆడి, తెల్లవారుతుండగా ఒకరి భుజం ఇంకొకరు పట్టుకుని నడుస్తూ అట్లతద్ది పాట పాడుకుంటూ, పైన వెనె్నల కాస్తుండగా చెరువు దగ్గరకు వెళ్లేవాళ్లం. ఆ చెరువులో చందమామ కనిపిస్తూ వుంటే దానిని పట్టుకోవాలని చేతులతో నీళ్లలో జలకాలాడేవాళ్లం. ఆ వెనె్నలలో ఆడుకుంటూ వుంటే ఎంత బావుండేదో. ఇప్పుడైతే టీవీలు చూస్తూ వెనె్నల వుంది అనే మాటే మర్చిపోయారు జనం.
ఆ అట్లతద్ది పాట ఏమిటి నానమ్మా’ అని అడిగారు మనవలు.
ఆ పాట మొదలెట్టాను.
‘అట్లతద్దోయ్, ఆరట్లోయ్, ముద్దపప్పోయ్ మూడట్లోయ్ ఏట కింద పిల్లల్లార జెల్లల్లార లేచిరండోయ్- అంటూ పాడుకుంటూ, అలసిపోయి ఇళ్ళకు చేరుకునేవాళ్లం.
ఆ రోజంతా ఉపవాసం చేసి రాత్రి చంద్రుడు కనిపించిన తరువాత పూజ చేసి, అట్లు మాత్రమే (ఇప్పుడు దోసెలంటున్నారు) తిని పడుకునేవాళ్లం. ఇలా నేను చెపుతూ ఉండగానే పిల్లలు నిద్రలోకి జారుకున్నారు. పిల్లల్ని మంచం మీద పడుకోబెట్టి ఆలోచనతో నేను కూడా నిద్రలోకి జారుకున్నాను.

-పి.వి. రమణ 98660 70372