S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

రావణుడిని దూషించిన జటాయువు( అరణ్యకాండ)

‘్ధర్మం అంటే ప్రీతికల రాజులు శాస్త్రం నిందించిన ధర్మ, అర్థ, కామాలకు ఆశపడరు. పులస్త్యుడంత గొప్పవాడికి మనుమడవై ధర్మజ్ఞానం తెలియకపోతే ఎలా? ధర్మార్థకామాలు చక్కగా తెలుసుకుని ధర్మాన్ననుసరించి మంచి పనులు చేసే రాజు పెద్ద నిధి లాంటివాడు. ధర్మం కానీ, పుణ్యం కానీ, పాపం కానీ రాజులు ఎలా చేస్తారో, ప్రజలు అలానే చేస్తారు. నువ్వు దొంగతనం చేస్తే నీ రాజ్యంలోని ప్రజలు కూడా అలానే చేస్తారు. అప్పుడు రాజ్యానికి, ధర్మానికి ఏ గతి పట్తుందో ఆలోచించు. కాబట్టి ధర్మార్థ కామాలకు రాజు మూలం. కనుక నువ్వు స్వచ్ఛంద వ్యాపారం వదిలి శాస్త్ర ప్రకారం నడచుకో. పాపపు స్వభావం కలవాడా! ఇంద్రియ చపలత కలవాడా! సాధువులకు బాధ కలిగించేవాడా! నీకెలా గొప్ప సంపద లభించిందిరా? నువ్వు ఆ ఐశ్వర్యం పోయి త్వరలోనే భ్రష్టుడివి అవుతావు.’
‘నీకు పుట్టుకతో వచ్చిన పాపగుణం నీ శవాన్ని కాల్చినపుడు కాని పోదు. నేను చెప్తున్న బుద్ధులు పాపాత్ముడివైన నీ మనసుకు పట్తాయా? ఒకవేళ ఇప్పుడు పట్టినా స్థిరంగా ఉంటాయా? విరోధానికి కూడా కారణముండాలి. అపకార విరోధి లక్షణం. నీ లంకా నగరంలో కానీ, నీ దేశంలో కానీ, మరెక్కడైనా కానీ శ్రీరామచంద్రమూర్తి నీకేమన్నా కీడు చేశాడా? ఎందుకిలా నిష్కారణంగా కలహానికి కాలు దువ్వుతున్నావు? ఎందుకు పాపం తెలియని శ్రీరాముడి విషయంలో తప్పు చేస్తున్నావు? దీనివల్ల నీకు అపాయమే కానీ మేలు జరగదు. ఓరీ రాక్షసుడా! నీ తమ్ముడైన ఖరుడిని చంపడం నీకు అపకారం చేసినట్లే అని అంటావేమో? శూర్పణఖ చెప్పుడు మాటలు విని శ్రీరాముడి మీదకు యుద్ధానికి పోయి ఖరుడు చచ్చాడు. యుద్ధంలో తన ప్రాణరక్షణ తాను చేసుకోవడం తప్పా? అలాగే నీకు మగతనం వుంటే శ్రీరాముడి మీదికి యుద్ధానికి వెళ్లు. ఏ పాపం ఎరుగని సీతను దొంగిలించి ఆమెను బాధపెట్టడానికి శ్రీరాముడు చేసిన తప్పేంటి?’
‘రాక్షసరాజా! నువ్వు సీతను బలాత్కారంగా తీసుకుపోవద్దు. అది చాలా పాపపు పని. నువ్విలా చేసినట్లు రాముడికి తెలిస్తే చూపులతోనే నిన్ను ఆయన చంపుతాడు. రాబోయే కీడు తెలుసుకోలేక యమపాశాన్ని మెడలో వేసుకున్నావు. మోయలేని బరువు తలకెత్తుకున్నావు. జీర్ణం కాకుండా రోగంతో చచ్చినట్లు, సీతను అపహరిస్తే నీకు అపాయం తప్పదు. ఓరీ! నేను ముసలివాడినని అలక్ష్యం చేయవద్దు. నాకు ఇప్పుడు అరవై వేల సంవత్సరాల వయస్సు. ఇన్నాళ్లూ ఏ లోపం రాకుండా తండ్రి రాజ్యాన్ని పాలించాను. నువ్వు దృఢమైన వయసులో ఉన్నావు. విల్లు, రథం, కవచం, బాణాలు ఉన్నా శూరుడివి. నేను ముసలివాడిని. అయినా సీతను నా కళ్లెదుట తీసుకుని నువ్వు సుఖంగా పోలేవు. చెప్పిన మాట విను. సీతను హరించి రాముడి నుండి విడదీయలేవు. రాక్షసుడా పరుగెత్తకుండా మగవాడివైతే కాసేపు యుద్ధం చేయి. యుద్ధం చేస్తే ఖరుడు చచ్చినట్లు నువ్వూ ఛస్తావు. ఎన్నోసార్లు రామచంద్రమూర్తి రాక్షసులను చంపినట్లు నిన్నూ చంపుతాడు. ఎందుకు ప్రాణ భయంతో పరుగెత్తుతావు? నువ్వు కాసేపుంటే రామలక్ష్మణులను తెస్తాను. నేను వారికై పోతే నువ్వు లంకకు పారిపోతావు?’
‘నా దేహంలో ప్రాణం వున్నంత వరకు సీతాదేవిని తీసుకుని నిన్ను పోనీయను. నా ప్రాణానికి ప్రమాదం కలిగినా సంతోషమే. నేనేం చేస్తానో చెప్తా విను. నువ్వు పోవాలనుకున్నా నా కంటబడి ఎక్కడికీ పోలేవు. ఎదిరించి నా శక్తికొద్దీ నీకు ఉత్సాహంగా యుద్ధ భిక్ష పెట్తాను. దానిని స్వీకరించు. నిన్ను రథం మీద నుండి నేలపడగొడ్తాను.’
జటాయువు మాటలు విన్న రావణాసురుడు వీడిని ఎలాగైనా హతమార్చాలన్న పట్టుదలతో, కోపం తెచ్చుకుని, తన ఇరవై కళ్ల నుండి నిప్పులు రాలుస్తూ, జటాయువును తాకాడు. అలా వాళ్లిద్దరూ ఒకళ్లనొకరు ఎదిరించుకున్నప్పుడు పెద్ద గాలితో చిమ్మబడిన రెండు మేఘాలు ఒకదానినొకటి తగిలినట్లు, రెక్కలున్న రెండు మాల్యవంచాలు గుద్దుకున్నట్లు వుంది. ఇద్దరూ అలా సమాన బలవేగాలతో ఎదుర్కొన్నారు ఒకరినొకరు. ఆ ఇద్దరూ ఆశ్చర్యకరంగా యుద్ధం చేస్తుంటే, రావణుడు జటాయువు మీద కుప్పలు కుప్పలుగా, వర్షంలాగా, పదునైన భయంకర బాణాలను ప్రయోగించాడు. జటాయువు వాటన్నిటినీ తన ముక్కుతో, గోళ్లతో నేలబడగొట్టాడు. రావణుడి శరీరమంతా పుండులాగా అయ్యేట్లు జటాయువు తన గోళ్లతో చీల్చి చాలా బాధ కలిగించాడు. దీంతో కోపం తెచ్చుకున్న రావణుడు ‘చచ్చావురా జటాయువూ!’ అంటూ, పదునైన బాణాలను గురిచూసి కొట్టాడు. ఆ బాణాలను సంధించిన విల్లును సాహసంతో, రావణుడి మీదకు దూకి, రెండు తునకలుగా జటాయువు విరిచాడు.
-సశేషం
పుస్తకం దొరుకు స్థలం: శ్రీ కోదండరామ సేవక ధర్మసమాజం, అంగలకుదురు, తెనాలి మండలం, గుంటూరు జిల్లా 7036558799 08644-230690

-వనం జ్వాలా నరసింహారావు 80081 370 12