స్వర్గం
Published Saturday, 11 May 2019‘ప్యారడైస్ లాస్ట్’ అన్న కవితను జాన్‌మిల్టన్ రాశాడు. డిగ్రీ చదువుతున్నప్పుడు బహుశా అందరూ ఈ కవితని చదివి వుంటారు. అదొక కోణం.
‘స్వర్గాలు లేవు.. మనం కోల్పోయినవే స్వర్గాలు’ అన్నాడు ఓ తెలుగు కవి.
‘మన స్వర్గాలు మనలోనే వున్నాయి’ అంది ఈ మధ్య ఓ కవయిత్రి.
స్వర్గం ఒకటికాదా? రకరకాలైన స్వర్గాలు వున్నాయా? ఇలా ఎన్నో సందేహాలు కలుగుతాయి. మనం కోల్పోయినవి అన్నీ స్వర్గాలేనా? ఈ కవులు ఏ సందర్భంలో ఇలాంటి వ్యాఖ్యానాలు చేసి ఉంటారు. కొన్ని మాటలు సంఘటనలు మనకు వెంటనే అర్థం కాదు. ఆ సందర్భం వచ్చినప్పుడు అవి మనకు బోధపడతాయి. దానికి కొంతకాలం గడవచ్చు కూడా.
స్వర్గం అంటే మన అభిప్రాయం వేరు. అక్కడ అంతా ఆనందం ఉంటుంది. అప్సరసలు ఉంటారు. ఎప్పుడూ యవ్వనమే వుంటుంది. అనారోగ్యం వుండదు. ఇలాంటి భావనలు ఎన్నో మనస్సులో మెదలుతుంటాయి.
స్వర్గాలు మనలోనే వున్నాయి. అంటే అర్థం ఏమిటి? ఎవరి పిచ్చి వారికి ఆనందం. ఈ ఆనందమే స్వర్గమా...?
పిల్లల స్వర్గం వేరు.
బొమ్మలలోనే వారి స్వర్గం ఉంటుంది. కొత్త బొమ్మలు కన్పించగానే వాటిని చూసి ఆటలో మునిగిపోతారు. అది వారి స్వర్గమా?
ఆడపిల్లలు పెద్దవాళ్ల మాదిరిగా వేషాలు వేస్తూ ఆడుతూ వుంటారు. అదే వారి స్వర్గమా?
పెద్దవాళ్ల స్వర్గం వేరు.
కార్లు మారుస్తూ కొత్త కార్లు కొంటూ కొంతమంద తమ స్వర్గాన్ని సృష్టించుకుంటారు. కొత్త ఆభరణాలని చూస్తూ, కొనుక్కుంటూ ఆడవాళ్లు తమ స్వర్గాన్ని సృష్టించుకుంటారు.
ఎవరి పిచ్చి
వారి స్వర్గం.
ఇలా చెప్పుకుంటూ పోతే చాలా కన్పిస్తాయి.
స్వర్గం పోయింది అని అన్నా, మనం కోల్పోయినవే స్వర్గాలు అని అన్నా, స్వర్గాలు మనలో వున్నాయి అన్నా వాటికి సందర్భం రావాలి. ఆ సందర్భం వస్తే అవి అర్థమవుతాయి.
మరి నరకం ఎక్కడ వుంది. స్వర్గం నరకం రెండు విభిన్నమైన విషయాలు. అది మనలో లేదా? మనం కోల్పోయింది నరకం కాదా? అన్ని కాకపోయినా కొన్ని సంఘటనలు.
స్వర్గం, నరకం రెండూ మనలోనే వున్నాయి.
ఈ రెండు మానసిక స్థితులని మనం సృష్టించుకోవచ్చు.
ఎంపిక మనదే!