S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

రంగులు, రేఖలతో మీఠీ మీఠీ బాతేఁ...

చిత్రకళ గూర్చి తెలుసుకోవడానికి, అధ్యయనం చేయడానికి చాలామంది యువకులు చిత్రకళను నేర్పించే కళాశాలలకు వెళతారు. చిత్రకారుడు బాలభక్తరాజు ఇందుకు పూర్తి భిన్నం. ఈ ఒక్క విషయంతో ఆయన ‘విశిష్టత’ ఏమిటో తేటతెల్లమవుతుంది. ఆయన పేరులోనూ విశేషణముంది. ఈ విశిష్టత.. విశేషణాల కలగలుపు ఆయన గీసిన వర్ణచిత్రాలు.
బాలభక్తరాజు 1974 మే 6న సికిందరాబాద్‌లో జన్మించారు. తండ్రి సత్యమూర్తి ‘స్టంప్ వర్క్’ చేసేవాడు. అప్సర 6బి, 8బి పెన్సిల్‌తో అద్భుతమైన బొమ్మలు గీసేవాడు. కలర్ పెన్సిల్స్‌తోనూ అందమైన చిత్రాలు సృజించేవాడు. ఆ రకంగా ఆ చిత్రకళకు చిన్నారి బాల భక్తుడయ్యాడు. అది మొదలు ప్రాథమిక పాఠశాల రోజుల నుంచే చిత్రలేఖనంపై మనసు పెట్టడమే గాక ‘్భక్తి’ని ప్రదర్శించాడు.
తండ్రి శివుని బొమ్మలు ఎక్కువగా వేస్తే కొడుకు శివుని కొడుకు గణేశుని బొమ్మలు వేయసాగాడు. పైగా ప్రతి సంవత్సరం తాను పుట్టి పెరిగిన ప్రాంతంలో పెద్దఎత్తున గణేశుని మండపాలు వెలయడం, అందులో వివిధ భంగిమల గణేశుని ప్రతిమలు పెట్టడం.. పూజించడంతో ‘బాలభక్తుడి’లో మరింత ఉత్సాహం పెరిగింది. అంతేగాక గణేశుడు అతడిని ఆవహించాడు. దాంతో వందల రకాల గణేశుని వర్ణ చిత్రాలను, కాలక్రమంలో అటు కాగితంపై, ఇటు కాన్వాసుపై గీశాడు. అలా గీసిన వర్ణ చిత్రాలను హైదరాబాద్‌లోనే గాక ఇతర మెట్రో నగరాల్లో ప్రదర్శించగా అపూర్వమైన ‘స్పందన’ వీక్షకుల నుంచి, చిత్రకళా విమర్శకుల నుంచి, ఆర్ట్ కలెక్టర్స్ నుంచి రావడం, ఏ కళాశాలలో చదువుకున్నారు? ఎక్కడ నుంచి ఎంఎఫ్‌ఐ చేశారని కొందరు ప్రశ్నించగా, అప్పుడు గాని ఓ సర్ట్ఫికెట్ అవసరమని బాలభక్తరాజుకు అనిపించలేదు. ఆ రకంగా మైసూరులోని డి.ఎం.ఎస్. లలిత కళా మహా సంస్థాన్ నుంచి దూర విద్య ద్వారా ఆయన బిఎఫ్‌ఏ చేశారు. ఆ సర్ట్ఫికెట్ ఒక అలంకరణ మాత్రమే! తన అధ్యయం, సాధన అంతా స్వతహాగానే కొనసాగింది.
‘ఒక దశలో బొమ్మలు గీయకపోతే బొమ్మలు గీయడానికి దూరమైతే పిచ్చి పట్టేది..’ అని ఆయన చెప్పారు. ఆ వ్యక్తీకరణతో ఆయన చిత్రకళా రంగానికి ఎంత అంకితమై పోయాడో అర్థమవుతున్నది. భృతి కోసం ‘నగల డిజైనర్’గా ఓ ఆభరణాల షాపులో పనికి కుదిరినా మనసంతా పెయింటింగ్ ప్రదర్శనల పైకి మళ్లేది. కళాభవన్‌లో గానీ, కళామందిర్‌లో గానీ, ఇతర గ్యాలరీలలో గానీ ఏర్పాటైన చిత్ర ప్రదర్శనల గూర్చి పత్రికల్లో చదివి పర్మిషన్ తీసుకుని పరుగెత్తి వెళ్లి గంటల తరబడి తనివితీరా ఆ ప్రదర్శనలు చూడటం, అదే ధ్యాసగా ఉండటంతో షాపు యాజమాన్యంతో మాట రావడం, ప్రతిసారి పర్మిషన్ ఇవ్వడానికి తటపటాయించడంతో తానే ఆ ఉద్యోగం నుంచి విరమించుకోవడం చూస్తే చిత్రకళ పట్ల బాలభక్త రాజుకున్న ‘ఆర్తి’ ఎంతటిదో అర్థమవుతుంది. ఎంతగా ‘ఆర్ట్’పై మనసు పెట్టాడో బోధపడుతుంది. నిజమైన చిత్రకారుడి నిజమైన ‘లక్షణం’ ఇదేనేమో!ననిపిస్తుంది.
రామానాయుడు స్టూడియోలో కళాభాస్కర్ వద్ద పబ్లిసిటీ డిజైనర్‌గా కొంతకాలం పని చేసినా, అడ్వర్టయిజ్‌మెంట్ ఏజెన్సీలో మరి కొంతకాలం పని చేసినా ఎక్కడా నిలువలేక పోయానని ఒకచోట కూర్చోలేక పోయానని, పిచ్చిపట్టినట్లుగా ఉండేదని, అంతేగాక తాను చేయాల్సిన పనిగాక మరేదో పని చేస్తున్నానన్న ‘అపరాధ భావన’ మనసులో నిరంతరం మెదిలేదని బాలభక్తరాజు తన గతాన్ని గుర్తు చేసుకున్నారు.
బేగంపేటలోని కళామందిర్‌లో సచిన్ జల్తారే అన్న చిత్రకారుడి బొమ్మల ప్రదర్శన తన దృష్టికోణాన్ని మలుపు తిప్పిందంటారు. అలాగే తార్నాకలోని సిసిఎంబిలో చిత్రకారుడు సూర్యప్రకాశ్ నిర్వహించిన ఆర్ట్ క్యాంప్‌లో పాల్గొన్న సునీల్‌దాస్ లాంటి ప్రముఖుల రేఖలు.. రంగులు నన్ను నన్నుగా ఉండనీయలేదని బాలభక్తరాజు గుర్తు చేసుకున్నారు.
ఈ ‘ఎక్స్‌పోజర్’తో క్యూబిజం ఆధారంగా ఓ వినూత్న సిరీస్‌ను ఆయన ప్రారంభించారు. అదే ‘మీఠీ మీఠీ బాతే’. పేరు తగ్గట్టుగానే ప్రేమ రసగంగలో మునిగిన యువతీ యువకుల ముఖ్యంగా గ్రామీణ జంటల మృదుమధుర భావజాలాన్ని చిత్రిక పట్టే సరికొత్త ‘శైలి’ని కాన్వాసుపై ఆయన ప్రకటించారు. ఎంకి - బావల అమలిన శృంగారం లాంటి అందమైన ఊసులను వర్ణాలతో పలికించారాయన. తమ భావాలను, ఆలోచనలను రామచిలుకలకు, పక్షులకు, రసగంగలోని చేపపిల్లలకు మొరపెట్టుకునే వైనం వినూత్నం. మీఠీ మీఠీ బాతే అన్న శీర్షికతోనే చిత్రకారుడు ఎదుటివారి మనసులు దోచేస్తారు. ఇక ఆ వర్ణ రంజితం, ముగ్ధ మనోహర రూపం, అందమైన ఫ్రేమ్, వొదిగిపోయిన క్యూబిజం చిహ్నాలు మనసు లోలోతు పొరల్ని తాకుతాయి. తన్మయత్వంలోకి తీసుకెళతాయి. పురుషుడి మెడలో తాయతు, తలకు పగిడీ, దర్పాన్ని ఒలకబోసే మీసాలు, చేతికో ‘వాచీ’.. అలాగే అమ్మాయి అమాయక చూపులు, మెడలో అతి సాధారణ ఆభరణాలు, దగ్గరలో చిలుక.. హావభావాలన్నీ క్యూబిజంలో బంధించి చూపరులను మంత్రముగ్ధుల్ని చేసే వైనం.. వెరసి వర్ణచిత్రాల వైభవం కళ్ల ముందు రాశి పోసిన చందంగా ఉంటుంది.
ఆయన బ్రష్ స్ట్రోక్స్, వర్ణాలతో కనిపించే టెక్చర్, జీవం పోసుకున్న రూపాల్లోని నిండుదనం తన ప్రత్యేక శైలిని, తనదైన సిగ్నేచర్‌ను తెలుపుతాయి. సాధారణంగా ప్రతి చిత్రకారుడు ఆశించే, కోరుకునే ఈ ‘శైలి’ని బాలభక్తరాజు అవలీలగా సాధించడం అపురూపం. స్వచ్ఛతకు, అమాయకత్వానికి, అద్భుత భావ వ్యక్తీకరణకు ఆయన వర్ణచిత్రాలు చిహ్నాలుగా నిలుస్తాయి.
2005 సంవత్సరం నుంచి తన చిత్రాలను హైదరాబాద్, బెంగళూరు, అమృత్‌సర్, ముంబయి తదితర నగరాలలో ప్రదర్శించారు. 2003 సంవత్సరం నుంచి అనేక గ్రూప్ షోలు కోల్‌కతా, కొత్త ఢిల్లీ, బెంగళూరు, చెన్నై తదితర మెట్రో నగరాలలో నిర్వహించారు.
హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ, స్టేట్ ఆర్ట్ గ్యాలరీ, కోనసీమ చిత్రకళా పరిషత్ సంస్థల నుంచి అనేక అవార్డులు అందుకున్నారు. చిత్రకళలో సర్ట్ఫికెట్లు, డిగ్రీలు లేకున్నా చిత్తశుద్ధి, నిజాయితీ ఉంటే శిఖరాగ్రాలను చేరుకోవచ్చని బాలభక్తరాజు నిరూపించారు.

బాలభక్తరాజు 9948855444

-వుప్పల నరసింహం 9985781799