S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

మమకారం మంట కలిసింది

అది ఓ వృద్ధాశ్రమం.. ఎందరో వృద్ధులకు, వృద్ధ దంపతులకు ఆవాసమైన భవనాల సముదాయం. ఎంతో స్వచ్ఛమైన, అచ్చమైన స్వేచ్ఛాయుత జీవనం. ఇందు అరమరికలు, అతిశయాలు, ఆడంబరాలు, కుల వివక్షతలు లేని జీవనం.
నాలుగెకరాల విస్తీర్ణంలో నిర్మితమైన భవన సముదాయం - ఇందు అధునాతనమైన పరికరాలు అమర్చిన ఇంద్రభవనం కాకపోయినా మహేంద్ర భూపతి ధార్మికంగా అందించిన ఆనంద నిలయం. మహేంద్ర భూపతిగారి సతీమణి గాయత్రీ సుమతిగారి జ్ఞాపకార్థం ఏర్పరచబడిన గృహ సముదాయం. చుట్టూరా వృద్ధులను స్వాంతన నొసగుతూ.. గాలికి తలలూచుతూ లతలు వారిని పలకరిస్తున్నట్లుగా అనుభూతి. ఆశ్రమంలో ఆయాలు మొదలుగా అన్ని సేవలు చేసేందుకు గుమస్తాలు, వంటవాళ్లు, తోటమాలులు సుమారు ఏభై మంది వరకు ఉంటారు వృద్ధుల్ని కనిపెట్టుకుని.
వృద్ధుల సంఖ్య ఐదు వందల వరకు ఉండింది ఆడా, మగతో సహా.
వృద్ధులందరు ఐచ్ఛికంగా వారివారి సేవలు అందిస్తూ, కంటిపాపలా లతాంగులను పందిళ్లకి పాకిస్తూ.. పాదులు సవరిస్తూ.. పైపుల ద్వారా నీటిని కురిపిస్తూ కాలాన్ని, వారి గమనాన్ని సద్వినియోగ పరుస్తుంటారు.
ప్రొద్దుటే సూర్యోదయానికి ముందే కాలకృత్యాలను ముగించుకుని బాలభానుణ్ణి స్వాగతిస్తారు - సప్తాశ్వ రథమారుడం కశ్యపాత్మజం.. శే్వత పద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం.. ప్రార్థన తర్వాతనే ఫలహారమైనా.. వేడివేడి పానీయమైనా. ఆ తర్వాత పేపర్ పఠనం వగైరావగైరా.
ఇలా సాగిపోతున్న ఆ వృద్ధాశ్రమంలోకి క్రొత్తగా అన్నపూర్ణాదేవి అన్న పండు ముతె్తైదువ చేర్చబడింది. బహుశా ఆమెను ఇక్కడ చేర్చింది కొడుకు, కూతురనుకుంటాను, కోడలు తీరికలేని పనులతో సతమతమవుతున్నదట.. అందరూ చెప్పుకుంటుంటే విన్నాయి చుట్టూరున గుమిగూడి గుసగుసలాడ్తున్న లతాంగనలు. వాటికి ఇక్కడ చేర్చబడ్డ వారందరి కష్టాలు, కన్నీళ్లు. కడుపున పుట్టిన వాళ్లు తలిదండ్రుల్ని ఇక్కడ చేర్చేసి ‘అమ్మయ్య..’ అంటూ చేతులు దులుపుకున్న చందాలు తెలుసు.
అన్నపూర్ణాదేవి మెల్లమెల్లగా అలవాటు పడటానికి కొత్త వాతావరణంలో విశ్వ ప్రయత్నమే చేస్తోంది. కాని చాలా టైమే పట్టేటట్లుంది. అందరు తనని పలకరిస్తున్నారు, కలుపుకో ప్రయత్నిస్తున్నారు. కాని తనే ఎందుకో మనస్ఫూర్తిగా స్పందించలేక పోతోంది.
కనీసం గతాన్ని మరిచిపోయేందుకు మొక్కల సాగులో ప్రయత్నం చేస్తోంది. గాలికి అటు ఇటుగా విడిపోయిన తీగలను ప్రోది చేస్తూ.. పాదుల్ని సమంగా మట్టిని సర్దుతూ సరిచేయబూనింది. అంతే ఆరేళ్ల తన కొడుకు సుశాంత్ కళ్ల ముందుకి వచ్చాడు.
‘అమ్మా.. స్కూల్ టైమవుతోంది. తల దువ్వమ్మా...’ అంటూ చుట్టేశాడు తనని. చిందరవందరగా ఉన్న జుట్టుని చక్కగా దువ్వి దిష్టిచుక్క అరికాళ్ల కింద పెట్టి సంతోషంగా వాడిక్కావసిన తాయిలాలు, వాటర్ బాటిల్ అన్నీ బ్యాగ్‌లో సర్ది పంపించింది సుశాంత్‌ని. ఆ వెంటనే కూతురు సుకన్య దువ్వెన తీసుకువచ్చింది జడ వెయ్యమంటూ.
దొంతరలు దొంతరలుగా పిల్లల చిన్నప్పటి జ్ఞాపకాలు; వాళ్లకి ఒళ్లు నలిస్తే తను చేసిన పరిచర్యలు. వాళ్ల ఇష్టానికి పిండివంటలు చేసి వాళ్ల కళ్లల్లో తొంగి చూసిన ఆనందం గుర్తుకొస్తున్నాయి.
పెరిగి పెద్దయ్యాక.. వాళ్లు చేసిన వాగ్దానాలు.. అమ్మని అందలమెక్కిస్తామన్నారు... పల్లకీ మోస్తామన్నారు.. కాలుకింద పెట్టనివ్వమన్నారు - నీ సుఖమే కోరుతున్నామన్నారు.. అందుకే నను వీడి వెళిపోయారు. నిజమే.. కానీ అనుకున్నామని జరుగుతాయా అన్నీ.. అనుకోలేదని ఆగుతాయా కొన్ని.. జరిగేవన్నీ మంచికని అనుకోవడమే అమ్మ పని.
అయిపోయింది అమ్మ పని వాళ్లకు పెళ్లిళ్లవడంతోనే. దానికి మొగుడొచ్చాడు, అదెళ్లిపోయింది. వీడికి పెళ్లామొచ్చింది తనని గెంటింది వృద్ధాశ్రమానికి అడ్డెందుకని.
పెళ్లప్పుడే ఒడంబడిక చేసుకున్నాట్ట అత్తమామలతో.. రాబోయే ఆలితో. తనకి తెలియనివ్వలేదు ఆ విషయం. రాబోయే కోడలిలో తనేం చూసింది రూపం.. గుణం గురించి గుణించద్దా!!
తను పాజిటివ్‌గా వెళ్లింది.
కోడలు చక్కని చుక్క.. చారడేసి కళ్లు, మోకాలి వరకు కేశాలు, చక్కని పలువరుస, చెదరని చిరునవ్వు నాకూ నచ్చేసింది. వాడికైతే దానందం చూసి మతే పోయింది.
కాకపోతే అత్తమామలతో.. ఇల్లాలితో కుదుర్చుకున్న ఒప్పందం నా వద్ద గుప్తంగా ఉంచుతాడా!!
నా రొమ్ము పాలు తాగి నా రొమ్ము మీద గుద్దింది నవమాసాలు నా కడుపున మసలి, నా కనుసన్నల ఎదిగిన వంశోద్ధారకుడు - నన్నిలా వృద్ధాశ్రమం పాల్జేసి ఉద్ధరించాడు.
అసలు వాడికెలా కలిగింది ఈ బుద్ధి - నా కూతురు నిర్వాకం. ఆడపడుచు కదా.. ఇలా చక్కదిద్దింది పుట్టింటిని.. నన్ను ఆశ్రమం పాల్జేసి వృద్ధాప్యంలో. ఇంతకీ ఏం చేసిందనేగా మీ సందేహం...
చెప్తా.. నింపాదిగా వినండంటూ లతల్ని పెనవేసుకుపోయింది భోరుమంటూ అన్నపూర్ణమ్మ.
గతం మళ్లీ కళ్ల ముందు కొచ్చింది - కన్నీరు మున్నీరౌతోంది అన్నపూర్ణమ్మ.
తలచినదే జరిగినదా దైవం ఎందులకు.. జరిగినదే తలచితివా శాంతి లేదు నీకు.. నిజం, శాంతి లేదు వాళ్లందరూ కలిసి నాకు చేసిన ద్రోహానికి. ఇంకా పాట సాగిపోతోంది ఆశ్రమంలో. మారుమ్రోగిపోతోంది అన్నపూర్ణమ్మ మస్తిష్కంలో..
అన్నపూర్ణమ్మ తనని తాను సంభాళించుకుంది. వర్షిస్తున్న కళ్లని చీరకొంగుతో అద్దిపట్టుకుంది. ఆ రోజు... అదే పెళ్లిచూపుల రోజు.. కొడుకు, కూతురు కాబోయే కోడలిని లోనికి తీసుకువెళ్లి రహస్య సమాలోచనలు చేశారు - ఒప్పందం కుదుర్చుకున్నారు. దాని సారాంశం ఏమంటే తనకి భర్త పెన్షన్ వస్తుంది కాబట్టి ఈ సంబంధం ఒప్పుకున్నారట... పదహారు రోజులు పండుగ పూర్తయ్యేలోపు తనని వృద్ధాశ్రమంలో చేర్పించే షరతుపై.
వాణ్ణి శతవిధాల ప్రాధేయపడ్డా కన్నకడుపు కోత తప్పించమని.. కోడలికి అర్థమయ్యేలా చెప్పి ఒప్పించమని. వాడు తనకి ఇచ్చిన మొట్టమొదటి మాటట... అది తప్పి తనని నొప్పించలేనన్నాడు. ‘అర్థం చేసుకోమ్మా.. ఇనే్నళ్లు పెంచిన నువ్వే నా కష్టాన్ని, నష్టాన్ని అర్థం చేసుకోలేకపోతే.. నిన్న మొన్న పరిచయమైన అదేం అర్థం చేసుకుంటుందమ్మా’ అన్నాడు వాడు.
అంతే.. వాడు నా కళ్లముందున్నా.. వాడు నడిచే శవం.. జీవచ్ఛవం...
అంతేగా.. అంతేగా.. అంటూ అన్నపూర్ణమ్మ ఆ లతల్ని పెనవేసుకు కుప్పకూలిపోయింది. పండుటాకు రాలిపోయింది- నేలపై వాలిపోయింది- (ఆ)వేదన ఆగిపోయింది. మరుక్షణం మమకారం మంటలెగసింది.

-ఆచార్య క్రిష్ణోదయ 74168 88505