ఎప్పుడోసారి..
Published Monday, 3 June 2019నాకు అప్పటివరకూ తెలీదు
సూర్యుడూ మాయవౌతాడని
ఆకాశాన్ని వెలిగించే వెనె్నల కూడా
మంచులా కరిగిపోతుందని
మనం శాశ్వతం అనుకున్నవన్నీ
ఎప్పుడోసారి అశాశ్వతవౌతాయని!
నాకు అప్పటివరకూ తెలీదు
సముద్రమూ చెమర్చుతుందని
ఆకులన్నిటినీ పరామర్శించే చిరుగాలి
మబ్బుల ముంగిట సోలిపోతుందని
మనల్ని ఓదార్చే చేతులు కూడా
ఎప్పుడోసారి ఓదార్పును కోరుకుంటాయని!
నాకు అప్పటివరకూ తెలీదు
పర్వతాలూ ఎదురుచూస్తాయని
అందరికీ గొడుగును పట్టే అడవి
ఒక్క వానజల్లుకై నిరీక్షిస్తుందని
మనల్ని ఎప్పుడూ మోసే అపజయాలు
ఎప్పుడోసారి విజయం వాకిట చేరుస్తాయని!
నాకు అప్పటివరకూ తెలీదు
ఎడారులూ నవ్వుతాయని
ఆకుల్లేక మోడువారిన చెట్టులోనూ
కొన్ని ఆశలు సజీవంగా మిగిలుంటాయని
మనం నమ్మకంతో నీళ్లు పోస్తుంటే
ఎప్పుడోసారి జీవితమూ చిగురిస్తుందని!