S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

పాతాళస్వర్గం-16

‘అవును సర్! ఆవిడ క్షేమంగా ఉన్నారు’ అతని చేతుల్లోని తన చేతుల్ని సున్నితంగా తీసుకుంటూ అందామె. అది చూసి కాస్త సిగ్గుపడ్డాడతను.
‘సారీ... చెప్పు! గౌతమి ఎక్కడుంది?’ అన్నాడు ఆతృతగా.
‘అడవిలోనే...’
‘అడవిలోనా? అడవిలో క్షేమంగా ఉందని నీకెవరు చెప్పారు?’ అనుమానంగా అడిగాడు అనిల్.
ఆమె నవ్వింది.
‘నిజం సర్! ఎక్కడున్నా ఆమె క్షేమంగా ఉన్నారని తెలిసింది. సింగపడవికి అటువైపు తుంగభద్ర నర్సింగ్‌హోమ్ మీకు తెలుసుగా’ అంది ఉత్సాహంగా.
‘విన్నాను’
‘దానికి సంబంధించిన ఓ మెడికల్ షాపుంది’
‘అయితే?’ అసహనంగా అన్నాడతను.
‘ఆ షాప్‌కి మేడమ్‌గారి ప్రిస్క్రిప్షన్స్ వస్తున్నాయట’
‘నిజమా?’
‘నిజం సర్! నాకు తెలిసిన ఒకతను చెప్పాడు. అంటే అడవిలోని వాళ్లెవరికో ఆవిడ ట్రీట్‌మెంట్ చేస్తున్నారన్నమాట. ట్రీట్ చేసిన డాక్టర్‌కి ఎవరూ హాని కలిగించరు కదా. ఇంక మేడమ్‌గారికేం ఫర్లేదు. క్షేమంగా ఇల్లు చేరుకుంటారు’ అంటూ మరికొన్ని వివరాలు చెప్పింది లూసీ.
అనిల్ మొహంలోకి కొత్త వెలుగొచ్చింది.
‘్థంక్స్ లూసీ. నిజంగానే మంచి శుభవార్త. ఐ మీన్ పెద్ద శుభవార్త చెప్పావ్. ఇంక దిగుల్లేదు’ అన్నాడు తేలిగ్గా.
‘మీరు అడవికేసి వెళ్తారుగా’
‘వెళ్తాను. ప్రభుగారిని కూడా తీసుకుని వెళ్తాను’ అన్నాడు అనిల్.
‘అవును. ఆయన కూడా వెళ్తానన్నారు’
‘ఆయన వెళ్తానన్నాడా?’ తుళ్లిపడ్డాడు అనిల్.
‘అవును సర్. ఆయనగారిక్కూడా మేడమ్ అంటే చాలా అభిమానం. అందుకే ఆయనక్కూడా ఫోన్ చేసి చెప్పాను’ అంది లూసీ.
‘ఏవఁన్నాడు?’ ఏదో ఆలోచిస్తూ అన్నాడతను.
‘చాలా సంతోషించారు. మీతో మాట్లాడతానన్నారు’
‘నిజమే. గౌతమి గురించి నాకన్నా అతనే ఎక్కువ టెన్షన్ పడుతున్నాడు’ అని మరోసారి ఆమెకి థాంక్స్ చెప్పి వెళ్లిపోయాడు అనిల్.
* * *
గౌతమి చెప్పిన టైమ్‌కన్నా కాస్త ముందే వచ్చి ఆమె రాక కోసం ఎదురుచూస్తూ కూర్చున్నాడు జింబో. గౌతమి మాటలకి మధురంగా ఏవేవో వూహించుకుంటున్నాడతను.
కాస్త ఆలస్యంగా వచ్చిన గౌతమి
‘సారీ జింబో! చిన్నిని తప్పించుకుని వచ్చేసరికి కాస్త ఆలస్యం అయింది. రాననుకున్నావా?’ ఓ రాతి మీద కూర్చుంటూ అంది.
‘సారీనా! లేదు గౌతమీ. నేనే నీకు సారీ చెప్పాలి. ముందు వెనుకలు చూడకుండా నిన్ను బందీని చేసి చాలా ఇబ్బందులు పెట్టాను. అయినా నా మీద మావఁకేం చెప్పలేదు. అన్నింటికీ మించి మాకు, అడవి తల్లికి అండగా వుండి కాపాడే దేవుడిలాంటి మావకి ప్రాణదానం చేశావ్. నీకు సారీ చెప్పడం కాదు, కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఇంతకీ ననె్నందుకు రమ్మన్నావ్?’ అన్నాడు జింబో ఉత్సాహంగా.
‘నీతో ఓ ముఖ్య విషయం మాట్లాడాలి’ నవ్వింది గౌతమి. ఆ నవ్వు అతని మనసుని మరింత గిలిగింతలు పెట్టింది.
‘అనుకున్నాను. ఏదో ముఖ్యమైన సంగతే అని’ నవ్వాడు అతను కూడా.
‘చిన్నిని గురించి నీ అభిప్రాయం ఏమిటి?’ అంది గౌతమి అతనికేసి పరిశీలనగా చూస్తూ. జింబో పెద్దగా నవ్వాడు.
‘దాన్ని గురించా? దాన్ని గురించి కొత్తగా చెప్పేదేముంది గౌతమీ! చిన్నప్పుడు ఎత్తుకు మోశాను. చెట్లెక్కడం, ఏట్లో ఈతలు కొట్టడం లాంటివెన్నో నేర్పాను. మా అక్క కొండమ్మ దగ్గర నా మీద ఏదో ఒకటి చెప్తూనే ఉంటుంది. వొఠ్ఠి అల్లరి పిల్ల! కోపం కూడా ఎక్కువే. కానీ పాపం! మనసు మాత్రం వెన్నపూసే. ఇంతకీ ఇప్పుడు దాన్ని గురించి ఎందుకు?’ అన్నాడు నవ్వుతూనే.
‘నీ మీద మీ అక్కకి కంప్లైంట్ చేస్తుందా? ఏం? తనకి నువ్వంటే ఇష్టం లేదా?’
‘ఇష్టమా. నేనంటే దానికి ప్రాణం. నేను అడవి దాటి వెళ్తే వచ్చేదాకా తిండి కూడా సరిగ్గా తినదు. ఎప్పుడూ నా వెంట వెంటే తిరుగుతుంది. అక్క దగ్గర దానికి చనువెక్కువ. సరదాగా ఏదో ఒకటి చెప్తుంది’ గర్వంగా అన్నాడు జింబో.
‘మరి మీరిద్దరూ పెళ్లి చేసుకోవచ్చు కదా?’
‘పెళ్లా?’ జింబో మొహం మాడిపోయింది.
‘ఊఁ పెళ్ళే’
‘లేదు. దాన్ని చేసుకోవడం ఇష్టం లేదు’ అన్నాడతను కంపరంగా.
‘ఏం? కొంపతీసి ఎవర్నయినా ప్రేమించావా?’ సరదాగా అందామె.
‘అవును’
‘వ్వాట్?’ తుళ్లిపడింది గౌతమి.
‘అవును. నేనొకామెని ప్రేమించాను’ అన్నాడు జింబో మెల్లగా.
‘ఎవర్ని? ఈ అడవిలో అమ్మాయినేనా?’ నీరసంగా అందామె.
చిన్ని మనసు తెలిసిన ఆమె, జింబోకి నచ్చజెప్పాలన్న ఆమె ఆశ వాడిపోయింది.
‘నినే్న’
‘ఏమిటీ?’ అదిరిపడింది గౌతమి.
‘అవును. నువ్వంటే నాకిష్టం’
‘నీకేమైనా పిచ్చా?’ గభాల్న లేచింది గౌతమి.
‘నువ్వేమైనా అనుకో. నువ్వు నాక్కావాలి. నిన్ను పెళ్లి చేసుకుంటాను’ ధైర్యంగానే అన్నాడు జింబో. క్షణం మాట రాలేదామెకి.
‘పిచ్చి జింబో! మన పరిచయం ఎంత? అసలు నా గురించి నీకేం తెలుసు’ అంది బలవంతంగా నవ్వుతూ.
‘ప్రేమకి ఎంతకాలం కావాలి గౌతమీ! రెండు క్షణాలు చాలు. ఇంక నీ గురించంటావా? చాలా చిన్నతనంలోనే నిన్ను చూశాను. అప్పుడే నువ్వంటే నాకు ఇష్టం ఏర్పడింది. ఇప్పుడు నిన్ను చూశాక ప్రేమ కలిగింది’ అన్నాడతను చిన్నపిల్లాడిలా.
‘ఇది ఎలా సాధ్యం జింబో! నువ్వు అడవిలో హాయిగా బతికే స్వేచ్ఛా జీవితానికి అలవాటు పడిన వాడివి. నేను పట్నవాసానికి అలవాటు పడినదాన్ని. మనిద్దరి మధ్య ప్రేమేమిటి? పెళ్లేమిటి’ అంది గౌతమి అనునయంగా.
‘ఏం పరవాలేదు. నేన్నిన్ను ప్రాణంగా చూసుకుంటాను. నీకు తోడుగా ఇక్కడ మా చిన్నీ కూడా ఉంటుంది’ అన్నాడతను ఉత్సాహంగా.
చిన్ని పేరు వినగానే గౌతమి గుండె దడదడలాడింది. ఆమె జింబోని ఎంతలా ప్రేమించిందో ఆమెకి తెలుసు. అతను కాదంటే ఏమైపోతుందో తెలుసు. అందుకే-
‘సారీ జింబో! ఇది జరిగే పని కాదు. నువ్వెన్ని చెప్పినా నిన్ను చేసుకోవడానికి నేను సిద్ధంగా లేను. కారణం నేనొకతన్ని ప్రేమించాను’ అంది సున్నితంగా. జింబో మొహం వెలవెలబోయింది.
‘నువ్వు ప్రేమించావా?’ అన్నాడు సూటిగా చూస్తూ.
‘‘అవును. నేనిక్కడ చిక్కుకోకపోతే ఈపాటికి మా పెళ్లి కూడా జరిగిపోయేది’ అందామె మెల్లగా. క్షణం ఆలోచించి-
‘అయినా పర్లేదు అతన్ని మర్చిపోయేలా నేను చూసుకుంటాను’ అన్నాడు. ఓసారి అతని మొహంలోకి పరిశీలనగా చూసిందామె.
‘జింబో! నువ్వు మరీ పసివాడిలా మాట్లాడుతున్నావ్? నేను నిన్ను ప్రేమించలేదు. అలాంటిది ప్రేమించినతన్ని మర్చిపోయి నినె్నలా చేసుకుంటాను. నా మాట విని చిన్నిని చేసుకో’ అంది.
‘్ఛ! దానికీ నాకూ పెళ్లా?’ కంపరంగా అన్నాడతను.
‘చూశావా? చిన్నతనం నించీ నీతో కలిసి తిరిగింది. ఆడింది పాడింది. నినే్న ప్రాణంగా చూసుకుంటోంది. నువ్వే తన లోకం అనుకుంటోంది. అలాంటి చిన్నిని చేసుకోమంటే ‘్ఛ! దానికీ నాకూ పెళ్లా?’ అంటూ అంత అవమానకరంగా మాట్లాడావే. మన పరిచయ కాలం చాలా స్వల్పం. మన దారులూ వేరు. ఆచార వ్యవహారాలు వేరు. అలాంటిది నిన్ను గురించి నేనేమనాలి?’ నిలదీసినట్టు అంది గౌతమి.
జింబో మొహం నల్లబడింది.
‘గౌతమీ! ఆనాటి సంఘటన నీకు గుర్తులేక పోవచ్చు గానీ నాకింకా మొన్న జరిగినట్టుంది. నేనిచ్చిన పూలు ఎంత అపురూపంగా దాచుకున్నావో, మాతో కలిసి ఎన్ని కబుర్లు చెప్పావో, కోలుకుని వెళ్లేప్పుడు ఎంత దిగులుగా చూశావో నేను మర్చిపోలేదు. అప్పుడు నీకు మేం అడవి మనుషుల్లా కనిపించలేదు. కానీ ఇప్పుడు...’ దుఃఖంతో అతనికి మాట రాలేదు.
గౌతమి కంగారు పడిపోయింది.
‘అయ్యో జింబో! మన జీవన విధానాన్ని గురించి చెప్పానే గానీ నిన్నవమానించడానిక్కాదు. మీరంటే మా అందరికీ అభిమానమే!’
చిన్ననాటి ఆ సంఘటన నాకు గుర్తు లేదు. కానీ ఆ నాన్నగారు చెప్తే లీలగా గుర్తొచ్చింది. నిజంగా ఆనాడు మీ దొర కాపాడకపోతే నేనే కాదు. మా కుటుంబం కూడా మిగిలేది కాదు. ఆ విశ్వాసం మాకుంది. ఆ విశ్వాసంతోనే నాన్న చాలా తాపత్రయపడ్డారు. దొరకి ఎలాంటి ఆపదా రాకూడదని’ అంటూ తండ్రి బ్లాక్‌టైగర్ని గురించి, అతను పట్టు పడకుండా ఉండటానికి ఎంత కష్టపడ్డాడో క్లుప్తంగా చెప్పింది. తర్వాత గొంతు మరింత మృదువుగా మార్చుకుని-
‘ఆనాటి మన పరిచయం విలువైందే కావచ్చు. మీ దొర వల్ల నేను బతికుండచ్చు. కానీ వాటిని ఆసరాగా తీసుకుని లిప్తకాలపు పరిచయాన్ని దృష్టిలో పెట్టుకుని మరొకర్ని ప్రేమించిన నన్ను పెళ్లి చేసుకుంటాననడం న్యాయంగా ఉందా?’ అంది.
అదోలా నవ్వాడు జింబో.
పారిజాత పువ్వు పరిమళాలు కాస్సేపే ఉండవచ్చు. దాన్ని తక్కువగా చూస్తామా? పూర్ణచంద్రుడు ఒక్కరోజే కనిపించవచ్చు. అలా అని పున్నమి రాత్రిని మర్చిపోగలమా? మన స్నేహమూ అలాంటిదే’ అన్నాడు నవ్వుతూన.
మధురమైన చక్కని భావాలను ఇంత సరళంగా వెలిబుచ్చే ఇతను కిరాతక చర్యలు చేసే ఆటవికుడా? అని విస్తుపోయింది గౌతమి.
‘మాట్లాడవేం? అన్నట్టు ఆనాడు మీ అందర్నీ కాపాడాడు. ఈనాడు నువ్వాయనకి ప్రాణదానం చేశావు. సరే. కానీ మా మావని మీ నాన్న కాపాడాడన్నావే అదే నవ్వొస్తోంది. అడవి సింహాన్ని చిట్టెలుకలు కాపాడక్కర్లేదు. దానికేంగానీ నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలి. లేకపోతే నీ ఎదురుగానే గొడ్డలితో నరుక్కుని చచ్చిపోతాను’ అంటూ విసురుగా వెళ్లిపోయాడు జింబో.
నిస్సహాయంగా నిల్చుండిపోయింది గౌతమి.
* * *
పూర్తిగా తెల్లవారకుండానే ప్రభు కారొచ్చి అనిల్ ఇంటి ముందు ఆగింది. ఫోనైనా చెయ్యకుండా వచ్చిన అతన్ని చూసి కంగారుపడిపోయాడు అనిల్.
‘అరె! మీరింకా రెడీ కాలేదా? అసలు మిస్ లూసీ మీకు గౌతమిగారిని గురించి చెప్పలేదా?’ అన్నాడు ప్రభు ఆశ్చర్యంగా.
‘చెప్పింది. చాలా హ్యాపీగా అనిపించి, వెంటనే మీకు ఫోన్ చేద్దామనుకున్నాను. కానీ.. ఆ కాంతారావుగారికి సీరియస్ అంటే వెళ్లి రాత్రంతా అక్కడే చిక్కుకుపోయాను. మీకు ఫోన్ చేద్దామనుకుంటుండగా మీరే వచ్చారు. అడవిలో గౌతమి ఎన్ని అవస్థలు పడుతోందో? ముందు తనని గురించి తెలుసుకోవాలి’ అన్నాడు అతన్ని ఆహ్వానిస్తూ అనిల్.
‘కాంతారావు గారికేమైంది?’ కళ్లు చిట్లించాడు ప్రభు.
‘హార్టెటాక్‌లా వచ్చి చాలా కంగారుపెట్టారు. అదృష్టవశాత్తూ మస్కిలర్‌పైనే.. రాత్రంతా నిద్రలేదు కదా. కాస్త బడలికగా ఉంది. ఇప్పుడు వెళ్దామంటే రెడీ అయి వచ్చేస్తాను’ అన్నాడు అనిల్.
‘మీరు రెస్ట్ తీసుకోండి అనిల్. నేను విషయం కనుక్కుని వస్తాను. తర్వాత అవసరం అయితే ఇద్దరం కలిసి వెళ్దాం’ అంటూ లేచాడు ప్రభు.
‘మీరొక్కరే వెళ్తారా?’
‘పర్లేదు. అడవిలోకి కాదు కదా. సి.ఎం.గారు నన్ను వెళ్లి చూసి రమ్మన్నారు. నా వెంట మావాళ్లుంటారు. అదీగాక మందీమార్బలంతో వెళ్తే జనాలకి

అనుమానం రావచ్చు. అన్నీ గోప్యంగా జరగాలని సి.ఎం.గారి ఉద్దేశం. మీకు చెప్పకపోతే మీరు హర్ట్ అవుతారని వచ్చానంతే’ నవ్వుతూ అన్నాడు ప్రభు.
‘మీరు చాలా శ్రమ తీసుకుంటున్నారు. థాంక్స్’ అన్నాడు అనిల్.
‘నేను కాదు, మన సి.ఎం.గారు! అది ఆయన శ్రమ అనుకోవడం లేదు. బాధ్యత అనుకుంటున్నారు. గౌతమిగారినే కాదు. అమ్మవారి ఆభరణాలు దొరికే దాకా ఆయన నిద్రపోర’ నవ్వాడు ప్రభు.
‘నిజం! మన సి.ఎం.గారి లాంటి సి.ఎం. చాలా అరుదు’ అన్నాడు అనిల్ కృతజ్ఞతగా చూస్తూ. తర్వాత మరోసారి చెప్పి బైటికొచ్చేశాడు ప్రభు.
అయితే అతను లూసీ చెప్పిన మెడికల్ షాప్‌కేసి వెళ్లలేదు. ఇంటికెళ్లి అంతకు ముందే సిద్ధం చేసుకున్న బ్యాగ్ తీసుకుని, ఫ్రెండింటికి వెళ్తున్నానని చంద్రకి ఫోన్ చేసి తన బైక్ మీద బయల్దేరాడు చాలా సింపుల్‌గా.
మిట్టమధ్యాహ్నం అవుతుండగా ఓ చిన్న పల్లెకి చేరుకుని ఎవరూ గమనించకుండా బైక్‌ని అడవిలోకెళ్లే సన్నని బాట పక్కనున్న ఓ పొదలో పెట్టి ఆ సన్నని బాటలో వేగంగా నడక సాగించాడు.
అసలక్కడ ఓ దారి ఉందని కూడా కొత్తవాళ్లెవరూ ఊహించరు. అడవిలోని ముఖ్యమైన కొన్ని గూడేలకి అది దగ్గరి మార్గం అని అతని ఎంక్వయిరీలో తెలిసింది. అందరిలా గౌతమి అడవిలోనే ఉండి ఉంటుందని అతని నమ్మకం. నిజానికి కేవలం గౌతమి ఉనికి తెలుసుకోవడమే అయితే అనిల్‌నో, విజయ నాయక్‌నో కలిసి వచ్చేవాడు. కానీ అతనికి ఆ అడవిలో ‘పాతాళ స్వర్గం’ అనే ఒక స్థావరం ఉందని, అక్కడే దేశ విద్రోహ చర్యలకి సంబంధించిన ఎన్నో చర్చలు జరుగుతాయని, దశాబ్దాలుగా దానికి ముఖ్య యజమాని బ్లాక్‌టైగర్ అన్న బందిపోటు దొంగ అనీ, దేశంలో జరిగే దారుణాలన్నింటికీ కారకుడు అతనే అనీ, అతనికి రహస్య సమాచారం అందించారెవరో. గౌతమికి సాహస చర్యలన్నా, ప్రజాసేవ అన్నా ఎంత ఇష్టమో ‘క్లూ’గా ఆమె అందించిన సమాచారాలని బట్టి అతనెప్పుడో గ్రహించాడు. ఈపాటికే ఆ పాతాళస్వర్గం గురించి ఎంక్వయిరీ మొదలుపెట్టిందని కూడా అతని నమ్మకం. ఆమె సహకారంతో అక్కడ జరిగే దారుణాలని బైటపెట్టాలన్న ఆశతో, చంద్రక్కూడా చెప్పకుండా బయల్దేరాడు. గౌతమి క్షేమంగా ఉంటుందని, తనకి కనిపిస్తుందనీ, తనని చూసి పొంగిపోతుందని కూడా అనుకునే ఇంత సాహసానికి పూనుకున్నాడు.
నిర్భయంగా నడక సాగిచాడు.
పట్టపగలే చీకటిగా ఉండే ఆ దారి సాయంత్రం అయ్యేసరికి మరింత చీకటిగా ఉంది. అయినా అతనికే భయం అనిపించలేదు. అంతసేపు నడిచినా అలసట అనిపించలేదు. బహుశా అతని ఆలోచనల నిండా గౌతమి ఉండడం వల్లనేమో కానీ ఎక్కడా జన సంచారం గానీ, తండాల్లాంటివి కనిపించకపోవడమే ఆశ్చర్యంగా ఉంది.
పొద్దుగూకిన కొద్దీ మరింత జాగ్రత్తలు తీసుకున్నాడు. ఆకలేసినప్పుడు బ్యాగ్‌లోంచి ఏవో తీసుకు తిని నీళ్లు తాగాడు. మరో గంట గడిచినా కీచురాళ్ల ధ్వని తప్ప చిరు జంతువులు కూడా కనిపించలేదు. కాస్త అలసటగా అనిపించి ఓ చెట్టుకింద కూర్చున్నాడో తెలియనంతగా ఆక్రమించేశాయా మహావృక్షాలు. ఉత్సాహం తగ్గిపోయింది. భారంగా లేచాడు. అడుగులు వెయ్యబోయి, ఠక్కున ఆగిపోయాడు.
అతని గుండె ఆగినంత పనయింది. కారణం, దారీతెన్నూ తెలియనంతలా ఉందా ప్రాంతం. అసలు తనెట్నించి వచ్చాడో, ఎటుకేసి వెళ్లబోతున్నాడో కూడా అర్థం కాలేదు. అప్పుడు మొదలయిందతనిలో కంగారు. ఒక చేత్తో రివాల్వర్ మరొక చేత్తో టార్చిలైట్ పట్టుకుని, దేవుడి మీద భారం వేసి నాలుగడుగులు వేశాడు.
అప్పుడే ఇద్దరు ఆటవికులు, పక్కనించి వచ్చి పిడుగుల్లా అతని మీద పడి, అతని చేతిలోని వస్తువులు లాక్కున్నారు.
వాళ్లు తన మీద దాడి చేసినందుకు కలిగే భయంకన్నా ఆ పరిస్థితుల్లో మనిషన్నవాడు కనిపించాడన్న ఆనందమే ఎక్కువగా కలిగిందతనికి. మెల్లగా వాళ్లకేదో చెప్పబోయాడు. అయితే వాళ్లు వినిపించుకోలేదు. బలంగా అతని మెడ మీద కొట్టి, స్పృహ కోల్పోయిన అతన్ని చచ్చిన జంతువుని మోసుకెళ్తున్నట్టు మోసుకుంటూ తీసికెళ్లారెక్కడికో.
* * *
ఇదిగో వస్తానని వెళ్లిన ప్రభు మూడు రోజులైనా రాకపోవడం, కనీసం ఫోనైనా చెయ్యకపోవడం చంద్రకి కంగారు కలిగించింది. అన్నింటికీ మించి తనెన్నిసార్లు ట్రై చేసినా ప్రభు ఫోన్ స్విచాఫ్‌లో వుండడం అతన్ని మరింత కంగారు పెట్టింది. అయినా విషయం గోప్యంగా ఉంచాలనుకోవడం ల్ల బైట పడ్డంలేదు.
ఆలయం దోపిడీకి సంబంధించిన రహస్యాలు కొన్ని ప్రయాగకి, విజయ నాయక్‌కీ తెలిసినా ప్రయాగ లాంగ్ లీవ్ మీద, నాయక్ ఏదో కేంప్‌కి వెళ్లడం వల్ల విషయం చర్చించడానికీ అవకాశం లేదు. విజయ నాయక్ వస్తూనే సి.ఎం మెసేజ్ చూసుకుని వచ్చేశాడు.
అతన్ని చూడగానే చంద్ర మొహంలో కాస్త ఉత్సాహం వచ్చింది. చిన్నపిల్లాడిలా ప్రభు గురించి చెప్పాడు.
‘అపర చాణక్యుడు, మేధావి, పిడుగులు పడ్డా చలించని సి.ఎం. చంద్రేనా ఇతను?’ అనిపించింది విజయ నాయక్‌కి.
‘మీరు అనవసరంగా కంగారు పడుతున్నారు సర్! మిస్టర్ ప్రభు అమాయకుడు కాదు. అనామకుడు కాదు. అనుకోకుండా ఏదైనా పని పడిందేమో. గౌతమిగారు కనిపిచని దగ్గర్నించి ఆయన చాలా డల్ అయిపోయారు. బహుశా దోపిడీని గురించి టెన్షన్ కావచ్చు. మనసు బావుండనప్పుడల్లా వాళ్ల గ్రామానికెళ్లడం ఆయనకలవాటేగా’ అన్నాడు ధైర్యం చెప్తున్నట్టు.
‘లేదు మిస్టర్ నాయక్! తనెక్కడికెళ్లినా నాతో చెప్పకుండా ఊరు విడిచి వెళ్లడు. ఎక్కడున్నా రోజుకి నాలుగుసార్లు ఫోన్ చేసేవాడు. ఇప్పుడు ఫోన్ మాటటుంచి, నేను చేసినా రెస్పాన్స్ లేదు. మీకు బ్లాక్‌టైగర్ పేరిట వచ్చిన లెటర్‌ని గురించి తెలుసుగా. తననెవరైనా కిడ్నాప్ చేశారేమో అని నా భయం’ అన్నాడు చంద్ర.
‘్ఛఛ! అలాంటిదేం ఉండదు సర్! ఆ అనిల్‌గారి దగ్గర పనిచేసే లూసీగారు ఇచ్చిన ఇన్‌ఫర్మేషన్ గురించేమైనా వెళ్లారేమో’ ఏదో ఆలోచిస్తూ అన్నాడు నాయక్.
‘అది మీతో కలిసి వెళ్లి ఎంక్వైరీ చేస్తానన్నాడు. ఒకవేళ వెళ్తే మాత్రం ఇన్నాళ్లేం చేస్తుంటాడు. సెల్ ఎందుకు రెస్పాన్స్ లేదు?’
‘ఆ అనిల్‌గారికేమైనా తెలుమో కనుక్కుంటాను. ఒకవేళ అతనితో కలిసి తిరుగుతున్నారేమో?’
‘ఎస్! యువార్ రైట్! ముందు అనిల్ ఊళ్లో ఉన్నాడో లేడో కనుక్కోండి. అతను లేకపోయినా, లూసీ వివరాలు చెప్పచ్చు’ అన్నాడు చంద్ర.
క్షణం ఆలస్యం చెయ్యకుండా అనిల్ సెల్‌కి ఫోన్ చేశాడు విజయ నాయక్. అతన్ని గుర్తించిన అనిల్-
‘సర్! మిస్టర్ ప్రభు వివరాలు కనుక్కున్నారా?’ అన్నాడు ఆతృతగా.
‘వివరాలా? దేన్ని గురించిన వివరాలు?’
‘అదే సార్! గౌతమి గురించి లూసీ ఇచ్చిన ఇన్‌ఫర్మేషన్ గురించి ఆ పల్లె కెళ్తానన్నారుగా!’ అంటూ ఆనాడు ప్రభు రావడం అదీ చెప్పాడు అనిల్.
విజయ నాయక్ గుండె వేగంగా కొట్టుకుంది.
‘తనక్కడికెళ్లాడా? కానీ ఇంతవరకూ రాలేదు’ అన్నాడు మెల్లగా.
‘ఇంకా రాలేదా? మొన్నట్నించీ నేను ఫోన్ చేస్తూనే ఉన్నాను. రెస్పాన్స్ లేకపోతే, ఇంకేదైనా పనిలో బిజీగా ఉన్నారేమో అనుకున్నాను. కానీ ఆ గ్రామానికెళ్లి రావడానికి ఇన్నాళ్లెందుకు పట్టింది?’ కాస్త కంగారుగా అన్నాడు అనిల్.
విజయ నాయక్ కళ్లు వింతగా ముడుచుకున్నాయి.
‘డాక్టర్ అనిల్! మిస్ లూసీ వున్నారా?’ అన్నాడు.
‘ఇప్పుడే తనో పేషెంట్‌ని చూడ్డానికి బైటికెళ్లింది. ఏమైనా చెప్పమంటారా సర్?’ వినయంగా అన్నాడు అనిల్.
‘ఆమె వచ్చిన వెంటనే ఓసారి మా ఇంటికి పంపడానికి మీకేం అభ్యంతరం లేదు కదా’
‘్ఛ! అభ్యంతరం ఏం ఉంటుంది సర్! కానీ...’
‘అభ్యంతరం అయితే చెప్పండి. నేనే వచ్చి కలుస్తాను. ఆమె ఇచ్చిన ఇన్ఫర్మేషన్ గురించి కొంత వెరిఫై చేసుకోవాలి’ గంభీరంగా అన్నాడు విజయ నాయక్.
‘ఎంత మాట సర్! తను రాగానే పంపిస్తాను’ అన్నాడు అనిల్.
ఫోన్ కట్ చేసి విషయం చంద్రకి చెప్పాడు నాయక్.
చంద్ర మొహం మరింత వాడిపోయింది.

(ఇంకా ఉంది)

-రావినూతల సువర్నాకన్నన్