S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

రావణుడిని పరుషోక్తులాడిన సీత( అరణ్యకాండ)

రావణుడు సీతను ఇలా తనకిష్టమైన రీతిలో భయపడే మాటలు అంటుంటే, భయపడకూడదనుకున్న సీత, పతివ్రతలైన స్ర్తిలు పర పురుషులతో సాక్షాత్తుగ సంభాషించకూడదు కాబట్టి, ఒక గడ్డిపోచను వాడికి అడ్డంగా వేసింది. ‘నువ్వు ఈ గడ్డిపోచతో సమానమనే భావం’ కూడా దీంట్లో వుంది. తన పాతివ్రత్య మహిమ వల్ల రావణుడు తననేమీ చేయలేడనే ధైర్యం వున్నది కాబట్టి భయం కలగకపోయినా రామవియోగం వల్ల దుఃఖం వచ్చింది సీతకు. తన కొరకు రామచంద్రుడు ఎంత శోకిస్తున్నాడో అన్న బాధ కూడా కలిగింది. స్ర్తిలతో బలవంతంగా భోగిస్తే రావణుడు తల పగిలి ఛస్తాడన్న అప్సరస శాపం మనసులో వుంచుకుని సీత నిర్భయ అయింది. ఒకవేళ బలాత్కరిస్తే యోగబలంతో అదృశ్యమై అస్పృశ్యను అవుదామనుకుంది కాబోలు.
ఆ తరువాత రాముడు దేబె అనీ, దీనుడనీ, దుర్బలుడనీ, మనుష్యుడే కదా అనీ అన్న రావణుడు మాటలకు ప్రత్యుత్తరంగా సీత వాడితో ఇలా అంటుంది. ‘ఓరీ! నేను దిక్కలేని దాన్ననీ, శీలహీనననీ పలికినట్లు అంటున్నావు. నన్ను నువ్వేమనుకుంటున్నావురా? సత్యప్రతిజ్ఞ కలవాడు, సత్యాన్ని దాటనివాడు, ధర్మాత్ముడు, జగత్ ప్రసిద్ధుడు, ధర్మంలో నిలకడ కలవాడు, ధర్మమే తరుణోపాయంగా భావించే వ్యక్తి కోడలిని. నువ్వు ఒక్క రథం మీద ఒకే దిక్కుకు పోగలవు. ఆయన పది దిక్కులకు పోగలడు. ఒక్క రథాన్ని నడిపినట్లు పది రథాలను ఒకేసారి నడపగల సమర్థుడు. ఆయన కొడుకు, శూరపుత్రుడు రామచంద్రుడు, ముల్లోకాలలో పూజ్యుడు. నీలాగా భయంతో కాదు, భక్తితో పూజ్యుడు. కొందరికే మాత్రం పూజ్యుడు కాదు.. దేవ - మనుష్య - తిర్యగ్బాల - వృద్ధ - స్ర్తి - పురుష పశు పక్ష్యాదులకు పూజ్యుడు. రాముడని ప్రసిద్ధికి ఎక్కినవాడు. నువ్వేమో హింసించి, బాధించి రావణుడని ప్రసిద్ధికెక్కావు. ఆయనేమో రమింపచేసి, రమించి రాముడని ప్రసిద్ధికెక్కాడు. విశాలమైన కళ్లు కలవాడు. నీలాగా భయంకరమైన మిడిగుడ్లు లేవాయనకు. దీర్ఘమైన చేతులున్నాయి. ఆయన చేతులు చూడగానే ఎవరికైనా మహా పురుషుడు అనిపిస్తూంది. నీలాగా తుట్టెపురుగులాగా విశేష హస్త మస్తక పాదాలు కలవాడు కాదు. మిక్కిలి ధర్మస్వరూపుడు. నీలాగా ధర్మ విరుద్ధ స్వభావం కలవాడు కాదు. నాకు ప్రాణ విభుడు. నా ప్రాణాలకు అధిపతి. నా ప్రాణాలు ఆయన అధీనంలో, ఆయన స్వాధీనంలో, ఆయన ధారణ - పోషణలో వున్నాయి. నా ప్రాణాల మీద విభుత్వం నాకూ లేదు. కాబట్టి నేను ఆయన సొత్తును. దీన్ని మరొకరి స్వాధీనం చేయడానికి నాకు అధికారం లేదు. దీన్ని పోగొట్టుకోవడం, కాపాడుకోవడం ఆయన పని. నువ్వు అనుకూలిస్తే మంచిది.. లేదంటే చెడిపోతావు.’
‘నాకే కాదు, నీకూ ఆయన దైవమే. నువ్వు ఆయన్ను పూజించాల్సిందే కానీ ధిక్కరించకూడదు. నువ్వు మొదటి నుండీ ఆయన్ను ధిక్కరిస్తున్నావు. కాబట్టి నిన్ను చంపడానికి అసమాన శౌర్యం కలవాడాయన. పైగా లక్ష్మణుడు ఆయనకు తోడుగా ఉన్నాడు. ఆయన దరిద్రుడని అన్నావు.. కానీ ఆయన సర్వదా సలక్ష్మీకుడు. ఆ విషయం ఎలా నీకు తెలుస్తుంది అని అడుగుతావేమో? ఆయన పరబ్రహ్మ లక్షణం లాంటి లక్షణాలు కలవాడు. పరబ్రహ్మ లక్షణాలు, పరబ్రహ్మంలో కాకుండా మరెక్కడ ఉంటాయి? సింహం మూపురాల్లాంటి మూపురాలు కలవాడు రాముడు. కాబట్టి సింహం క్షుద్ర మృగాన్ని చూసినట్లు నిన్ను చూస్తాడు. అలాంటి దైవం, లక్ష్మీవంతుడు వైకుంఠంలో వుండకుండా ఇక్కడికి ఎందుకు వచ్చాడంటావా? అనరన్యుడి శాపం ప్రకారం నిన్ను చంపడానికి ఇక్ష్వాకు వంశంలో పుట్టాడు. ఈ విషయాలు తెలుసుకోకుండా ఏమిటేమిటో వాగుతున్నావు. అలా అయితే నినె్నందుకు ఇంతదాకా చంపలేదంటావా? కారణం కోసం వేచి ఉన్నాడు. నన్ను నువ్వు ఆయన ఎదుట ముట్టుకున్నట్లయితే ఖరుడిని చంపినట్లు నిన్నూ చంపేవాడే. నువ్వాయన ఎదుట పడలేదు. కాబట్టి బతికిపోయావు. ఎదుటపడితే చచ్చేవాడివే.’
‘నీ రాక్షస సేన భయంకరాకారం కలదనీ, దృఢమై - భయంకరమైన బలం కలదనీ ఆడదాన్నైన నా ఎదుట ఇక్కడ ఈ మూల ఇంట్లో గేహేశూరుడవై ప్రజ్ఞలు చెపుతున్నావు. నీ సేనాబలం, భయంకరత్వం ఎంతదాకా? గరుత్మంతుడి కంటబడేవరకే కదా పాముల భయంకరత్వం, బలం? ఆ తరువాత తలవంచుకుని నేల రాలాల్సిందే కదా? అలాగే నీ బలమంతా నా భర్త ప్రయోగించే బంగారు పిడుల బాణాలు గంగానది అలలు ఒడ్డును మింగినట్లు నీ సేనను మింగుతాయి. నువ్వు వరబలంతో దేవతల చేతుల్లో, దైత్యుల చేతుల్లో చావవేమో. నా భర్తకు కోపం వచ్చేట్లు చేస్తే యుద్ధంలో నా భర్త చేతుల్లో చావకుండా ఆ వరాలు కాపాడలేవు. నా భర్త దేవ దైత్యుల జాతిలో చేరినవాడు కాదు. నా మగడే సంకల్పిస్తే నీకు వరాలిచ్చిన బ్రహ్మ రుద్రాదులను కూడా చంపగలడు. ఇక వాళ్ల వరాలు నినే్న కాపాడగలవు? అది కాకుండా మనుష్యుల చేతుల్లో చావకుండా నీకు వరం లేదు కదా? కాబట్టి యజ్ఞంలో యూపస్తంభానికి కట్టబడిన పశువు చావడానికి ఎలా సిద్ధపడుతుందో నా మీద మనసు పెట్టిన నువ్వు చావడం ఖాయం. రామబాణాల బారినపడి నువ్వా బతికేది?’
-సశేషం

పుస్తకం దొరుకు స్థలం: శ్రీ కోదండరామ సేవక ధర్మసమాజం, అంగలకుదురు, తెనాలి మండలం, గుంటూరు జిల్లా 7036558799 08644-230690

-వనం జ్వాలా నరసింహారావు 80081 370 12