S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

గ్లోబల్ చిత్రకారిణి- గౌరి వేముల

ఇటీవల 60వ జాతీయ చిత్రకళా ప్రదర్శనలో హైదరాబాద్ నగరానికి చెందిన గౌరి వేముల లలిత కళా అకాడెమీ అవార్డు అందుకున్నారు. ప్రతిష్ఠాత్మక ఈ అవార్డు అందుకున్న తెలంగాణ తొలి చిత్రకారిణి ఆమె కావడం గర్వకారణం. ‘విజిల్ బ్లోయర్’ శీర్షికతో గీసిన డ్రాయింగ్‌కుగాను జాతీయ అవార్డును ఆమె అందుకున్నారు. చిత్రకళారంగంలో ఆమె ప్రతిభావ్యుత్పత్తి అసాధారణం. వాస్తవానికి ఆమె చిత్రకళకు ఖరీదు కట్టే షరాబు లేడంటే అతిశయోక్తి కాదు. ఆమె సృజన ఓ అనంతం.. అద్భుతం. ఆమె అరుదైన చిత్రకారిణి, అపురూప నైపుణ్యం గల భరిణ. చెలియలికట్టను తెంచుకుని ప్రవహించే సముద్రం లాంటిది ఆమె సృజన.. చిత్రరచన. నైరూప్యం, అధివాస్తవికత, ప్రకృతి, గత జ్ఞాపకాల గుచ్ఛం ఆమె చిత్తరువులు. ఎన్నో.. ఎనె్నన్నో అంశాలు కలగలిసిన రంగుల హేళ ఆమె కాన్వాసు.. కాగితం. కలలు, కల్పనలు, కోడిపుంజులు, మేకపిల్లలు, పొదలు, లతలు ఇలా ఎనె్నన్నో ఆమె ‘వస్తువు’గా స్వీకరించి అంకితభావంతో, ఏకాగ్రతతో కాన్వాసును - కాగితాన్ని పుణీతం చేస్తున్నారు. అందుకే ఆమె గ్లోబల్ చిత్రకారిణిగా గుర్తింపు పొందుతున్నారు. అనేక అంతర్జాతీయ పత్రికల్లో ఆమె చిత్రాల గూర్చిన ప్రస్తావన కనిపిస్తోంది. ఆయా చిత్రాలను ప్రచురించి అందులోని అద్భుత శైలిని, సమకాలీన కళను కొనియాడారు. అమెరికా, కెనడా, లండన్, దుబాయ్ తదితర చోట్ల ఆమె చిత్రాల ప్రదర్శనలు జరిగాయి. ఆమె చిత్రరచనను శ్లాఘిస్తూ ప్రముఖ చిత్రకళా విమర్శకులు రాశారు. ఆమె చిత్రాలను ప్రముఖ ప్రచురణ సంస్థలు ప్రచురించాయి. ఇదొక అపురూప అనుభవం.
ఈ అవార్డుల పరంపర దశాబ్దంన్నర కాలంగా కొనసాగుతోంది. 2002 సంవత్సరంలో భోపాల్‌లో ప్రతిష్ఠాత్మకంగా జరిగిన ప్రింట్ మేకింగ్ అంతర్జాతీయ చిత్ర ప్రదర్శనలో ఆమె అవార్డును అందుకున్నారు. అంతకు ముందు సంవత్సరం కూడా జాతీయ అవార్డును గెలుచుకున్నారు.
ఆమె డ్రాయింగ్స్‌లో వృక్షాలు స్ర్తి, పురుష దేహాలుగా కన్పిస్తాయి. అంతేగాక అవి అల్లుకుపోతాయి. చెట్ల కొమ్మలు పక్షుల రూపాలు ధరిస్తాయి. ఆ వృక్షాలు అల్లుకపోవడం స్ర్తి పురుష సృష్టి కార్యానికి ప్రతీకగా నిలుస్తాయి. అందులో నైరూప్యం.. నవీనత, నైపుణ్యం, తనదైన శైలి.. భావధార బంగారంలా మెరుస్తుంది. కొన్ని చిత్రాల్లో పురుషునికి ప్రతీకగా గుర్రం.. స్ర్తికి చిహ్నంగా ప్రకృతి - పరిసరాలు ఇలా గౌరి వేముల వినూత్న, విభిన్న చిత్రరచన వీక్షకుల మెదడుకు మేత వేస్తుంది. ఆ బొమ్మల్లోని ఫోర్స్, అనంతమైన శక్తి, స్పష్టతగా కనిపిస్తాయి. కోర్కెలే గుర్రాలయితే అన్న చందంగా పురుషుని కోర్కెల బలమైన వ్యక్తీకరణ ఆమె ‘గీత’ల్లో దండిగా కనిపిస్తుంది. ఆమె అంతర్లోకాలను పట్టుకోవడం అసాధ్యమనిపిస్తుంది. ఆమె దృష్టి కోణం పసిగట్టడం కష్టమనిపిస్తుంది. ఇది ఆమె ప్రతిభకు తార్కాణంగా నిలుస్తుంది.
చిత్రకారిణి గౌరి వేముల తనదైన మాయాలోకం సృష్టించుకుని అందులో విహరిస్తూ, స్వప్నిస్తూ, శ్వాసిస్తూ తాజా పరిమళాలను వీక్షకులకు అందించేందుకు నిరంతరం శ్రమిస్తుంటారు. ఆ కలల లోగిలి నిండా నైరూప్యం నిగనిగలాడుతూ ఉంటుంది. మన పురాణాల్లో సగం మనిషి, సగం సింహం (నరసింహస్వామి), సగం మహిళ, సగం చేప (మత్స్య కన్య) ఇలా ఎన్నో కనిపిస్తాయి. ఈ ‘ఇమేజరీ’కి గుర్తింపు ఉంది. గౌరవమూ ఉంది. గౌరి వేముల సైతం ఈ ప్రక్రియను పట్టుకుని తన డ్రాయింగ్స్‌లో విశ్వరూపం చూపిస్తున్నారు.
2016 సంవత్సరంలో కొత్త ఢిల్లీలోని ఆర్ట్ హెరిటేజ్ గ్యాలరీలో ‘ది ఫాంటసీ వరల్డ్ ఆఫ్ గౌరి వేముల’ (గౌరి వేముల ఊహా ప్రపంచం) శీర్షికతో ఏర్పాటు చేసిన ప్రదర్శనలోని బొమ్మలు చూస్తే ‘హారీపాటర్’ సినిమా గుర్తొస్తుంది. (ఇలాంటి పోలిక చిత్రకారిణికి ఇష్టముండదు. తాను గీసిన బొమ్మల - పాత్రలు తన సొంతమని ఆమె గర్వంగా చెబుతారు) కొక్కొరొకో.. అని కూసే కోడిపుంజుకు.. మేకతల.. కొమ్ములు’ అతికించి ‘చూపడం’ తనదైన ఫాంటసీ ప్రపంచానికి చిహ్నం. ‘బర్డ్ సిరీస్’లో ఇలాంటి అనేక ప్రయోగాలు ఆమె చేశారు. ఒక ఆడ - మగ మనిషికి పక్షిరూపం ఇచ్చి తల వెంట్రుకలను ఈకలుగా చిత్రించారు. మరో బొమ్మలో ఓ ఎద్దు భారీ వృక్షంగా దాని కొమ్ములు చెట్టు కొమ్మలుగా, ‘ఫ్రేమ్’ నిండా పరుచుకుని కనిపిస్తాయి. ‘ట్రీ సీరీస్’లో ఇలాంటి ప్రయోగాలు అనేకం అగుపిస్తాయి. అంతేనా?... కాదు ఆ చెట్లు ఆలుమగలై అనుభూతులను పంచుకుంటూ కనిపిస్తాయి.
ఇంతటి ఫాంటసీ ప్రపంచంలో తిరుగాడే చిత్రకారిణి తనదైన ‘శైలి’లో దశావతారాలను ఓ ‘సర్పం’లో చిత్రించారు. గణపతిని, నటరాజును, శ్రీకృష్ణుడిని ఇట్లా అనేక పురాణ పురుషులు ఆమె చిత్రకళలో కొలువుతీరారు. అయితే అవన్నీ వినూత్న రీతిలో, నైరూప్యంలో చెక్కముక్కలు, ఆకులు అలములు, తీగలు.. తీరైన పద్ధతుల్లో కనిపిస్తాయి. అంటే వారిని సైతం చిత్రకారిణి తన ఫాంటసీ ప్రపంచంలో ఇమిడ్చారు. ఓ పొట్లం నుంచి కిందపడిన వేరుశనక్కాయల (పల్లీలు)పై సైతం అసంఖ్యాక ఆకృతులను దర్శింపజేశారు. అందులో సంభోగం ఉంటుంది, సాంత్వన ఉంటుంది. సహచర జంతుజాలముంటుంది. ‘కాగితం - కల - సిరా’ శీర్షికన గీసిన ఇలాంటి చిత్రాలు చూశాక ఆమె ఊహాలోకం అంచులను ఎవరైనా తాకగలరా? అన్న ప్రశ్న ఉదయిస్తుంది.
ఆమె ఎక్కువ చిత్రాలు కాన్వాసుపై గాక జింక్ ప్లేట్‌పై నీడిల్‌తో చిత్రించి (గ్రాఫిక్స్) సూక్ష్మమైన వివరాలను సైతం వదిలిపెట్టకుండా శ్రమించి తన ఊహకు రూపం ఇస్తారు. ఇది అంత తేలికైన పని కాదు. రసాయనాలతో కూడుకున్న పని. అయినా గౌరి వేముల ఈ ‘ఎచ్చింగ్’ ప్రక్రియనే ఎంపిక చేసుకుని ముందుకు సాగుతున్నారు. ‘పెన్ అండ్ ఇంక్’ ఆధారంగా కూడా ఆమె అతి నాజూకైన చిత్రాలకు ప్రాణం పోశారు.
ఫాంటసీ ప్రపంచానే్నగాక వాస్తవలోకాన్ని సైతం ఆమె పట్టించుకున్నారు. ముఖ్యంగా పాతబస్తీ.. చార్మినార్ ప్రాంతంలోని ప్రజా జీవితాన్ని ఆమె ఎంతో నిష్టతో చిత్రిక పట్టారు. మిక్స్‌డ్ మీడియాలో ఆ బొమ్మలు, స్కెచ్‌లు, డ్రాయింగ్స్ అబ్బురపరుస్తాయి. చిన్నచిన్న దుకాణదారుల పరిసరాలలో కనిపించే వస్తు సామాగ్రి, ఫుట్‌పాత్‌పై అమ్మే సరుకుల తీరు ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా మోటారుసైకిల్ రిపేర్ షాపు వద్ద తిరుగాడే కోళ్లు.. మేకలు, పడి వుండే పాత టైర్లు, ఇనుప సామాగ్రి దేన్నీ వదలకుండా కూర్పు చేశారు. నవాబుల కాలంనాటి భవనాలు, వాటి బాల్కనీలు, కిటికీలు.. పరదాలు, పూలతీగలు.. ఏదీ వదలకుండా చిత్రిక పట్టారు. పాత నగరం భవనాల ఆర్కిటెక్చర్, ముస్లిం చిరువ్యాపారులు, ఆటోలు, పాతసామాన్ల అమ్మకం.. ఇట్లా ఒకటేమిటి మరో లోకాన్ని మన కళ్ల ముందుకు తీసుకొచ్చారు. నైరూప్యాన్ని ఎంత నిష్టగా చిత్రించారో ఈ వాస్తవిక దృశ్యాలను అంతే నిష్టగా కాగితంపై పెట్టారు.
హైదరాబాద్ నగర శివారులోని ఘట్‌కేసర్‌కు చెందిన గౌరి వేముల నాన్న ఇంజనీర్. ఉద్యోగరీత్యా కర్నాటకలోని హుబ్లికి వెళ్లారు. 1972 సంవత్సరంలో పుట్టిన గౌరి వేముల ఉన్నత పాఠశాల విద్య అక్కడే సేక్రెడ్ హార్ట్ స్కూల్‌లో జరిగింది. ప్రాథమికోన్నత పాఠశాలలో చిత్రలేఖనం, క్రీడలపై ఎక్కువ మక్కువ పెంచుకుంది. రెండు రంగాల్లో పాఠశాలలో ఫస్ట్ రావడంతో ఆమె మేఘాల (క్లౌడ్-9)లో తేలిపోయారు. అక్కడే పదవ తరగతి పూర్తయ్యాక స్థానిక లలిత కళా మహావిద్యాలయలో డ్రాయింగ్ కోర్సు పూర్తి చేశారు. ఆ రకంగా క్రీడలు తగ్గించి ఆర్ట్ వైపు బలంగా అడుగులు వేసింది. అనంతరం హైదరాబాద్‌కు చేరుకుని 1992 నుంచి 1998 వరకు జెఎన్‌టియు ఫైన్ ఆర్ట్స్ కాలేజీలో బిఎఫ్‌ఏ చేశారు. చివరి సంవత్సరంలో తన డ్రాయింగ్ చాలా బలమైనదని, ప్రొఫెసర్లు ప్రశంసించి, ప్రింట్ మేకింగ్‌కు ఈ విధమైన శైలి.. ఢ్రాయింగ్ ఎంతో నప్పుతుందని సూచించడంతో తాను ‘ఎచ్చింగ్ టు స్పెషలైజేషన్’ చేసేందుకు నిశ్చయించుకుని, అప్పటి నుంచి ఆ ప్రక్రియలో శ్రమిస్తున్నానని ఆమె చెప్పారు. ఈ విధమైన పని సాంకేతికమైనదే గాక రసాయనాల (నైట్రిక్ ఆసిడ్.. ఇతర ఆసిడ్స్)తో పని చేయాల్సి ఉంటుందని, ఈ రంగంలో సైన్స్, మాథ్స్ అవగాహన కించిత్ ఎక్కువే అవసరమని, అన్ని సరిగా కుదిరినప్పుడే బొమ్మ బాగా వస్తుందని, ప్రింట్ వచ్చాక గాని ఫలితం కనిపించదని ఆమె అంటున్నారు.
రబ్బర్ షీట్, అక్రలిక్ షీట్, జింక్ ప్లేట్ ఇట్లా పలు రకాల వస్తువులు తీసుకుని బొమ్మలు వేస్తానని, డ్రాయింగ్స్ వేయడం, కాన్వాస్‌పై పెయింటింగ్స్ చేయడం షరా మామూలే అంటూ బహు నాజూకైన పని ‘డెప్త్’ కోసం ఎచ్చింగ్ ప్రక్రియను మించింది లేదని ఆమె అంటున్నారు. ఈ రకమైన ప్రింట్ మేకింగ్ విద్యలో ఆమె మాస్టరీ చేసింది. 1998 నుంచి 2000 సం. వరకు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఇందులోనే ఎంఎఫ్‌ఏ చేశారు. అనంతరం 2001 సం. కొత్త ఢిల్లీలోని ఆర్ట్ హెరిటేజ్ గ్యాలరీలో ‘సోలో షో’ను నిర్వహించడంతో ఆమె చరిత్రను సృష్టించారు. అనంతరం 2016 సం.లో అఖిల భారత పెయింటింగ్ పోటీలో ఆమె ‘బతుకమ్మ అవార్డు’ను అందుకున్నారు. బతుకమ్మ అంటే తెలంగాణ గౌరవమ్మ.. గౌరమ్మ అంటే గౌరి.. వేముల గౌరి.. మంగళ గౌరి.. చిత్రకళా గౌరి వేముల.

గౌరి వేముల 7702250999

-వుప్పల నరసింహం 9985781799