S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

సలహాదారు (కథ)

సింహం బాగా ఆకలిగా ఉంది. ఆ రోజు ఉదయం నుండీ అది ఆహారం తినలేదు. దాంతో ఆకలి బాధ తాళలేక సింహం గుర్..గుర్.. అని గర్జిస్తోంది. అది ఆ ఆడవికి రాజు కూడా.
మామూలుగా అయితే ఏదో రోజు ఆ సమయానికి ఒక ఆహారం తినేదే. అయితే ఆ రోజు అడవిలో జంతువులకు ఎన్నికలు జరిగాయి. సింహం రాజుగా ఎంపిక అయింది.
నక్క దానికి సలహాదారుగా నియమింపబడింది. ఎన్నికలు అయ్యేసరికి ఆలస్యం అయిపోయింది. దాంతో సింహ రాజు ఆకలి మరింతై ఘర్జించటం మొదలుపెట్టింది.
సింహరాజు ఘర్జనకి జంతువులన్నీ భయపడిపోసాగాయి.
అన్నీ కలిసి సింహరాజు చూడకుండా నక్కను పిలిచి..
‘నువ్వేదైనా సింహరాజుకి సలహా ఇవ్వు. మాకు భయం వేస్తోంది’ అని వేడుకున్నాయి.
నక్క సరేనని సింహం దగ్గరికంటా వెళ్లి...
‘సింహరాజా.. చుట్టూ వెతికి వచ్చాను. మీకు సరిపోయే ఆహారం ఎక్కడా నాకు కనిపించలేదు. ఇక్కడే ఉండి ఘర్జిస్తే లాభం లేదు. రండి. అలా బయటికి వెళ్లి వెతుకుదాం’ అనేసరికి సింహం లేచి బయలుదేరింది. అలా నడవగా నడవగా దానికి దూరంగా ఒక జింక గడ్డి తినటం కనపడింది.
అంతే. సింహం పరుగు అందుకుంది. నక్క కూడా అదే వేగంతో సింహం పక్కగా పరుగు పెట్టటం మొదలెట్టింది. అది గమనించిన సింహం పరుగు ఆపి...
‘నువ్వెక్కడికి?’ అని అడిగింది నక్కను.
‘మీ కూడానే మహారాజా!’ అంది నక్క.
‘సలహాదారు అంటే ఏదైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడే. అంతేకానీ రాజు ఎక్కడికి వెళితే అక్కడకు రావాల్సిన అవసరం లేదు. ఏదైనా పని ఉంటే నేనే పిలుస్తాను. ఆగిపో...’ అంది సింహం.
ఏం చెప్పాలో తోచలేదు నక్కకు. నిజానికి దానికీ ఆకలిగానే ఉంది. ఆలోచించగా ఆలోచించగా దానికి ఒక ఉపాయం తట్టింది. దాంతో...
‘సింహరాజా! అసలే మీరు కొత్తగా రాజుగా ఎంపిక అయ్యారు. మీ మీద కొంతమందికి కోపం ఉండవచ్చు. అందుకని ఆ కనిపించే జింక నిజమైనదో, కాదో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవేళ మిమ్మల్ని చంపాలని ఎవరైనా జింక రూపంలో ఉన్న దేనినైనా అక్కడ ఉంచారేమో? దానివల్ల మీకు ఏదైనా ప్రమాదం జరిగితే ఆ బాధ్యత నా మీద కూడా ఉంటుంది. అందుకని మీకు సలహా ఇచ్చినందుకు రక్షించే బాధ్యత కూడా నాదే కదా!’ అంది.
ఆ మాటతో ఎంతో సంతోషపడిపోయింది సింహం. ‘అయితే.. పద’ అంది సింహం పరుగు తీస్తూ.
నిజానికి నక్క మనసులో ఉన్న ఆలోచన వేరు. ఎన్నికల హడావిడిలో నక్క కూడా ఏమీ తినలేదు. సింహం ఏ జంతువునైనా వేటాడితే తినాల్సినదంతా అక్కడే తినేసి మిగతాది వదిలేస్తుంది. పులిలాగా తెచ్చుకోదు. కాబట్టి సింహం కూడా వెళితేనే మిగిలిన ఆహారం దొరుకుతుందని నక్క ఆశ.
సింహ రాజు రమ్మనటంతో.. మరింత శక్తితో దానిని అనుసరించింది నక్క.

-కన్నేగంటి అనసూయ 9246541249