S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఉన్మత్తుడి మాదిరి దుఃఖిస్తూ సీతను తలచుకున్న రాముడు( అరణ్యకాండ)

వాస్తవానికి సీతాదేవి తన ఎదురుగా లేకపోయినా, మన్మథ తాపం వల్ల కళ్లకు కట్టినట్లు దగ్గరే వున్నట్లు భావించిన శ్రీరాముడు, ఆ సీతను గురించి గద్గద స్వరంతో, మాట కూడా సరిగ్గా రాకుండా, తన బాధ ఇలాంటిదని చెప్పనలవి కాకుండా, విచారంతో చాలా చాలా అన్నాడు, తనలో అనుకున్నాడు.
‘జానకీ! కొత్త పూల మీద నీకున్న ప్రేమ వల్ల అశోకవృక్షం కొమ్మ పూల చాటున దాగావులే! తెలుసుకున్నాను. నేను కనుగొన్న తరువాత కూడా దాక్కోవడం ఎందుకు? లీలావతీ! నీ అందమైన తొడలు అరటి బోదెల లాంటివి కదా? అందువల్ల, కదలీ వృక్షాల మధ్యన వున్నా నువ్వు అందంగా ఉన్నందున అవి నాకు కనపడుతున్నాయి. దాచిపెట్టడం నీకు సాధ్యమా? విశాలమైన, దీర్ఘమైన కళ్లు కలదానా! కొండగోగు పూలకని కొండగోగు వనానికి పోయి నవ్వులాటకు నన్ను పరిహాసం చేయడం నీకు ధర్మమా? నిన్ను చూడలేక బాధపడుతున్నానే? సీతా! నువ్వు పరిహాస ప్రియవని నాకు తెలుసు. అయితే, ఇది పరిహాసానికి సమయమా? తిరిగి తిరిగి, ఏడ్చి ఏడ్చి చాలా అలసిపోయాను. ఇలాంటి ఆపద సమయంలో నాతో ఎగతాళి ఎందుకు?’
‘అన్నా! లక్ష్మణా! నేనింతగా పిలుస్తున్నానే? ఒకవేళ వుంటే, ‘ఓ..’ అనుకుంటూ పలికి రాకపోయేదా? శత్రువులు మింగారో? ఎత్తుకునే పోయారో? రెంటిలో ఒకటి జరక్కపోతే సీత కనపడకుండా ఉండదు. ఈ మృగాలు కన్నీళ్లు కారుస్తూ సీతను రాక్షసులు తిన్నారని దుఃఖపడుతున్నాయి. ఎక్కడికి పోయావే సీతా? ఎక్కడున్నావే? నీ కారణాన, కైక నన్ను చంపదల్చుకున్న కోరిక నెరవేరుతుందా? జానకితో అరణ్యానికి వచ్చి, జానకిని పోగొట్టుకుని, గడువు తీరగానే నేనేమని అంతఃపురానికి పోతాను? పోయినా, లోకులేమంటారు? రాముడు అసమర్థుడనీ, చూపు గుర్రమే కానీ సత్తువ లేదనీ, సత్తువ వున్నా జానకి మీద దయలేని వాడనీ, అందుకే ఆమెను దక్కించుకోలేక పోయాడనీ, అనరా? ఒకరన్నా, అనకపోయినా, సీత లేకపోతే నాకు సుఖం ఎక్కడిది? ఏకపత్నీవ్రతుడను కదా! భార్యలేని వాడి బతుకు పాడే కదా? శిఖం ఎక్కడి నుండి వస్తుంది?’
‘అరణ్యంలో మనం కాపురం చేయాల్సిన గడువు త్వరగా తీర్చి అయోధ్యకు పోగానే, కూతురు, అల్లుడు చాలాకాలానికి తిరిగి వచ్చారని జనకుడు చూడడానికి వచ్చి, సంతోషంతో ‘అల్లుడా! అందరూ క్షేమమా?’ అని అంటే నేనేమని చెప్పాలి? ‘మీ కూతురు తప్ప’ అని చెప్పాల్నా? చెప్పడం సరే.. ఆయన ముఖం నేనెలా చూడాలి? జానకి లేదనే వార్తా ఆయన చెవుల పడిందా, కడుపు దుఃఖాన తన బిడ్డను తలచి తలచి శోకంతో తపించి తపించి సగం చచ్చిపోతాడు కదా? నేను ఇంటికి పోగానే, మా అమ్మ కౌసల్యాదేవి ఎదురుగా వచ్చి, ‘కుమారా! నా కోడలు ఏదిరా?’ అని అడిగితే నేనేమని చెప్పాలి? ఆ తరువాత మీ అమ్మ వచ్చి, ‘రామచంద్రా! ఏదిరా జానకి?’ అంటుందే? ఏమి జరిగిందో చెప్పడానికి నోరెలా వస్తుంది? ఆ తరువాత కైకమ్మ కల్లబొల్లి చిరునవ్వుతో పరిహాసంగా ‘సీతను అడవికి ధారబోసి వచ్చావా’ అంటుందే? నేనేమని అబద్ధం చెప్పాలి? భరత శత్రుఘు్నలు వచ్చి ‘అన్నా! మా వదినె రాలేదా ఏమి?’ అని ప్రశ్నిస్తారు కదా! ఏమని జవాబివ్వాలి? సీత రాలేదు, రాముడు ఒక ఆడదాన్ని కాపాడలేక పెళ్లాన్ని రాక్షసుల పాల్జేసి తాను మాత్రం వచ్చాడని పలచగా మాట్లాడేవాళ్ల నోళ్లు ఎలా మూయించాలి? లక్ష్మణా! నేనేం చేయాలి? ఇప్పుడు నేను చెప్పినదంతా పోనివ్వు. భరతుడి పురానికి రాను. స్వర్గానికి పోతాననుకో. సీత లేని కారణాన అది కూడా శ్మశానంలా శూన్యంగా కనపడుతుంది.’
‘లక్ష్మణా! నువ్విక్కడ ఇంకా ఆలస్యం చేయకుండా అయోధ్యకు పో. భరతుడిని గట్టిగా కౌగలించుకుని, నేను చెప్పానని, నా మాటలుగా ఇలా చెప్పు: ‘్భరతా! నువ్వు శాశ్వతంగా రాజువై రాజ్యాన్ని పాలించు. ఇది రామాజ్ఞ’ అని చెప్పు. ఇంత కార్యం చేసిన మా తల్లి కైకకు, మీ అమ్మకు, కౌసల్యకు, నా ఆజ్ఞగా నమస్కారం చేయి. మా అమ్మను చాలా చాలా అడిగానని చెప్పు. సీత పోయిన వ్యవహారం, నా చావు గురించి కూడా చెప్పు. అన్ని విధాలా నువ్వు ఆమెను జాగ్రత్తగా చూసుకో. నాయనా! ఇక పోయిరా. నీకు మేలు కలుగు గాక. నాయనా! నేను లేకుండా నువ్వు అడవుల్లో తిరగాల్సిన పని లేదు. సీతాదేవి లేకుండా దేహంలో ప్రాణాలుండవు.’
ఇలా వెలవెలబోతూ, అతిశయించిన బాధతో రాముడు సీతాదేవిని తలుచుకుంటూ మాట్లాడుతుంటే, దుఃఖపడుతుంటే, లక్ష్మణుడు చలించిన మనస్సుతో కలవరపడ్డాడు.

-సశేషం
పుస్తకం దొరుకు స్థలం: శ్రీ కోదండరామ సేవక ధర్మసమాజం, అంగలకుదురు, తెనాలి మండలం, గుంటూరు జిల్లా 7036558799 08644-230690

-వనం జ్వాలా నరసింహారావు 80081 370 12