S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

కుడి ఎడమైతే...

‘‘బాబూ.. బారెడు పొద్దెక్కింది. తమరికి లేచే ఆలోచన ఏమైనా ఉందా? లేకపోతే ముసుగుదన్నుకుని సాయంత్రం వరకూ ఇలాగే పడుకుంటారా?’’ కొడుకు మీద అరిచాడు సుబ్బారావ్.
‘‘అబ్బా ఇంత పొద్దునే్న లేచి ఏం చేయాలి నాన్నా’’ అన్నాడు సీతాపతి ముడుచుకుని పడుకుంటూ.
‘‘అబ్బో తమరు రోజూ పొద్దునే్న లేచి ఏదో పీకేస్తున్నట్టూ... పడుకుంది చాలు పైకి లెయ్ దున్నపోతా’’ మళ్ళీ తిట్టాడు సుబ్బారావ్.
సీతాపతికి ఈ తిట్లన్నీ మామూలే. అయినా అవన్నీ పొద్దునే్న లేవనందుకు కాదు, డిగ్రీ పూర్తయి రెండు సంవత్సరాలవుతున్నా ఏ ఉద్యోగం లేకుండా బలాదూర్ తిరుగుతున్నందుకని తనకు తెలుసు. పాపం తను మాత్రం ఏంచేస్తాడు? ఉద్యోగం కోసం ఇంటర్వ్యూలకు వెళ్తాడు. అంతా సవ్యంగా సాగిపోతోంది అనుకుంటుండగానే ఏదో ఒక పొరపాటు చేసేస్తాడు. ఇక అక్కడితో వచ్చే ఉద్యోగం కాస్తా ఫట్. అందుకే నింపాదిగా ఆవులిస్తూ-
‘‘రాత్రంతా నిద్రలేదు, పడుకోనీ నాన్నా’’అన్నాడు.
‘‘తొమ్మిదవుతోంది.. లేచి పళ్ళు తోముకుని దండగ తిండి తిని చావు..’’ అని సుబ్బారావు అనగానే ఉన్నట్టుండి ఏదో గుర్తొచ్చినవాడిలా ‘‘తొమ్మిదా..!’’ అంటూ గబుక్కున పైకి లేచి, స్నానాల గదిలోకి దూరాడు సీతాపతి.
సరిగ్గా తొమ్మిది గంటలకి వస్తానని చెప్పాడు నిన్న పోలిగాడితో. ఆ సంగతే మర్చిపోయాడు తను. ఇప్పటికే ఆలస్యం అయిపోయిందనుకుంటూ తొందర తొందరగా స్నానం చేసుకుని, తండ్రి చీవాట్లతోపాటు నాలుగు మెతుకులు తిని, బయల్దేరబోతుండగా ‘ఎక్కడికో?’ అన్నాడు సుబ్బారావు- చదువుతున్న పేపరులోంచి తల పైకెత్తి. ఆ ప్రశ్నకి సమాధానం చెప్పకుండా గబగబా నడుచుకుంటూ బయటికి వెళ్లిపోయాడు సీతాపతి.
తన చిరకాల స్నేహితుడికి తను గొప్ప సాయం చేయబోతున్నాడు ఇవ్వాళ. ఇంతకుముందు ఎన్ని సహాయాలు చేసినా ఇది కొంచెం గొప్పదని అతని ఫీలింగు. ఎందుకంటే అది పోలిగాడి ప్రేమ వ్యవహారం మరి.
వెళ్ళూ వెళ్తూ అంగట్లో ఓ బిస్కెట్ ప్యాకెట్ కొనుక్కుని తింటూ, మాటిమాటికీ తన జేబులో మడచి పెట్టుకున్న తెల్ల కాగితం వైపు చూసుకుంటూ నడవడం మొదలుపెట్టాడతను.
ఇంతకీ ఆ కాగితం ఏంటీ? పోలిగాడికి సీతాపతి చేయబోయే సహాయం ఏంటి? ఇవన్నీ తెలుసుకోవాలంటే పరిగెత్తుకుంటూ ఒక పదిహేడు సంవత్సరాలు వెనక్కి వెళ్లాలి.
***
సీతాపతికి పోలిగాడు ఒకటో తరగతిలో వున్నపుడు పరిచయం అయ్యాడు. రెండో తరగతితోనే పోలిగాడి చదువు అటకెక్కింది.
చదువువల్ల ఎటువంటి ప్రయోజనం లేదని అతి చిన్న వయసులోనే గ్రహించిన బాలమేధావి అతడు. అందుకే బడెగ్గొట్టి గూటిబిల్ల, గోలీలాటల్లో ఏడేళ్ళకే బ్యాచిలర్ డిగ్రీ సంపాదించేశాడు. వాడు పిహెచ్‌డి ఎక్కడ చేసేస్తాడోనని భయపడి వాళ్ళ నాన్న వాడిని బర్రెలు మేపే పనికి కుదిర్చాడు. ఎనిమిదేళ్ళ వయసుకే సంపాదనలో పడ్డ పోలిగాడు ఏదో పెద్ద ఉద్యోగం చేసేస్తున్నట్టు తెగ ఫోజు కొట్టేవాడు. సీతాపతి ఎప్పుడు కలిసినా ఎక్కడో నేర్చుకున్న పద్యమొకటి చెప్పేవాడు. ఆ పద్యం ఇలా ఉండేది.
‘‘సదువెందుకు సంకనాకను.. పది బర్రెలు మేపిన పాలిచ్చును, పెరుగిచ్చును, పేడ కూడా ఇచ్చును..’’ అని గట్టిగా అరుస్తూ పద్యం మొత్తం పూర్తిగా చెప్పి ‘‘అయినా ఈ కాలంలో సదువుకున్నోళ్ళకు ఉద్దోగాలు ఎక్కడొస్తావుండాయిరా’’ అనేవాడు.
అది విని సీతాపతికి కూడా చదువుమీద విరక్తి పుట్టి, ఒకానొక సమయంలో బడి మానేయాలనిపించింది. మానేస్తే తండ్రి తాట తీస్తాడని ఆ ఆలోచన మానుకున్నాడు.
అవన్నీ అటుంచితే, అసలు విషయం ఏమిటంటే పోలిగాడు చిన్నప్పట్నుంచి నాయుడుగారి కూతుర్ని తెగ ప్రేమించేవాడు. ఆ విషయం చాలా సందర్భాల్లో సీతాపతికి చెప్పాడు కూడా. చెప్పిన ప్రతిసారీ కిందనుంచి పైవరకు పోలిగాడ్ని ఎగాదిగా చూసి ‘‘నీ మొహానికి ఆ అమ్మాయి కావాలా?’’ అన్నట్టు మొహం పెట్టేవాడు సీతాపతి. ఆ అమ్మాయి కూడా అంత అందగత్తె కాకపోయినా పోలిగాడికంటే మిక్కిలి అందగత్తె అని చెప్పవచ్చు. ఎందుకయ్యా అంటే పోలిగాడ్ని వర్ణించడం సాక్షాత్తు షేక్స్ఫియర్‌కికూడా సాధ్యంకాదనే చెప్పాలి.
మనిషి కర్రి. ముందరిపళ్ళ మధ్యలో చింతగింజంత వెడల్పైన తొర్రి. జుట్టు ఊడలమర్రి. వీటికితోడు వేపకాయంత వెర్రి. ఇదీ పోలిగాడి స్వరూపం, కాదు కాదు విశ్వరూపము.
ఒక్కోసారి మాటలమధ్యలో సీతాపతి అడిగేవాడు- ‘‘ఎందుకురా ఆ అమ్మాయంటే నీకంత ఇష్టం?’’ అని. దానికి సమాధానంగా పోలిగాడు ‘‘ఎందుకో ఆ యమ్మిని సూడగానే ఒంద బర్రెలు ఒక్కసారిగా పేడేసినట్టుంటాదిరా’’ అని విచిత్రమైన పోలికొకటి చెప్పేవాడు. వెంటనే సీతాపతి ముక్కు మూసుకుని పక్కకు జరిగేవాడు. అయినా పోలిగాడికి సీతాపతి మీద ఎందుకో గట్టి నమ్మకం. ఎప్పటికైనా స్నేహితుడే తన ప్రేమను నిలబెడతాడని. ఆ నమ్మకంతోనే ఏదైనా సలహా చెప్పమని పొరపాటున అడిగాడు ఓ దుర్ముహూర్తాన.
తాగేవాడిది ఒక ఆనందం అయితే, తాగకుండా ఆ మాట ఈ మాట చెప్తూ వాడు తెచ్చుకున్న మంచింగ్ మింగేసేవాడిది ఒక ఆనందమన్నట్టూ, సీతాపతి కూడా ప్రేమ మత్తులో వున్న పోలిగాడికి ఆ మాట ఈమాట చెప్పి తెగ తినేవాడు. మరి ఇటువంటి అవకాశమొస్తే వదులుతాడా? అందుకే సలహా చెప్పాలంటే ఓ మిక్చర్ పొట్లం కావాలని డిమాండ్ చేశాడు. అంతే మరుక్షణంలోపావు కేజి మిక్చర్ పొట్లం ఒకటి అతని ముందు ప్రత్యక్షమైంది. కరువు ప్రాంతంనుంచి వచ్చినవాడిలా ఆవురావురుమని మెక్కుతూ, తన్మయత్వంతో చెప్పడం మొదలుపెట్టాడు.
‘‘ఓరే పోలీ, నీకా అమ్మాయి పడదు. నువ్వె...’’అని ఏదో చెప్పబోయి, చప్పున ఆగి, ఓసారి పోలిగాడి వైపుచూశాడు. వాడి మొహం ఎర్రబడటం గమనించి మళ్లీ-
‘‘‘పడటానికి అవకాశమే లేదని నేనటం లేదు. కానీ అవకాశాలు తక్కువని చెబుతున్నాను’’ అన్నాడు మిక్చర్ నములుతూ.
‘‘అయితే నా మిక్చర్ నాకిచ్చెయ్, నేబోతా’’ అన్నాడు పోలిగాడు పొట్లం లాక్కుంటూ.
‘‘ఒరె.. రె.. ఆగరా.. ఇంకా సగమైనా తినే్లదు’’ అని పొట్లం పెరుక్కుని, ఎక్కడ సలహా చెప్పకపోతే మిక్చర్ దక్కకుండా పోతుందో అని. తను అంతకుముందు ఎక్కడో చదివిన వశీకరణ మంత్రం గురించి చెప్పసాగేడు.
‘‘చూడు పోలి నేను చెప్పేది జాగ్రత్తగా విను. పూర్వకాలంలో వశీకరణ మంత్రం అని ఒకటుండేది. దాన్ని ఏ అమ్మాయి మీద ప్రయోగిస్తే ఆ అమ్మాయి ప్రయోగించినవాడి వశమయిపోయేది. అంటే దమ్మిడీ ఖర్చు లేకుండా ప్రేమలో పడిపోయేదన్నమాట. నువ్వా అమ్మాయి వెనక ఇంకా తిరుగుతూనే ఉంటే నీకు సమయం వృథా తప్పితే ఇంకే ప్రతిఫలమూ లేదోయ్.
కాబట్టి..’’ అంటూ నోటికొచ్చింది చెప్పుకుపోతున్నాడు సీతాపతి ఎలాగోలా కాలక్షేపం చేసి మిక్చర్ లాగించేయాలనుకుంటూ. పోలిగాడు లీనమయిపోయి ఆలకిస్తున్నాడు.
ఇంతలో ఎక్కడినుండి వచ్చాడో సుడిగాలిలా వచ్చాడు పిచ్చి పరామానందం. వచ్చినవాడు వచ్చినట్టే గబుక్కున సీతాపతి చేతిలో మిక్చర్ పొట్లం లాగ్కుని పరిగెత్తాడు. సీతాపతి ఏం జరిగిందో గ్రహించేలోపలే అక్కడ్నించి మాయమైపోయాడు. ఇక పరమానందం గురించి వేరే చెప్పాలా. పిచ్చి నయం చేయడానికొచ్చిన డాక్టర్లకే పిచ్చెక్కించిన ఘనత ఆయనకే సాధ్యం. ఒకసారి ఆయన చేతిలోకి వెళ్లిన వస్తువు తిరిగి వచ్చుట అసాధ్యమ. అందుకే దానిమీద ఆశలు వదులుకున్నాడు సీతాపతి. ఇందాకేదో వశీకరణ మంత్రం అది ఇది అని మిక్చర్కి ఆశపడి వాగేశాడు కానీ, నిజానికి తనకి కూడా దాని గురించి ఏమీ తెలియదు. ఎలాగోలా అక్కడినుంచి జారుకోవాలనుకుంటుండగా, పోలిగాడు-
‘‘ఒరే సీతాపతి ఇపుడా ఒసీకర్ణం తెల్సినోళ్ళు ఎవూరూ లేరా?’’ అని అడిగాడు. ఎవరూ లేరంటే ఇంకో సలహా చెప్పమని ప్రాణాలు తోడేస్తాడని-
‘‘ఎందుకులేరూ, మహర్షులకు, సిద్ధులకూ, మునులకూ, మహా మంత్రికులకూ తెలిసే వుంటుంది. కానీ వాళ్ళంతా ఇక్కడుండరు. ఏ హిమాలయాల్లోనో తపస్సు చేసుకుంటూ ఉంటారు’’ అన్నాడు సీతాపతి. పోలిగాడు ఎలాగో హిమాలయాలకు వెళ్లలేడని తెలిసి.
‘‘ఇమాలయాల్లోనే ఉంటారా..!?’’ ఎందుకూ..!?’’
‘‘ఇక్కడుంటే నీలాటోళ్ళు పట్టుకుంటారని’’ తడుముకోకుండా అన్నాడు సీతాపతి.
‘‘అట్టాగాదురా మనూళ్ళో బుడబుక్కలోడు లేడూ.. ఆడికేమైనా తెల్సుంటుందేమోనని నా హనుమానం. ఓసారి పొయ్యి అడిగొద్దాం రారా’’ అంటూ లేచాడు పోలిగాడు.
వాడికెలాగో తెలిసుండదని ‘‘సరే పద’’ అంటూ పోలిగాడిని అనుసరించాడు సీతాపతి.
ఊరి చివరున్న పాడుబడిన ఇంట్లో ఉంటాడా బుడబుక్కలోడు. ఎప్పుడో రెండు సంవత్సరాల క్రితం ఆ ఊరికొచ్చి, పూటకో ఇంట్లో అడుక్కుంటూ, రాత్రిపూట అక్కడే తలదాచుకుంటూ ఉంటాడు. ‘‘కాళ్ళూ చేతులు బాగానే ఉన్నాయి కదా, ఇలా అడుక్కోకపోతే ఏదైనా పని చేసుకు బతక్కూడదూ’’ అని ఎంతమంది తిట్టినా పట్టించుకునేవాడు కాదు. ఆ జీవితమే బాగుందనుకున్నాడో ఏమో, అక్కడే ఉండిపోయాడు. అలా రాను రానూ ఊరికి అతనో పీడలా తయారయ్యేడు.
పోలిగాడు, సీతాపతి అక్కడికి చేరుకునేసరికి ఇంటి బయట అరుగుమీద కూర్చుని బంగు పీలుస్తూ తూలుతున్నాడతను. ఇద్దరూ కాస్తంత దూరంలో నిలబడ్డారు భయం భయంగా.
ముందు పోలిగాడే కొంచెం ధైర్యం చేసి ‘‘సోవే.. సోవే..’’ అని పిలిచాడు.
బుడబుక్కలోడు ఓసారి కళ్ళు తెరిచి చూసి ‘‘ఊ..?’’ అని మళ్లీ కళ్ళు మూసుకున్నాడు.
‘‘మిమ్మల్నో ఇసయం అడగాలి సోవే’’ అన్నాడు పోలిగాడు కొంచెం ముందుకెళ్ళి.
‘‘ఊ.. చెప్పరా’’
మీరు బుడబుక్కలోల్లుగదా, మీకు అని ఇద్దెలు ఒచ్చుంటాయి గద సోవీ’’
‘‘మాకు తెలీని విద్యంటూ ఏదీ లేదురా’’
‘‘ఐతే మీకు ఒసీకర్ణం తెలుసునా?’’
‘‘ఎందుకురా?’’ హూంకరించాడు బుడబుక్కలోడు.
మోదట కాస్త తటపటాయించి, ఆ తర్వాత పూస గుచ్చినట్టు మొత్తం చెప్పి, ఎలాగైనా సహాయం చేయమని బతిమాలాడు పోలిగాడు
‘‘చేస్తాంలేగానీ, దానికి ఖర్చవుతుంది’’అన్నాడు బుడబుక్కలోడు.
‘‘ఏంగావాలి సోవి?’’ పోలిగాడి కళ్ళలో ఆనందం.
‘‘మోహినికి మాంసం, డాకినికి నల్లకోడి, శాకినికి కుంభం కూడు, కామినికి కల్లు కావాలిరా’’
‘‘ఓర్నీ.. నేను మిక్చర్కి కక్కుర్తిపడితే, నువ్వు కల్లుకి, కోడి మాంసానికీ కక్కుర్తి పడ్డావా?’’మనసులో బుడబుక్కల్లోన్ని తిట్టుకున్నాడు సీతాపతి.
‘‘సరే పోని పూజ ఏ రోజు మొదలెడతారో సెప్తే అన్నీ సమకూరుస్తాం సోవీ’ పోలిగాడు చేతులు జోడించి వినమ్రంగా అన్నాడు.
కాసేపు ఏదో తర్కించి, ‘‘రేపు అమావాస్య. మంచిరోజు. రేపు రాత్రికే పూజ’’ అరమోడ్చు కన్నులతో అన్నాడు బుడబుక్కలోడు.
‘‘అట్నే సోవే’’ అని సీతాపతివైపు చూశాడు పోలిగాడు.
ఆ మరుసటి రోజు రాత్రి పూజ సామగ్రి మొత్తం సమకూర్చడం జరిగింది. సీతాపతికి అలాంటి పూజలమీద నమ్మకం లేకపోయినా పోలిగాడికి చేదోడు వాదోడుగా అన్నిపనులు చేశాడు. పూజా కార్యక్రమం జరిగేటప్పుడు ఇతరులెవ్వరూ ఉండకూడదని బుడబుక్కలోడు చెప్పటడంతో ఇద్దరూ అక్కడ్నించి వచ్చేశారు.
సరిగ్గా అర్ధరాత్రి కాగానే ఊరి చివర స్మశానంలో మర్రిచెట్టు క్రింద పూజ మొదలైంది. బుడబుక్కలోడు ఒక్కడే కూర్చు, కళ్ళు మూసుకుని మంత్రాలు చదువుతున్నాడు. అతని ముందు ఓ ముగ్గు గీయబడి ఉంది. ఆ ముగ్గుకి చివర్లో నిమ్మకాయలు పెట్టబడున్నాయి. ఇస్తరాకులో కూడు పోసి ఉంది. వేయించిన కోడిమాంసం, తాటికల్లు, బలికి నల్లకోడి సిద్ధంగా ఉన్నాయి. కళ్ళు మూసుకుని గట్టిగా మంత్రాలు చదువుతున్నాడు బుడబుక్కలోడు.
ధూపం వేయడంతో ముగ్గు చుట్టూ పొగంతా అలుముకుంది. ఒక చేత్తో మంత్రదండాన్ని గాలిలో తిప్పుతూ, మరో చేత్తో హోమాగ్నిలోకి కర్పూరపు పొడిని చల్లుతూ ‘‘ఆవాహయామి.. ఆవాహయామి..’’ అంటూ గొంతు చించుకుని అరుస్తున్నాడతను. పూజ దాదాపు ఆఖరి దశకు చేరుకుంది. కళ్ళు మూసుకుని చివరగా చదవవలసిన మంత్రాలను చదవడం మొదలెట్టేడు బుడబుక్కలోడు. చదవడం పూర్తవబోతుండగా.. కోడి వున్నట్టుండి ‘క్కొక్కొక్కొ’ అని అరవడంతో ఓసారి కళ్ళు తెరిచి చూశాడు.
అంతే..
చేతిలోని మంత్రదండంతోపాటూ అతని గుండె కూడా జారిపోయింది. ఏదో ఆకారం ముగ్గు మధ్యలో కూర్చుని కుంభం కూడు రెండు చేతులతో ఆరగిస్తోంది. పై ప్రాణాలు పైనే పోయాయి బుడబుక్కలోడికి. అరుద్దామనుకున్నా మాటలు పెగల్లేదు. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా పరుగందుకున్నాడతను. అసలే అమావాస్య కావడంతో చుట్టూ చీకటిగా ఉంది. అయినా ఆగలేదతను. జారిపోతున్న పంచె ఎగేసుకుంటూ, రాళ్ళు రప్పలు, ముళ్ళపొదలు
తొక్కుకుంటూ, పడుతూ లేస్తూ పరిగెడుతూనే ఉన్నాడు.
‘‘బంగు మైకంలో ఏవేవో మంత్రాలు చదివేశాను. అందుకే వచ్చేసిందది’’ అని పరిగెడుతూ తనలో తాను గొణుక్కుంటున్నాడు. ఏదో దెయ్యం నిజంగానే వచ్చేసిందనుకుని. కానీ ఓసారి పరీక్షగా చూసుంటే తెలిసుండేది అక్కడ కూర్చుంది పిచ్చి పరమానందం అని.
మరుసటిరోజు పొద్దునే్న పోలిగాడు, సీతాపతి పూజ జరిగిన చోటుకొచ్చి చూసేటప్పటికీ నల్లకోడి తప్ప అక్కడెవరూ లేరు. ఏ పక్కనుంచయినా కుక్కో, పిల్లో వచ్చి పట్టుకుపోతుందని కాబోలు బిక్కుబిక్కుమంటూ చూస్తోందది. అసలేం జరిగిందో ఇద్దరికీ అంతుచిక్కలేదు. దాని కాళ్ళకు కట్టినదారం విప్పి ఇంటికి తీసుకెళ్ళారిద్దరూ.
ఆ రోజు నుంచీ బుడబుక్కలోడు ఏమైపోయాడో ఎవ్వరికీ తెలిదు. కొంతమంది అతన్ని దెయ్యాలెత్తుకుపోయాయన్నారు. మరికొందరు ఊరికి పట్టిన పీడా వదిలిందనుకున్నారు. అన్నీ తెలిసిన పోలిగాడు, సీతాపతి మాత్రం తీగలాగితే ఎక్కడ డొంక మొత్తం కదులుతుందోనని కిక్కిరుమనకుండా ఉండిపోయారు. ఆ తర్వాత కొన్ని రోజులకు పిచ్చిపరమానందం చేతిలో బుడబుక్కలోడి మంత్రదండం కనిపించింది బుడబుక్కలోడు మాత్రం ఎక్కడా కనిపించలేదు.
మళ్లీ దిగులు పట్టుకుంది పోలిగాడికి. పోలిగాడి బాధ చూడలేకపోయాడు సీతాపతి. అందుకే ఈసారి సలహా ఇవ్వకుండా ఏకంగా సహాయమే చేద్దామని రాత్రంతా మేలుకుని పోలిగాడు నాయుడి కూతుర్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో వర్ణిస్తూ ఓ లవ్ లెటర్ రాశాడు. ఆ లెటర్ ఇవ్వడానికే ఇపుడు తను వెళ్తోంది.
***
ఒక్కో బిస్కెట్టూ తింటూ తొందర తొందరగా నడుచుకుంటూ వెళ్తున్నాడు సీతాపతి. ఈ లోపల ఎక్కడ్నించొచ్చాడో గద్దలా వచ్చి బిస్కెట్టు ప్యాకెట్ తన్నుకుపోయాడు పిచ్చి పరమానందం. వాడివైపు వైపు ఓసారి కోపంగా చూసి, మళ్లీ కర్తవ్యం గుర్తుకొచ్చి నడవడం మొదలుపెట్టాడతను.
సీతాపతి లేటుగా రావడంతో, కోపంతో అంతెత్తున ఎగిరిపడ్డాడు పోలిగాడు. ఇద్దరూ ఓ మూడో తరగతి పిల్లవాడ్ని పట్టుకున్నారు లెటర్ నాయుడి కూతురుకి చేర్చడానికి. వాడు రెండు రూపాయలిస్తేగానీ ఆ పని చేయనన్నాడు. చస్తే ఇవ్వనన్నాడు పోలిగాడు. ఇవ్వకపోతే ఇద్దరూ కలిసి కరణం కూతురికి లవ్‌లెటర్ రాశారని అందరికీ చెప్పేస్తానని బ్లాక్‌మెయిల్ చేశాడు వాడు. చివరికి వాడికి లవ్ లెటర్‌తోపాటు రెండు రూపాయలు కూడా ఇచ్చి పంపారిద్దరూ.
వాడు లవ్‌లెటర్ తీసుకెళ్లిన గంటకి ఊర్లోంచి ఏవో పెద్ద పెద్ద అరుపులు వినిపించాయి. పొలిమేరదగ్గర కూర్చున్న ఇద్దరికీ ఏదో తేడా జరిగినట్టు అనిపించింది.
‘‘రే పోలీ, ఆ నాయుడుగాడు మీ ఇంటికి గొడవకొచ్చేడేమోరా!’’ అన్నాడు సీతాపతి ఊరి వైపు చూస్తూ.
భయపడిపోయాడు పోలిగాడు.
‘‘అమ్మో మా యింట్లో తెలిసిందంటే సంపి పాతరేస్తాడు మా అయ్య. నేను పక్కూర్లో వున్న మా సుట్టాలింటికెళ్లిపోతాను. నినె్నవురైనా అడిగితే ఏడకి బోయినావో నీకు తెలవదని సెప్పు, సరేనా?’’’ పరిగెత్తాడు పోలిగాడు. గత్యంతరం లేక ఇంటికి బయల్దేరాడు సీతాపతి.
తీరా ఊర్లోకెళ్లి చూస్తే గొడవ పోలిగాడింటి దగ్గర కాదు, సీతాపతి ఇంటి దగ్గర జరుగుతోంది. నాయుడు గట్టిగా అరుస్తూ ఏదేదో తిడుతున్నాడు సుబ్బారావుని.
‘‘అయినా ఆ లెటర్లో ఎక్కడా నా గురించి రాయలేదే! చేతిరాతకూడా మార్చాను. మరి మా ఇంటికి వీడెందుకు గొడవకొచ్చినట్టు. ఆ గొడవ అయ్యివుండదులే. ఇదేదో వేరేది అయ్యుంటుంది. కొంపదీసి అదేనా! అయినా ఆ లెటర్ నేనే రాశానని ఆధారం లేనప్పుడు మా ఇంటికొచ్చి గొడవెలా చేస్తాడీడు?’’ అనుకుంటూ ధైర్యంగా వెళ్ళాడు సీతాపతి.
నాయుడు కోపంగా ఏవో బూతులు తిడుతున్నాడు.
‘‘చదువుకుంటే సరిపోదు క్రమశిక్షణుండాలి’’ ఎవరో గుంపులోంచి అరుస్తున్నాడు.
‘‘మీ ఆడోళ్ళకి జరిగితే ఊరుకుంటారా?’’ నాయుడి బందువొకడు పేలుతున్నాడు.
ఇంతలో సీతాపతి గొడవ దగ్గరకొచ్చి నిలబడ్డాడు. కొడుకుని చూడగానే నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చి, లెటరు చూపిస్తూ ‘‘ఏమిట్రా ఇది?’’ అన్నాడు సుబ్బారావు వస్తున్న కోపాన్ని దిగమింగుతూ. తీసుకుని ఓసారి లెటరు మొత్తాన్నీ పరిశీలనగా చూశాడు సీతాపతి- తను ఏ తప్పు చేయలేదనే ధీమాతో. మొత్తం సరిగానే ఉంది గానీ ఒకచోట మాత్రం అతని కళ్ళు ఆగిపోయాయ్. లెటరు చివరాఖర్న ‘ఇట్లు పోలయ్య’ అని ఉండాల్సిన చోట ‘ఇట్లు సీతాపతి’ అని రాసుంది. రాత్రి నిద్రమత్తులో ఎక్కడ పొరపాటు చేశాడో తెలిసేసరికి తల తిరిగిపోయింది సీతాపతికి. ఓ క్షణం బైర్లుకమ్మినట్టనిపించింది. ఏం సమాధానం చెప్పాలో తెలియక తికమకపడుతూ, వాళ్ళ నాన్న వైపు చూసి ఇబ్బందిగా నవ్వాడతను.

కథలకు ఆహ్వానం
‘ఆదివారం ఆంధ్రభూమి’కి కథలు పంపవలసిన చిరునామా:
ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, 36, సరోజినీదేవి రోడ్, సికిందరాబాద్- 500 003.
పీడీఎఫ్ ఫార్మాట్‌లో sundaymag@andhrabhoomi.net కు మెయల్‌లో పంపాలి.

- వెంకట్ ఈశ్వర్.