S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

‘చెమ్మగిల్లిన బొగ్గు’!

మన శరీరానికి కావలసిన పోషక పదార్థాల గురించి చిన్నప్పుడు చదువుకున్నాం. వాటిని మాంసకృత్తులు, పిండి పదార్థాలు, కొవ్వులు, లవణములు, విటమినులు అనే పేర్లతో పిలిచేవాళ్లం. అనేక కారణాల వల్ల నాకు ‘మాంసకృత్తులు, పిండి పదార్థాలు’ అనే పేర్లు నచ్చలేదు. ఉదాహరణకి ‘పిండి పదార్థాలు’ అనే మాటనే తీసుకుందాం. ఈ మాట వాడినప్పుడు మన మనస్సులో ఏ భావం స్ఫురిస్తుంది? లేదా, ఇది ఏ ఇంగ్లీషు మాటతో సరితూగుతుంది? మా ఉన్నత పాఠశాలలో నాకు సైన్సు నేర్పిన మాస్టారి దృష్టిలో పిండి పదార్థం అంటే ‘కార్బోహైడ్రేట్’. ఇప్పుడు, సైన్సు బాగా నేర్చుకున్న నా దృష్టికి పిండి పదార్థం అంటే ‘స్టార్చ్’. కార్బోహైడ్రేట్ అనే మాటకి చాలా విస్తృతమైన అర్థం ఉంది. స్టార్చ్ అనే మాటకి అంత విస్తృతార్థం లేదు.
ఉదాహరణకి అన్నంలోనూ, గంజిలోనూ, బంగాళాదుంపలలోనూ, ఇలా మనం తినే అనేక పదార్థాలో స్టార్చ్ ఉంటుంది. మన తిండికి పనికిరాని గడ్డిలోను, కర్రలలోనూ ఉన్న వౌలికమైన పదార్థం పేరు సెల్యులోజు; ఇది స్టార్చ్ కాదు. అయినా సరే స్టార్చి, సెల్యులోజూ - ఈ రెండూ కూడ కార్బోహైడ్రేట్ నిర్వచనంలో ఇముడుతాయి. స్టార్చి, పిండి పదార్థం సమానార్థకమైన మాటలు; అదే స్టార్చి అన్న మాటని కార్బోహైడ్రేట్‌ని సూచించటానికి వాడకూడదు. సైన్సులో ఒక భావానికి ఒక నిర్దిష్టమైన పేరు ఉండాలి. కనుక ఇటుపైన పిండి పదార్థం అనే మాటని వాడినప్పుడల్లా స్టార్చిని ఉద్దేశించి మాట్లాడుతున్నామని ఒక ఒప్పందానికి వద్దాం. ఇప్పుడు కార్బోహైడ్రేట్‌కి కొత్త పేరు కావాలి. ‘కార్బోహైడ్రేట్’ని మక్కీకి మక్కీ తెలుగులోకి అనువదిస్తే ‘చెమర్చిన బొగ్గు’ అని అనాలి. ఎందుకనాలిట? కార్బన్ అంటే బొగ్గు, హైడ్రేట్ అంటే ‘నీటితో కలిసినది’ అని అర్థం. హైడ్రేట్‌లో ‘హైడ్రా’ అన్న భాగం హైడ్రొజన్ లోంచి వచ్చింది. ‘ఏట్’ అనే తోక ఆమ్లజని ఉనికికి సూచకం. కనుక హైడ్రేట్ అనేది ఉదజని, ఆమ్లజని సమ్మిళితమైన నీటిని సూచిస్తుంది. కనుక, ఇప్పుడు నిర్మొహమాటంగా చెప్పుకోవాలంటే కార్బోహైడ్రేట్‌లు అంటే ‘తడిసిపోయిన బొగ్గు’ లేదా ‘చెమ్మగిల్లిన బొగ్గు’ లేదా చెమర్చిన బొగ్గు.
చిన్న పిట్ట కథ - హోమియోపతీ వైద్యంతో పరిచయం ఉన్న వాళ్లు ‘కార్బోవెజ్’ అనే మందు పేరు వినే ఉంటారు. ఇది కర్రలు (వెజ్) కాల్చగా వచ్చిన బొగ్గు!
ఈ రకం తెలుగుసేత మరీ నాటుగా ఉంది కనుక కొంచెం సంస్కృతం పాలు కలిపి, కార్బోహైడ్రేట్‌కి ‘కర్బనోదకం’ అని పేరు పెట్టేను. ఇక్కడ కర్బనం అంటే కార్బన్. బొగ్గులో ఉండేది ఈ కర్బనమే. ఉదకం అంటే నీరు. ఈ కర్బనోదకాల జాతిలో పిండి పదార్థాలు ఉన్నాయి. చక్కెరలు ఉన్నాయి. పిప్పి పదార్థాలు ఉన్నాయి. ఇంకా ఇతర రకాల రసాయనాలు ఉన్నాయి. ఈ జాతి అంతటికీ కొన్ని ఉమ్మడి లక్షణాలు ఉన్నాయి. ముఖ్యంగా కొట్టొచ్చినట్టు కనపడేది వీటన్నిటిలోనూ కర్బనము, ఉదజని, ఆమ్లజని 1:2:1 నిష్పత్తిలో ఉంటాయి.
కార్బోహైడ్రేట్ పేరుని పోలిన పేరుతో మరొక జాతి ఉంది. ఆ జాతి పేరు ఇంగ్లీషులో ‘హైడ్రోకార్బన్’. సమాసంలో మాటలు తిరగబడ్డాయి. అంతే, కానీ ఈ జాతుల లక్షణాలు పూర్తిగా వేర్వేరు. వీటిని మనం ‘ఉదకర్బనాలు’ అందాం. ఇక్కడ ‘ఉద’ అంటే ‘ఉదజని’ అనే అర్థం. ‘ఉదక’ అనలేదు కనుక నీటి ప్రసక్తే లేదు. కనుక ఉదకర్బనాలలో ఉదజని, కర్బనం మాత్రమే ఉంటాయి. నీరు ఉండదు. ఉదకర్బనాలకి కిరసనాయిలు ఒక ఉదాహరణ.
కర్బనోదకాలు జీవకోటికి శక్తినిచ్చే ఇంధనం అయితే ఉదకర్బనాలు యంత్రాలకి ఇంధనం. గమనించేరో లేదో, కర్బనోదకాలు చెమర్చిన బొగ్గు కనుక అవి నెమ్మదిగా, అతి నెమ్మదిగా, ‘కాలి’ శక్తిని విడుదల చేస్తాయి. శరీరం లోపల వాతావరణం అంతా తడిగానే ఉంటుంది కనుక, ఈ చెమర్చిన బొగ్గు శరీరంలో ‘మండి’ శక్తిని అంతటినీ ఒకేసారి విడుదల చేసెయ్యకుండా నెమ్మదిగా విడుదల చేస్తుంది. యంత్రాలలో మండే ఉదకర్బనాల తీరే వేరు. వాటిలో చెమ్మదనం లేదు; కర్బనము, ఉదజని మాత్రమే ఉన్నాయి కనుక ఈ ఇంధనం భగ్గున మండుతుంది. దీపం వెలిగించుకోవాలన్నా, కారు నడవాలన్నా ఇంధనంలో ఉన్న శక్తి జోరుగా విడుదల కావాలి. అదీ వీటిలో ఉన్న తేడా.
కర్బనోదకాలు మన శరీరానికి ఇంధనం లాంటి వస్తువు అయినట్లే, మన యంత్రాలకి కావలసిన ఇంధనాలు రాక్షసి బొగ్గు, రాతి చమురు మొదలైనవి. వీటిని తెలుగులో ‘ఉదకర్బనాలు’ అన్నాం కదా. గత వాక్యంలో ‘రాతి చమురు’ అన్న మాట వాడేను. దీన్ని ఇంగ్లీషులో ‘పెట్రోలియం’ అంటారు. లేటిన్‌లో ‘పెట్రో’ అంటే రాయి, ‘ఓలియం’ అంటే చమురు. ఇందులోంచే ‘ఆయిల్’ అన్న మాట వచ్చింది. కనుక ‘పెట్రోలియం’ అంటే రాతి నూనె. ఈ రాతి నూనెని శుద్ధి చేస్తే ‘పెట్రోలు’ వస్తుంది.
అమెరికాలో ‘ఓలియో మార్జరిన్’ అన్న మాట వినిపిస్తూ ఉంటుంది. ఇక్కడ కూడ ‘ఓలియో’ అంటే చమురే. ఇండియాలో పాఠకులకి ‘మార్జరిన్’ అంటే ఏమిటో తెలియకపోవచ్చు. వారి కొరకు ‘మార్జరిన్’ అంటే వనస్పతి. వనస్పతి అంటే ఏమిటంటారా? మన ‘డాల్డా’ వనస్పతికి ఒక వ్యాపార నామం (ట్రేడ్ నేమ్). చూశారా! ఈ చర్చ చిలవలు పలవలతో పక్కదార్ల వెంబడి ఎలా పెరిగిపోతోందో. ఏది ఏమైతేనేమి ‘ఓలియో మార్జరిన్’ అంటే దరిదాపు మన డాల్డా లాంటి వనస్పతి.
ఏదైనా భావానికి తెలుగులో పేరు పెట్టవలసినప్పుడు ఇలా చిలవలు పలవలుగా ఆలోచించ చూడాలి. ఇలా ఆలోచన చేసినప్పుడే తత్సంబంధిత భావాలన్నింటికి కూడ నప్పిన పేర్లు పెట్టటానికి వీలవుతుంది. లేకపోతే భాష అతుకుల బొంతలా తయారయి అందంగా ఉండదు.

- వేమూరి వేంకటేశ్వరరావు ప్లెజన్‌టన్, కేలిఫోర్నియా