S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

చీకటి రోజులు( సండేగీత)

చీకటి రోజులు మనకూ వుంటాయి.
దేశానికీ వుంటాయి.
ఒక్కోసారి ప్రపంచానికి కూడా వుండవచ్చు.
అప్పుడు ఆకాశం మేఘావృతంగా కన్పించవచ్చు.
వెలుతురు కన్పించకపోవచ్చు.
దారి దొరకకపోవచ్చు.
ఆ సమయంలో
మన చుట్టూ నిరాశావాదులు చేరతారు.
శూన్యం ఆవరిస్తుంది.
ఇలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు ఎలా వుండాలి. ధైర్యంగా వుండాలి. మన చుట్టూ వెలుగుని నింపాలి. ఉత్సాహం కలిగించే పుస్తకాలు చదవాలి. అలాంటి ఉత్సాహాన్నిచ్చే స్నేహితులతో మాట్లాడాలి.
కవులూ, రచయితలు కూడా రకరకాలుగా వుంటారు. నిరాశావాదులు, అనుభూతి వాదులు, అనార్కిస్టులు ఇలా ఎన్నో రకాలు. వాళ్లు చీకటి రోజుల గురించి రకరకాలుగా వర్ణిస్తారు. కొన్ని కవితలు నిరుత్సాహపరచవచ్చు. కొన్ని కథలు మనల్ని కృంగదీయవచ్చు. అలాంటి రచనల జోలికి వెళ్లవద్దు.
చీకటి రోజుల గురించి ఆలోచించినప్పుడల్లా నాకు బెర్టోల్ట్ బెహ్ట గుర్తుకొస్తాడు. అతను జర్మనీ దేశస్థుడు. కవి నాటక ప్రయోక్త మార్కిస్టు మేథావి. ఆయన కవితలు ఎన్నో. అందులో చాలా ప్రముఖమైన కవితా చరణాలు ఇవి-
‘చీకటి రోజుల్లో కూడా
మీరు పాటలు పాడుతారా?
అవును, పాడుతాం
చీకటి రోజుల గురించి పాడుతాం’
మనం మన ధోరణి వదిలి పెట్టకూడదు. చుట్టూ చీకటి ఆవరించి వున్నా మనం చైతన్యవంతంగా వుండాలి. ఆకాశం మేఘావృతమై వున్నా మన మనస్సులో చీకటి ముసురుకోవద్దు.
చుట్టూ నిరాశామయ వాతావరణం వున్నా మనం ఆశావాదులమై ఉండాలి.
చీకటి రోజుల్లో కూడా పాటలు పాడాల్సిందే. చీకటి రోజుల గురించి గొంతెత్తాల్సిందే!
శూన్యాన్ని బద్దలు కొట్టడానికి శబ్దం చేయాల్సిందే!

మంగారి రాజేందర్ ‘జింబో’ 94404 83001